Previous Page Next Page 
రేపల్లెలో రాధ పేజి 3


    "బాధేం కాదు....! కాసేపాగి చూడు, ఎంత సంబరపడుతుందో!" ప్రకాశం రాధ తలమీద చెయ్యివేసి నిమిరాడు.
    
    సుబ్బారాయుడు డాక్టర్ని తీసుకొచ్చినట్టున్నాడు. అందరినీ పక్కకి జరగమని అదిలిస్తూ అరుస్తున్నాడు.
    
    "ఏడుకొండలవాడికి పది రూపాయలు మనిఆర్డరు చెయ్యరా సుబ్బన్నా!" అరిచింది తాయారమ్మ.
    
    "అలాగే అమ్మా! ముందు గండం గడిచి పిండం బయటపడనీ!" అన్నాడు సుబ్బారాయుడు.
    
    అందరూ తలోమాటా మాట్లాడుతుండగా పురుడొచ్చింది.
    
    పార్వతమ్మ కళ్ళమ్మట కారుతున్న నీళ్ళు తుడుచుకోకుండానే "అత్తయ్యా! లక్ష్మి ప్రసవించింది" అంది.
    
    "ఆడదా....మగదా?" మంచంమీద లేచి కూర్చుంటూ అడిగింది తాయారమ్మ.
    
    "ఆడదే!" శాంత సంతోషంగా చెప్పింది.
    
    "శుక్రవారం పూటా మహాలక్ష్మి పుట్టిందన్నమాట!" కళ్ళుమూసుకుని చేతులు జోడిస్తూ అంది తాయారమ్మ.
    
    "ఏదీ! నేను చూడొచ్చా?" రాధ ఆగలేనట్లు చెంగున గెంతుతూ వచ్చింది.
    
    "రేపు పొద్దున్న జున్ను పంపాలి రాయుడుగారూ!" చేతులు కడుక్కుంటూ అన్నాడు డాక్టరు.
    
    అప్పుడే తల్లి గర్భంలోంచి వచ్చి, చుట్టూ ఉన్న లోకాన్ని వింతగా చూస్తోంది నుదుటిమీద ఎర్రమచ్చ ఉన్న తెల్లని దూడ!
    
    "అప్పుడే నిలబడుతోందే అమ్మా!" సంతోషంగా కేకలు పెట్టింది రాధ.
    
    "ఎంత కష్టపడ్డావే, తల్లీ!" లక్ష్మి వెన్ను నిమిరి శుభ్రం చేస్తూ అంది పార్వతమ్మ
    
    కృతజ్ఞతగా చూసింది ఆ మూగజీవి.
    
    సుబ్బారాయుడు చెమరించిన కళ్ళని అడ్డుకుని, "అమ్మాయ్ శాంతా! తల్లికీ పిల్లకీ దిష్టితీయండి!" అన్నాడు.
    
    సూరమ్మ వెండి గ్లాసులో కాఫీలు తెచ్చి, "నువ్వు కాఫీతాగి స్థిమితపడు ముందు" అంది.
    
    "అం .... బా...!" అని మెడ తిప్పి పిల్లవైపు చూస్తూ తన ఆనందాన్ని వ్యక్తం చేసింది లక్ష్మి. "మగాళ్ళందరూ తప్పుకోండి" అన్నాడు సన్యాసిరావు ముందుకొస్తూ
    
    దూరంగా కోవెల గంటలు మోగాయి.
    
    ఇంతలో 'జు.....య్...' మని చప్పుడుచేస్తూ....పైనుండి వెళ్తున్న విమానాన్ని చూడడానికి గభాల్న పెరట్లోకి పరుగెత్తింది రాధ.
    
    అది మేఘాలమాటున కనుమరుగయ్యేదాకా చూసి వెనక్కి తిరిగేసరికి ఇంకా విమానంవైపే చూస్తున్న తండ్రి కనపడ్డాడు. రాధ పెదవులు అల్లరిగా విచ్చుకున్నాయి.
    
                                                        * * *
    
    విమానంలో కళ్ళు మూసుకుని వాక్ మన్ వింటున్న మాధవ్ గబుక్కున కళ్ళు తెరిచాడు.
    
    ఎదురుగా ఎయిర్ హోస్టెస్ చిరునవ్వులు చిందిస్తూ చేతిలో చాక్లెట్స్ ట్రే పట్టుకుని వుంది.
    
    "కెన్ యు డు మి ఎ ఫేవర్ .... మిస్?" అన్నాడు.
    
    "విత్ ప్లెజర్!" అదే చిరునవ్వుతో చెప్పింది.
    
    "థాంక్స్! నేను ఓసారి కాక్ పిట్ లోకి వెళ్ళాలనుకుంటున్నాను" అన్నాడు.
    
    ఆమె కళ్ళు చిన్నవిగా చేసి "ఎందుకు?" అంది.
    
    "పైలెట్ తో చిన్నపనుంది!" భుజాలేగరేసి కాజువల్ గా చెప్పాడు.
    
    "పైలెట్ తో పనా?" ఈసారి ఆమె ఆశ్చర్యంగా అడిగింది.
    
    "ఆయనదీ మాదీ ఒకే వూరు. చిన్నప్పటి సంగతులు గుర్తొచ్చాయి. ఒకసారి చూడాలని ఉంది!" నవ్వుతూ చెప్పాడు.
    
    "వాట్? భండారీదీ మీదీ ఒకే వూరా?" అనుమానంగా అడిగింది.
    
    అతను యింక ఆగలేనట్లు లేచి కాక్ పిట్ వైపు నడుస్తూ "ప్లెయిన్ ఎలా నడుపుతున్నాడో చూడాలని వుంది!" అన్నాడు.
    
    అతనికి యెదురొస్తున్న కెప్టెన్ "ఎస్, సర్ ... ఎనీ ప్రాబ్లెం?" అన్నాడు.
    
    "కాక్పిట్ లోకి వెళతానంటున్నారు!" ఎయిర్ హోస్టెస్ చెప్పింది.
    
    అతను మాధవ్ ని ఓసారి అనుమానంగా చూసి "ఎందుకూ?" అన్నాడు.
    
    మాధవ్ వాక్ మన్ తీసి అతనికి అందిస్తూ.
    
    "హైజాక్ చెయ్యడానికి మాత్రం కాదు. కావాలంటే నన్ను చెక్ చేసుకోండి!" అన్నాడు.
    
    అతను అర్ధమైనట్టు తల పంకించి, "ఓకే! అక్కడ ఒక ఛెయిర్ కూడా వుంటుంది. వెళ్ళి కూర్చుని చూడండి. బట్ డోంట్ డిస్టర్బ్ ద పైలెట్!" అన్నాడు.
    
    "థాంక్యూ!" మాధవ్ లోపలికి నడిచాడు.
    
    లోపలికి వచ్చిన ఆగంతకుడిని పైలట్ విచిత్రంగా చూశాడు.
    
    "మీరు చిన్న హెల్ప్ చెయ్యాలి భండారీ!" అన్నాడు చిరునవ్వుతో మాధవ్.
    
    అందమైన ఆ యువకుడిని అనుమానంగా చూస్తూ కో పైలట్ "ఎవరు మీరు!" అన్నాడు.
    
    "నేనో కెమికల్ ఇంజనీర్ ని మీరో సహాయం చెయ్యాలి నాకు!" అన్నాడు.
    
    "చెప్పండి!" అన్నాడు భండారి.
    
    "ఎప్పుడైనా మీరు మీకప్పనున్న ఆ గ్లాస్ షీట్ ని ఓపెన్ చేస్తారా?" అడిగాడు మాధవ్.
    
    "యు మీన్ వెంటిలేషన్ విండో?" అన్నాడాయన.
    
    "ఎస్! ఓపెన్ చెయ్యగలరా?"
    
    "వై?"
    
    "చాలా అవసరం! ముందు జవాబు చెప్పండి మిష్టర్ భండారి...చెయ్యగలరా?"
    
    "బిఫోర్ లాండింగ్, పదివేల అడుగుల ఎత్తువరకూ అయితే ఫరావాలేదు. ఎందుకలా అడిగారు?"
    
    ఫ్లయిట్ కిందకి దింపి ఒక్కోసారి సిటీస్ ని కూడా పాసింజర్స్ కి చూపిస్తారు కదూ!"
    
    "అఫ్ కోర్స్ బట్ .... నిర్ణీతమైన సమయాల్లోనే అది సాధ్యం!"
    
    "నా కోసం ఒకసారి కాస్త కిందికి దింపి ప్రెషరైజేషన్ ఫీట్ కి వచ్చాక ఆ విండో ఓపెన్ చెయ్యగలరా? ప్లీజ్.... ఒక స్ప్లిట్ సెకండ్ చాలు!" ఈసారి మాధవ్ మోహంలో అదోలాంటి టెన్షన్, సీరియస్ నెస్ కనబడింది.
    
    పైలెట్, కోపైలెట్ మొహమొహాలు చూసుకున్నారు.


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS