ఉసిరికాయ రెసిపిస్
* * * * * * * * *
ఉసిరికాయ రోటి పచ్చడి
అప్పటికప్పుడు ఉసిరికాయ పచ్చడి కావాలంటే ఉసిరికాయలని ఆవిరిపైన ఉడికించిపెట్టుకోవాలి. ఆవాలు, ఎండుమిర్చితో పోపు చేసి ముందుగా ఈ పోపును గ్రైండ్ చేసి ఆ తర్వాత ఉడికించిన ఉసిరికాయల గింజల్ తీసి వాటికీ ఉప్పు చేర్చి మెత్తగా రుబ్బుకోవాలి. ఆవాలు,ఇంగువతో పోపు చెయ్యాలి. రోటి పచ్చడి అంటూ గ్రైండర్ లో చేయమన్నారేంటి అనుకుంటున్నారా .? అప్పటికప్పుడు చేసే పచ్చళ్లని రోటి పచ్చడి అని అంటారు.
ఆమ్లా రైస్ - ఉసిరికాయ పులిహోర
నిమ్మకాయ పులిహోర చేసినట్టుగానే ఉసిరికాయ పులిహోర కూడా చేసుకోవచ్చు.. అయితే పులిహోర అనగానే పిల్లలు పాత వంటకం అనుకుంటారు. అదే రైస్ అని చెబితే ఇష్టంగా తింటారు. అన్నాన్ని కాస్త పొడిగా ఉండేలా వండుకోవాలి. వేడి అన్నంపైన చిటికెడు పసుపు,నూనె,కరివేపాకు వేసి కలపాలి. వేడి వేడి అన్నంలో కరివేపాకు వేసి కలిపితే ఆ రుచి అన్నానికి పడుతుంది+. అలాగే ముందుగా పసుపు, నూనె వేసి కలిపితే అన్నం పొడిపొడిగా వస్తుంది. ఇక ఉసిరికాయలని ఆవిరి పైన ఉడికించి, మధ్యలో గింజ తీసేసి మెత్తగా గ్రైండ్ చెయ్యాలి. ఆగుజ్జుని అన్నంలో కలిపి పైన మినపప్పు, శెనగపప్పు, ఆవాలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, ఇంగువ తో పోపు చెయ్యాలి. ఉసిరికాయ కాస్త ఒగరుగా అనిపిస్తే కొంచం నిమ్మరసం కూడా కలుపుకోవచ్చు.
పిల్లలు ఉసిరి పచ్చడి తినకపోతే ఇలా రైస్ ఐటమ్ గా చేసి తినిపించవచ్చు.
ఉసిరికాయ చారు
ఉసిరికాయలని ఉడికించి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. నీటిలో ఆ గుజ్జుని కలిపి పసుపు, ఉప్పు వేసి చివరిలో
ఆవాలు,ఎండుమిర్చి,ఇంగువతో పోపు చెయ్యాలి.
- రమా