గుత్తివంకాయ వేపుడు
కావాల్సిన పదార్థాలు:
వంకాయలు - అర కిలో ( గుండ్రంగా ఉన్నవి తీసుకోండి)
నూనె - 3 టేబుల్ స్పూన్స్
కొత్తిమీర - కొద్దిగా
మసాలా తయారీకి కావాల్సి పదార్థాలు:
శనగపప్పు - 1 టేబుల్ స్పూన్
మినపగుళ్లు - అర టీస్పూన్
ధనియాలు - అర టీస్పూన్
జీలకర్ర - 1 టీ స్పూన్
ఎండు మిర్చి - 10 నుంచి 12
ఎండు కొబ్బరి తురుము - పావు కప్పు
కరివేపాకు - 2 రెమ్మలు
పల్లీలు - 2 టేబుల్ స్పూన్స్
ఉప్పు - రుచికిసరిపడా
పసుపు - పావు టీ స్పూన్
వెల్లుల్లి రెబ్బలు - 5
నూనె - 1 టీ స్పూన్
తయారీ విధానం :
ముందుగా వంకయాలను నాలుగు ముక్కలుగా కట్ చేసుకోవాలి. వీటిని ఉప్పు నీటిలో వేయాలి. తర్వాత కళాయిలో పల్లీలు వేసి వేయించుకోవాలి. వీటిని దోరగా వేయించిన తర్వాత ప్లేట్ లోకి తీసుకుని అదే కళాయిలో శనగపప్పును కూడా వేయించాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత మినుపగుళ్లు , ధనియాలు, జీలకర్ర వేసి వేయించాలి. వీటిని దోరగా వేయించిన తర్వాత ప్లేట్ లోకి తీసుకోవాలి. తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు, ఎండు కొబ్బరి, వేసి వేయించుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇవన్నీ చల్లారిన తర్వాత ఒక జార్ లోకి వీటిని తీసుకుని ముందుగా శనగపప్పు, దినుసులు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
తర్వాత ఎండు కొబ్బరి, ఎండు మిర్చీ వేసి గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత పల్లీలతోపాటు మిగిలిన పదార్థాలు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ పొడిని వంకాయల్లోకి స్టఫ్ చేసుకోవాలి. తర్వాత కళాయిలో నూనె పోసి వేడయ్యాక..వంకాయలు వేసి మూత పెట్టి చిన్న మంటపై వేయించాలి. వీటిని మధ్య మధ్యలో తిప్పుతుండాలి. వంకాయలు మెత్తగా అయ్యే వరకు మగ్గించాలి. వంకాయలు మెత్తగా మగ్గిన తర్వాత మిగిలిన పొడిని కూడా చల్లుకోవాలి. ఒక నిమిషం పాటు వేయించిన తర్వాత కొత్తమిర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేస్తే రుచికరమైన గుత్తివంకాయ వేపుడు రెడీ అవుతుంది.