Previous Page Next Page 
రాబందులూ - రామచిలుకలు పేజి 3


    "ఏమిటయ్యా నీకీ పిచ్చి? ఉన్న ఆ కొండ్రకాస్తా అమ్ముకొని ఆ తర్వాత ఏం చేద్దామని?" అంటూ జానకిరామయ్య లేచి వీధిగుమ్మంలోకి వెళ్ళాడు. ఖాండ్రించి ఊసి తిరిగొచ్చి మంచంమీద కూర్చున్నాడు.

 

    ధర్మయ్య సమాధానంగా నవ్వాడు సన్నగా, నిండుగా.

 

    "ఆ కాస్త ఆధారం కూడా అమ్మి చదువులకు పోసి, రేపు పిల్ల పెళ్ళి ఎట్లా చేస్తావయ్యా?" మందలింపుగా అన్నాడు జానకిరామయ్య.

 

    ధర్మయ్య మాట్లాడలేదు. ఆరిపోయిన చుట్టను వెలిగించే ప్రయత్నంలో వున్నాడు. జానకిరామయ్యకు ధర్మయ్య ముఖంలో ఎటువంటి భావం కన్పించలేదు. వళ్ళు మండిపోయింది.

 

    "జాగ్రత్త! అది కాస్తా అమ్మేశాక పొట్టచేత్తో పట్టుకొని బిక్ష మెత్తుకోవాల్సి వస్తుంది. సునందకు పెళ్ళి కాదు. బాగా ఆలోచించుకో!"

 

    ధర్మయ్య ఉలకలేదు. పలకలేదు. చుట్టదమ్ముపట్టి బాగా పొగ వదిలాడు.

 

    "అదేమిటన్నయ్యా? మా సునంద బాగా చదువుకొని ఉద్యోగం చేసి మమ్మల్ని పోషించలేదా? అది బాగా చదువుకుంటే వరుడు వెతుక్కుంటూ రాడూ?" అన్నది సరస్వతమ్మ భర్తను వెనకేసుకొస్తూ.

 

    జానకిరామయ్య తలెత్తి ఓ క్షణం సరస్వతమ్మ ముఖంలోకి చూశాడు.

 

    "మరే! నువ్వు ఇట్టా వుండబట్టే మీ ఆయన ఆడింది ఆటగా, పాడింది పాటగా సాగుతూంది. మొగుడితోపాటు దేశం దేశం అంటూ వంతపాడి ఆస్తినంతా హారతి కర్పూరంలా వెలిగించి వేశారు. జైలుకు వెళుతుంటే హారతిపట్టి ఆనందంగా సాగనంపావు. రోజులు మారుతున్నా మీరు మారరు. ఇద్దరికీ బొత్తిగా ప్రపంచం తీరు తెలియదు. తెలుసుకోటానికి ప్రయత్నించరు. ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఆ పిల్లను ఒక ఇంటిదాన్ని చెయ్యమని గోలపెట్టాల్సిన నువ్వు, ఇంకా మీ ఆయన చేసే పనుల్ని సమర్దిస్తున్నావు. ఇక మిమ్మల్ని ఆ భగవంతుడు కూడా రక్షించలేడు." జానకిరామయ్య బాధగా అన్నాడు.

 

    సరస్వతమ్మ మాట్లాడలేదు. దిగులుగా భర్త ముఖంలోకి చూసింది. ఆమెకు జానకిరామయ్య హెచ్చరిక సబబుగానే తోచింది.

 

    "నన్ను అర్ధం చేసుకో జానకిరామయ్యా! ఈ విషయంలో నన్ను నిందించకు. నాకు అమ్మాయిని బాగా చదివించాలని వుంది. అది బాగా చదువుకొని, తన కాళ్ళమీద తాను నిలబడితే చూడాలని వుంది. తనదంటూ ఒక ప్రత్యేక వ్యక్తిత్వాన్ని సంతరించుకొని నలుగురిచేతా ఔననిపించుకొంటే చూడాలని వుంది. సునంద అందరి ఆడపిల్లల్లాంటిది కాదయ్యా జానకిరామయ్యా! నా ఆదర్శాలూ, ఆకాంక్షలూ పుణికిపుచ్చుకొని నా ఇంట్లో వెలసిన దేవత. దానికీ చదువుకోవాలనే వుంది. అమ్మాయి సంఘసేవ చేస్తుంది. తనకోసం బతకటంలో గొప్పలేదయ్యా, పశువులూ, పక్షులూ, చీమలూ, దోమలూ కూడా బతుకుతున్నాయి. మనది మానవజన్మ. భగవంతుడు ఏ ప్రాణికీ ఇవ్వని బుద్ధినీ, ఆలోచించే శక్తినీ ఇచ్చాడు మనకు. మనం బతకటమే కాకుండా, ఇతరులు కూడా సుఖంగా బతికేందుకు చేతనైన సేవ చెయ్యడంలోనే వుంది. మానవజన్మకు సార్ధకత. అమ్మాయిని ఆదర్శ స్త్రీమూర్తిగా తీర్చిదిద్దటమే నా చిరకాల వాంఛ" ధర్మయ్య ఉద్రేకంగా అన్నాడు.

 

    సరస్వతమ్మ సంతృప్తిగా "ఇప్పుడు సమాధానం చెప్పు"! అన్నట్టు జానకిరామయ్య ముఖంలోకి చూసింది.

 

    జానకిరామయ్య విసుగ్గా కదిలి కూర్చున్నాడు.

