సోయా మటర్ కర్రీ

 

 

సోయా గ్రాన్యూల్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని ప్రత్యేకంగా చెప్పక్కర్లెద్దు. ఇవి అంత  రుచిగా ఉండవు కాని మన ఆహారంలో వీటిని తప్పకుండా చేర్చుకోవాలి. వీటితో చేసే ఒక రెసిపీ ని ఇప్పుడు చూద్దాం...


కావలసిన పదార్థాలు:

సోయా గ్రాన్యూల్స్ - 1 కప్పు

గ్రీన్ పీస్ - 1 కప్పు

పాలు - 1 1/2 కప్పు

తరిగిన ఉల్లిపాయ ముక్కలు - 1 కప్పు

టమాటో ప్యూరి - 2 స్పూన్స్

సన్నగా తరిగిన వెల్లుల్లి - 5 రెబ్బలు

సన్నగా తరిగిన అల్లం  - 1 స్పూన్

పచ్చి మిర్చి - 4

కారం - 1/2 స్పూన్

ధనియాల పొడి  - 1/2 స్పూన్

కొత్తిమీర - 1 కట్ట

నిమ్మరసం - 1 స్పూన్

గరం మసాలా - 1 స్పూన్  

ఉప్పు - తగినంత


తయారి విధానం:

సోయా గ్రాన్యూల్స్ ని పాలల్లో ఒక గంట సేపు నానబెట్టాలి... అవి నానిన తరువాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి నూనె వేసి అందులో ఉల్లిపాయ ముక్కలు వేయాలి.

 

అవి కాస్త రంగు మారాకా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి ముక్కలు, పచ్చి మిర్చి, టమాటా ప్యూరి వేసి టమాటా పచ్చి వాసన పోయేదాకా వేగనివ్వాలి.

 

అందులో ధనియాల పొడి కారం తగినంత ఉప్పు వేసి కాసిని నీళ్ళు పోసి 5 నిమిషాలు మగ్గనివ్వాలి.

 

ఇందులో ఉడికించిన బఠానీలు వేసి అవి కూడా మగ్గాకా పాలల్లో నానబెట్టిన సోయా గ్రాన్యూల్స్ వేసి ఆ పాలు కూడా పోసి కర్రీ మొత్తం దగ్గరయ్యేదాకా ఉంచాలి.

 

దించే ముందు దానిలో గరం మసాలా, నిమ్మరసం కలిపి కొత్తిమీరతో అలంకరించుకుంటే చాలు, ఘుమఘుమలాడే సోయా మటర్ కర్రీ మీ ముందు ఉంటుంది.

- కళ్యాణి