క్యాబేజీ కోఫ్తా కర్రీ
కోఫ్తా కర్రీస్ ఇటు రైస్ లోకి అటు రోటీల్లోకి కూడా చాలా టేస్టీ గా ఉంటాయి. ఇది మొఘలాయి డిష్ అయినప్పటికీ అందరి మనసులు చక్కగా దోచేసింది. దీని కోసం కావాల్సిన పదార్థాలేమిటో చూద్దాం.
కోఫ్తా కోసం కావాల్సిన పదార్థాలు:
క్యాబేజీ - పావుకేజీ
సెనగపిండి - 1/2 కప్పు
పచ్చి మిర్చి - 4
ధనియాలపొడి - కొద్దిగా
కొత్తిమీర - 1/2 కట్ట
ఉప్పు - రుచికి తగినంత
గ్రేవీ కోసం కావాల్సిన పదార్థాలు:
టమాటా - 4
అల్లం - చిన్న ముక్క
పోపు దినుసులు - 2 స్పూన్స్
కారం - 1 స్పూన్
పసుపు - చిటికెడు
గరం మసాలా పొడి - 1/2 స్పూన్
తయారి విధానం:
ముందుగా గ్రేవీని తయారుచేసుకుందాం. దీనికోసం టమాటా, అల్లం ముక్క, పచ్చిమిరపకాయ ముక్కలు కలిపి మెత్తగా గ్రైండ్ చేసుకుని ఉంచాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టి అందులో 3 స్పూన్స్ నూనే వేసి పోపు దినుసులు వేసి అవి వేగాకా అందులో టమాటా ప్యూరిని వేసి వేగనివ్వాలి. కాస్త పచ్చిదనం పోయేదాకా ఉంచాలి. అందులో పసుపు, కారం, గరం మసాలా పొడి కొత్తిమీర తురుము వేసి కాసేపు ఉంచి ఆపేయ్యాలి. కాస్త వెరైటీ టేస్ట్ కావాలనుకునే వాళ్ళు ఉల్లి పేస్టుని కూడా కలుపుకోవచ్చు.
ఇప్పుడు కోఫ్తాల తయారి కోసం ఒక డిష్ లో సన్నగా తరిగిన క్యాబేజీ వేసి అందులో సెనగపిండి, పచ్చిమిర్చి ముక్కలు, ధనియాల పొడి, సన్నగా తరిగిన కొత్తిమీర, ఉప్పు వేసి నీళ్ళు పోసి కలపాలి. పిండి ఉండ చుట్టటానికి వీలుగా ఉండేలా కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని మనకు నచ్చిన సైజులో గుండ్రని ఉండల్లా చుట్టుకోవాలి. ఇలా తయారయిన వాటిని కాగిన నూనెలో వేసి ఎర్రగా వేయించి తీసి ముందుగా తయారుచేసి పెట్టుకున్న గ్రేవీలో వేయాలి. ఉండలన్నిటికి గ్రేవీ పట్టేలా కదుపుకోవాలి. అంతే ఏంతో రుచికరమైన క్యాబేజీ కోఫ్తా కర్రీ రెడీ అయినట్టే.
..కళ్యాణి