ఆలు కుర్మా గ్రేవీ కూర
ఆదివారం అనగానే అమ్మ మాకు నచ్చిన కూరలు చేసి పెట్టేది. అలా మేము అమ్మని అడిగి చేయించుకునే కూరలలో ఆలూ /కుర్మా ఒకటి.. ఆ కూర అన్నంలోకి అయతే ఒకలా, చపాతీలోకి అంటే ఒకలా చేసేది అమ్మ. అన్నంలోకి అనగానే ఆలూని ముందు ఉడికించి , చెక్కుతీసి మసాలా కలిపి గట్టి కూరలా చేసేది. అదే చపాతీ లోకి అంటే గ్రేవీకూరలా చేసేది. ఈమధ్య మనం అన్ని ప్రాంతాల కూరలు తెలుసుకున్నాక మన ఒరిజినల్ కూర వండే విధానానికి మార్పులు, చేర్పులు చేస్తూ వస్తున్నాం కదా... అందులో ఈఆలూ కుర్మా కూడా ఒకటి. అల్లం, వెల్లుల్లి, లేకుండా కూడా, మసాలాలు ఏవి లేకుండా కూడా ' కుర్మా ' చేయచ్చు అంటే నమ్ముతారా ? ధనియాలు, కొబ్బరి కాంబినేషన్ మ్యాజిక్ అది. ఈరోజు ఆ ఆలు కుర్మా గ్రేవీ కూర చేసే విధానం చెప్పుకుందాం.
కావలసిన పదార్థాలు :
ఆలు - 5
ఉల్లి పాయలు - 2
టమాటోలు - రెండు
పచ్చి కొబ్బరి - 5 చెంచాలు
ధనియాలు - రెండు చెంచాలు
జీలకర్ర - ఒక చెంచా
ఎండు మిర్చి - నాలుగు
నూనె - రెండు చెంచాలు
ఆవాలు - అర చెంచా
జీలకర్ర - పావు చెంచా
ఉప్పు - తగినంత
కారం - తగినంత
పసుపు - తగినంత
తయారీ విధానం :
ముందుగా ఆలూని చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. అలాగే టమాటోని కూడా. ఉల్లిపాయలని మెత్తగా కాకుండా కొంచం కచ్చాపచ్చా గా దంపుకోవాలి. ( లేదా గ్రైండ్ చేస్తే ..ఒక్కసారి తిప్పి వదిలేయాలి). టమాటో లని చాలా చిన్న ముక్కలుగా తరగాలి. ఇప్పుడు ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి కలిపి మెత్తగా గ్రైండ్ చేయాలి. ఒక నాలుగు సార్లు తిప్పితే కాని మెత్తగా అవ్వదు. ధనియాలు మెత్తగా అవ్వకపోతే నోటికి తగిలి, చేదుగా అనిపిస్తాయి. అలా ధనియాల మిశ్రమం మెత్తగా అయ్యాక అందులో పచ్చికొబ్బరి వేసి మళ్ళీ తిప్పాలి. ఇక అప్పుడు చిన్న కుక్కర్ లో నూనె వేసి అందులో కొంచం జీల కర్ర, ఆవాలు వేసి అవి చిటపట లాడాక ముందు ఉల్లి చెక్కు వేసి వేయించాలి. అవి ఎర్రగా అవుతుండగా, ధనియాలు, కొబ్బరి మిశ్రమాన్ని వేసి వేయించాలి. రెండు నిముషాలు వేయిస్తే చాలు. లేదంటే కొబ్బరి మాడిపోయే అవకాసం వుంది. ఆ వెంటనే ఆలూ, టమాటో వేసి కలిపి, ఉప్పు, కారం, పసుపు కూడా వేసి బాగా కలపాలి. చిన్న గ్లాసుడు నీళ్ళు పోసి కుక్కర్ మూత పెట్టి ..ఒక నాలుగు విసిల్స్ రానిచ్చి ఆపాలి. మూత వచ్చాక ఒకసారి కలిపి, స్టవ్ మీద రెండు నిముషాలు ఉండనిస్తే కూర దగ్గర పడుతుంది . గ్రేవీగా వుండే ఈ కూర చపాతీలలోకి చాలా బావుంటుంది.
టిప్: ఇదే కూర అన్నంలోకి చేయాలంటే, ఆలూ ముందుగా ఉడికించి, బాణలిలో మసాలాలు, ఉల్లి వేయించాక టమాటో వేసి ఆఖరున ఆలూ వేసి కలిపితే కూర పొడి , పొడి గా వస్తుంది.
- రమ