కూర మెంతిపొడి
పులుసు కూరలు చేసేటప్పుడు ఈ మెంతి పొడి వాడతారు. పేరుకు మెంతి పొడే అయినా, ఇందులో వేసే మెంతులు చాలా తక్కువ. మిగతా పప్పు దినుసులు కూడా కలిసేసరికి మెంతులలోని చేదు తగ్గి పొడి కమ్మగా వస్తుంది. సాధారణంగా తెల్ల వంకాయ, బెండకాయ, బీరకాయ, వంటి కూరలని పులుసు, మెంతి పెట్టి చేస్తారు. అప్పుడు ఆ కూరలని ముందుగా చింతపండు నీళ్ళల్లో ఉడికించి, కూరలు ఉడికాక నీరు వార్చి, పోపులో వేసి, వేయించాక ఓ చెమ్చా మెంతిపొడి వేసి కలుపుతారు. కూరలో పులుపు తగ్గి, కమ్మగా వుంటుంది కూర. వైజాగ్ వైపు ఈ పులుసు కూరలని ఎక్కువగా చేస్తారు. పండుగ అయినా, ఫంక్షన్లు అయినా ఈ పులుసు కూరలు వుండాల్సిందే. ఆ పులుసు కూరలు మీరు కూడా ఒకసారి వండి చూడండి. అందరికి చాలా నచ్చుతాయి. మరి ఆ కూరలు చేయాలంటే మెంతి పొడి వుండాలి కదా. ఈ రోజు ఆ మెంతి పొడి చేయటం ఎలాగో నేర్చుకుందాం.
కావాల్సిన పదార్ధాలు:
సెనగ పప్పు - ఒక కప్పు
మినపప్పు - ఒక కప్పు
ధనియాలు - పావు కప్పు
జీల కర్ర - ఒక చెమ్చా
ఎండు మిర్చి - ఓ 20 దాకా
మెంతులు - రెండు చెమ్చాలు
తయారుచేసే విధానం:
పైన చెప్పిన దినుసులన్నిటిని, విడి విడిగా వేయించుకోవాలి. అది కూడా పొడి మూకుడిలో, నూనె వేయకుండా. మరీ ఎర్రగా అక్కరలేదు. కొంచం పచ్చి వాసన పోయే దాక వేయిస్తే చాలు. కాని ధనియాలు, మెంతులని మాత్రం కొంచం ఎర్రగానే వేయించాలి. వేగిన దినుసులన్నీ బాగా చల్లారాక, మెత్తగా పొడి చేసి పెట్టుకోవాలి. ఏ కూరకి అయినా కమ్మదనం రావాలంటే ఈ పొడిని ఒక చెమ్చా వేస్తే చాలు.
టిప్ : టమాటో, ఉల్లిపాయ కూర చేసినప్పుడు ఈ పొడి ఒక చెమ్చా వేసి చూడండి. మంచి రుచిగా వస్తుంది కూర. అలాగే పప్పు పులుసు చేసినప్పుడు కూడా ఈ మెంతి పొడి, అందులో వేస్తే, కమ్మదనంతో రుచిగా వుంటుంది పులుసు. పులిహోర చేసినప్పుడు, అన్నంలో పులుసుతో పాటు ఈ మెంతి పొడి కూడా ఒక చెమ్చా వేస్తే, చాలా రుచి వస్తుంది పులిహోరకి.
-రమ