Previous Page Next Page 
ప్రేమ పురాణం పేజి 2

 

    ఎక్కడున్నారు వీళ్ళు?
    
    బాటనీ క్లాసుకు రాలేదు.
    
    కెమిస్ట్రీ క్లాసుకీ రాలేదు.
    
    అప్పుడు హఠాత్తుగా గుర్తొచ్చింది సితారకి.
    
    ఇవాళేదో క్రికెట్ మ్యాచ్ తగలబడిందట!
    
    కాలేజీ గ్రౌండ్స్ లోనే.
    
    ఎక్కడ క్రికెట్ ఉంటే అక్కడ జెయ్ చెంద్ర వుంటాడు.
    
    ఒక్క క్రికెట్ ఏమిటీ?
    
    ఎక్కడ కాస్త సరదా, సందడీ ఉంటే అక్కడ వుంటాడు జెయ్ చెంద్ర. 'కాదు! ఎక్కడ జెయ్ చెంద్ర వుంటే అక్కడే సందడి వుంటుంది' అంటారు ముగ్గురు మూర్ఖుణులూ. సందట్లో సడేమియాలాంటి మనిషి అతగాడు.
    
    ఈ నిక్ నేమ్ అతగాడికి ఇంకా బాగా సూటయ్యేటట్లుందే!
    
    అవును 'దేశద్రోహి' అంటే అది మారుపేర్లాలేదు.
    
    గ్రామరుక్లాసులో విశేషణంలా వుంది.
    
    ఈ నిక్ నేమ్ లు పెట్టడానికీ ఓ టెక్నిక్ వుంటుందేమో! జెయ్ చెంద్ర తనకి 'సితార' అని పెట్టినట్లు.
    
    నిక్ నేమే అనుకో. ఎంత బాగా కుదిరిందీ!
    
    అంతలోనే తనమీద తనకే కోపం వచ్చింది సితార, ఉరఫ్ సీతారామలక్ష్మికి.
    
    సితార అని వాడు పేరు పెడితే దాన్ని తను బావుందని మెచ్చుకోవడమేమిటి?
    
    సితార! ఛీ! ఛీ! వెధవపేరు. పరమ చెత్తపేరు.
    
    సీతారామలక్ష్మంటేనే బావుంది.
    
    పేరులో ఏముంది అన్నాడు షేక్ స్పియర్!
    
    వాట్ ఈజ్ ఇన్ ఏ నేమ్ అని!
    
    కానీ పేరు 'నేమ్' వుందిగా!
    
    తన పేరు తనకిష్టం. సీతారామలక్ష్మి! నా పేరూ, నా యిష్టం!
    
    'నా మొగుడూ, నా యిష్టం!' సినిమా టైటిల్లా లేదుగా!
    
    సినిమాలు....
    
    వెధవ సినిమాలు, చెత్త సినిమాలు.
    
    అలా ఆత్మస్తుతీ, పరనింద చేసుకుంటూ అప్రయత్నంగానే కాలేజీ గ్రౌండ్స్  వైపు నడిచింది సితార.
    
    అది కాలేజీ గ్రౌండ్ లా లేదు.
    
    చేపల మార్కెట్ లా వుంది.
    
    తనకి స్పోర్ట్స్ అంటే యిష్టం లేదు.
    
    బొత్తిగా!
    
    తనకి పుస్తకాలంటే పంచప్రాణాలు!
    
    చదువు తఃప్పితే ఇంకో వ్యాపకం లేదు.
    
    ఇదిగో!
    
    ఈ క్రికెట్టు, సినిమాలు, ఇలాంటి పిచ్చి సరదాలు ఇవన్నీ డబ్బున్నవాళ్ళకి.
    
    అవునూ!
    
    క్రికెట్ అంటే ఇంతగోల గోలగా ఆడతారా?
    
    కాలేజీ స్టూడెంట్సందరూ గ్రౌండ్ మధ్యలోనే వున్నట్లున్నారే!
    
    ఇలా అయితే ఇంక ఆడేదెవరు?
    
    చూసేదెవరు?
    
    ఇంకాస్త దగ్గరకెళ్ళాక అప్పుడు అర్ధం అయ్యింది సితారకి.
    
    అక్కడ మ్యాచ్ జరగట్లేదు. ఆగిపోయినట్టుంది.
    
    ఏదోగొడవ జరిగినట్లుంది.
    
    మళ్ళీ కొట్టుకున్నారా ఏం?
    
    ఈ కాలేజీలో రెండు గ్రూపులు వున్నాయి.
    
    గ్రూపులు కాదు! గ్యాంగులనడం కరెక్ట్!
    
    ఒక గ్యాంగ్ కేమో విలను జెయ్ చెంద్ర నాయకుడు. వాడి చుట్టూ ఎప్పుడు చూసినా నలభైమందికి తక్కువకాకుండా పోరంబోకుగాళ్ళు వుంటారు.
    
    అలా అనుకోగానే హఠాత్తుగా తట్టింది సితారకి.
    
    జయచంద్ర కి కరెక్ట్ నిక్ నేమ్ ఏమిటో!
    
    ఆలీబాబా!
    
    అవును, ఆలీబాబా అండ్ హిజ్ ఫార్టీ థీవ్స్!
    
    ఆలీబాబా నలభై దొంగలూ!
    
    చెప్పలేనంత ఎగ్జయిట్ మెంట్ కలిగింది సితారకి.
    
    పెద్దపెట్టున కేకేసి యీ శుభవార్త అందరికీ చెప్పాలనిపించింది కూడా.
    
    కానీ ఆ ఉత్సాహాన్ని అతికష్టం మీద ఆపుకుంది.
    
    త్వరత్వరగా ముందుకి నడిచింది.
    
    ఆమె రావడం గమనించిన "విశేష్" మర్యాద ప్రదర్శిస్తూ కాస్త పక్కకి జరిగాడు.
    
    సితార చాలా సీరియస్ గా వుంటుంది.
    
    ఆ అమ్మాయి చాలా క్లవరనీ, జీనియస్సనీ, కాలేజీలో ఎప్పుడూ ఫస్టేననీ కూడా విశేష్ కి తెలుసు.
    
    కళ్ళజోడు పెట్టుకుని, సీరియస్ గా కనబడుతున్న యీ అమ్మాయి మనసులో బాటనీ, కెమిస్ట్రీ పాఠాలే మెదులుతుంటాయని అతను అనుకుంటాడు గానీ ప్రస్తుతం ఆమె జయచంద్రకి అద్భుతమయిన నిక్ నేమ్ గురించి ఆలోచిస్తోందని మాత్రం చచ్చినా అనుకోలేడు గదా.
    
    వెళుతూనే విశేష్ ని గమనించింది సితార.
    
    అతను ఉడతపిల్లలా వుంటాడు.
    
    భూమికి జానెడెత్తున, పొట్టిగా, అల్పంగా వుంటాడతను. సోడాబుడ్డి కళ్ళజోడూ....భూతద్దాలలాంటి ఆ కళ్ళజోడు వెనకనుంచి కళ్ళు మరీ మాగ్నిఫై అయి మిడిగుడ్లలా కనబడుతూ వుంటాయి. ముందు పళ్ళు రెండూ మరీ ముందుకొచ్చి మిక్కీమౌస్ ని గుర్తుతెస్తాయి. విశేష్ సాధుజంతువులాంటివాడు. తన ఇంటి కెదురుగానే ఓ రూములో వుంటున్నాడు.
    
    "వీళ్ళేరీ?" అంది సితార అతనితో.
    
    "ఎవరూ" అడిగాడు.
    
    "ఈ నిమ్మీ, రచనా, షీలా"
    
    "అయ్యవారి సేవలో వున్నారు" అన్నాడు.
    
    "అంటే?"
    
    "నువ్వే వెళ్ళి చూడ్రాదూ?"


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS