Previous Page Next Page 
లేడీస్ హాస్టల్ పేజి 2

   

    అందుకే ఈ సంబంధానికి వాళ్ళు ఒప్పుకున్నారని తెలిశాక ఆమె భయపడింది. ముందు ముందు తన భర్తతో మానసికంగా సంబంధాలు ఎలా వుంటాయో అని! అతడి కాంప్లెక్స్ అలవాట్లూ, అతడి తరపు ఇంటి వాతావరణం వీటన్నిటితో తను ఇమడగలదా అని అనుమానపడింది. అత్తవారింటికి వెళ్ళే ప్రతీ అమ్మాయిలోనూ ఈ భయాలుండటం సహజమే గానీ, ఆమెకి తన స్వంత ఇంటి వాతావరణం, మూసుకున్న పడగ్గది వెనుక నుంచి వినపడే గొడవలు అన్నిటికన్నా ముఖ్యంగా తను చదివిన "ట్రాన్సాక్షనల్ అనాలిసిస్" ఈ భయాన్ని కలుగజేసాయి.
   
    కిరణ్మయి విపరీతమైన పఠనా శక్తిగల అమ్మాయి. చదువుకునే రోజుల్లో కూడా ఆమె చాలా భాగం పుస్తకాలు చదవటంలోనే గడిపేది. చదువు పూర్తయ్యాక అయితే సరేసరి! ఆమె చైద్విన పుస్తకాల ఆధారంగా ఈ రెండు సంవత్సరాల ఖాళీలోనూ ఆమే గాని ఒక థీసెస్ వ్రాసుంటే డాక్టరేట్ లభించి వుండేది.
   
    ఆమె భయపడేది అందుకే. ఎవరో రచయిత చెప్పినట్టు - "జ్ఞానమూ" "దంతమూ" వచ్చేటప్పుడు చాలా బాధ పెడతాయి. ఈ అనాలిసిస్ వల్ల భర్త తనపట్ల ఏ మాత్రం సరిగ్గా "వైబ్రేట్" అవకపోయినా తను రాజీపడలేనని ఆమెకు తెలుసు.
   
    మామూలు అబ్బాయిలకీ అమ్మాయిలకీ వుండే సున్నితమైన భావాలకీ, థ్రిల్స్ కీ ఆమె అతీతురాలేమీ కాదు. దాదాపు వంద పరుగులూ పూర్తిచేసి పెవీలియన్ వైపు వస్తూ అతడు తనవైపు కన్నార్పకుండా చూసిన చూపూ; పెళ్ళిచూపుల్లో "నువ్వు మొన్న నా ఆట చూడటానికి రావటం నేను గమనించాను సుమా" అన్న చిరునవ్వూ ఆమె గమనించింది. చాలాసార్లు ఆ విషయం మళ్ళీ గుర్తొచ్చింది కూడా! .... కొన్ని కొన్ని అనుభవాలు, అనుభవించే టైమ్ లో కన్నా జ్ఞాపకాలుగా మారేక చాలా బావుంటాయి. అలాంటి వాటిల్లో అదొకటి, అయితే ఆమె నిరాశ చెందింది. అతడు పెళ్ళిచూపుల్లో ఏమీ మాట్లాడకపోవటం.
   
    22. 33. 04 Hrs.
   
    అప్పటికి ముప్పై సుదీర్ఘమైన సెకన్లు గడిచాయి. అతడింకా దగ్గరికి రాలేదు. తనే చొరవ తీసుకుని అడుగుముందుకు వేయాలో అక్కర్లేదో తెలియనిస్థితి. అతడు తనకన్నా ఎక్కువగా తడబడటం ఆమెకి వింతగా తోచింది. రంజీప్లేయర్-ఏ మాత్రం అదృష్టం బావున్నా తొందర్లో టెస్ట్ ప్లేయర్ కాబోతున్నవాడు - ఇంత బిడియపడటం గమ్మత్తుగా వుంది. సాధారణంగా ఆటగాళ్ళకీ - ముఖ్యంగా క్రికెట్ ప్లేయర్స్ కి చాలామంది 'ఫాన్స్' వుంటారని ఆమె అనుకుంది. కానీ ఇతడు సచిన్ టెండూల్కర్ స్థాయిలో సిగ్గుపడుతున్నట్టు కనబడుతున్నాడు.
   
    ఆ తలుపు దగ్గిర అలా అంతసేపు నిల్చోవటం ఆమెకి ఇబ్బందిగాతోచి, అడుగు ముందుకు వేయబోయింది. అప్పుడు వినిపించింది 'హల్లో' అని గదిలో ప్రవేశించిన నలభై రెండు యుగాల తరువాత వినిపించిన ఆ ఒక్క మాట అయిపోయిన తరువాత మళ్ళీ గాఢమైన నిశ్శబ్దం! ఆమె కూడా 'హల్లో' అందామనుకుంది గానీ అది మరీ ఇంగ్లీషు శోభనంళా వుంటుందని మానేసింది!
   
    అతడామె చేతిని తన చేతిలోకి తీసుకుంటూ "హల్లో - అంటే సమాధానం చెప్పవేం?" అన్నాడు. ఏం చెప్పాలి అన్నట్టు ఆమె తలదించుకుంది. నిశ్చయంగా సిగ్గుతోకాదు, ఆలోచనతో. "What do you say after you say hello?" అన్న పేరుతో ఎరిక్ బెర్నె వ్రాసిన పుస్తకం! 'హల్లో' అన్న తరువాత ఏం మాట్లాడుకోవాలి అన్న దాని గురించి అతడు వ్రాసాడు.
   
    ఏవండీ బావున్నారా.... బావున్నాను మీరు? .... నేను కూడా.... ఇంట్లో అందరూ కులాసాయేనా....ఆఁపిల్లలేం చదువుతున్నారు? ..... పెద్దోడు ఎనిమిది తప్పాడు. రెండోది ఆరు చదువుతుంది. ఎండలు మండిపోతున్నాయండీ మరి మీ వూళ్ళో ఎలా వున్నాయి? మరీ ఇంతలేవు. అన్నట్లు చెన్నారెడ్డి మినిస్ట్రీ పడిపోతుందంటున్నారు నిజమేనా .... అబద్దం, ఇంకో పది సంవత్సరాల వరకూ పడదు. గ్యారంటీ ఇస్తాను. కనీ మీకు తెలుసా? పాకిస్తాన్ సి.ఐ.డీ. వాళ్ళని వెయ్యి మందిని మన రాష్ట్రానికి పంపిందట మినిస్ట్రీ పడగొట్టటానికి... నిజమా (ఇంకో పదిమందితో చెప్పాలి) వెళ్ళొస్తాను.
   
    వాడ్డూయూసే ఆఫ్టర్ యూసే హల్లో కిరణ్మయీ?
   
    ఒక హల్లోకి జవాబుగా మరో హల్లో చెప్పాలంటే అవతల వ్యక్తిని కలుసుకున్న ఆనందం మొహంలో స్పష్టంగా కనిపించాలట! ఆ క్షణం వరకూ వున్న బాధల్నీ బాధ్యతల్నీ మరిచి, గుండె లోతుల్లోంచి పలకరించగలగాలిట. అంత ప్రయత్నం జరక్కపోతే- 'హల్లో' అనటం కన్నా అనకపోవటమే మంచిదట! నిజమే బాధ్యత కోసం మాట్లాడటంకన్నా సంభాషణ రహితమే మంచిదికదా! ఒకసారి హల్లో - హల్లో అనుకున్నాక మనుషులు ఆ తరువాత గంటసేపు మాట్లాడే 'ట్రాష్' గురించి నాలుగు వందల పేజీల పుస్తకం వ్రాసిన డాక్టరు ఎరిక్ బెర్నె- తన మొదటి రాత్రి భార్యతో ఏం మాట్లాడి వుంటాడు? జీవితాంతం కలిసి వుండబోయే ప్రయత్నంలో ఇద్దరిమధ్యా వున్న నిశ్శబ్దపు గోడని పడగొట్టి, మాటలసాయంతో స్నేహపు వారధిని నిర్మించుకునే దంపతులు తమ మొదటి రాత్రి మొట్టమొదట మాట ఏం మాట్లాడుకున్నాం అన్నది ఎంతమంది ఎంతకాలం జ్ఞాపకం పెట్టుకుని వుంటారు? అసలు దానికి ఎంత ప్రాముఖ్యత ఇస్తారు? మూడొంతులమంది మర్చిపోయే వుంటారు?
   
    "చూశావా నా చెయ్యి ఎలా వణుకుతుందో?"
   
    ఆమె తెప్పరిల్లి అతడి చేతిని చూసింది. తన చేతిని గుప్పెట్లో పెట్టుకుని వుంది ఆ చెయ్యి. నిజమే వణుకుతూంది సన్నగా. అతడి చెయ్యి పూర్తిగా కప్పేసి వుండటంవల్ల తన చెయ్యి పరిస్థితి తెలియటంలేదు. ఆమె చిరునవ్వును అతి కష్టంమీద అణిచిపెట్టింది.
   
    అతడు తన చేతివైపు సాలోచనగా చూస్తూ -
   
    "ఇది రెండోసారి ఇలా వణకటం.... ఇంతకుముందు ఒకే ఒకసారి ఇలా ఫీలయ్యాను-" అన్నాడు.
   
    ఆమె చప్పున తలెత్తింది.
   
    పెళ్ళయిన కొత్తలో భార్యభర్తలు తమ గత జీవితం గురించి, అనుభవాల గురించీ, అలవాట్ల గురించీ ... తమ నిజాయితీ నిరూపించుకునే ప్రయత్నంలో అవతలివారికి చెప్పి, ఆ తరువాత జీవితాంతమూ దాని పరిణామాన్ని అనుభవిస్తారని మొట్టమొదటిరోజు క్లాసులో సైకాలజీ ప్రొఫెసర్ చెప్పాడు. తన మొట్టమొదటి రోజు అదే జరగబోతుందా?
   
    అతడు సీరియస్ గా చెప్పబోతూంటే ఆమె బెదురుగా కళ్ళు పైకెత్తింది.
   
    "అవును. ఇది రెండోసారి....మైకేల్ హోల్డింగ్ తెలుసా? క్రితం వేసవిలో వాళ్ళటీమ్ మన దేశానికి వచ్చినప్పుడు ఈ సౌత్ జోన్ తరపున అతడి మొట్టమొదటి బంతి ఎదుర్కోబోయేటప్పుడు బ్యాటు పట్టుకుని ఇలాగే వణికింది చెయ్యి అది మొదటిసారి - ఇది రెండోసారి-"
   
    ఆమె ఫక్కున నవ్వింది.
   
    అలా తెగింది. ఆ సందిగ్ధపు ఆనకట్ట.
   
    వాడ్డూయూసే ఆఫ్టర్ యూసే హల్లో కిరణ్మయీ?
   
    ఏమీ అనక్కర్లేదు. ఒక శుభప్రదమైన చిరునవ్వు చాలు.
   
    23. 02. 34 Hrs.
   
    సరిగ్గా అరగంట తరువాత మాటల సందర్భంలో అతనన్నాడు. "-నేను తక్కువ చదువుకున్నానని నీకేం లేదుగా?" అని. ఆమె తెల్లబోయింది.
   
    "నాకేం లేదు! మీరే ఏమన్నా అనుకుంటారేమో అని నేను అనుకుంటూ వున్నాను."
   
    అతడు నవ్వి, "ఒక క్రికెట్ గురించి తప్ప మరేదాని గురించీ నేను ఆలోచించను. అన్నట్టు నీకు క్రికెట్ అంటే ఉత్సాహం వుందా?" అని అడిగాడు.
   
    "కొద్దిగా వుంది. కానీ ఇక ముందు ముందు పెంచుకుంటాను. మీతో చర్చిస్తూ వుండాలికదా."
   
    అతడు మళ్ళీ నవ్వేడు "థాంక్స్" అని.
   
    అతడి నవ్వులో ఒక ప్రత్యేకతని గమనించింది ఆమె. ఈ ప్రపంచంలో అద్భుతంగా నవ్వగలవాళ్ళు ఫీజీ ద్వీపవాసులట. డాక్టర్ మాక్స్ లూజెర్ వ్రాసేడు వారి నవ్వు నెమ్మదిగా ప్రారంభమై, మొహమంతా నిజాయితీ నిండి అవతలివారు దాన్ని గుర్తించేదాకా నిలిచి, చివరికి దీపపు వత్తిలాగా తెలీకుండా అదృశ్యమవుతుందట. ఈ మాట నిజమా కదా అని నిర్ధారణ పరుచుకోవటం కోసం ఆమె ఫీజీ సినిమా ఒకటి చూసింది కూడా! ఆ నవ్వుకీ, దీనికీ సామీప్యాన్ని గమనించింది ఆమె.
   
    ఆ విషయమే అతడితో చెప్పింది. "పెళ్ళయిన కొత్తలో అన్నీ బ్యూటీగా, అద్బుతాలుగానే కనిపిస్తాయి" అన్నాడు.
   
    ఆమె చిరుకోపంతో, "నేనందర్లాగా అనటం లేదు. మాక్స్ లూజెర్ వ్రాసింది స్వయంగా చూసి నిర్ధారణ చేసుకుని చెబుతున్నాను."
   
    "సరె సరె సరె- వప్పుకుంటున్నాను. సరేనా."
   
    ఆ తరువాత టాపిక్ వారి తల్లిదండ్రుల మీదకు మళ్ళింది. అతనన్నాడు. "అమ్మ గడుసరి, తనకి అసలు ఇలా చదువుకున్న సంబంధం ఇష్టంలేదు. కానీ నాన్న ఎందుకో చాలా ఇష్టపడ్డాడు. ఆయన పెద్దగా చదువుకోలేదు. సరే నా చదువు సంగతి తెలుసుగా- కనీసం మనవడినైనా చదువుకున్నవాడిగా చూసుకోవాలని ఆయన ఆశ! అందుకని నిన్ను చూడగానే ఇష్టపడ్డారాయన."


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS