
చిత్రసీమలో కొన్ని కాంబినేషన్లు ఎప్పుడూ ఆసక్తిని రేకెత్తిస్తూనే ఉంటాయి. ఈ కాంబినేషన్ ఎలా కుదిరింది చెప్మా?? అంటూ బుర్ర గోక్కున్నా.. అర్థం కాదు. అలాంటి కాంబో ఒకటి టాలీవుడ్‌లో సెట్టయినట్టు సమాచారం. అదే పూరి జగన్నాథ్ - నారా రోహిత్ సినిమా. త్వరలో వీరిద్దరి నుంచి ఓ సినిమా రాబోతోందని టాలీవుడ్ వర్గాల్లో టాక్. దాంతో ఈ కాంబినేషన్ గురించి కూడా చర్చ మొదలైంది. నారా రోహిత్ ఇప్పటి వరకూ ఓ పది సినిమాల వరకూ చేశాడు. `బాగున్నాయి` అన్న పేరైతే వచ్చింది గానీ ఏ సినిమా `హిట్` అనిపించుకోలేదు. అంతెందుకు.. ప్రొడ్యూసర్‌కి ఒక్కటంటే ఒక్క సినిమా కూడా లాభాల్ని తెచ్చిపెట్టలేదు. ఈ నారా వారి అబ్బాయి ఎంత గింజుకొన్నా మాస్ హీరో అవ్వలేకపోతున్నాడు. సరిగ్గా ఇలాంటి దశలోనే పూరి జగన్నాథ్ తగిలాడు.

పూరి సినిమా అంటే స్టార్ హీరోల రేంజ్. ఎన్టీఆర్, మహేష్, పవన్, రవితేజ.. ఈ స్థాయిలో సాగుతుంటాయి ఆయన ఆలోచనలు. కథలు కూడా వీళ్ల చుట్టూనే తిరుగుతుంటాయి. అయితే గత కొన్నేళ్లుగా పూరి నుంచి నికార్సయిన హిట్ రాలేదు. ఏదో సినిమాలు తీస్తున్నాడంతే. అందులో ఇదివరకు ఉన్న కిక్ లేదు. పూరి అంటే పెద్ద హీరోలు కూడా లైట్ తీసుకోవడం మొదలెట్టారు. జ్యోతిలక్ష్మి, లోఫర్‌లతో పూరి.. జీరోకి పడిపోయాడు. అందుకే ఇప్పుడు కల్యాణ్‌రామ్‌లాంటి హిట్ లేని హీరోతో సినిమా చేయడానికి కూడా రెడీ అయిపోయాడు. నారా రోహిత్‌ని పట్టుకోవడానికి కూడా కారణం అదే కావొచ్చు. ఏదేమైనా.. రోహిత్‌కి ఓ మాస్ హిట్ కావాలి. పూరి కూడా తనని తాను నిరూపించుకోవాలి. ఇద్దరూ సేమ్ పొజీషన్‌లో ఉన్నారు. అందుకే ఒకే గూటి పక్షులు.. ఒక చోటే చేరారు. మరి ఇద్దరూ కలసి అనుకొన్నది సాధిస్తారా, చూడాల్సిందే.