కూర మసాలా పొడి

 

 

 

మనం ఇప్పటిదాకా రెండు రకాల కూర పొడులు గురించి చెప్పుకున్నాం కదా. అవి కమ్మటి కూరల కి బావుంటాయి. ఈ రోజు చెప్పుకునే పొడి కొంచం ఘాటుగా వుండే మసాలా కూర పొడి. మసాలా అనగానే పిల్లలు ఇష్టంగా తింటారు. ఏ కూరలలో కైనా బావుంటుంది ఈ పొడి. అల్లం వేస్తాం ఇందులో. ఆ రుచి నచ్చని వారు అల్లం లేకుండా కూడా ఈ పొడి చేసి వాడుకోవచ్చు.

 

కావాల్సిన పదార్ధాలు:

ధనియాలు           .... 5 చెంచాలు
జీలకర్ర                .... 2 చెంచాలు
ఆవాలు               .... 2 చెంచాలు
మెంతులు            .... 1  చెంచా
మిరియాలు          .... 1 1/2
దాల్చిన చెక్క         .... చిన్న ముక్క
లవంగాలు             .... 1/2 చెంచా
యాలుకలు           .... రెండు
ఎండుమిర్చి           .... 4
అల్లం తురుము     .... 2 చెంచాలు
పసుపు                .... 1 చెంచా

 

తయారుచేసే విధానం:

ఆలు వంటి కూరలు చేస్తున్నప్పుడు, అందులో వేసే మసాలా దినుసులతో ఆకూర రుచి మారిపోతుంది. ఈ పొడి ని ఇన్స్టంట్ గా అప్పటికప్పుడు చేసుకుని వాడుకోవాలి. గ్రేవీ కూరలలోకి బావుంటుంది. కొంచం ఘాటుగా కూడా వుంటుంది కాబట్టి, రైస్ ఐటమ్స్ లోకి సైడ్ డిష్ గా చేసే కూరలలో కూడా  వేసుకోవచ్చు. మిక్స్డ్ వెజిటబుల్ కరీలో ఈ మసాలా పౌడర్ వేస్తే చాలు. కూర చాలా రుచిగా వస్తుంది. ఇందులో అల్లం వుంది కాని, వెల్లుల్లి వేయలేదు. అలవాటు వుండి, ఇష్టం అయితే వెల్లుల్లి కూడా వేసుకోవచ్చు. పొడి బాణలిలో అన్ని దినుసులని వేయించుకోవాలి. చివరిలో అన్నిటిని కలిపి మెత్తగా పొడి చేసుకోవాలి. అల్లం తురుముని ఆ పొడితో కలిపి కూర పైన జల్లి కలపాలి.

 

టిప్: కూరలలో అల్లం ఒక్కటే, వెల్లుల్లి లేకుండా వేస్తే రుచి వేరేగా వుంటుంది. అదే అల్లాన్ని కూర మొత్తం అయ్యాక ఆఖరిలో వేసి కలిపితే ఆ ఫ్లేవర్ కూరకి చక్కగా పట్టి ..బావుంటుంది. వెల్లుల్లి లేకుండా, కేవలం అల్లం, పచ్చిమిర్చి గ్రైండ్ చేసి కూరలలో వేస్తారు. అది కూడా మంచి రుచినిస్తుంది కూరకి.

 

-రమ