మామిడితో రవ్వ పులిహోర
రవ్వతో పులిహోర అనగా, అసలు పులిహోర రుచి వస్తుందా అన్న అనుమానం వస్తుంది, కానీ రవ్వ పులిహోర రుచిలో అసలు పులిహోరతో పోటీ పడుతుంది. సింపుల్‌గా కూడా అయిపోతుంది. ఈ రోజు పులిహోర చేయటం చూద్దాం.
కావలసిన పదార్థాలు:
మామిడి తురుము - ఒక కప్పు
బియ్యం రవ్వ - ఒక గ్లాసు
నీళ్ళు - రెండు గ్లాసులు
పసుపు - చిటికెడు
ఉప్పు - రుచికి తగినంత
పచ్చి మిర్చి - 2
కరివేపాకు - కొద్దిగా
పోపు సామాను - తగినంత
నూనె - చిన్న కప్పుతో
మెంతి పొడి - ఒక చెమ్చా ( పప్పులతో కలిపి చేసిన మెంతి పొడి )
తయారీ విధానం:
ముందుగా రవ్వని ఉడికించి పెట్టుకోవాలి. కుక్కర్లో పెట్టక్కర్లేదు. రెండు గ్లాసుల నీటిని బాణలిలో పోసి, నీరు కళపెళలాడుతుండగా, ఉప్పు, ఒక పచ్చి మిర్చి , కరివేపాకు వేసి... ఆ తర్వాత బియ్యం రవ్వ పోసి కలపాలి. ఉండ చుట్టుకోకుండా కలుపుతూ వుండాలి. రవ్వ కొంచం ఉడికి దగ్గరకి అవుతుండగా అప్పుడు మామిడి కోరుని వేసి కలపాలి. స్టవ్ ఆపేసి మూత పెట్టి 5 నిముషాలు ఉంచితే రవ్వ ఉమ్మగిల్లుతుంది. ఇక ఇప్పుడు ఉడికించిన రవ్వని ఓ పళ్ళెంలోకి తీసి పరుచుకోవాలి. పైన ఓ రెండు చెంచాల నూనె, చిటికెడు పసుపు వేసి పొడి వేసి పొడిగా కలపాలి. ఇప్పుడు ఒక చెమ్చా మెంతి పొడి వేసి కలిపి, ఇక ఆఖరుగా నూనెలో శనగపప్పు, మినపపప్పు, వేరు శనగపప్పు, ఆవాలు, ఎండు మిర్చి, పచ్చి మిర్చి, కరివేపాకు వేసి పోపు చిటపటలాడుతుండగా, ఇంగువ వేసి.. ఆ పోపుని కూడా ఉడికించిన రవ్వ మిశ్రమంలో వేసి బాగా కలపాలి. ఆ పులిహోరని మూత పెట్టి ఓ పది నిముషాలు వుంచితే ఉప్పు, కారం, పోపు రుచి అన్నీ చక్కగా పడతాయి.
మెంతి పొడి తయారీ:
చిన్న బాణలిలో చెమ్చా నూనె వేసి, అర చెమ్చా మినపపప్పు, పావు చెమ్చా శనగ పప్పు, ఓ నాలుగు మెంతి గింజలు, ఒక ఎండు మిర్చి, కొంచం ఇంగువ వేసి ఎర్రగా వేయించి, గ్రైండ్ చేయాలి. ఈ మెంతి పొడి మాములు పులిహోరలో కూడా వేస్తారు. దీని వల్ల కమ్మదనం వస్తుంది.
-రమ