క్యారెట్ - క్యాబేజ్ తోరణ్

 

 

 

క్యారెట్ - క్యాబేజ్ తోరణ్... ఇది పక్కా కేరళ వంట. కేరళవారు నెలలో వారం రోజులైనా ఈ కూర చేసుకుని లొట్టలు వేసుకుంటూ తింటారు. అయితే మనం కూడా ఈ కూర చేసుకుని లొట్టలు వేసుకుంటూ తినొచ్చు. అయితే ఒకే ఒక కండీషన్ ఏమిటంటే, కేరళవాళ్ళు ప్రతీ కూరని కొబ్బరి నూనెతో చేస్తారు. కొబ్బరి నూనె వంటలు మనకు ఎంతమాత్రం నచ్చవు. కాబట్టి మన అలవాట్లకు తగిన విధంగా నూనెను మార్చుకుని మాత్రం వండుకోవాలి. ఈ ఒక్క జాగ్రత్త తీసుకుంటే చాలు.. కేరళ వంటలను మనం కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు క్యారెట్ - క్యాబేజీ తోరణ్ ఎలా చేయాలో చూద్దాం.

 

కావలసిన పదార్థాలు:

క్యారెట్ తురుము      - ఒక కప్పు
క్యాబేజ్ తురుము     - రెండు కప్పులు
ఉల్లిపాయ ముక్కలు - అర కప్పు
పచ్చి మిర్చి             - రెండు
కరివేపాకు               - కొంచెం
జీలకర్ర పొడి             - అర టీ స్పూను
పసుపు                   - పావు టీ స్పూను
ఆవాలు                   - పావు టీ స్పూను
కొబ్బరి తురుము     - పావు కప్పు
వంట నూనె             - తగినంత
ఉప్పు                     - తగినంత

 

తయారుచేసే విధానం:

* క్యారెట్, క్యాబేజీ తురుము, ఉల్లిపాయ, పచ్చి మిరపకాయ ముక్కలు, కరివేపాకు, పసుపు, ఉప్పు, జీలకర్ర పౌడర్ అన్నీ ఒక గిన్నెలో వేసుకుని మొత్తం బాగా కలిసేలా చేత్తో కలపాలి.

* ఇప్పుడు పొయ్యి మీద పాన్ పెట్టుకుని, నూనె వేసుకోవాలి, ఆవాలు వేసి చిటపట లాడిన తర్వాత కలుపుకుని సిద్ధంగా వుంచుకున్న మిక్చర్సి పాన్‌లో వేసి బాగా కలపాలి.

* ఆ తర్వాత స్టవ్ మంటని మీడియంలో పెట్టుకుని, పాన్ మీద మూత పెట్టి నాలుగు నిమిషాలపాటు వుంచాలి. మధ్యమధ్యలో కూరని కలుపుతూ వుండాలి.

* తర్వాత కూర మీద కొబ్బరి తురుము చల్లుకోవాలి. స్టవ్‌ని సిమ్‌లో పెట్టుకుని మూతపెట్టిన పాన్‌ని రెండు నిమిషాలపాటు వుంచి దించేయాలి. ఈ క్యారెట్ - క్యాబేజ్ తోరణ్ మనం రెగ్యులర్‌గా తినే క్యాబేజీ కూరకంటే భిన్నంగా వుంటుంది.