సినిమా పేరు: శతమానం భవతి
నటీనటులు: శర్వానంద్, అనుపమ పరమేశ్వరన్, ప్రకాష్ రాజ్ మరియు జయసుధ
దర్శకుడు: సతీష్ వేగేశ్న
బ్యానర్ : శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
విడుదలయిన తేది : Jan 14, 2017
సంక్రాంతి అనగానే మొదటగా గుర్తొచ్చేది కోళ్ల పందెం. ఎవరి స్థాయి తగ్గట్టు వాళ్ళు ఈ మహా పండగకి పందాలు కాస్తూ ఉండటం ఆనవాయితీ. కానీ, సుప్రీమ్ కోర్ట్ వీటిపైన నిషేధం విధించింది. కానీ, సినిమా ప్రియులకి ఈ పండగ నిజమైన కోలాహలం తీసుకొచ్చింది. చిరంజీవి, బాలకృష్ణ లాంటి అగ్రనటులతో ఢీ అంటే ఢీ అంటూ శర్వానంద్ కూడా తన శతమానం భవతి తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. పెద్ద సినిమాలు కోళ్ల పందాలయితే, శతమానం భవతి ఇంటికొచ్చిన చుట్టాలు మరియు పిండి వంటలు. చూద్దాం సతీష్ వేగేశ్న ఈ సినిమాని ఎలా మలచాడో..
కథ :
ఆత్రేయపురం అనే ఊరిలో రాఘవ రాజు గారు (ప్రకాష్ రాజ్) తన భార్య జానకమ్మ (జయసుధ) తో ప్రశాంతమైన జీవితం గడుపుతుంటాడు. వాళ్ళ మనవడు రాజు (శర్వానంద్) దగ్గరే ఉంటూ చేదోడు వాదోడుగా ఉంటాడు. కానీ ఆ వృద్ధ దంపతులకి ప్రతి సంక్రాంతికి తమ పిల్లలతో గడపలేకపోయామే అనే దిగులు ఉండిపోతుంది. అయితే, పెద్దాయన విదేశాల్లో ఉన్న తన పిల్లల్ని ఇంటికి రప్పించడానికి ఒక కఠిన నిర్ణయం తీసుకుంటాడు. అది ఎలాంటి పరిణామాలపై దారి తీసింది? చివరికి పిల్లలు రాఘవ రాజు గారి కోరికని అంగీకరించారు? మరదలు నిత్య (అనుపమ పరమేశ్వరన్) తో పీకల లోతు ప్రేమలో పడిపోయిన రాజు పరిస్థితేంటి? చివరికి, తన ప్రేమని గెలుచుకున్నాడా? వీటికి సమాధానం కావాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ :
పట్నంలోనో ఫారిన్ లోనో బిజీ లైఫ్ గడిపే ఎంత మంది పల్లెల గురించి ఆలోచిస్తున్నారు. పల్లె అంటే ఊరు కాదు, తల్లి లాంటిది అన్నారు పెద్దవాళ్ళు. నిజంగా, చాలా మంది తమ పెద్దల్ని (తల్లిదండ్రుల్ని) ఊర్లల్లో వదిలేసి, చిన్నవాళ్ళ మనిపించుకుంటున్నారు. పిల్లలొస్తేనే కదా, పెద్దలకి నిజమైన పండగ అది సంక్రాంతి అయినా అది ఇంకేదైనా. అవ్వ చేతి గోరు ముద్ద తిన్నప్పుడే కదా ఆ అవ్వకు కడుపు నిండేది. మన సంతోషం టీవీల్లో, మొబైల్ గేమ్స్ లో చూసుకుంటున్నాం, కానీ అసలైన ఆనందం ఊర్లలో ఉంది అనే విషయాన్ని మర్చిపోతున్నాం. ఒక పది నిముషాలు ఫోన్ లేకుండా గడపలేకపోతున్నాం, అలాంటిది మన తల్లిదండ్రులు మనల్ని వదిలేసి ఎలా ఉంటారు అనే విషయాన్ని విస్మరిస్తున్నాం. దర్శకుడు సతీష్ వేగేశ్న ఉమ్మడి కుటుంబాల ప్రాధాన్యత చెప్పే ప్రయత్నంలో పాత కథే ఎన్నుకున్నప్పటికీ, ఆకట్టుకునే కథనంతో ఫామిలీ వర్గంని మెప్పించే ప్రయత్నం చెప్పాడు.
నటీనటులు :
శర్వానంద్ తన వయసుకి మించి పరిణితి చూపించాడు. తన కన్నా పెద్ద నటులతో పోటీ పడి చేసాడు. గత సినిమాలతో పోలిస్తే, తన పాత్రకి కొంచెం ప్రాధాన్యత తక్కువైనా కూడా తన నటనతో మెప్పించగలిగాడు. అనుపమ పరమేశ్వరన్ తన అందం అభినయంతో అలరించింది. తన నవ్వు పెద్ద ప్లస్ పాయింట్. శర్వా, అనుపమాల రొమాన్స్ బాగా పండింది. వీరిద్దరి సీన్ లు యూత్ కి బాగా కనెక్ట్ అవుతాయి.
ప్రకాష్ రాజు గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎలాంటి క్యారెక్టర్ ఇచ్చినా, తనదైన శైలిలో అత్యద్భుతంగా చేస్తాడు. ఇంకా చెప్పాలి అంటే, దర్శకుడు చెప్పిన క్యారెక్టర్ లోకి పరకాయ ప్రవేశం చేస్తాడు. ఒక భర్తగా, ఒక తండ్రిగా, ఒక తాతగా, ఒక ఇంటికి పెద్దగా అన్ని బాధ్యతల్ని సక్రమంగా నెరవేర్చాడు. జయసుధ కూడా ఏం తక్కువ కాదు. తన అనుభవాన్నంతా రంగరించి ఈ క్యారెక్టర్ చేసింది. వీళ్లిద్దరు కలిసి పతాక సన్నివేశాల్లో కళ్ళకి నీళ్లు తెప్పిస్తారు. సీనియర్ నరేష్ తనదైన కామెడీ టైమింగ్ తో అలరించాడు. ఇంద్రజ వాళ్ళ సినిమాకి పెద్దగా ఒరిగిందేమి లేదు.
సాంకేతిక వర్గం :
సతీష్ వేగేశ్న తన కథని బాగా నమ్మాడు. ఆడియో విడుదల వేడుకలోనే చెప్పాడు- కొత్త కథ చేయలేదు కానీ కొత్తగా, నచ్చేట్టుగా తీసాను అని. తాను చెప్పినట్టుగా, శతమానం భవతి కొన్ని వేరే చిత్రాల్ని గుర్తుతెచ్చినప్పటికీ, ఎంటర్టైనింగ్ గా ఉండి పర్లేదు అన్పిస్తుంది. కొన్ని సన్నివేశాలు హృదయం తాకేలా ఉంటాయి, కానీ ఒక పాయింట్ చెప్పడానికీ సినిమా మొత్తం సాగ తీత లాగ ఉంటుంది. సమీర్ రెడ్డి కెమెరా వర్క్ చాలా బాగుంది. ప్రకృతి అందాల్ని తన కెమెరాతో బంధించాడు. మిక్కీ జే మేయర్ వినసొంపైన బాణీల్ని ఇచ్చాడు. నేపథ్య సంగీతం కూడా ఆహ్లాదకరంగా ఉంది. ఎడిటర్ సెకండ్ హాఫ్ లో వచ్చే కొన్ని బోరింగ్ సన్నివేశాలకి కత్తెర పెట్టుంటే బాగుండేది. దిల్ రాజు సినిమా కి ఎంత అవసరమో అన్నే డబ్బులు పెట్టాడు.
ప్లస్ పాయింట్స్ :
ప్రకాష్ రాజ్, జయసుధ
శర్వానంద్, అనుపమ
సంగీతం
మైనస్ పాయింట్స్;
కొత్తదనం లేని కథ
నత్తనడకన నడిచే కథనం
తెలుగువన్ ప్రొస్పెక్టివ్ :
ఈ సంక్రాంతికి ఫామిలీ తో కలిసి చూడాలంటే శతమానం భవతి మంచి ఆప్షన్. అప్పుడప్పుడూ కొంచెం బోరింగ్ గా ఉన్నా, అశ్లీలతకు చోటులేకపోవడం వాళ్ళ ఒక వర్గానికి బాగా నచ్చొచ్చు. కానీ, మాస్ ప్రేక్షకుల ఆదరణ ఈ సినిమాకి ఉండక పోవచ్చు.
Rating : 2 .75