పెసరపప్పు కొబ్బరి పాల పాయసం
(Navaratri Special)
కావలసిన వస్తువులు:
1. పెసర పప్పు - 1 కప్పు
2. బెల్లం నీళ్ళల్లో కరిగించినది - 1 కప్పు ( మనకిష్టమైన తీపిని బట్టి ఎక్కువా, తక్కువా వేసుకోవచ్చు)
3. పాలు అరకప్పు ( మనకి కావలసిన చిక్కదనాన్ని బట్టి కాస్త ఎక్కువ కూడా వేసుకోవచ్చు)
4. కొబ్బరి పాలు - 1/2 కప్పు
5. ఏలక్కాయ పొడి - 1 చిన్న స్పూనుడు
6. నెయ్యి - 1 స్పూను
7. జీడిపప్పు, కిస్ మిస్ - ఒక చెంచా చొప్పున, నేతిలో వేయించి పెట్టుకున్నవి
తయారు చేయు విధానం:
1. మూకుడులో ఒక స్పూన్ నెయ్యి వేసి పెసరపప్పును బంగారు రంగు వచ్చేదాకా వేయించుకోవాలి.
2. కొబ్బరి కాయ కొట్టి చిక్కటి పాలు తీసి పెట్టుకోవాలి
3. జీడిపప్పు, కిస్ మిస్ నేతిలో వేయించి పెట్టుకోవాలి.
4. వేయించుకున్న పెసరపప్పును మెత్తగా ఉడికించుకోవాలి, ఆపైన మెదిపి పెట్టుకోవాలి.
5. బెల్లాన్ని కొద్దిగా నెళ్ళల్లో కరిగించి, వడకట్టి తయారుగా ఉంచుకోవాలి.
6. ఒక పెద్ద పాత్ర తీసుకుని దానిలో ఉడికించిన పప్పు, కరిగిన బెల్లం కలిపి కొంచం సేపు ఉడికించుకోవాలి. బెల్లం వాసన పూర్తిగా పోయేదాకా ఉండాలి.
7. ఈ మిశ్రమానికి పాలు కలిపి 2-3 నిమిషాలు ఉడకనివ్వాలి, పాలు విరగకూడదు.
8. ఇప్పుడు మనం తీసిపెట్టుకున్న కొబ్బరి పాలు, ఏలకుల పొడు వేసి ఒకే పొంగు వచ్చేవరకూ ఉంచి దింపెయ్యాలి. వేయించిన జీడిపప్పు, కిస్ మిస్ లతో అలంకరించి చల్లగా కానీ వేడిగా కానీ వడ్డించుకోవచ్చు.
కొబ్బరి పాలు ఇష్టం లేకపోతే పూర్తిగా మాములు పాలే పోసుకోవచ్చు, అలాగే బెల్లం ఇష్టం లేకపోతే చక్కెర వాడుకోవచ్చు.
--వేదుల సుందరి