పన్నీర్ పుదీనా తందూరీ చీక్స్
తందూరీ వంటలు చాలామంది ఇష్టపడతారు. వాటిని మనం ఇంట్లోనే చేసుకోవచ్చు కూడా. ఈ మద్య హోటల్స్ లో చీక్స్(తందూరీ ఊచ) కి పెట్టి కాల్చే రెసిపీస్ని మనం చూస్తూనే ఉన్నాం అలాంటి ఒక రెసిపీ ఇప్పుడు మీ కోసం.
కావాల్సిన పదార్థాలు:
పనీర్ - 1 కప్పు
పుదీనా - 1 కట్ట
ఉడికించిన బంగాళా దుంపలు - 1 కప్పు
ఉడికించిన కేరట్ ముక్కలు - 1/4 కప్పు
ఉల్లి తరుగు - 3 స్పూన్స్
సన్నగా తరిగిన బీన్స్ - 3 స్పూన్స్
సన్నగా తరిగిన పచ్చి మిర్చి ముక్కలు - 3 స్పూన్స్
షా జీరా - కొద్దిగా
ఉప్పు, నూనె - సరిపడినంత
తయారి విధానం:
ఈ తందూరీ చీక్స్ కోసం ముందుగా స్టవ్ వెలిగించుకుని దాని మీద కడాయి పెట్టి అందులో నూనె వేసి షా జీరా వేయాలి, తరువాత బీన్స్ ముక్కలు, ఉల్లితరుగు, పచ్చి మిర్చి ముక్కలు వేసి పచ్చి పోయేదాకా 2 నిమిషాలు వేయించాలి.
పుదీనా కూడా వేసి వేయించాకా ముందుగా ఉడికించి పెట్టుకున్న కూరగాయ ముక్కల్ని వేసి కలపాలి. సరిపడా ఉప్పు వేసి ఆఖరుగా పనీర్ తురుము వేసి బాగా కలిపి 2 నిమిషాలు ఉంచి దించుకోవాలి.
ఈ మిశ్రమం చల్లారాకా గరిటెతో బాగా మెదపాలి. ఇలా తయారయిన ముద్దని చీక్స్(ఊచ) కి పొడుగుగా అంటించి గ్రిల్ పై పెట్టి కాల్చుకోవాలి.
అన్ని వైపులా బాగా కాలిన తరవాత వాటిపై కాస్త పెరుగు రాయాలి.
వీటిని పుదీనా చెట్నీ లేదా టమాటా సాస్ తో ముంచుకుని తింటే భలే రుచిగా ఉంటాయి.
- కళ్యాణి