ఈరోజు హోలీ. కలర్స్ డే. కలర్ఫుల్ డే. పరస్పరం రంగులు జల్లుకుంటూ సంతోష సాగరంలో మునిగితేలే రోజు. చీకులూ చింతలూ, చిరాకులూ పరాకులూ మరచి, పరవశించే రోజు. కలర్స్ తో కలర్ఫుల్ గా గడిపే రంగుల పండుగ. హోలీని సంస్కృతంలో వసంతోత్సవం అని కూడా అంటారు. అతి ప్రాచీనకాలంలో కూడా ఈ వేడుక జరుపుకున్నట్టు పురాణ కధనాలు చెబుతున్నాయి.
కొడుకు ప్రహ్లాదుడు విష్ణు నామస్మరణ చేయడం తండ్రి హిరణ్యకశిపునికి గిట్టదు. దాంతో ఏనుగులతో తొక్కించబోతాడు. అవి తప్పుకుని వెళ్ళిపోతాయి. కొండపైనుండి విసిరేయగా విష్ణుమూర్తి కాపాడతాడు. లాభంలేదని హిరణ్యకశిపుడు తన చెల్లెలు హోలిక చేతిలో కొడుకును ఉంచి దహించమంటాడు. విష్ణు భక్తుడైన ప్రహ్లాదునికి ఏమీ కాదు. హోలిక మాత్రం దహనమైపోతుంది. ఈ హోలికా దహనానికి గుర్తుగా దక్షిణ భారతంలో కామదహనం చేస్తారు. ఆ మరుసటి రోజే హోలీ.
ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసంలో పౌర్ణమిరోజును హోలీగా జరుపుకుంటాం. ఈ పండుగను మొట్టమొదట గుర్తించింది భారత్, నేపాల్, శ్రీలంకలు. హిందువులు, సిక్కులకు ఇది ముఖ్యమైన పర్వదినం. భారత్ లో బెంగాల్, ఒరిస్సా, బీహార్, గోవా, గుజరాత్, మహారాష్ట్ర, మణిపూర్, కేరళ, ఆంధ్రప్రదేశ్, కాశ్మీర్, పంజాబ్ - ఇలా అన్ని రాష్ట్రాల్లో కులమతాలతో సంబంధం లేకుండా అందరూ ఆనందంగా జరుపుకుంటారు. అలాగే భారత ఆచారాలు, అలవాట్లు ప్రతిఫలించే మలేషియా, గుయానా, సౌత్ ఆఫ్రికా, యునైటెడ్ కింగ్డమ్, మారిషస్, ఫిజి తదితర దేశాల్లో కూడా ఈ కలర్ఫుల్ పండుగ జరుపుతారు.
పశ్చిమ బెంగాల్, ఒరిస్సా రాష్ట్రాల్లో హోలీని డోల్ యాత్ర లేదా డోల్ జాత్ర అని బసంతోత్సవ్ అని అంటారు. శ్రీకృష్ణుని పేరుమీద జరుపుకునే హోలీ మధుర, బృందావనం, నందగాం, బర్సాన ప్రాంతాల్లో మరింత శోభాయమానంగా 16 రోజులపాటు జరుగుతుంది. హోలీ రోజుల్లో ఈ ప్రదేశాలు యమా కలర్ఫుల్ గా ఉంటాయి. టూరిస్టులతో కిటకిటలాడుతాయి.
రోజూవారీ దిగుళ్ళకు దూరంగా ఒకరిమీద ఒకరు కలర్స్ జల్లుకుంటూ, కలర్ వాటర్ స్ప్రే చేసుకుంటూ ఆనందం పొందుతారు, వింత అనుభూతిని సొంతం చేసుకుంటారు. ఇది నిజంగా కలర్ఫుల్ డే, చీర్ఫుల్ డే.
హ్యాపీ హోలీ!