Previous Page Next Page 
అజ్ఞాత బంధాలు పేజి 4


    రాగిణి అర్థమయిపోయింది లలితకి. మరేమీ మాట్లాడలేదు. మాట్లాడినా ప్రయోజనం లేదు.
    "ఏదో బజారు వ్యవహారమని చికాకు పడుతున్నావేమో! అదంతా ఏం ఉండదు తెలుసా? శ్యామలాంబగారు చెప్పారు. అంతా గొప్ప గొప్ప వాళ్ళతో వ్యవహారం. మాక్కూడా చాలా గౌరవం ఉంటుంది." గర్వంగా అంది రాగిణి.
    అప్పటికీ లలిత ఏమీ మాట్లాడలేదు.
    లలిత అలా ముభావంగా ఉదాసీనంగా ఉండటం రాగిణికేం నచ్చలేదు.
    "నువ్వొక్కసారి మా సేవాసదనానికి రారాదు?" అంది.
    "వద్దులే! నేను రాలేను." కోపంగా అంది లలిత. అప్పటికయినా ఆ సేవాసదనంలో నుండి రాగిణిని బయటకు తీసుకు రాగలిగితే బాగుండునని లలిత తాపత్రయం.
    రాగిణి మనసు చివుక్కుమంది. ఏదో అక్కసు కలిగింది.
    "ఎందుకు రావూ? నిన్నూ అక్కడ చేరమంటారని భయమా? పరవాలేదులే! అక్కడ ఎవరిని పడితే వాళ్ళని చేర్చుకోరు. నాలా అన్నివిధాలా అందమైన వాళ్ళే కావాలి!" నవ్వుతూ నవ్వుతూ అనేసింది.
    త్రుళ్ళి పడింది లలిత.
    తను ఎన్ని విధాలుగానో ఆదరించిన రత్నమ్మ తన దగ్గిర ఎన్నెన్నో సహాయాలు పొందిన రత్నమ్మ, ఈనాడు రాగిణిగా మారి ఇలా మాట్లాడుతోంది.
    "నీ అంత గొప్పగా బ్రతకలేక పోయినా, ఏదో, ఎలాగో ఒకలా, బ్రతకడానికి ప్రయత్నిస్తున్నాను. ఈ అభాగ్యురాలిని మరిచిపోకు."
    వెటకారంగా అని వెళ్ళిపోయింది రాగిణి.
    తరువాత తరువాత శ్యామలాంబ సేవాసదనం గురించి చాలా విషయాలు తెలిసాయి లలితకి. రాగిణి అన్నట్లు ఆవిడ సేవాసదనంలో అందరూ అందమైన వాళ్ళే.
    ఆవిడ వాళ్ళను పెద్ద పెద్ద ఆఫీసర్ల దగ్గిర పనులు సాధించుకోవటానికి ఉపయోగించుకుంటుంది. పైనుంచి కిందవరకు అన్నిరకాల మనుషుల దగ్గరా ఆవిడకు లావాదేవీలున్నాయి. ఈ విషయాలు అందరికీ తెలుసు. ఎవరికీ తెలియనట్టే ఉంటారు.
    రాగిణిని ఇంచుమించు మరచిపోయింది లలిత. చాలా రోజుల తరువాత ఆ రోజు చూసింది రాగిణిని.
    రాజు పక్కన కూర్చుని నవ్వుతోన్న రాగిణిని.
    బాపినీడుగారు రమ్మంటున్నారని ఎవరో ప్యూన్ సైకిల్ మీద వచ్చి చెప్పాడు లలితకి. అప్పటికి వారం రోజులనుండే ప్రయత్నిస్తోన్నా, బాపినీడుగారి దర్శనం కాలేదు లలితకు. మోహన్ ఇంజనీరింగ్ లో డిప్లమా తీసుకున్నాడు. డిగ్రీలున్న వాళ్ళకే ఉద్యోగాలు దొరకని రోజుల్లో డిప్లమా మాత్రమే ఉన్న మోహన్ కి ఉద్యోగం దొరకలేదు. బాపినీడు గారికి అన్ని రంగాలలోను పలుకుబడి ఉందనీ, ఆయన తలుచుకుంటే సహాయం చెయ్యగలరనీ కొందరు స్నేహితులు లలితకు చెప్పారు. తమ్ముడికి కూడా ఉద్యోగం దొరికితే ఇంటి పరిస్థితి కాస్త కుదుట పడుతుంది. ఆ కారణంగానే బాపినీడుగారిని కలుసుకోవాలని ప్రయత్నించింది లలిత. ఉదయం వెళితే సాయంత్రం రమ్మనీ, సాయంత్రం వెళితే మరునాడు రమ్మనీ తిప్పిస్తున్నాడు పి.ఏ. లాంటిది ఈ రోజున అక్కడినుండే కబురు వచ్చేసరికి ఆశ్చర్యం కలిగింది లలితకి. ఏమో! బాపినీడు మంచివాడేనేమో! తను అతనికోసం వస్తున్నట్లు ఇంతకుముందు అతనికి తెలియదేమో? ఇప్పుడు తెలుసుకుని, కబురు పంపించాడేమో!
    కొంచెం జంకుతూనే వెళ్ళింది. నౌకరు లోపలకు తీసుకెళ్ళాడు. అక్కడ బాపినీడు పక్కనే కూర్చుని పకపక నవ్వుతోన్న రాగిణిని చూసి మ్రాన్పడిపోయింది.
    రాగిణి లలితను చూడగానే తమాషాగా నవ్వింది. గర్వం, అహంకారం వీటన్నిటినీ మించి ఏదో అసహనం వున్నాయి ఆ నవ్వులో.
    "రా లలితా! కూర్చో! నేనే నీకోసం కబురు పంపించాను. నాబోటివాళ్ళం ఒక స్టేటస్ మెయిన్ టైన్ చెయ్యాలిగా! మీ ఇంటికొస్తే బాగుండదు చూడు...!"
    ఏం మాట్లాడలేక నిలబడిపోయిన లలితను రాగిణి భుజాలు పట్టుకు కూర్చోబెట్టింది.
    "ఏం తింటావు? రసగుల్లా? గులాబ్ జాం కావాలా?" అని అడిగింది.
    "ఏం వద్దు."
    "ఎందుకు? స్వీట్స్ తినటం కూడా పవిత్రతకు భంగమా? లేకపోతే డయిటింగా? నాలాంటి వాళ్ళకు ఆ తాపత్రయాలన్నీ! నీకెందుకు?"
    "వెళ్తాను." లేచింది లలిత. రాగిణి మళ్ళీ భుజాలు పట్టి కూర్చోబెట్టింది.
    "కూర్చో! నన్ను చూసి భయపడకు. నేను నీకేమి చెయ్యను. ఆ మాట చెప్పాలనే పిలిచాను."
    "నేను నీకు భయపడటం లేదు!"
    "గుడ్! ఒక్కసారి అద్దంలో చూసుకో! కొంచెం రోజుల్లోనే ఎంత మారిపోయావ్? ప్చ్! పవిత్ర ప్రేమ! దాని కర్మ ఇంతే! పరవాలేదులే! బెంగపెట్టుకోకు! నేను రాజును పెళ్ళిచేసుకోను. పెళ్ళి చేసుకోమని కాళ్ళా వేళ్ళా పడ్డాడు మహానుభావుడు! ఈ అందమంతా... అందమొకటే కాదులే..." ఆగి కన్నుకొట్టి నవ్వింది రాగిణి. లలిత ముఖం చూస్తూ మళ్ళీ సాగదీస్తూ సంభాషణ సాగించింది.
    "ఇదంతా సొంతం చేసుకుందామని ఆశపడ్డాడు. అలాంటివాడు నాకెందుకు? అతని జీతమంతా కలిపి రెండువేలు లేదు. నాకు నెలకి అయిదువేలు తక్కువ ఖర్చుకాదు. అంతకంటే తక్కువలో ఎలా గడుపుకోవాలి? కొంచెం రోజుల్లో ఎలాగూ రాజుని ఒదిలేస్తాను. అప్పుడింక చచ్చినట్లు నీ దగ్గిరకే వస్తాడు. ఈ క్షోభ, పాపం నీకు కొంచెం రోజులే!"
    లలితకు అక్కడినుంచి పారిపోవాలని ఉంది. పర్వతంలా సోఫాలో నిండుగా కూర్చుని, పరమానందంగా తమ సంభాషణ వింటూ చిరునవ్వులు చిలకరిస్తోన్న బాపినీడుని కత్తితో పొడవాలని ఉంది.
    "అన్నట్లు రాజుకి నీలం రంగంటే ఇష్టంట. నీలం రంగు చీరను కొని జాగ్రత్త పెట్టుకో!" నేను శృంగారంలో చిలిపిగా కొన్ని ధ్వనులు చేస్తాను. అవంటే రాజుకి చాలా ఇష్టం. నువ్వెప్పుడైనా తీరుబడిగా వస్తే అవెలా చేయాలో నేర్పిస్తాను..."
    చిరునవ్వుతో చెప్పుకుపోతోంది రాగిణి. లలిత ముఖం చూస్తే బాపినీడుకే జాలి కలిగినట్టుంది. "మీకేం కావాలి?" అన్నాడు రాగిణి ధోరణికి అడ్డుపడుతూ...
    "ఏం అక్కర్లేదు!"
    "మరెందుకు తిరుగుతున్నారు నా చుట్టూ..." అతడి మాటల్లో పరిహాస ధోరణికి లలిత పోరుషపడలేదు.
    "నేను ఎంత నీచానికి పాల్పడ్డానో, నాకు తెలియక వచ్చాను. కొన్ని కొన్ని విషయాలు అనుభవంలో కాని అర్థంకావు. అదృష్టవంతురాలిని. ఇప్పటికైనా అర్థం చేసుకున్నాను. మాబోటి వాళ్ళందరూ ఉద్యోగాల కోసమో, మరి దేనికోసమో మీ ఇంటి చుట్టూ తిరక్కపోతే మీరేం చెయ్యగలరు? మా అలసత్వమే మీకు అధికారాన్ని ఇస్తోంది. ఈ అడ్డు దారులను అడ్డుకోకపోవటమే మాలో అల్పత్వం. వస్తాను."
    ఆ ఇంటి నుంచి బయటకు అడుగుపెట్టగానే భయంకరమైన అగ్ని జ్వాలల్లోంచి బయటపడినట్లనిపించింది లలితకి.


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS