Previous Page Next Page 
ఖజురహో పేజి 2


    "ధర్మం చెయ్యమ్మా!" ముడతలు పడ్డ చెయ్యి ఆమె కాళ్ళని తాకుతూ యాచిస్తోంది. ఆ వృద్దురాలు నడుం నేలని తాకుతూ ఆమె అతి దీనావస్థలో వుంది.

    వృద్ధురాలిని చూడగానే ఆ యువతి ముఖంలో భయంతో కూడిన అసహ్యం చోటుచేసుకుంది. కాళ్ళని విదిలిస్తూ "ఛీ....ఛీ.... ఈ ముసల్దాన్ని ఇక్కడినుంచి వెళ్ళగొట్టండి. అరెరే....నా డ్రెస్ నిండా మురికి అంటిస్తోంది. వాచ్ మాన్ ఈమెని వెళ్ళగొట్టు" అనరిచింది.
    
    "ఏమిటీ వాచ్ మాన్ తో వెళ్ళగొట్టిస్తావా?" ఆ వృద్దురాలు నోరంతా తెరిచి నవ్వింది. "నన్ను వెళ్ళగొడితే నీకు తిండెట్లాగే పిల్లా? ఎల్లెల్లు.... గంట కొట్టి చాలా సేపయింది. పగటి కలలు తీరిగ్గా కనొచ్చు" అంది ఆ ముసలి అవ్వ.
    
    చాయ కళ్ళు మూసుకునే "నన్ను వదులు....గెట్ అవుట్!" అని అరిచింది.
    
    ముసలి అవ్వ లేచి మూలనున్న కూజాలోంచి నీళ్ళు వంచి చాయ ముఖాన జల్లి "లెమ్మంటూంటే నీక్కాదూ?" అంది.
    
    ముఖాన నీళ్ళు పడగానే చాయ దిగ్గున లేచి కూర్చుంది. కళ్ళు తెరిచి చుట్టూ చూసింది. తను నగల దుకాణంలో లేదు. హాస్టల్ రూంలో వుంది. మెర్సిడిస్ కారులో లేదు. నేలమీద చాపమీద కూర్చుని వుంది. ఎదురుగా ఆయా కాంతమ్మ కూర్చుని నోట్లో మిగిలిన రెండు పళ్ళూ బయటపెట్టి నవ్వుతోంది.
    
    చాయ ఇంకా అనుమానంగా తన వంటికేసి చూసింది. వెలిసిపోయిన ఆకుపచ్చ చుడీదార్ వేసుకుని వుంది. ఆ రంగు వెలిసిన బట్టల్లో అలా చాపమీద కూర్చున్న ఆమె....మారువేషంలో భూమ్మీదకి వ్యాహ్యాళికి వచ్చిన దేవకన్యలా వుంది.
    
    "చాయమ్మా... పద.... రెండు మెతుకులు నోట్లో వేసుకుందువుగాని" కాంతమ్మ ప్రేమగా అంటూ ఆమె గెడ్డం పట్టుకోబోయింది.
    
    "ఛీ....అవతలికెళ్ళు" చాయ విసురుగా లేస్తూ అంది.
    
    కోపంగా వెళ్ళిపోతున్న చాయని చూస్తూ "ఏ జమీందారింటి బిడ్డో! ఈ అనాధాశ్రమానికి వచ్చి పడింది.
    
    ఏ పాపిష్టోళ్ళ పనో ఇది! బిడ్డది దీపంలాంటి రూపం" అని కళ్ళొత్తుకుంది కాంతమ్మ.
    
    చాయ మెస్ కి వెళ్ళేసరికే అందరూ ప్లేట్లు తీసుకుని వరుసగా లైన్లో నించుని వున్నారు. పొడవాటి కాడలున్న గరిటలతో ఒకరు సాంబారన్నం, ఒకరు పెరుగన్నం వడ్డిస్తూ పోతున్నారు.
    
    ఖైదీల్లా అలా నిలబడి వడ్డించుకోవడం చూస్తుంటే చాయకి చాలా అసహ్యం వేసింది. 'ఛీ పాడు జన్మ' అనుకుంది.
    
    "చాయా....రామ్మా వార్డెన్ దయగా పిలిచింది. పేరు కూడా ఆమెకి తగ్గదే. దయామణి!
    
    చాయ ముందుకి నడిచి ప్లేటు పట్టింది.
    
    "కాలేజ్ కి వెళ్ళాలిగా కాస్త త్వరగా తెమలకపోయావా?" ఆవిడ మెత్తగా మందలించింది.
    
    చాయ మాట్లాడలేదు. ప్లేటు తీసుకుని తను ఎప్పుడూ కూర్చునే చోటువైపుకి నడిచింది.
    
    "త్వమేవ మాతచ....పితా..." అందరూ కళ్ళు మూసుకుని తలలు వంచి ప్రార్ధన మొదలుపెట్టారు.
    
    చాయ కళ్ళు మూసుకోలేదు. తల వంచుకోలేదు. ప్రార్ధన చెయ్యలేదు.
    
    "యూ చీట్! నా అందానికి తగిన జన్మ ఇవ్వకుండా నన్నిలాంటి దరిద్రంలో పడవేసిన నిన్ను ఏమని స్తుతించాలి? ఎందుకు ప్రార్దించాలి?" కసిగా అనుకుంది.
    
    ప్రార్ధన ముగించాక అందరూ- "హే భగవాన్!" అన్నారు.
    
    "స్కౌండ్రల్!" చాయ గొణిగింది.
    
    "చాయా! కాలేజ్ కి వెళ్లేముందు నన్నోసారి కలిసివెళ్ళు" అని చెప్పి వార్డెన్ తన రూంవేపు వెళ్ళిపోయింది.
    
    ఛాయా గొంతులోకి దిగుతున్న ముద్ద మింగుడు పడలేదు.
    
    'నిన్న నేను కాలేజ్ లో చేసిన పని ఈవిడకి తెల్సిపోలేదు కదా' అని గతుక్కుమంది.
    
                                          *  *  *
    
    "ఈ శారదా నికేతన్ లో పెరిగే ప్రతిపిల్లా పాటించవలసిన రూల్స్ కొన్ని వున్నాయని నేను చెప్పనక్కరలేదనుకుంటాను" దయామణి గొంతు ఖంగుమంటూ మ్రోగింది.
    
    చాయ తలఎత్తి వార్డెన్ వెనకాల వేళ్ళాడుతున్న కేలండర్ వైపు చూసింది.
    
    ఆధునికంగా అలంకరించుకున్న ఓ అమ్మాయి బోంబే డైయింగ్ చీరలకి మోడలింగ్ చేస్తూ విలాసంగా నిలబడి వుంది.
    
    "అబద్దం ఆడకూడదు" వార్డెన్ గట్టిగా అంది.
    
    చాయ చీరనే చూస్తోంది.
    
    చీరలకి మోడలింగ్ చేస్తే ఫ్రీగా చీరలిస్తారేమో రకరకాల చీరలు కట్టుకోవచ్చు! అనుకుంది.
    
    "మీకు తల్లీ తండ్రీ అన్నీ మేమే! మాకు చెప్పకుండా ఎక్కడికీ వెళ్ళడం, ఏమీ చెయ్యడం కుదరదు."
    
    'అసలా మోడలింగ్ చేసిన అమ్మాయి ఏం బావుందని? అదే తను ఆ చీర కడితే' చాయ ఆ చీరలో తనని వూహించుకోగలిగింది.
    
    "అసలే నువ్వు చాలా అందమైన పిల్లవి. జాగ్రత్తగా వుండాలి. ఏమిటలా చూస్తున్నావు? నే చెపుతున్నది అర్ధం అయిందా?" గద్దించినట్టు అడిగింది దయామణి.
    
    చాయ ఉలిక్కిపడి ఇహలోకంలోకి వచ్చి- "ఆ! అర్ధం అయింది మేడమ్!" అంది.
    
    "ఏం అర్ధం అయింది?" అడిగింది దయామణి.
    
    "నేను చాలా అందమైనదాన్ని" కాస్త గర్వంగా పలికింది నదురూ బెదురూ లేకుండా చాయ.
    
    దయామణి చిరాగ్గా- "ఇందాకట్నించీ చెప్పినదంతా వినలేదా? ఎక్కడున్నావు? కాస్త భూమ్మీదకి రా!" అంది.
    
    "ఎస్ మేడమ్!" అంది చాయ.
    
    "నిన్న కాలేజ్ నుంచి నువ్వు రెండుగంటలు ఆలస్యంగా వచ్చావు" అంది దయామణి.
    
    "ఎస్ మేడమ్! లైబ్రరీలో నోట్స్ రాసుకుంటూ కూర్చున్నాను. టైం తెలీలేదు" చెప్పింది చాయ.
    
    దయామణి చేత్తో ఆపమన్నట్టుగా చూపిస్తూ-


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS