Home » Rice » Pulihora Specials
రకరకాల పులిహోరలు ...
కావలసిన పదార్థాలు:--
పొడిపొడిగా వండిన అన్నం -- 1 కప్పు
చింతపండు గుజ్జు -- పావు కప్పు
పచ్చిమిర్చి -- 6(నిలువుగా చీల్చి ఉంచుకోవాలి)
ఎండుమిర్చి -- 3
పోపుదినుసులు -- తగినన్ని(మినప్పప్పు , శెనగపప్పు , ఆవాలు, కొంచెంగా మెంతులు )
వేరుశెనగ పప్పు (గుళ్ళు) -- పావుకప్పు
కరివేపాకు రెబ్బలు -- కొద్దిగా
పసుపు & ఉప్పు -- రుచికి తగినంత
ఇంగువ -- 1/2 స్పూన్ (ఇష్టమైతే మరికొంచెం వేసుకోవచ్చును)
నూనె -- 1/4 కప్పు
తయారీవిధానం:--
ముందుగా స్టవ్ వెలిగించుకొని, బాణలి పెట్టి, కొద్దిగా నూనె వేసి చింతపండుగుజ్జులో కొద్దిగా ఉప్పు, పసుపు వేసి చింతపండు దగ్గరపడేవరకు మగ్గించి, పక్కనపెట్టుకోవాలి. ఇప్పుడు మల్లి బాణలి పెట్టి నూనెవేసి, పోపుదినుసులు, వేరుశెనగగుళ్ళు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఇంగువ, అన్నీ వేసి బాగా వేగాక కొంచెం పోపును తీసి పక్కన పెట్టుకోవాలి, మిగిలినపోపులో మగ్గించి పక్కనపెట్టుకున్న చింతపండుగుజ్జును వేసి, 5 నిముషాలు ఉంచి, దించి ఒక బేసనలో ఉంచుకొన్న అన్నం మీద పోపుని, చింతపండుతో కలిసిన పోపుని వేసి బాగా కలియబెట్టాలి. అంతా కలిసాక పైన మిగిలిన నూనెను వేసి మరొక్కసారి కలపాలి. అంతే కమ్మని వాసనగల చింతపండు పులిహోర రెడీ. పండుగనాడు ప్రతీఒక్క ఇంట్లోను చేసుకొనే ప్రసాదములలో ఇది ముందుగా ఉంటుంది. ఎందుకంటే పర్వదినాలలో పసుపుఅన్నం తప్పనిసరిగా చెయ్యాలని ..... అందరూ చేస్తారు.
నిమ్మ పులిహొర
కావలసిన పదార్థాలు:-
అన్నం--4 కప్పులు
నిమ్మకాయలు--2
పచ్చిమిర్చి--4
వేరుసెనగ గుళ్ళు--1/2 కప్పు
ఉప్పు--రుచికి తగినంత
పసుపు--చిటికెడు
పోపు దినుసులు(సెనగపప్పు, మినపప్పు, ఆవాలు, ఎండుమిర్చి-2, ఇంగువ) కరివేపాకు & కొత్తిమీర....కొంచెం
నూనె-- 50 గ్రాములు
తయారుచేయు విధానం:--
ముందుగా ఒక పళ్ళెంలోకి అన్నం తీసుకొని, ఉప్పు, పసుపు, నిమ్మ రసం, కొంచెం నూనె వేసుకొని.....కలుపుకోవాలి..ఇప్పుడు స్టవ్ వెలిగించి, బాణలి పెట్టి,నూనె వేసి పోపుదినుసులు, వేరుసెనగ గుళ్ళు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించి.....అన్నం పైన వేసి కలుపుకోవాలి....పోపు అంతా అన్నానికి కలిసేలా కలుపుకోవాలి....కొట్టేమీర పైన వేసుకొని అలంకరించుకుంటే.....బావుంటుంది.....అంతే పుల్లపుల్లని నిమ్మ పులిహొర రెడీ.....మీకు తినాలనిపిస్తుంది కదా.....మరెందుకు ఆలస్యం.....త్వరగా చేసేయ్యండి.........
అటుకుల పులిహోర:--
కావలసిన పదార్థాలు:-
అటుకులు --4 కప్పులు
ఉల్లిపాయముక్కలు -- 2 కప్పులు
బంగాళాదుంపలు -- 2 కప్పులు
టమాట ముక్కలు -- 2 కప్పులు
కారెట్ తురుము -- 1/2 కప్పు
వేరుశనగ గుళ్ళు -- 1/2 కప్పు
పచ్చిమిర్చి -- 8 చీలికలు చేసినవి
పోపుదినుసులు & కరివేపాకు
ఇంగువ, ఉప్పు & పసుపు
నిమ్మకాయలు -- 2
నూనె -- 100 గ్రా
తయారీ విధానము:-
ముందుగా అటుకులను శుభ్రంగా బాగుచేసి కడిగిపెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాణలి పెట్టి, నూనె వేసి కాగిన తరవాత పోపుదినుసులు, కరివేపాకు వేసి, వేగిన తరవాత, వేరుసెనగ గుళ్ళు, ఇంగువ వేసి, తరిగిపెట్టుకున్న కూరలు అన్ని వేసి బాగా కదిపి, అన్ని వేగాక అటుకులు, ఉప్పు పసుపు వేసి బాగా కదిపి, అన్ని కలిసాక స్టవ్ మీద నుండి దించుకోవటమే. ఇష్టమైన వాళ్ళు నిమ్మకాయ రసం వేసుకోవచ్చును. అంతే వేడి వేడి అటుకుల పులిహోర రెడీ........
రవ్వ పులిహొర
కావలసిన పదార్థాలు:--
బియ్యపు రవ్వ -- 2 కప్పులు
నిమ్మకాయ --1
పచ్చిమిర్చి-- 6
ఉప్పు--రుచికి తగినంత
పసుపు-- 1 స్పూన్
కరివేపాకు -- 4 రెబ్బలు
వేరుశెనగగుళ్ళు -- 1/4 కప్పు
పోపు దినుసులు -- (సెనగపప్పు, మినపప్పు, ఆవాలు, ఎండుమిర్చి-4, ఇంగువ) కరివేపాకు
నూనె-- 50 గ్రాములు
తయారుచేయు విధానం:--
ముందుగా స్టవ్ వెలిగించి ఒక గిన్నెలో 4 కప్పులు నీళ్ళు పోసుకొని, మరిగిన తరవాత బియ్యపురవ్వని వేసి, 2 స్పూన్స్ నూనె వేసి ఉడికించి ఒక పళ్ళెంలోకి తీసి ఉంచుకోవాలి. ఉప్పు, పసుపు, కొంచెం నూనె వేసుకొని.....కలుపుకోవాలి..ఇప్పుడు స్టవ్ వెలిగించి, బాణలి పెట్టి,నూనె వేసి పోపుదినుసులు, వేరుశెనగగుళ్ళు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఇంగువ వేసి వేయించి.....ఉడికించి పక్కన పెట్టుకున్న రవ్వపైన వేసి కలుపుకోవాలి, నిమ్మరసాన్ని కూడా వేసి ....పోపు అంతా రవ్వ మిశ్రమానికి బాగా కలిసేలా కలుపుకోవాలి..... అంతే రవ్వ పులిహొర రెడీ.....
సేమ్యా పులిహోర
కావలసిన పదార్థాలు
సేమ్యా – 1/4 కేజీ
నిమ్మచెక్కలు – 3
పచ్చిమిరపకాయలు – 4
జీడిపప్పు -- 1/4 కప్పు
కరివేపాకు -4 రెబ్బలు
పోపుదినుసులు -- కొంచెం
ఎండుమిర్చి -- 3
ఇంగువ -- కొంచెం
పసుపు – చిటికెడు
ఉప్పు – తగినంత
నూనె – 1/4 కప్పు
తయారీవిధానం
ముందుగా స్టవ్ వెలిగించి ఒక పెద్ద గిన్నెతీసుకొని, అందులో నాలుగు గ్లాసుల నీళ్లు పోసి మరిగించాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు సేమ్యా వేసి 5 నిమిషాలు ఉఢకనివ్వాలి. తర్వాత సేమ్యాను చిల్లుల బేసేనలో వేయ్యాలి. సేమ్యా మీద వెంటనే చల్లటినీళ్లు పోయాలి. దీనివల్ల సేమ్యా మరింత ఉడికి మెత్తబడకుండా విడివిడిగా అంటుకోకుండా ఉంటుంది. నీరంతా పోయినతర్వాత ఒక పళ్ళెంలో వేసి, తగినంత ఉప్పు, నిమ్మరసం, పసుపు వేసి కలిపి పెట్టాలి. బాణలిలో నూనె వేడి చేసి పోపుదినుసులు వేసి, జీడిపప్పు, ఎండుమిర్చి, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, చిటికెడు పసుపు వేసి, బాగా వేయించి ఉడికించి పక్కన పెట్టుకున్న సేమ్యాలో వేసి కలియబెట్టాలి. పుల్లపుల్లగా సేమ్యాపులిహార రెడి.
ఆవ పులిహోర
కావలసిన పదార్థాలు
పొడిపొడిగా వండిన అన్నం -- 4 కప్పులు
చింతపండు గుజ్జు -- పావు కప్పు
అల్లం ముక్కలు -- 5 స్పూన్స్
పచ్చిమిర్చి -- 6(నిలువుగా చీల్చి ఉంచుకోవాలి)
ఎండుమిర్చి -- 3
పోపుదినుసులు -- తగినన్ని(మినప్పప్పు , శెనగపప్పు , ఆవాలు, కొంచెంగా మెంతులు )
వేరుశెనగ పప్పు (గుళ్ళు) -- పావుకప్పు
కరివేపాకు రెబ్బలు -- కొద్దిగా
పసుపు & ఉప్పు -- రుచికి తగినంత
ఇంగువ -- 1/2 స్పూన్ (ఇష్టమైతే మరికొంచెం వేసుకోవచ్చును)
నూనె -- 1 కప్పు
ఆవముద్ద -- (ఆవముద్ద తయారుచేయు విధానం:::2 స్పూన్స్ సెనగపప్పు, 3 స్పూన్స్ నూలుపప్పు, 2స్పూన్స్ ఆవాలు, 3 పచ్చిమిర్చి......ఇవి అన్ని కలిపి 1 గంట నానపెట్టి రుబ్బుకుంటే ఆవముద్ద రెడీ అవుతుంది)
తయారీవిధానం
ముందుగా స్టవ్ వెలిగించుకొని, బాణలి పెట్టి, కొద్దిగా నూనె వేసి చింతపండుగుజ్జులో కొద్దిగా ఉప్పు, పసుపు వేసి చింతపండు దగ్గరపడేవరకు మగ్గించి, పక్కనపెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ బాణలి పెట్టి నూనెవేసి, పోపుదినుసులు, వేరుశెనగగుళ్ళు, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, ఎండుమిర్చి, ఇంగువ, అన్నీ వేసి బాగా వేగాక కొంచెం పోపును తీసి పక్కన పెట్టుకోవాలి, మిగిలిన పోపులో మగ్గించి పక్కనపెట్టుకున్న చింతపండుగుజ్జును వేసి, 5 నిముషాలు ఉంచి, దించి ఒక బేసనలో ఉంచుకొన్న అన్నం మీద పోపుని వేసి బాగా కలియబెట్టాలి. చివరగా రుబ్బి ఉంచుకున్న ఆవముద్దని వేసి బాగా కలపాలి. అంతా కలిసాక పైన మిగిలిన నూనెను వేసి మరొక్కసారి కలపాలి. అంతే కమ్మని వాసనగల ఆవపులిహోర రెడీ.
మామిడికాయ పులిహొర
కావలసిన పదార్థాలు:-
అన్నం-- 10 కప్పులు
పుల్లని మామిడికాయలు -- 2 (సన్నగా కోరి ఉంచుకోవాలి)
పచ్చిమిర్చి-- 6
వేరుసెనగ గుళ్ళు--1 కప్పు
ఉప్పు--రుచికి తగినంత
పసుపు-- 1 స్పూన్
కరివేపాకు -- 4 రెబ్బలు
జీడిపప్పు -- 1 కప్పు
పోపు దినుసులు(సెనగపప్పు, మినపప్పు, ఆవాలు, ఎండుమిర్చి-4 ఇంగువ) కరివేపాకు
నూనె-- 100 గ్రాములు
తయారుచేయు విధానం:--
ముందుగా స్టవ్ వెలిగించి, బాణలి పెట్టి, నూనె వేసి పోపుదినుసులు, వేరుసెనగ గుళ్ళు, పచ్చిమిర్చి, జీడిపప్పు, కరివేపాకు వేసి, మామిడి తరుగు(కోరు)ని కూడా వేసి వేయించి, వండి ఉంచుకున్న అన్నం పైన పోపుని వేసి ..... ఉప్పు, పసుపు, కొంచెం నూనె వేసుకొని కలుపుకోవాలి..అన్నీ అన్నానికి బాగా కలిసేలా కలుపుకోవాలి..... మామిడి పులిహోర మీద నూలుపొడి వేసి కలుపుకోవాలి. అంతే పుల్లపుల్లని మామిడికాయ పులిహొర రెడీ.....
నారింజకాయ పులిహొర
కావలసిన పదార్థాలు:--
అన్నం-- 8 కప్పులు
నారింజకాయ --1
పచ్చిమిర్చి-- 6
వేరుసెనగ గుళ్ళు--1 కప్పు
ఉప్పు--రుచికి తగినంత
పసుపు-- 1 స్పూన్
కరివేపాకు -- 4 రెబ్బలు
నూలుపొడి -- 1 కప్పు
జీడిపప్పు -- 1 కప్పు
పోపు దినుసులు(సెనగపప్పు, మినపప్పు, ఆవాలు, ఎండుమిర్చి-4, ఇంగువ) కరివేపాకు
నూనె-- 50 గ్రాములు
తయారుచేయు విధానం:--
ముందుగా ఒక పళ్ళెంలోకి అన్నం తీసుకొని, ఉప్పు, పసుపు, నారింజ రసం, కొంచెం నూనె వేసుకొని.....కలుపుకోవాలి..ఇప్పుడు స్టవ్ వెలిగించి, బాణలి పెట్టి,నూనె వేసి పోపుదినుసులు, వేరుసెనగ గుళ్ళు, పచ్చిమిర్చి, జీడిపప్పు, కరివేపాకు వేసి వేయించి.....అన్నం పైన వేసి కలుపుకోవాలి....పోపు అంతా అన్నానికి కలిసేలా కలుపుకోవాలి..... నారింజ పులిహోర మీద నూలుపొడి వేసి కలుపుకోవాలి. అంతే పుల్లపుల్లని నారింజకాయ పులిహొర రెడీ.....ఇష్టమైనవారు కొత్తిమీరని వేసుకోవచ్చును.
I.V సీత దేవి