దేవీ నవరాత్రులు ... స్పెషల్ స్టోరీ - 1
శివ శ్శక్త్యా యుక్తో యది భవతి శక్త: ప్రభవితుం
న చే దేవం దేవో నఖలు కుశల స్పందితు మపి
అతస్త్వా మారాధ్యాం హరి హర విరించాదిభి రపి
ప్రఫంతుమ్ స్తోతుమ్ వా కథ మకృత పుణ్యం ప్రభవతి!
ఈ చరా చర జగత్తుని నడిపించేది శక్తి ఈ శక్తి లేనట్టయితే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు తమ తమ కృత్యాలైన సృష్టి స్థితిలయాలు నిర్వర్తించటమే కాదు, కదలటం కూడా చేత కాని వారవుతారు. ఆ శక్తినే ఆదిశక్తి, పరాశక్తి అంటారు. ఆ శక్తి త్రిగుణాత్మకంగా ఉంటుంది. తమో గుణ ప్రధానమైనప్పుడు మహాకాళి అనే పేరుతో పిలువబడుతుంది. రజోగుణ ప్రధానమైనపుడు ఆ శక్తిని మహాలక్ష్మి అని పిలుస్తారు సత్త్వగుణంలో ప్రకాశించే శక్తి మహాసరస్వతి. ఇవి ప్రధానమైన రూపాలుగా ముల్లోకాలలోనూ బాగా ప్రసిద్ధమైనవి ఇవే కాదు మహాశక్తి ఎప్పుడు ఎక్కడ దుష్ట సంహారం చేయవలసిన అవసరం వచ్చినా, శిష్ట రక్షణ చేయవలసిన అవసరం కలిగినా జీవులపై ఉన్న అంతు లేని ప్రేమతో అవతరిస్తూ వచ్చింది. ఎంతైనా జగన్మాత కదా! అన్ని సందర్భాలలోను ఆ తల్లి ఆవ్వయుజ వుద్ధ పాడ్యమినాడు అవతరించి నవమి నాడు రాక్షస సంహారం చేయటం జరిగింది. కనుక ఆదిపరాశక్తిని ఆసమయంలో పూజించి ఆ తల్లి అనుగ్రహం పొందటం సంప్రదాయం అయింది.
అందరు దేవతల శక్తి ఏకీకృతమై రూపుదాల్చిన శ్రీదేవి రాక్షసులతో యుద్ధం చేసే సమయంలో దేవతలు, ఋషులు ఆమెకు పుష్టి కలగటానికి దీక్షలు పూనారు`యజ్ఞాలు, హోమాలు, జపాలు, తపాలు పూజలు, సారాయణలు మొదలైనవి. మానవులు కూడా ఉడతా భక్తిగా తమకు తోచిన విధంగా దీక్షలు చేయటం మొదలు పెట్టారు. ఈ దీక్షలలో ఉపావాసాది నియమాలు పాటించటంలో ఎన్నో పరమార్థాలు ఉన్నాయి. భారతీయులు జరుపుకునే పండగలన్నీ బహుళార్ధ సాధక ప్రణాళికలే! సంవత్సరంలో వసంత ఋతువు శరదృతువు యమదంష్ట్రలుగా చెప్పబడ్డాయి దానికి కాలంలో వచ్చే మార్పులే కారణం. వర్షాలు పూర్లి అయి, వాతావరణంలో పెను మార్పులు వచ్చే సమయం శరదృతువు. దానిని తట్టుకొనే శక్తి శరీరానికి మనస్సుకి కలిగి సంవత్సరం పాటు ఆరోగ్యంగా ఉండటానికి ఈ దీక్షలు సహకరిస్తాయి మన శరీరంలోనే మనకి సహాయ పడే శక్తులు, హాని కలిగించేవి కూడా ఉన్నాయి. వాటి మధ్య జరిగే సంఘర్షణకే దేవి రాక్షసులతో యుద్ధం చేయటం సూచిస్తుంది మరెన్నో ఖగోళ సంబంధమైన, సామాజిక అంశాలు కూడా ఇమిడి ఉన్నాయి.
శక్తి అవతారాలు మహాకాళి
ప్రథమంగా ఆవిష్కృతమైన శక్తి తమోగుణ ప్రధానమైనది సృష్టి కార్యం చేయటానికి ఆవిర్భవించిన బ్రహ్మ తననెవరు సృష్టించారో, ఎందుకు సృష్టించారో అర్థం కాక ఏం చెయ్యాలో తెలియక ఉన్నప్పుడు ఆయనకి తమ ఉన్న పద్మం క్రింద ఉన్న నీరు కనిపించింది. ఆ నీరు తపతపా కొట్టుకుంటుంటే తపస్సు చేయాలి అని అనిపించిందట. తపస్సు అంటే ఏమిటి? అని లోచిస్తే ఎలా చెయ్యాలో స్ఫురించిందట. సృష్టి చెయ్యాలి అని ఆ విజ్ఞానం కోసం తపస్సు చేశాడు మెచ్చిన నారాయణుడు దర్శనమిచ్చి, అనుగ్రహించి యోగనిద్రా ముద్రితుడై పోయాడు. బ్రహ్మ తనకు స్ఫురించిన తీరులో సృష్టి కార్యం నిర్వర్తిస్తూ ఉన్నాడు. యోగనిద్రలో ఉన్న విష్ణుమూర్తి రెండు చెవులలో నుండి వలము (గులివి) ప్రవించింది. నిత్ర తమో గుణం. ఆ సమయంలో శరీరంలోని అన్ని అవయవాల నుండి వ్యర్థ పదార్థాలు విసర్జించబడటం సహజమే కదా! ఆ గులివి ముద్దల నుండి ఇద్దరు రాక్షసులు రూపు కట్టారు ఒకడు మధువు, మధువు అంటే తేనె, తేనె లాగా తియ్యని మాటలు వినాలనుకోవటం చెవికి ఉండే ఒక బలహీనత. కనుక ఒక చెవి నుండి ఆ బలహీనత మలిన రూపంలో బయటికి వచ్చింది. రెండవ చెవి నుండి వచ్చినది కైటభుడు అనే రాక్షస రూపం ధరించింది. కీటకముల మొక్క లక్షణం, లేక మోసపూరిత గుణం కైటభం. ఎప్పుడూ ఎదుటి వారికి నచ్చే విధంగా తియ్యని మాటలు మాట్లాడటం వీలు కాదు. ఎన్నని మంచి గుణాలు ఆపాదించగలం? కనుక తిప్పి, తిప్పి మోసపూరితంగా చెప్పటం జరుగుతుంది. గుంపులు గుంపులుగా చేరి లుకలుక లాడటం వాటి కీటకాల లక్షణం. పైగా అవి మలినం ఉన్న చోటున మాత్రమే ఉండగలవు. జరిగిపోయిన వాటి గురించి మళ్ళీ మళ్ళీ మాట్లాడుకుంటు ఉండటం వానాలనుకోవటం అనే లక్షనం చెవికి ఉండే రెండో మలినం.
మధు కైటభులు మలినొద్భవులు, తమో గుణం వర్తిస్తున్ననిద్రా సమయంలో పుట్టారు కనుక రాక్షసులు. తమోగుణ లక్షాలైన మదం, అహంకారం నిండుగా కలిగిన వారు. ప్రళయ జాలలో యథేచ్ఛగా విహరిస్తూ తమపుట్టుకకు ఎవరు కారణము? ఎవరీ సందేహ నివృత్తి చేస్తారూ అని ఆలోచించసాగారు. అపుడు వారికి ఆకాశం నుండి వాగ్బిజ రూపంలో ఒక ధ్వని వినిపించింది. వారు దానిని సాధన చేస్తుండగా ఒక మెరుపు గోచరించింది వేయేండ్లు ఆ విధంగా ఘోరమైన తపస్పు చేయగా వారిపై దయ తలచి పరాశక్తి దర్శనమిచ్చింది. వారు ఆ శక్తికి ప్రణమిల్లి వరం కోరుకోమంటే స్వచ్ఛంద మరణం కావాలని కోరుకున్నారు. ఆమె అనుగ్రహించింది. వారు వర గర్వంతో మరింత మదించి జలచరాలనన్నిటిని హింసిస్తూ బ్రహ్మ వద్దకు వచ్చి తమతో యుద్ధం చెయ్యమని లేదా ఓటమిని అంగీకరించి పద్మాసనం తమకు వదిలి వెళ్ళమని అడిగారు. బ్రహ్మకు వారితో య్ధుం చేసి గెలుస్తాననే నమ్మకం లేదు కనుక తనకు శరణ్యుడైన విష్ణువుని ప్రార్థించాడు ఆయన యోగనిద్రలో ఉండటం వల్ల బ్రహ్మ ప్రార్థనను వినిపించుకోలేదు. బ్రహ్మ అప్పుడు సర్వలోకాధిపతి అయిన విష్ణువు ఒక మహాశక్తికి వశుడై ఉండటం గమనించి, నిద్రారూపంలో ఉన్న యోగమాయను స్తుతించి ప్రార్థించాడు. ప్రసన్నురాలైన ఆమెను విష్ణువును చైతన్యవంతునిగా చేయమని వేడుకున్నాడు. తమోగుణ స్వరూపిణి అయిన నిద్రాదేవి నల్లని రూపంలో విష్ణువు శరీరం నుండి బయల్వెడలి ప్రక్కన నిలచింది.
యోగనిద్ర నుండి మేలుకొన్న విష్ణువు బ్రహ్మను తపస్సు వదిలి వచ్చిన కారణమేమిటి అని అడిగితే బ్రహ్మ మధుకైటభుల గురించి చెపుతాడు. విష్ణువు బ్రహ్మకు అభయ మిస్తుండగానే మధుకైటభులక్కడకు వచ్చారు. విష్ణువు వారిని తనతో యుద్ధం చెయ్యమని అడిగాడు. ఒకరు అలసిపోతే రెండవవారు యుద్ధం చేసేవారు. విష్ణువు ఒక్కడే విరామం లేకుండా వారితో ఐదువేల సంవత్సరాలు యుద్ధం చేశారు. కొద్ది విశ్రృాంతి కావాలని అడిగి ఇంత యుద్ధం చేసిన వారిని సంహరించలేక పోవటానికి కారణం ఏమయి ఉంటుందా? అని ఆలోచించి దేవి ఇచ్చిన వరము కారణమని గుర్తించి ఆ శ్రీ విద్యా శక్తిని ప్రార్థించాడు తలెత్తి చూస్తే మనోహర రూపిణి అయిన యోగమాయ దర్శన మిచ్చింది. తను వారి బుద్ధులను మోహింప చేస్తానని అభయమిచ్చింది. మరలా యుద్ధం చేసి, వారి బలాన్ని మెచ్చుకుని వరం ఇస్తానని అన్నాడు విష్ణువు వారికి అహంకారం తలకెక్కి తాము యాచకులము కామని, తామే విష్ణువుకి వరం ఇస్తాము కోరుకోమని అన్నారు.
అయితే నా చేతిలో వధ్యులు అవండి అని కోరాడు విష్ణువు తాము మోసపోయామని గ్రహించి, మాట తప్పలేక తప్పించుకోవటానికి మార్గం వెతికి అంతా జలమయంగా ఉన్నది కనుక నీరులేని చోట చంపమని అడిగారు. విష్ణువు వారిని తన తొడలపై పెట్టుకొబోగా వారు తమ శరీరాలను విపరీతంగా పెంచారు. విష్ణువు కూడా తన శరీరం పెంచి తన తొడలపై వారిని ఉంచి సుదర్శనంతో కంఠాలని తెగవేశారు. వారి మేదస్సు చేత సముద్ర జాలాలు నిండిపోయాయి. అదే మేదిని. అంటే భూమి. ఈ విధంగా నిర్గుణమైన పరాశక్తి యొక్క మొదటి సగుణ ఆవిర్భావము తమోగుణమయమైన మహాకాళి. అందువల్లనే మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ అనే జగదంచిక త్రిశక్తులలో మొదటిగా మహాకాళినే పేర్కొనటం జరుగుతుంది.
ఇది వైవస్వత మన్వంతర వృత్తాంతం
శక్తి అవతారాలు మహాలక్ష్మి
సావర్ణి మన్వంతరంలో ఆది పరాశక్తి రజోగుణ ప్రధానమైన మహాలక్ష్మిగా అవతరించింది. దానికి హేతువు మహిషాసురుడు. జగన్మాత అవతారాలలో దీనికి చాలా ప్రాముఖ్యం ఉంది. ఇది ప్రధానమైన అవతారంగా పరిగణించబడుతుంది. ఎందుకంటే ఈ తత్త్వాన్ని వంటపట్టించుకోవటం ఏ కాలంలోనైనా అవసరమే. మహిషాసురులు ఎప్పుడూ ఉంటారు. అందుకే మహిషాసుర మర్ధినులైన మహాలక్ష్ముల అవసరం ఎప్పుడూ ఉంటుంది. దనువు పుత్రులలో రంభకు, కరంభుడు అనే వారిద్దరు తమకి పుత్ర సంతానం కావాలనే కోరికతో పంచనదీ జలాలలో తపస్సు చేశారు. కరంభుడు నీటిలో మునిగి వరుణుని గురించి తపస్సు చేయసాగాడు. రంభుడు ఒక మర్రి చెట్టుమీద ఉండి అగ్నిని ఆరాధించి పంచాగ్నులను సాధించటంలో నిమగ్నమయ్యాడు. ఇంద్రుడు వారి భయంకరమైన తపస్సు చూసి భయపడి, మొసలి రూపంలో వచ్చి, కరంభుని వధించాడు. రంబుడు తన సోదరుని చావుకి కోపం పెచ్చు పెరిగిపోగా, ఎడమ చేతిలో తన తల వెంట్రుకలు పట్టుకుని కుడి చేతితో కత్తిపట్టి తన తలను తానే తెగవేసి అగ్నిలో వ్రేల్చటానికి సిద్ధమయ్యాడు. అగ్ని ప్రత్యక్షమై తెలివి తక్కువగా అటువంటి పని చెయ్యవద్దు. నీకు కావలసిన వరం ఇస్తాను అన్నాడు రంభుడు. మూడు లోకాలను గెలవగలవాడు, దేవి దానవ మానవుల కజుయుడు, మహబలశాలి, కామరూపి, సర్వవంద్యుడు అయిన కుమారుని ప్రసాదించమని కోరాడు. అగ్ని నీమనస్సు ఏ స్త్రీ పట్ట ఆకర్షితమైతే ఆమె వల్ల నీకు నీవు కోరినటువంటి పుత్రుడు కలుగుతాడు అని వరం ప్రసాదించాడు.
రంభుడు సంతోషించి యక్షులు తిరిగే ప్రదేశంలో ఉన్న ఒక మహషాన్ని చూసి, మోహపరవశుడయ్యాడు. ఆ మహిషం కూడా అతడి వైపు ఆకర్షించబడిరది. మహిషం గర్భం దరించింది. దానిని సంతోషంగా ఉంచటం కోసం, కాపాడటం కోసం పాతాళానికి (ఆది దానవుల లోకం) తీసుకొని వెళ్ళాడు. ఒకప్పుడొక మహిషం దానిని చూసి, వ్యామోహపడి, దాని వెంట పడగా రంభుడు దానిని చంపటానికి వెళ్ళాడు. మదించిన ఆ మహిషం కొమ్ములతో పొడవగా రంభుడు చనిపోయాడు. యక్షులు ఆ మహిషంతో పోరి సంహరించారు. రంభుని వరీరం చితిపై ఉండగా చూసి, తట్టుకోలేక మహిషి ఆ చితిపైకి దూకింది. దాని గర్భంలో నుండి మహాబలవంతుడైన మహిషుడు బయటకు వచ్చాడు. రంభుడు తపస్సు చేసినదే పుత్రుడు కావాలని కదా! కుమారుడు కలుగగానే కుమారునికి తోడుపడటానికి రక్త బీజులు అనే పేరుతో మరొక రూపంలో బయటకు వచ్చాడు. మహిషాసురుని రాక్షసులు తమ రాజుగా అభిషేకించారు. మహిషాసురుడు భూమిని పరిపాలిస్తున్న కాలంగా భయంకరమైన దేవసుర సంగ్రామం జరిగింది. ఇది తరచుగా జరిగేదే. తమది కాని దానిని దొంగతనంగానో, దొరతనంగానో అనుభవించటం రాక్షసుల లక్షణం. తమదైన పాతాళం ఎంత సుందరంగా ఉన్నా వారి కన్ను స్వర్గం మీదే ఉంటుంది. పోనీ అని దానిని గెలిచి తృప్తి పడరు దేవతలను స్వర్గం నుండి పారదోలటం, బాధించటం, వారి యజ్ఞ భాగాలను కూడా తాము హరించటం వంటి అకృత్యాలను పాల్పడతారు. రాక్షసుల రాజ్యం ఎప్పుడూ పాలించకపోయినా తమ రాజ్యం కూడా కోల్పోయి, దీనులై దేవతలు బ్రహ్మవద్దకు వెడతారు. ఆయన వీరిని వెంట పెట్టుకొని శివుని వద్దకో, విష్ణువు వద్దకో తీసుకొని వెడతాడు వారు దానవులని అణచి, దేవతల రాజ్యం అయిన స్వర్గాన్ని వారికి అప్ప చెప్పటం జరుగుతూ ఉంటుంది.
స్త్రీలు అంటే చులకన
ఇటువంటి యుద్ధమే జరుగుతున్నప్పుడు మహిషాసురుడు బ్రహ్మ దేవుని గురించి మేరుగిరి మీద పదివేల ఏళ్ళు తీవ్రమైన తపస్సు చేశాడు. బ్రహ్మ ప్రత్యక్షమైతే తనకు దావులేకుండేట్టు వరం అడిగాడు. అది తన చేతుల్లో లేదని మరొక వరం కోరుకోమని అడిగాడు దానికి మహిషాసురుడు తనకు దేవ దానవ నరుల వల్ల చావు లేకుండ వరం ఇమ్మని అడిగాడు. పైగా ఆడుది తనను ఏమి చేయలేదు కనుక స్త్రీ చేతిలో చావు మూడితే తను తప్పించుకో గలను అని ధీమాగా అన్నాడు.
స్త్రీల పట్ల ఎంత చులకన భావం!!
అల్పులకి అధికారం వస్తే అహంకారం పెచ్చు పెరిగిపోతుంది గొప్ప వారికి వస్తే వచ్చిన దానిని బాధ్యతయుతంగా స్వీకరిస్తారు. వరాలైనా అంతే. అసలే మహిషం. వర గర్వంతో మదించి ప్రవర్తించసాగాడు తన రాజ్యంతో సరిపెట్టుకుంటే దానవుడెలా అవుతాడు? ఇంద్రుడికి స్వర్గాన్ని తనకిమ్మని లేదా యుద్ధం చెయ్యమని దూతని పంపాడు. ఇంద్రుడు స్వర్గాన్ని వదలుకొనటానికి ఇష్టపడలేదు. ఆ మాట దూత చెప్పగానే సైన్యాన్ని తీసుకొని ఇంద్రునిపై యుద్దానికి వెళ్ళాడు ఇంద్రుడు కూడా దిక్పాలకులను కూడుకొని, బృహస్పతిని కర్తవ్య ముపదేశించమని అడిగాడు. అందరు కలసి బ్రహ్మవద్దకు వెళ్లారు బ్రహ్మ వారిని శివుని వద్దకు, శివుడు అందరిని విష్ణువు వద్దకు తీసుకొని వెళ్ళటం జరిగింది. కోపగించినవారై అందరు కలిసి మహిషునిపై యుద్ధానికి తమ తమ వాహనాలని ఎక్కి, ఆ యుధాలని తీసుకొని వెళ్లారు ముందుగా మహిషుని సేనానులు చిక్షురుడు, బిడాలుడు తరువాత తామ్రుడు యుద్ధానికి వచ్చారు. వారిని మూర్చితులను చేయగా మహిషుడే స్వయంగా వచ్చి శివ కేశవులతో యుద్ధం చేసి, వారి ఆయుధాలను నిర్వీర్యం చేశాడు. దేవతలు స్వర్గం వదలిపెట్టి గుణలలో తల దాచుకొన్నారు.
ఋషులు వచ్చి బ్రహ్మను ప్రార్థిస్తే మహిషుడి చావు స్త్రీ చేతిలో మాత్రమే ఉన్నది కర్తవ్యం విష్ణువుని అడుగుదాము అని అందరు కలిసి కైలాసం వెళ్లి శివునితో కలిసి వైకుంఠం వెళ్లారు విష్ణువు బ్రహ్మ వరంలోని ధర్మ సుక్ష్మాన్ని గ్రహించి ఈ విధంగా చెప్పాడు. ‘దేవతల తేజోంశముల నుండి వీరాంగన పుట్టాలి మనమూ. మన పత్నులూ మన తేజోంశములను ప్రార్థించి, వాటినుండి పుట్టిన తేజో రాశికి అందరము మన ఆయుధములను ఇద్దాము ఆమో మహిషుని చంపగలదు’. విష్ణుమూర్తి మాటలు పూర్తి అవుతూనే దేవతలందరి నుండి తేజములు వెలువడి ఒక మహోజ్యలతేజోరాశిగా రూపు కట్టింది వెలుగు ముద్ధ కనుక ఆమెను దేవి అన్నారు. ఆమెకు పద్దెనిమిది చేతులున్నాయి. ఆమె జగన్మోహిని త్రిగుణాత్మిక, త్రివర్ణ దివ్యాభరణ భూషిత.
శ్రీదేవి దివ్వ స్వరూపము
శంకరుని నుండి వెలువడిన తెల్లని తేజముతో ఆమె ముఖ కమలము రూపు దాల్చింది. యముని తేజస్సుతో నల్లని అందమైన కురులు ఏర్పడ్డాయి. నలుపు, తెలుపు, ఎరుపు రంగులతో కాంతులీనే కన్నులు అగ్ని తేజముతో ఏర్పడినాయి. కనుబొమ్మలు సంధ్యల నుండి, చెవులు వాయువు తేజస్సు నుండి, నాసిక కుబేరుని తేజము నుండి, దంతములు దక్షుని తేజము నుండి, క్రింది పెదవి అరుణుడితేజము నుండి, పై పెదవి కార్తికుయుని తేజము నుండి, పదునెనిమిది భుజాలు విష్ణు తేజము నుండి వసువుల తేజము నుండి చేతి వ్రేళ్లు, సౌమ్యుని తేజము నుండి చనుదోయి ఇంద్రుని తేజము నుండి త్రివళులు, వరుణుని తేజము నుండి ఊరువులు జంఘలు, ఇంక మిగిలిన దేవతా తేజములు కూడా ఏకమై అద్భుత సౌందర్య రాశి రూపు దాల్చింది. దేవతలందరూ ఆ దేవికి వస్త్రాభరణాదులను సమర్పించారు. హిమవంతుడు సింహాన్ని వాహనంగా సమర్పించాడు. దేవతలందరు తమ తమ ఆయుధాలలో నుండి అటువంటి ఆయుధాలనే తీసి ఇచ్చారు. ఆ దివ్య మూర్తిని స్తుతించి స్త్రీ వధ్యుడైన మహిషుని మోహితుని చేసి సంహరించమని విన్నవించుకున్నారు. అభయమిచ్చి గట్టిగా నవ్వింది దేవి దేవతలకు సంతోషం, మహిషుడికి మనసులో సందేహం కలిగాయి.
ఒక మంత్రి తమ రాజు మాటలను దేవికి విన్నవించాడు. ఆమె మహిషునికి పట్టమహిషి కాగలదని ఆశ చూపించాడు. జగన్మాత నవ్వి తన మాటలుగా అతడికి కొన్ని హితోక్తులు చెప్పింది. మంత్రి ఆమెను వప్పించటానికి ఎంతో ప్రయత్నం చేశాడు. ఆమె తగిన ప్రత్యుత్తర మిచ్చి పంపించింది. అతడు ఎంతో ఆలోచించి రాజుకి చెప్పటమే ఉచితమని నిర్ణయించుకొన్నాడు. మహిషునితో దేవి నిరాకరణ గురించి తెలియచేశాడు. మహిషుడు మంత్రులందరను సమావేవ పరచి వారి సూచనలను అడిగాడు. అన్నీ విని తామ్రుని ఆమె వద్దకు పంపాడు. ఒప్పించమని, ఒప్పుకోక పోయిన పక్షాన చంపమని అదేశించాడు. అతడితో ఆమె తనకు పతి అన్నాడని చెప్పింది. బాష్కల దుర్ముఖులు తామామెను తీసికొని వస్తామని వెళ్ళి హతులయ్యారు అపుడు తామ్ర, చిక్షురులను పంపాడు. వారు నిహతులయ్యారు. అసిలోమ బిడాలుల గతి కూడా అంతే అయింది. ఇక మహిషుడే సరరూపం ధరించి దేవిని సమీపించి, తనను స్వీకరించమని, అటులయితే దేవతలతో శతృత్వం కూడా వదులుకుంటానని ఎన్నో వాగ్దానాలు చేసి, ఆశ చూపించాడు. దేవి తన నిజ తత్త్వాన్ని తెలియచేసింది. కాని మహిషుడు ఆమె రూపాన్ని చూసి మోహితుడయ్యాడు. ఆ తల్లి యుధ్ద సన్నద్ధురాలైతే తప్పక యుద్ధం చెయ్యటం మొదలు పెట్టాడు కామరూపి గనుక రకరకాల రూపాలతో యుద్ధం చేశాడు. ఆ రూపాలకు తగిన రూపాలను ధరించి దేవి మహిష రూపంలో ఉన్న రాక్షసుని సంహరించింది. ఇది జరిగింది ఆశ్వయుజ శుద్ధ నవమి రోజున. అప్పటి వరకు దీక్ష వహించిన వారందరు దశమినాడు జగదంబను స్తుతించి అమ్మకు పట్టాభిషేకం చేసి వేడుకలు చేసుకుని ఆనందించారు. వారి స్తుతులకు సంతసించిన శ్రీదేవి వారిని వరం కోరుకోమన్నది. తమకు అవసరమైనప్పుడు ఈ విధంగా కాపాడమని కోరారు. ఆమె వారు తలచి నప్పుడు అవతరిస్తానని మాట ఇచ్చింది.