Previous Page Next Page 
నీరు పల్లమెరుగు పేజి 4


    కృష్ణారావు తనను ఆటలు పట్టిస్తున్నాడా? అని అనుమానం తోచింది. మాట్లాడకుండా కూచుంది. కారు రిట్జ్ హోటల్ ముందు ఆగింది. కృష్ణారావు దిగి లోపలికి వెళ్ళి పది నిముషాల్లో సూర్యంతో కలిసి వచ్చాడు. సూర్యాన్ని చూడగానే గతుక్కుమంది తులసి. రక్తం నశించినట్లు పాలిపోయింది ముఖం. తులసిని చూడగానే సూర్యం కనుబొమలు పెద్దవి చేసి "తులసీ! మీరు ఇంతవరకూ ఇంటికి వెళ్ళలేదా? కృష్ణారావు కారులో ఎక్కణ్ణుంచి వస్తున్నారు?" అన్నాడు.
    కృష్ణారావు నవ్వుతూ "ఒరేయ్, సూర్యం! అంత త్వరగా నన్ను అపార్థం చేసుకోకు. ఈవిడిని నా కార్లో ఎక్కించుకుని షికార్లు కొడుతున్నానని అనుకోకు. పాపం, బస్ స్టాప్ దగ్గిర బస్ దొరక్క నిలబడివుంటే, లిఫ్ట్ ఇస్తున్నాను, అంతే!" అన్నాడు.
    తులసికి మెదడు మొద్దుబారిపోసాగింది. ఈ స్నేహితులిద్దరూ కావాలని కూడబలుక్కుని తననిలా ఏడిపిస్తున్నారా? నిజంగా సూర్యానికి ఏం తెలియకుండానే అంత ఆశ్చర్యంగా తననిలా అడుగుతున్నాడా? కృష్ణారావు కారులో సరదాగా తిరుగుతున్నట్లుగా ఊహించుకుంటున్నాడా తనను? అవును! ప్రస్తుతం తనున్న పరిస్థితి ఏమిటి మరి?
    తులసి దృష్టి తన ఎడంచేతి రెండోవెలికి వున్న వుంగరం మీద పడింది. ఆ వుంగరాన్నే చూస్తూ తలవంచుకుని కూచుంది. సూర్యం వచ్చి కృష్ణారావు పక్కన కూచున్నాడు. కారు కదిలింది. సూర్యం, కృష్ణారావూ ఏవో కబుర్లలో పడ్డారు. వాటిల్లో ఒక్కటి కూడా తులసి తలకెక్కటం లేదు. మెదడులో ఏదో హోరు...
    "బైదిబై సూర్యం - ఎక్కడ డ్రాప్ చెయ్యమంటావు నిన్ను?"
    "చంద్ర ఇంటి దగ్గర."
    "చంద్ర ఇంటి దగ్గరా!" బోలెడు ఆశ్చర్యం కృష్ణారావు కంఠంలో. లిప్త మాత్రం వెనక్కు తిరిగి తులసి ముఖంలోకి చూసి అంతలో మెరుపులా తల తిప్పుకున్నాడు.
    "ఇవాళ తన ఇంటికి రాకపోతే చంద్ర ఊరుకోనంది. ఏదో 'మంచి ప్రోగ్రాం' అని తెగ ఊరించింది. ఏమిటో అంత మంచి ప్రోగ్రాం?" ఎంతో ఉత్సాహం సూర్యం కంఠంలో.....
    తులసి అన్నీ వింటోంది ఏం మాట్లాడకుండా. తను వింటున్నట్లు ముందుసీట్లో కూచున్న వాళ్ళకు తెలుసు. తను వినాలనే మాట్లాడుకుంటున్నారు.
    కారు చంద్ర ఇంటిముందు ఆగింది. మనసు ఎంత ఉడికిపోతున్నా కుతూహలం అణచుకోలేక, కిటికీలోంచి తల బయటపెట్టి తొంగిచూసింది. చిన్న డాబా ఇల్లు. ముచ్చటగా ఉంది. ముందు కొద్దిపాటి ఆవరణ వుంది. ఆ ఆవరణలో గులాబి మొక్కలు విరబూసిన పూలతో ముచ్చటగా వున్నాయి. కారు హారన్ వినగానే వుత్సాహంగా బయటకు వచ్చింది చంద్ర. అతి మామూలు తెల్లని మిల్లు చీరలో ఎంతో నిరాడంబరంగా వుంది. చాలా అందంగా కూడా వుంది. కారులో తులసిని చూసి ఆశ్చర్యంతో బొమ్మలా నిలబడిపోయింది. ఆ ఆశ్చర్యం నటన కాదనిపించింది తులసికి. ఈ స్నేహితులిద్దరూ కూడబలుక్కుని నాటకమాడుతున్నది నిజమయితే, అందులో చంద్రలేదేమో? లేదా, వీళ్ళిద్దరినీ మించి నటిస్తుందేమో!
    చంద్ర క్షణాలలో తన ఆశ్చర్యం నుంచి తేరుకుని, గబగబ కారు దగ్గరకు వచ్చి సంతోషంతో ముఖం వెలిగిపోతుండగా "ఎంత అదృష్టం? ఇవాళ తులసిగారే మా ఇంటికి వచ్చారు. రండి! రండి!" అంది.
    తులసి మాట్లాడలేదు. కారు దిగే ప్రయత్నం చెయ్యలేదు. సూర్యం నవ్వుతూ "చంద్రా! మీ ఇంటికి వచ్చినవాణ్ని నేను. స్వాగతం చెప్పాల్సింది నాకు. నన్ను మరిచిపోయి తనదారిన తను పోతున్న తులసిని చూసి మురిసిపోతున్నావు. నువ్వు చాలా చెడ్డదానివి" అన్నాడు.
    చంద్ర సూర్యాన్నీ, తులసినీ మార్చి మార్చి చూసింది. ఆవిడ ముఖంలో రంగులు చకచక మారిపోయాయి. "నా చెడ్డతనం అప్పుడే ఏం చూశారు? అసలు మీరు నన్ను ఏం అర్థం చేసుకున్నారనీ? నన్ను గురించి తెలుసుకోవాలనుకుంటే మీ ఫ్రెండ్ నడగండి. ఏం కృష్ణా? నేను ఎలాంటిదాన్ని?" అంది, తులసిని పూర్తిగా మరిచిపోయినట్లు స్నేహితులిద్దరినీ నవ్వుతో చూస్తూ....
    కృష్ణారావు భయం నటిస్తూ "నువ్వా? బ్రహ్మరాక్షసివి" అన్నాడు.
    "కరెక్ట్!" అని పకపక నవ్వింది చంద్ర.
    తులసి శక్తిలేని కుడిచేత్తో ఎడంచేతి వుంగరాన్ని సగం వరకూ పైకిలాగి, అప్రయత్నంగా తల పైకెత్తింది. తననే చూస్తున్న సూర్యం చూపులతో చూపులు కలిశాయి. వుంగరాన్ని వెనక్కు తోసేసింది.
    "అయితే కృష్ణా! నువ్వు దిగి లోపలకు రావన్న మాట!" చంద్ర కదలకుండా కూచున్న కృష్ణారావుని కవ్విస్తున్నట్లు అడిగింది.
    "అలా అడిగి నా ప్రాణాలు తోడకు. ప్రస్తుతం కర్తవ్య దీక్షా బద్ధుణ్ని. అయినా తులసిగారు కూడా దిగి వస్తానంటే రావటానికి నాకు అభ్యంతరం లేదు. ఏం తులసి గారూ, కొంచెంసేపు కూచుని వెళ్దామా?"
    తులసి సూటిగా కృష్ణారావు ముఖంలోకి చూసింది.....
    "మీరు మీ కారులో నన్ను మా ఇంటిదగ్గర డ్రాప్ చేస్తున్నందుకు నేను చెల్లించుకోవలసిన మూల్యమా ఇది?"
    నవ్వుతూ వున్న కృష్ణారావు ముఖం కఠినంగా మారిపోయింది.
    "కాదు, మీరు నాకే మూల్యమూ  చెల్లించక్కర్లేదు" వెంటనే కారు స్టార్ట్ చేశాడు కృష్ణారావు.


                                       3


    "ఏమిటి? నేను లేచిపోవాలా? ఎందుకు? నేను లేచిపోగానే మరో అప్పలమ్మని తెచ్చుకుని కులుకుదామనా? ఒక్కనాటికీ లేచిపోను. మహాపతివ్రతా శిరోమణిని. మీ పాద పద్మాలు వదిలి నేనెక్కడికి పోతాను."
    "ఓహోహో! నువ్వు సుమతివి కదూ! ఇంకేం, నీ పేరు సార్థకం చేసుకో! నువ్వే తీసుకుపో, నేను కోరిన ఆడదాని దగ్గరకి....."
    'ఓ అలాగే! దానికేం భాగ్యం! ముందు సుమతి మొగుడికి వచ్చినట్లు మీకు కుష్టురోగం రానియ్యండి. ఆ తరువాత తట్టలో పెట్టుకొని మోసుకుపోతాను, మీకు కావలసిన చోటికి....."
    "ఏమిటే, ఏం కూశావ్? నాకు కుష్ఠురోగం రావాలా? పాపిష్టిదానా? ఎన్ని రోగాలైనా నీకొస్తాయి. నాకెందుకొస్తాయే?"


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS