మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ

 

 

కొన్ని కూరలు చేసే విధానం తో వాటి రుచి మారిపోతుంటుంది. ఈ మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ కూడా అంతే. దీనిని  చేసేటప్పుడు వాడే దినుసులతో ఆ కూర రుచి మారిపోతుంది. ఈ రోజు బెంగాలీ స్టైల్ లో చేసే కూర ఎలా వుంటుందో చూద్దాం. బెంగాలీ వంటకాలు అనగానే తెలుసు కదా.. అస్సలు కారం వుండవు..పైగా కొంచం స్వీట్ గా కూడా వుంటాయి. మరీ వాళ్ళ రుచిలో చప్పగా మనం తినలెం కాబట్టి , కాస్త మన దినుసులని కూడా చేర్చాను. ట్రై చేయండి... మా ఇంట్లో ఈ కూరని చపాతీ లతో  ఇష్టం గా తింటారు.


కావలసిన పదార్థాలు:

ఆలూ - రెండు

క్యారట్ - ఒకటి

బీన్స్ - పది వరకు

కాప్సికం - ఒకటి

చిలకడ దుంప - ఒకటి

వంకాయ - రెండు

తీపి గుమ్మిడి - చిన్న ముక్క

పాలకూర - రెండు కట్టలు

నూనె -  రెండు చెంచాలు

నువ్వులు - రెండు చెంచాలు

ఉప్పు - తగినంత

పచ్చిమిర్చి - మూడు

కరివేపాకు - కొంచం


తయారీ విధానం:
 
ముందుగా పాలకూర , ఇతర కూరలని సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఆ తర్వాత బాణలి లో నూనె వేసి జీలకర్ర, పచ్చి మిర్చి, కరివేపాకు, ఆఖరున నువ్వులు వేసి ఆ తర్వాత ముందుగా కూరలని వేయాలి. అప్పుడే కొంచం ఉప్పు కూడా వేసి మూత పెట్టాలి. కూరలు మెత్తపడుతుండగా పాలకూర కూడా వేసి బాగా కలిపి మళ్ళి మూత పెడితే, రెండు నిమిషాలలో పాలకూర మెత్తపడుతుంది. అప్పుడు మూత తీసి కొంచం సేపు వేయించాలి. ఆఖరున కొంచం బెల్లం కావాలంటే కలుపుకోవచ్చు . మరి ఎక్కువ తీపి కాకుండా కలపాలి. తీపి ఇష్టం లేని వారు బెల్లం వేయక పోయినా కూర రుచిగా వుంటుంది. నువ్వులు రుచి తో బావుంటుంది. కమ్మగా ఉంటుందేమో పిల్లలు హాయిగా తినేస్తారు. ఈ కూరలో ఇది అది అని లేదు... ఇంట్లో ని అన్ని కూరలు వేసుకోవచ్చు. చేదు కూరలు తప్ప. ఒకసారి ట్రై చేసి చూడండి. రెగ్యులర్ గా చేసే కూర లు బోర్ అని పిల్లలు అనగానే ఒకో ప్రాంతం లో ఆ కూర లని ఎలా చేస్తారో పరిచయం చేయండి.

- రమ