Previous Page Next Page 
ఛాలెంజ్ పేజి 2

    కనకారావు అదిరిపడ్డాడు. ఏదో చెప్పాలని ప్రయత్నించి ఏం చెప్పాలో తెలీక ఉక్కిరిబిక్కిరయ్యాడు.

    అతని అవస్త గమనించి రాజశేఖరం నవ్వాడు.

    "ఎందుకొచ్చిన గొడవ? నిజం చెప్పేసేయకూడదూ?"

    "అవున్సార్! అబద్దమాడాను లీవ్ కోసం"

    "లీవ్ తీసుకుని రేసులకెళ్ళావ్"

    "అవున్సార్! రెండువేలు డబ్బు పోగొట్టుకున్నాను."

    "అందులో వెయ్యిరూపాయలు ఆఫీస్ క్యాష్ కూడా వుంది."

    కనకారావు మళ్ళీ ఉలిక్కిపడ్డాడు.

    "అది కూడా తెలిసిపోయిందా సార్! క్షమించండి సార్! ఇలాంటి తప్పు యింకెప్పుడూ చేయనని మాట యిస్తున్నాను"

    "మళ్ళీ మాట తప్పితే?"

    "ఉద్యోగంలోనుంచి తీసేయండి సార్"

    "ఆల్ రైట్! ఇప్పుడు మనం మాట్లాడిందంతా కాగితం రాసివ్వు"

    "అలాగే సార్!"

    "అంతేకాదు! ఇవాళ్టినుంచీ రోజూ నువ్వు నేను రేసులాడుట వల్ల నా కుటుంబము అప్పులపాలయినది. నేను ఉద్యోగము పోగొట్టుకునే ప్రమాదకరస్థితిలో వున్నాను. అనే బోర్డు రాసుకుని ఒక ఏరియా చొప్పున రెండు గంటలు నడవాలి తెల్సిందా?"

    "అందరూ నవ్వుతారేమో సార్!"

    "నాక్కావలసిందదే! నీలాంటి ఫూల్ ను చూసి అందరూ నవ్వాల్సిందే! యీరెన్ గో."

    కనకారావు సెల్యూట్ చేసి బయటికి నడిచాడు.

    శంకర్రావ్ ని పిలిపించాడతను. అతను కొంచెంగా తూలుతూ వచ్చాడు.

    "నిన్న నేనడిగినట్టే స్టేట్ మెంట్ తయారయిందా?"

    "ఇంకా లేద్సార్!"

    "ఎందుకని?"

    "రేపటివరకు టైముంది కదా...." నసిగాడతను.

    "నేనడిగేది నిన్నటి సంగతి. నిన్నెందుకు తయారవలేదది? రాత్రి ఎంత లేటయినా అది తయారుచేసి అప్పుడు యింటికి వెళ్ళమని చెప్పాను కదా?"

    "చేసే వెళ్దామని కూర్చున్నానండీ! ఈలోగా యింటి దగ్గర్నుంచీ కబురొచ్చింది, మా బంధువులొచ్చారని. ఇంక బావుండదని యింటికెళ్ళాను"

    "బంధువులు చాలా దగ్గర బంధువులనుకుంటాను"

    "అవున్సార్! చాలా క్లోజ్."

    "వాళ్ళంతా నీకోసం 'గంగా జమున' బార్ లో ఎదురుచూస్తుంటే నువ్వు వెళ్ళి కలుసుకున్నావ్. ఆ క్లోజ్ బంధువులూ, నువ్వూ కలసి రాత్రి పన్నెండింటివరకూ జిన్ లో లిమ్కా కలుపుకుని తాగారు.‎‪ ఆ తరువాత నీ క్లోజ్ బంధువులు ఎవరిదారిన వాళ్ళింటికెళ్ళి పోయారు. నువ్వు మీ యింటికొచ్చావ్. అవునా?"

    శంకర్రావ్ ఉక్కిరిబిక్కిరయ్యాడు.

    "అది కాద్సార్! బంధువులు నిజంగానే అంటే నిజంగా బంధువులు కాదనుకోండి. ఫ్రెండ్ షిప్ లో వరుసలు అన్న మాట.... అంటే...." ఇంక ఏం మాట్లాడాలో తెలీలేదతనికి దాంతో నిజం చెప్పేశాడు.

    "నిజమే సార్! అబద్ధం చెప్పాను. ఇంకోసారిలాంటి అబద్ధాలు చెప్పనని ప్రామిస్ చేస్తున్నాను. ఈసారికి క్షమించండి సార్!"

