Home | News | Cinema | TV | Radio | Comedy | Romance | Shopping | Bhakti | VOD | Classifieds | NRIcorner | KidsOne | Greetings | Charity | More
Events Archive
2011
2010
2008
2007
2006
 
 
     Home >> Mother's Day Special Article

ప్రేమ + ప్రేమ = అమ్మ
మదర్స్ డే... మాతృత్వాన్ని గౌరవించడానికి ఉద్దేశించిన మధురమైన రోజు. ప్రపంచవ్యాప్తంగా మదర్స్ డే ను వేరేవేరే రోజుల్లో సెలెబ్రేట్ చేసుకున్నప్పటికీ ఎక్కువమంది ఈరోజే, అంటే మే సెకెండ్ సండేనే మదర్స్ డే గా వేడుక చేసుకుంటారు.

అమ్మపట్ల గౌరవం, ఆదరణ అనాదిగా ఉన్నదే. ఆసియాలో క్రీస్తుపూర్వం 6000 నాటి కాలంలో మదర్ గాడెస్ ను పూజించేవారు. అమ్మలకే అమ్మ ఆదిశక్తిని పూజించడం అనే ఆచారం ఆసియా నుండి గ్రీకు దేశాలకు పాకింది. వాళ్ళు ''సిబెలె'' పండుగ జరుపుకుంటారు. అనేక యూరోపియన్ దేశాల్లో క్రిస్టియన్ పండుగ పవిత్ర మేరీమాత గౌరవార్థం ''మదరింగ్ సండే'' జరుపుతారు.

మాతృత్వాన్ని గౌరవించడమే మదర్స్ డే ఉద్దేశం. ఈ మదర్స్ డే ఎలా వచ్చింది అంటే, ఖచ్చితంగా పూర్వాపరాలు తెలీవు. ఫెమినిస్ట్ అయిన జూలియా వార్డ్ హోవే గౌరవార్థం మదర్స్ డే జరపడం ఆనవాయితీగా మారిందనేది కొందరి నమ్మకం.. 18 వ శతాబ్దం చివర్లో జరిగిన అమెరికన్ సివిల్ వార్ సందర్భంలో జూలియా వార్డ్ హోవే సమాజాన్ని సంస్కరించాల్సిన, రాజకీయంగా ఉన్నత స్థితికి తీసికెళ్ళాల్సిన బాధ్యత స్త్రీలమీద ఉంది - అంటూ ఆ కాలంలోనే ఢంకాపధంగా చెప్పిన ధీర వనిత జూలియా వార్డ్ హోవే. 19వ శతాబ్దం మొదట్లో అన్నా జార్విస్ సేవలకు గాను మే రెండో ఆదివారాన్ని మదర్స్ డే గా జరపాలని నిర్ణయించారని మరి కొందరు విశ్వసిస్తారు.

మొత్తానికి ఎవరు, ఎప్పుడు నిర్ణయిస్తేనేం, అసలు ''మదర్స్ డే'' అంటూ ఒకరోజు ఉండటం అపురూపం. లోకంలో అమ్మను మించిన అపురూపమైన రిలేషన్ ఇంకోటి లేదు. బంధాలూ, అనుబంధాలూ అన్నీ స్వార్ధపూరిత సంబంధాలే, ఒక్క తల్లీబిడ్డల సంబంధం తప్ప. ఇది కల్తీ లేని, కల్మషం లేని ఆత్మీయ సంబంధం.

తల్లి ప్రేమను మించింది లోకంలో లేదు. అమ్మ ఒడి కంటే చల్లనైన ప్రదేశం ఉండదు. అమ్మ లాలన, పాలన అద్భుతం, అపురూపం. ఆవిడ పంచే ఆత్మీయత, అనురాగం ఇంకెక్కడా దొరకవు. దేవుడు అన్ని చోట్లా తాను ఉండటం కుదరక అమ్మను పంపించాడట. అమ్మ ప్రేమ అమూల్యం, అనిర్వచనీయం.

తాను తినకుండా అయినా పిల్లల కడుపు నింపుతుంది అమ్మ. "కన్నా" అంటూ అల్లారుముద్దుగా దగ్గరికి తీసుకుంటే చాలు, కొండంత సంబరం కలగదూ?! ఆ అనురాగం, ఆ ఆప్యాయత అనిర్వచనీయం. అది వెలకట్టలేని ప్రేమ. మాటలకందని మధురానుభూతి.

లోకంలో ఏది లేకున్నా బతికేయొచ్చు. ఎవరు లేకున్నా సాగిపోవచ్చు. కానీ, అమ్మ లేకుంటే మట్టుకు నిజంగా అనాధలమే. దిక్కుతోచనట్టు, దారులు మూసుకుపోయినట్టు అయోమయంగా, అగమ్యగోచరంగా ఉంటుంది. అమ్మ స్థానాన్ని మరెవ్వరూ భర్తీ చేయలేరు. అమ్మకు అమ్మే సాటి.

ఇంత మంచి అమ్మకు, ఇలాంటి గొప్ప అనురాగమయికి ప్రతిగా మనమేం ఇస్తున్నాం? బదులెలా తీర్చుకుంటున్నాం? రెక్కలొచ్చిన పక్షులు ఎగిరిపోయినట్లు అవసరాలు తీరగానే మన దారి మనం చూసుకోవడం ఎంత అన్యాయం?! త్యాగానికి ప్రతిరూపం అయిన అమ్మ దగ్గర కూడా స్వార్థమేనా?

తల్లి, పిల్లలకు అన్నీ ఇస్తుంది. తన కడుపు మాడ్చుకుని అయినా బిడ్డల ఆకలి తీరుస్తుంది. తాను కొవ్వొత్తిలా కరుగుతూ పిల్లల జీవితంలో వెలుగు నింపుతుంది. అమ్మ మనసు వెన్న కంటే మెత్తనైంది. బంగారం కంటే స్వచ్చమైనది. అమ్మ రుణం ఎటూ తీర్చుకోలెం. కనీసం ఆవిడని మనసారా ప్రేమిద్దాం. వృద్ధాప్యంలో ఆలంబనగా నిలుద్దాం. ఎన్నడూ అమ్మ కంట కన్నీరు ఒలక్కుండా జాగ్రత్త పడదాం.

ప్రపంచంలో ఉన్న అమ్మలందరికీ మదర్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు.