Previous Page Next Page 
గర్ల్ ఫ్రండ్ పేజి 5

    "ఏది మీ గమ్యం?"
    "హోటల్ గంధర్వ!"
    "ఆ!.... .... ...."
    "అరె! ఎందుకలా గాభరా పడతారు? గాభరాపడకండి. మీ గాభరా చూస్తే నాకు గాభరా కలుగుతోంది. చూడండి చేతులు ఎలా వణుకుతున్నాయో! ఇప్పుడు ఏక్సిడెంటు అవుతుంది."
    "హోటల్ కెందుకు తీసికెళ్తున్నారు?"
    "మీతో కాస్త మాట్లాడాలని."
    "మాట్లాడడానికి హోటల్ కెందుకూ? ఆపండి! దిగిపోతాను."
    సడన్ బ్రేక్ తో కారు ఆపాడు నీరద్. తూలి అతడి భుజంమీద వాలింది గీత. ఆమెను సరిగా కూచోబెట్టి "మీతో మాట్లాడాలనే తప్ప నాలో ఏ దురుద్దేశమూ లేదు. నాలో నమ్మకం లేకపోతే పోనీ దిగిపొండి. నేను దొంగని కాను, హంతకుణ్ణి కాను, కనీసం మా నాన్నలాంటి నాయకుణ్నయినా కాను. జస్ట్ డాన్స్ ర్ ని." అని కారు డోర్ తెరిచాడు. గీత అతడి ముఖంలోకి చూసింది. ఇద్దరి చూపులూ ఒకదానితో ఒకటి చిక్కుకొని కొద్దిక్షణాలు విడిపడకుండా నిలిచిపోయాయి. తెరిచివున్న కారుడోర్ ని మూసి "సరే! పోనీయండి" అంది గీత. చిరునవ్వుతో కారు తిరిగి స్టార్టు చేశాడు నీరద్.
    హోటల్ లో అడుగు పెడుతూ వింతగా చుట్టూ చూసింది గీత. అలాంటి ఖరీదైన హోటల్స్ ఉంటాయని వినటమేకాని, యెప్పుడూ వెళ్ళలేదు. డిమ్ లైట్స్ - ఎయిర్ కండిషన్డ్ రూమ్స్ - పాప మ్యూజిక్ - ఖరీదైన సూట్లలో ఉన్న మొగాళ్ళపక్కన జారిపోతున్న జార్జెట్ చీరలతో ఆడవాళ్ళు- పైకి శబ్దం వినబడని గుసగుసలతో సంభాషణలు - యూనిఫారంలో ఉన్న బట్లర్స్-చుట్టు చూస్తున్న గీతను మోచేత్తో పొడిచి ఈ లోకంలోకి లాక్కొచ్చి ,చెయ్యిపట్టుకొని ఒక టేబుల్ దగ్గరకు తీసుకొచ్చాడు - బట్లర్ వచ్చి మెనూకార్డు అందించాడు. నెమ్మదిగా సోమాసాలు ఆర్డర్ చేసి బట్లర్ వెళ్ళగానే "సారీ! ఇక్కడ ఇడ్లీ, దోసె దొరకవు" అన్నాడు నవ్వుతూ-
    రాధతో తను కల్పించి చెప్పిన మాటలు ఇలా నిజమవటం తలుచు నవ్వుకుంది గీత.
    "ఎందుకు నవ్వుతున్నారు?"
    "మీ మాటలకి!"
    "కాదు!"
    "ఎలా చెప్పగలరు?"
    "ఆమాత్రం తెలీదనుకున్నారా? ఇప్పుడు మీరు నవ్వుతుంది ఏదో రోమాన్స్ కి సంబంధించినది...."
    "వాట్?"
    "అవును. మీ చెక్కిళ్ళు ఎర్రబడ్డాయి. కళ్ళు బరువుగా వాలిపోయాయి. పెదవులు ఒక మోస్తరు చిరునవ్వుతో అరవిచ్చుకున్నాయి...."
    "ఓ గాడ్! నా మనసులో ఏ రొమాన్సూ లేదు__
    ఇవాళ మీ గురించి అడిగితే.... ...."
    తమ సంభాషణంతా చెప్పింది గీత. ఇద్దరూ నవ్వుకున్నారు. సోమాసాలు తిన్నాక ఐస్ క్రీమ్ కి ఆర్డరిచ్చాడు నీరద్. అంతా అయ్యాక్ బట్లర్ బిల్లు తీసుకొచ్చాడు. "బిల్ నేనిస్తాను" అంది గీత. నీరద్ వెనక్కు వాలి "ఇయ్యి" అన్నాడు. ఆ బిల్ చూసి కళ్ళుతిరిగినట్లయింది గీతకి. "హమ్మబాబోయ్! ఇంత ఖరీదా?" అంది.
    నీరద్ ముందుకు వంగి నెమ్మదిగా "మనం తిన్నదానికి, ప్లస్, ఈ మ్యూజిక్ కీ ప్లస్ ఈ వాతావరణానికీ ప్లస్,.... ప్లస్....ఈ ఏకాంతానికీ అన్నింటికీ కలిపి ఈ బిల్...." అన్నాడు.
    గీత తన బ్యాగ్ చూసుకుని, భయంగా బిల్ చూసి, బేలగా నీరద్ ని చూసింది. నీరద్ నవ్వుతూ తన పర్స్ లోంచి వందరూపాయల నోటు దీసి బిల్ ఉన్న ప్లేటులో పడేసాడు. తేలిగ్గా నిట్టూర్చింది గీత.
    "మీరిక్కడే డాన్స్ చేస్తారా?"
    "ప్రధానంగా ఇక్కడ! కొన్ని పబ్లిక్ పర్ ఫార్మన్సెస్ కూడా ఇచ్చాను. అందుకే మీ ఫ్రెండ్సందరికీ తెలుసు!"
    "నాకు మీ డాన్స్ చూడాలని వుంది."
    "రాత్రి ఎనిమిదయ్యాక రండి. టేబిల్ మీకు బుక్ చేసి ఉంచుతాను."
    "హమ్మో రాత్రా? పగలు ఉండదా మీ డాన్స్?"
    "ఇంకా మనదేశం అంత ఇంప్రూవ్ అవలేదు. చాలా బేక్ వర్డ్, ఇంక మీదట పగలుకూడా ఇలాటి డాన్స్ ప్రోగ్రామ్స్ ఉండేలా మనం కృషి చేద్దాం! ప్రస్తుతం రాత్రికే!"
    "లాభం లేదు! రాత్రి- అందులోనూ ఎనిమిదయ్యాక మా అక్కయ్య నన్నెక్కడికి వెళ్ళనివ్వదు."
    "అక్కయ్య వెళ్ళనివ్వదా? ఆవిడేమో అలా ఇష్టం వచ్చినట్లు తిరుగుతూ...."
    కూచున్నది చటుక్కున లేచి అతని చెంపలు టపటప వాయించి "జాగ్రత్త! మా అక్కని ఒక్కమాట అన్నారంటే సహించను" అంది. అందరి తలలూ వీరిద్దరి వైపుకే తిరిగినాయి. వింతగా, కుతూహలంగా చూడసాగారు. గీతకు ముఖమంతా చెమటలు పట్టాయి. నీరద్ తనకు కలిగిన విభ్రాంతిలోంచి తేరుకునేలోగానే హేండ్ బాగ్ తీసుకుని బయటకొచ్చేసింది. ఏదో ఆవేదన గుండెలను తొలుస్తోంది. యెంతటి మాధుర్యంలోనూ ఈ అవమానం అపశ్రుతి భరించడం తప్పదా! ఉన్మాదినిలా నడుస్తున్న గీతను వచ్చి కలుసుకున్నాడు నీరద్. చెయ్యిపట్టుకుని ఆపుచేసాడు.
    "నా చెయ్యి వదలండి" రోషంగా అంది.
    "గీతా! అయామ్ సారీ! వచ్చి నా కారులో కూచో! నిన్ను మీ ఇంటిదగ్గర...." అంటే ఇంటిముందు కాదు, కాస్త దూరంగా దింపుతాను."
    "అక్కర్లేదు."
    "గీతా! మీ అక్కయ్యను అవమానించే ఉద్దేశంలేదు. పైగా ఆవిడంటే నాకు గొరవం ...."
    ఈ మాటలతో గీత కొంత ప్రసన్నురాలయింది. దుఃఖంతో పూడుకుపోతున్న కంఠంతో "అక్కయ్య ఎలాంటి దేవతో ఎవరికీ తెలియదండీ! పైకి కనిపిస్తున్నది మాత్రమేచూసి అక్కయ్యను అవమానించటానికి పూనుకుంటారంతా! వాళ్ళంతా అక్కయ్యకాలి గోటికైనా పోలరు, తెలుసా?" అంది.
    "అలాగా! ఆవిడను చూస్తే నాకూ అలాగే అనిపించింది. రా! కారులో కూర్చో! మీ అక్కయ్యనుగురించి నాకు అంతా వివరంగా చెప్పు, వినాలని ఉంది."
    "ఆ ప్రార్ధనా స్వరానికి, పైగా ఆ మాటలకు పూర్తిగా కరిగిపోయింది గీత. వచ్చి కారులో కూచుంది. ఒక చేతితో కారు డ్రైవ్ చేస్తూనే మరొక చేతితో గీత చెయ్యి అభిమానంగా నొక్కి చెప్పు!" అన్నాడు.