    "నేనేదయినా క్షమించగలను. కానీ ఆఫీస్ లో కూడా తాగే తాగుబోతులు నా సిబ్బందిగా వుండటం మాత్రం సహించలేను. మీలాంటి వాళ్ళకు ప్రభుత్వ కార్యాలయాలు వున్నాయి. అక్కడ వుద్యోగం చేసుకుంటే బాగుంటుంది. అక్కడ మెజారిటీ అదే బాపతు కనుక ఎవడు ఏ పని చేసినా చేయకపోయినా ఎవరూ పట్టించుకోరు."

    "నేను ఆఫీసులో తాగను సార్! ప్రామిస్....!"

    "శంకర్రావ్! ఇంకో అబద్ధం చెప్తున్నావ్!"

    "నిజం సార్! బై గాడ్!"

    రాజశేఖరం చటుక్కున లేచి అతని దగ్గరకు వెళ్లాడు. అతని ప్యాంటు జేబులో దొరికింది క్వార్టర్ బాటిల్.

    "ఇప్పుడేమంటావ్?"

    అతని కళ్ళవెంబడి నీళ్ళు పెట్టుకున్నాడు.

    "సార్! అసలు సంగతి మీకు చెప్పలేదు. మా ఇంట్లో పరిస్థితులు మీకు తెలీవు! నా భార్యకు పక్షవాతంవచ్చి రెండుకాళ్ళూ పడిపోయాయి. మా పెద్దాడికి హార్ట్ ప్రాబ్లెమ్. మా నాన్నగారికి  మానసిక ఆరోగ్యం. ఇవికాక మొన్న రాత్రి మా ఇంటిలో దొంగలుపడి ఇంటిలో వున్న నగలన్నీ ఎత్తుకుపోయారు. ఈ పరిస్థితులన్నీ తట్టుకోలేక తాగుతున్నాను సార్."

    "వెరీ బాడ్! ఎన్ని సమస్యలు? మరి నాకెప్పుడూ చెప్పలేదేమోయ్ వీటి గురించి."

    "చెప్పి మీ మనసు కూడా పాడు చేయడం తప్ప నాకేం లాభం సార్?"

    "నీ బాధల్ని కనీసం నీ భార్యతో చెప్పుకున్నా మనశ్శాంతిగా వుండేది శంకర్రావ్! నీ భార్యకు పక్షవాతం వచ్చిన విషయం పాపం నీ భార్యక్కూడా తెలీకుండా దాచి నీలో నువ్వే కుమిలిపోతున్నట్లున్నావు."

    శంకర్రావు కంగారుపడ్డాడు.

    "అరగంట క్రితమే మన కంపెనీ డాక్టర్ మీ యింటికెళ్ళి మీ మిసెస్ పక్షవాతం గురించి చెక్ చేశాడు. ఆ సమయంలో ఆమె డాన్స్ ప్రాక్టీస్ చేస్తోందని తెలిసింది. మీ మిసెస్ డాన్స్ టీచర్ అని విన్నాను. నిజమేనా?" 

 

  శంకర్రావుకి నోట మాట రాలేదు.

    "నో ఛాయిస్ ఈజ్ యువర్స్ మిస్టర్ శంకర్రావ్! రిజిగ్నేషన్ ఇస్తావా? డిస్మిస్ ఆర్డర్ తీసుకుంటావా?"

    "సార్! తప్పుచేశాను, ఇంకోసారి చేయను."

    "కిందటిసారే నీకు వార్నింగిచ్చాను. ఆఫీస్ లో తాగి పనిచేయకూడదని."

    "అప్పటినుంచి తాగలేద్సార్! ప్రామిస్!"

    రాజశేఖర్ తన సీట్లోనుంచి లేచివచ్చి శంకర్రావు జేబులు తడిమి ఓ క్వార్టర్ బాటిల్ విస్కీ బయటకు తీశాడు.

    "నౌ వాడ్డూయూసే?"

    "రెండో తప్పు చేశాను! మూడువరకూ ఛాన్సివ్వండి సార్"

    "అలా చేస్తే నేను తప్పు చేసినట్లవుతుంది! సిబ్బందితోపాటు నేనూ తప్పులు చేయటం నాకిష్టంలేదు మిస్టర్ శంకర్రావ్! ప్లీజ్ గెటెవే"

    శంకర్రావు బయటికొచ్చేసి రిజిగ్నేషన్ లెటర్ రాయటం మొదలుపెట్టాడు.

    అతనికి తెలుసు!

    రాజశేఖర్ చాలా మొండి మనిషి.

    రిజిగ్నేషన్ చేయకపోతే డిస్మిస్ చేయటం ఖాయం.


                                                                   *    *    *    *    *

    స్ల్పిట్ ఎయిర్ కండిషనర్ చాలా నిశ్శబ్దంగా ఆ గదిని చల్లబరుస్తోంది.

    విశాలమైన ఆ గదిలో అర్ధచంద్రాకారంగా ఉన్న అందమయిన టేబుల్, ఆ టేబుల్ మీద రంగురంగుల ఫోన్లు, హాట్ లైన్లు, ఓ చిన్న ట్రేలో కొన్ని ఫైల్స్ వున్నాయి.

    టేబుల్ వెనుక రివాల్వింగ్ చైర్ లో ఆనందరాజశేఖర్ కూర్చుని వున్నాడు. అతని చేతిలో ఫోన్ వుంది. చాలా హడావుడిగా, చాలా క్లుప్తంగా, చాలా ఫాస్ట్ గా అమెరికాలోని ఓ వ్యాపార సంస్థతో మాట్లాడుతున్నాడతను.

    అతనికెదురుగా అతని సెక్రటరీ ఓ నోట్ బుక్ పెట్టుకుని కూర్చుని వుంది వినయంగా.

    "య!....య!....అఫ్ కోర్స్!....య!.... విత్ ప్లెజర్! ఐ లవ్ టూ డూ ఇట్! ఇట్ విల్ బి వండర్ ఫుల్!"

    ఫోన్ డిస్కనెక్టయ్యింది.

    అప్పుడు సెక్రటరీవేపు చూశాడతను.

    "ఎస్ ప్రమీలా?" అన్నాడు ప్రశ్నార్ధకంగా.

    "బాంబే ఫరమ్ కి లెటర్ డిక్టేట్ చేస్తానన్నారు"

    "ఒ!య! మర్చిపోయాను! నోట్ డౌన్" అంటూ రెండు లైన్లు చెప్పాడో లేదో మళ్ళీ ఫోన్ మోగింది.

    "సర్! ఢిల్లీ నుంచి ఎస్ టి డి.... ఇండియా గార్మెంట్స్ ఎమ్ డి ఆన్ ఫోన్"

    "కనెక్ట్ హిమ్"

    మూడు నిమిషాలు అతనితో మాట్లాడి మళ్ళీ సెక్రటరీవేపు చూశాడతను.

    "ఎస్ ప్రమీలా?" అన్నాడు మళ్ళీ ప్రశ్నార్ధకంగా.

    అదే సర్! బాంబే ఫరమ్ కి లెటర్ డిక్టేట్ చేస్తానన్నారు"

    "ఏ ఫరమ్ అది?"

    "కోస్టర్ కోరియర్స్"

    "య-య! ప్లీజ్ టేక్ డౌన్!" అంటూ మొదలెట్టాడుగానీ ఈసారి ఒక లైన్ చెప్పేసరికి మళ్ళీ ఫోన్ మోగింది.

    అది అందుకుంటూడగానే రెండో ఫోన్ మోగటం ప్రారంభించింది. అదికూడా అందుకుని రెండూ రెండు చెవుల దగ్గర పెట్టుకున్నాడతను.

    ప్రమీలకు నవ్వాగలేదు.

    ఇది రోజూ జరిగే తతంగమే.

    సాయంత్రం అయిదు తర్వాతగానీ రాజశేఖర్ కి ఖాళీ దొరకదని ఆమెకు తెలుసు.

    సరిగ్గా అదే సమయంలో నవ్వుతూన్న ప్రమీలవంక అనుకోకుండా చూశాడు రాజశేఖర్. నవ్వుతూన్నప్పుడు ఎంతో అందంగా వున్న ఆమె రూపం చూసి అతను స్టవ్ అయ్యాడు.

    ఆమెను గత ఆరునెలలుగా చూస్తూనే వున్నాడతను.

    కానీ ఎప్పుడూ ఇంత అందం వుందన్న విషయం తనకు తెలీలేదు.

    "షి ఈజ్ రియల్లీ బ్యూటిఫుల్" అనుకున్నాడు ఇంకా ఆమెవంకే కన్నార్పకుండా చూస్తూ.

    అతనలా ఫోన్స్ పట్టుకుని మాట్లాడకుండా తనవేపు చూస్తుండిపోవటము కూడా కలిగించింది.

    కొంచెం సిగ్గుకూడా కలిగింది.

 


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS