కాకరకాయ, ఉల్లి, పచ్చిమిర్చి వేపుడు
కావలసినవి:
కాకరకాయలు - పావు కిలో
మజ్జిగ - ఒక గ్లాసు
ఉల్లిపాయలు - పావు కిలో
పచ్చిమిర్చి - 10
నూనె - 150 గ్రాములు
పసుపు - చిటికెడు
ఉప్పు - తగినంత.
తయారు చేయు విధానం:
ఒక గిన్నెలో సగం వరకు నీళ్ళు పోసి, ఉప్పు, పసుపు, మజ్జిగ వేసి వుంచండి. పుల్లటి మజ్జిగ అయితే మరీ మంచిది. కాకరకాయల్ని కడిగి, పైన వున్న చిన్న చిన్న ముచ్చికల లాంటివి గీరేసేయాలి. అలా గీరేసిన తర్వాత కొసల దాకా వెళ్ళకుండా కాకరకాయ మధ్యలో గాటు పెట్టండి. ఆ తర్వాత వాటిని మజ్జిగ, నీరు, ఉప్పు, పసుపు వేసి కలుపుకున్న గిన్నెలో వేసి ఉడకబెట్టండి. కాయ మరీ మెత్తగా అవకుండా ఉడకబెట్టిన తర్వాత నీటిని వంచేయండి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఉప్పును కచ్చాపచ్చాగా దంచుకోండి. బాణలీలో నూనె వేసి కాగాక ముందుగా కాకరకాయల్ని నూనెలో ఎర్రగా వేయించుకోవాలి. వాటిని తీసి పక్కన పెట్టుకుని, ఉల్లి, పచ్చిమిర్చి, కారాన్ని అదే నూనెలో వేసి ఎర్రగా వేయించి తీసుకోండి. ఈ కారాన్ని కాకరకాయల్లో పెట్టి అన్నంలో నెయ్యి వేసుకుని కలుపుకుని, కాకరకాయని కొరుక్కుంటూ తినొచ్చు.