                                       4
    జ్ఞానస్వరూప్ బి. ఇ. డిగ్రీ తెచ్చుకున్న రోజున ఇంట్లోవాళ్ళ ఆనందానికి అంతులేదు. తల్లి పండుగలాగ స్వీట్లు, హాట్లు తయారుచేసింది. తండ్రి కనపడ్డవారికందరకూ చెప్పాడు సగర్వంగా తన కొడుకు బి.ఇ. పాసయ్యాడని. వేద, గీత, అన్నని పెద్దహీరోని చూసినట్లు చూసారు. వేద తండ్రి అంతగా చదువుకోని పల్లెటూరి రైతు. అతనికి కొద్దిపాటి భూవసతి తప్ప ఏ ఉద్యోగమూ లేదు. పల్లెటూళ్ళలో కొద్దో గొప్పో కలిగినవాళ్ళంతా వ్యవసాయాలు మానుకుని చదువులకూ వుద్యోగాలకూ ఎగబడుతున్నారు. కాకపోయినా ఆ కొద్దిపాటి పొలంతో ఇద్దరాడపిల్లలకు పెళ్ళిళ్ళు చేసి పంపించి, కొడుకుకు ఇంకా మిగల్చగలననే నమ్మకం లేకపోయింది తండ్రికి. నమ్మకమైన కౌలుదార్లకి భూమి కౌలు కిచ్చి అంతా సిటీలో మకాం పెట్టారు. పిల్లలందరినీ చదువులలో పెట్టాడు. ముగ్గురికి ముగ్గురూ బాగా తెలివైనవాళ్ళే! చక్కగా చదువుకునేవాళ్ళే! ఇంటర్ పాసయ్యాక బి.ఇ. ఎంట్రన్స్ వ్రాశాడు జ్ఞానస్వరూప్. సెలెక్టుఅయ్యాడు. అప్పటినుంచీ ఆ కుటుంబంలో ఇబ్బందులు ప్రారంభమయ్యాయి. ఆ కుటుంబం వెనుకబడ్డ తరగతులకు చెందినది కాదు. అంచేత జీతాలూ, వగైరా ఖర్చులన్నీ తలకు మించినవయి పోయాయి. కొడుకు డిగ్రీ తెచ్చుకున్నాక బోలెడు సంపాదించి పడేస్తాడనే ఆశతో పొలం అమ్మటం ప్రారంభించాడు తండ్రి. అప్పటికి వేద కాలేజీలోకి, గీత హైస్కూల్ లోకి వచ్చారు. ఆ పొలాలే తప్ప ఎటునుంచీ ఎలాంటి రాబడీలేదు. రోజురోజుకీ పెరుగుతోన్న ఖర్చులు, నెమ్మది నెమ్మదిగా ఒక్కొక్క ఎకరమూ అమ్ముడుపోసాగాయి. జ్ఞానస్వరూప్ బి.ఇ. పాసయి డిగ్రీ తెచ్చుకొనేసరికి ఆ తండ్రి 'హమ్మయ్య' అనుకొన్నాడు. ఇక కుటుంబానికి ఫరవాలేదనుకున్నాడు. తన కొడుకు సంపాదించబోయే డబ్బు నిలవ చెయ్యటం ఎలాగా అని ఆలోచనలు కూడా ప్రారంభించాడు. అవును మరి, నిలవ చెయ్యకపోతే, వేదకీ, గీతకీ మంచి సంబంధాలు చూసి పెళ్ళిళ్ళు చెయ్యటమెలాగ? వేద కూడా ఉద్యోగం చెయ్యవలసి వస్తుందనే ఆలోచనే రాలేదు ఆ వెర్రి తండ్రికి. పేపర్లనిండా ఉద్యోగాల ప్రకటనలు. అందులో ఏది ఎంచుకోవాలో అర్ధం కాక తికమక పడిపోయాడు జ్ఞానస్వరూప్. ఇంత కష్టపడి బి.ఇ. పాసయి చిన్న చిన్న జీతాల ఉద్యోగాలెందుకని ఏకంగా పెద్ద పెద్ద జీతాలున్న ఉద్యోగాలకి అప్లయి చేసాడు. ఇది మొదటి దశ.
    ఒక్కొక్క అప్లికేషనుతోను విధిగా పదిరూపాయలు రిజిస్ట్రేషన్ ఫీజ్ పంపాలి. పెద్ద ఉద్యోగాలుకదూ మరి! ఇంటర్వ్యూకి తప్పకుండా పిలుస్తారు. ఫస్ట్ క్లాస్ కాండిడేట్, మరి! తీరా సెలక్షన్ లో ఎవడినో, ఎందుకో, అంతకుముందే నిర్ణయించి వుంచుకున్నవాడిని సెలక్టు చేసుకుంటారు. ఇలాంటి అనుభవాలు ఒక పది ఎదురయ్యాక, అప్పుడు కొంచెం తగ్గి చిన్నా పెద్ద అన్ని ఉద్యోగాలకు అప్లయి చెయ్యసాగాడు. ఇది రెండవదశ.     


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS