Previous Page Next Page 
ప్రణయ వీచికలు పేజి 4

"నీకు పెళ్ళి అయేంతవరకూ ఎవరో ఒకరిమీద నువ్వు ఆధారపడక తప్పదు. నీ పెళ్ళి కాకముందు నేను చస్తే, నీపేర బ్యాంకులో ఆమాత్రం డబ్బు అయినా లేకపోతే ఆకలితో మాడి చస్తావు."
ఎప్పుడు డబ్బు అడిగినా ఇలాగే లెక్చర్ ఇస్తాడు. అతని మాటల్లో తన తండ్రి మీద అతనికి ఏమాత్రం గౌరవం లేదని తనకు అన్పిస్తుంది. కారణం తన తండ్రి బాగా సంపాదించలేదనే. ఎప్పుడూ అదే అంటూ ఉంటాడు.
తన తండ్రి ఇండియాలో ఉద్యోగం సంతృప్తిగా లేకనే తిరిగి ఇంగ్లాండు వచ్చాడు.
తనకున్న పొలంలో వ్యవసాయం చెయ్యాలనుకున్నాడు. ఆ పనిలో పరిజ్ఞానం లేనందువలన అదీ సరిగ్గా చెయ్యలేకపోయాడు. ఆ చిన్న ఊళ్ళో తన తండ్రికి ఎంతో గౌరవం వుండేది.
పెద్దగా డబ్బు లేకపోయినా రోజులు సంతోషంగా గడిచిపోయాయి. ఆయనకు భార్య అంటే అమితమైన ప్రేమ. ఆమె ఇండియా వదిలెయ్యడం ఇష్టపడలేదు. ఆ విషయాన్ని తల్చుకుని బాధపడుతూ వుండేవాడు. ఎప్పుడూ ఇండియాలోని తన స్నేహితుల్ని తల్చుకుంటూ వుండేవాడు.
ఆయన గుర్రాల్ని పెంచేవాడు. శీతాకాలంలో భార్యాభర్తలు ఇద్దరూ గుర్రాలమీద వేటకు వెళ్ళేవారు.
అప్పుడప్పుడు ఇంగ్లాండు వెళ్ళేవారు. ఖర్చుకు వెనకాడేవాడు కాదు. తన తండ్రికి డబ్బంటే వ్యామోహం లేదు. తన ఇల్లు ఎప్పుడూ నవ్వులతో ప్రతిధ్వనిస్తూ వుంటే, తన తల్లిదండ్రులు పోయి బాబాయి దగ్గరకు వచ్చినప్పుడు గాని తను పోగొట్టుకున్నదేమిటో, ఎంత విలువైనదో అర్థంకాలే.
తన బాబాయి ఇండియాలో జడ్జిగా పనిచేశాడు. అందువల్లనేమో అతడు అందర్నీ క్రిమినల్సుని (అపరాధుల్ని) చూసినట్టు చూస్తాడు. తనను కూడా అలాగే ట్రీట్ చేస్తున్నాడు.
బాబాయికి ఆడవాళ్ళంటే గిట్టదు. అతని ఇంట్లో ఆడవాళ్ళకు ప్రవేశం లేదు. అందుకే అతను పెళ్ళికూడా చేసుకోలేదు. తప్పని పరిస్థితుల్లో తనకు ఆశ్రయం ఇవ్వాల్సివచ్చింది. అన్న కూతుర్ని గాలికి వదిలెయ్యలేకపోయాడు.
తను తెలివైనదనీ తన పనికి వుపయోగిస్తుందనీ భావించడం వల్లనే తనను దగ్గరకు తీశాడా అనిపిస్తుంది.
తను తప్పులు చేస్తున్నప్పుడల్లా తిట్టేవాడు. ఇప్పుడు కొట్టడం కూడా ప్రారంభించాడు.
తన తల్లిదండ్రులు ఏనాడు తనమీద చెయ్యి ఎత్తలేదు.
తను ఒకటి రెండుసార్లు ఎదురుతిరిగింది. ఫలితంగా ఎక్కువ దెబ్బలు తిన్నది. తను ఏడుస్తుంటే చిరాకు పడేవాడు. తన టైంవేస్టు చేస్తుందని తిట్టేవాడు. ఆ తర్వాత నుంచి అతని తిట్లనూ, దెబ్బల్నీ మౌనంగా మూగపశువులా భరించసాగింది.
తన కోపం అంతా తనమీదే కాదని కూడా తనకు తెలుసు. తను ముసలివాడు అయిపోతున్నాననే బాధ అతన్ని వేధిస్తూనే వుంది. వయసులో తను ఇండియాలో అనుభవించిన అధికార దర్పాన్ని మననం చేసుకుంటూ, ఇప్పుడు అలాంటి జీవితం గడపలేనందుకు బాధపడుతూ వుంటాడు. రోజురోజుకూ అతనిలో అసంతృప్తి ఎక్కువ అవుతోంది.
తను వంటరివాడిననీ, తను కావాలనుకొనేవారు లేరనీ కృంగిపోతూ వుంటాడు. అందుకే అందుబాటులో వున్న తనమీద, అతను ప్రపంచం మీద ఏర్పడిన కసిని తీర్చుకుంటున్నాడు. అతను శాడిస్టుగా తయారయ్యాడు.
అనుకోకుండా అతనికి హైదరాబాదు నవాబు నుంచి ఆహ్వానం అందింది. ఒక క్లిష్టమైన కేసులో అతని సలహాను కోరాడు నిజాం నవాబు. అతను హైదరాబాద్ లోనే ఉద్యోగ విరమణ చేశాడు. నవాబు ఆహ్వానం అందుకోగానే అతని ఆనందం పెల్లుబికింది.
"నాకు తెలుసు ఎప్పటికైనా ఇలాంటి ఆహ్వానం వస్తుందని. నా అంత తెలివయినవాడు, న్యాయశాస్త్రంలోని మెళుకువలు తెలిసినవాడు ఆ సంస్థానంలో మరొకడు లేడని నాకు తెలుసు" అన్నాడు ఆనందంగా బాబాయి.
రెండురోజులు చిన్నపిల్లవాడిలా నవ్వుతూ కావాల్సిన పుస్తకాల బూజు దులిపాడు. ఇండియా నుంచి వచ్చాక బీరువాలో పడేసిన దుస్తుల్ని కూడా బయటకు తీశాడు.
"మీరు ఇండియా వెళ్ళిపోతే ఇక్కడ నేను వుండాలా అంకుల్?" అని తను ప్రశ్నించింది.
"ఇక్కడ వుండక ఇంకెక్కడికెళ్తావ్?" అన్నాడు తన ముఖంలోకి చూస్తూ.
ఆ మాట అన్నాడే కాని, వెంటనే ఆలోచనలో పడ్డాడు. బహుశా ఇండియాలో కొత్తవాళ్ళతో బాధపడేకంటే తనను తీసుకెళ్ళడమే మంచిదని భావించి వుంటాడు.
"నో. నువ్వు నాతో వస్తావు. కొన్ని సంవత్సరాలుగా నీమీద ఖర్చు పెట్టిన డబ్బు అక్కడ నీద్వారా సంపాదించుకుంటాను" అన్నాడు తన బాబాయి.
ఆ మాట వినగానే ముందు తనకు సంతోషం కలిగింది. తన తల్లిదండ్రులు ఇండియా గురించి ఎన్నో విషయాలు చెబుతూ ఉండేవారు. తనకు ఇండియా చూడాలని వున్నది. కాని తన బాబాయితో ఎక్కడికి వెళ్ళినా తనకు నరకం తప్పదని తెలుసు. అందుకే ముందు కలిగిన సంతోషం నీరుకారిపోయింది. మరుక్షణంలోనే అతనితో తనకు బయలుదేరాలని తోచలేదు. అయినా తప్పలేదు.
ఓడలో అతను రాస్తున్న స్క్రిప్టుకు ఫెయిర్ కాపీ చెయ్యసాగింది. తప్పుదొర్లినప్పుడల్లా తిట్లూ, దెబ్బలూ తింటూనే ఉంది.
సముద్రప్రయాణంలో తను జబ్బుపడలేదు. కాని తలనొప్పి మాత్రం తరచుగా వస్తోంది. తనకోసం అన్నిటికంటే చౌకగా వున్న చిన్న కాబిన్ రిజర్వు చేయించాడు.
సాధారణంగా ఫస్టుక్లాసు ప్రయాణీకుల పనివాళ్ళ కోసం ఆ క్యాబిన్ ను ఇస్తుంటారు. గాలి వుండదు, వెలుగు అంతంతమాత్రమే!
అందులోకి ప్రవేశించినప్పుడల్లా తనకు ఒక సమాధిలోకి వెళుతున్నట్టుగా వుంటున్నది. రాత్రిళ్ళు ఆ గుడ్డి వెలుగులోనే ఫెయిర్ రాస్తూ ఉంటుంది. అందువల్లనే కళ్ళు పీకడం, తలనొప్పి రావడం జరుగుతోంది. ఇంత చేసినా ఉదయం తన బాబాయి "ఇంతేనా రాత్రి రాసింది?" అంటూ విసుక్కుంటాడు. తిడతాడు, చీదరించుకుంటాడు. ఓడ మెడిటేరేరియన్ వదిలి సూయజ్ కెనాలులో ప్రవేశించేసరికి తను ఏ పనీ చేసే స్థితిలో లేదు.
ఎప్పుడూ కళ్ళు మూసుకొని పడుకోవాలనిపిస్తుంది. ఏమీ చెయ్యబుద్దికాదు.
"నీమీద నాకెంత ఖర్చు అవుతుందో ఈ ప్రయాణంలో తెలుసా? సోమరితనం మానేసి పని సరిగ్గా చెయ్యి. ఆ మాన్యుస్క్రిప్టు ఇండియా చేరేలోపల పూర్తికావాలి. చెయ్యకపోతే ఫలితం అనుభవిస్తావ్" అని బాబాయ్ బెదిరించాడు.
"ఇక నావల్ల కాదు అంకుల్" అంది.
అతను ముఖం మీద ఈడ్చికొట్టాడు. మరో దెబ్బకు చెంప చెళ్ళుమన్నది.
"నువ్వు చేసి తీరాలి. ఎలా చేయించాలో నాకు తెలుసు, లేకపోతే నిన్ను సముద్రంలోకి విసిరేస్తాను" అంటూ అతను అరిచాడు.
ఆ తర్వాత ఈ నిర్ణయానికి వచ్చింది. అతను చేస్తానని బెదిరించిన పని తనే చేసుకోవాలనే నిర్ణయం తనకు కలిగింది. తన జీవితం మీద తనకే ఎక్కువ అధికారం ఉన్నది.
ఆ రాత్రి, పగలూ బాగా ఆలోచించే, ఇక అతను బాధలు భరించలేదు, ఆత్మహత్యేశరణ్యం అని భావించింది.


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS