వెజిటెబుల్ లాలిపాప్స్
సమ్మర్ హాలిడేస్ వచ్చాయంటే రోజూ ఏదో ఒక కొత్త వెరైటీ చేసి పెట్టాలి పిల్లలకి. బజ్జీలు, పాప్ కార్న్స్ ఇలా అన్నిటితో పాటు ఈ వెజిటేబుల్ లాలిపాప్స్ చేసి పెడితే, చూడటానికి భలేగా ఉండి, వాళ్ళు తింటూ చక్కగా ఎంజాయ్ చేస్తారు.
కావాల్సిన పదార్థాలు:
ఉడుకించిన బంగాళదుంపలు - 3,4
కేరట్ తురుము - 1 కప్పు
ఉల్లి తరుగు - 1 కప్పు
పనీర్ - 50 గ్రా
మైదా, కార్న్ ఫ్లోర్ కలిపి - 2 చెంచాలు
మేగి మసాలా పొడి - 1/2 చెంచా
చాట్ మసాలా పొడి - 1/2 చెంచా
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 చెంచా
బ్రెడ్ పౌడర్ - 1/2 కప్పు
ఉప్పు, కారం - తగినంత
టూత్ పిక్స్ - కొన్ని
తయారి విధానం:
ఈ వెజిటేబుల్ లాలిపోప్స్ తయారుచేసుకోవటానికి ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో ఉడికించిన బంగాళదుంపలు మెత్తగా మెదుపుకోవాలి. అందులో పనీర్ తురుము, కేరట్ తురుము, ఉల్లితరుగు వేసుకోవాలి. అలాగే మేగి మసాలా, చాట్ మసాలా, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ జత చేసి బాగా కలుపుకోవాలి. అలా తయారయిన ముద్దని చేతికి అంటుకోకుండా ఉండటానికి కాస్త నూనే రాసుకుని మనకి ఇష్టమైన షేప్ లో వాటిని తయారుచేసుకోవాలి. అలా తయారయిన వాటిని ఒక గంట సేపు ఫ్రిడ్జ్ లో పెట్టి తీయాలి. ఇప్పుడు ఒక చిన్న కప్పులో మైదా కార్న్ ఫ్లోర్ ని వేసి నీళ్ళు కలిపి జారుగా కలుపుకోవాలి. అలా కలిపిన దానిలో పొటాటో బాల్స్ డిప్ చేసి బ్రెడ్ పౌడర్ లో దొర్లించి కాగిన నూనెలో ఎర్రగా వేయించుకోవాలి. అలా తయారయిన వాటికి టూత్ పిక్స్ గుచ్చాలి. వీటిని టమాటో సాస్ తో గాని చిల్లి సాస్ తో గాని పిల్లలకి తినిపిస్తే చాలా చాలా హాపీ అయిపోతారు.
..కళ్యాణి