 

    "అమ్మాయి వివాహం గురించిన చింత నాకు ఏనాడూ లేదు. తన భావాలకూ, ఆదర్శాలకూ అనుకూలమైన వ్యక్తి తటస్థ పడ్డప్పుడే వివాహం చేసుకుంటుంది. అమ్మాయికి కూడా ఇప్పుడప్పుడే పెళ్ళి చేసుకోవాలనిలేదు" అన్నాడు మళ్ళీ ధర్మయ్య.

 

    "చాల్లేవయ్యా! ఏ ఆడపిల్లయినా తనకు పెళ్ళి చేసుకోవాలని చెబుతుందిటయ్యా? పైగా నువ్వు చదువో చదువో అంటూ వుంటే, నాకు చదువొద్దూ, పెళ్ళికావాలి అని అమ్మాయి చెబుతుందా?" జానకిరామయ్య చిరాగ్గా అన్నాడు.

 

    "నిజమే అన్నయ్యా! సునందకు పెళ్ళి చేసుకోవాలని లేదు. బాగా చదువుకొని, ఉద్యోగం చెయ్యాలని ఉంది" అన్నది సరస్వతమ్మ.

 

    "ఇక మిమ్మల్ని మార్చటం నా తరం కాదు. మీరు పట్టిన కుందేలుకు మూడే కాళ్లు. మీ కుటుంబంతో వున్న అనుబంధం కొద్దీ, చూస్తూ ఊరుకోలేకపోతున్నాను" అన్నాడు జానకిరామయ్య దిగులుగా.

 

    "ఇన్నిటికీ బేరం ఏమయిందో చెప్పావు కాదు?" అన్నాడు ధర్మయ్య సంభాషణ మరో వైపుకు మళ్ళిస్తూ.

 

    "ఐదువేలకు పైన పోనంటున్నాడు. ఇష్టం అయితే చెప్పు! బేరం ఖాయం చేస్తా!" అన్నాడు జానకిరామయ్య అయిష్టంగా.

 

    "ఐదువేలకా? బంగారంలాంటి గడ్డ!" అన్నది సరస్వతమ్మ నీరుకారిపోతూ.

 

    "మన అవసరమా? వాళ్ళవసరమా? అమ్మకానికి బేరం పెడితే ప్రతివాడూ అలువులకూ సులువులకూ ఏసుకోవాలని చూస్తాడు. వాళ్ళ తప్పేముందిలే!" అన్నాడు జానకిరామయ్య విసుగ్గా.

 

    "ఏమిటో! అమ్మబోతే అడివి కొనబోతే కొరివి" తనకు తనే చెప్పుకుంటున్నట్టు చిన్నగా అన్నది ధర్మయ్య భార్య.

 

    "ఆ మధ్యనే గదయ్యా, ఆ పరమయ్యే సుబ్బరామయ్య పొలం, ఎకరం ఎనిమిదివేల కాడికి కొన్నాడు. అది ఒట్టి నాసిరకం పొలం. దానికంటే నా పొలం మంచిదని నీకు తెలియదా? ఆ పరమయ్యకు తెలియదా?" అన్నాడు ధర్మయ్య.

 

    "నాకు తెలిస్తే ఏం ప్రయోజనం? నేనా కొనేవాణ్ణి? మన అవసరం కొద్దీ మనం అమ్ముతున్నాం. ఆ పరమయ్యకేం అవసరం ధర పెట్టటానికి? ఎంత చౌకగా వస్తుందా? వేసుకుందాం_అని ఎదురు చూస్తున్నాడు. సుబ్బరామయ్య పొలానికి ఆ ధర ఎందుకు పెట్టాడంటావ్? సుబ్బరామయ్య అమ్ముతాననలేదే? పరమయ్యే కాడిగట్టు పొలం అని అతని వెంటపడి కొన్నాడు" అన్నాడు జానకిరామయ్య చుట్టముక్కను వీధిలోకి విసిరిపారేస్తూ.

 

    "సరే! ఏం చేస్తాం? లోకం తీరే అంత. ఎదుటివాడి అవసరాన్నీ, బలహీనతనూ వాడుకుంటారు. డబ్బు త్వరగా సర్దుబాటు చెయ్యమను."

 

    "డబ్బుకేం డబ్బు సిద్ధంగానే వుంది. నువ్వు ఊఁ అంటే చాలు. రేపు యీపాటికి డబ్బు నీ చేతిలో వుంటుంది. అయినా ఎందుకు చెబుతున్నానో, మరోసారి ఆలోచించు."

 

    "ఇక ఆలోచించటానికి ఏంలేదు, ఆ రాతకోతలేవో ఇవ్వాళే పూర్తి చేసేద్దాం! డబ్బు అందితే రేపే అమ్మాయిని ప్రయాణం చేస్తాను. రేపు మంచిరోజు అని శాస్త్రి చెప్పాడుగా!"

 

    జానకిరామయ్య లేచి "వస్తానమ్మా"! అని సరస్వతమ్మతో చెప్పి బయలుదేరాడు.

 

    "పరమయ్య దగ్గరికేనా?" వీధి గుమ్మందాకా వచ్చి జానకిరామయ్యను అడిగాడు ధర్మయ్య.

 

    "ఊఁ" అంటూ అంగలు పంగలు వేసుకుంటూ వెళ్ళిపోయాడు జానకిరామయ్య.

 

    "అన్నయ్యకు కోపంగా వుంది. మనం ఈ పొలం అమ్మడం ఇష్టంలేదు. చాలా బాధపడుతున్నాడు" అన్నది సరస్వతమ్మ దిగులుగా.

 

    "మీ అన్నయ్య సంగతి వదిలెయ్. నీ సంగతి చెప్పు! అంతగా దిగాలుపడిపోయి కన్పిస్తున్నావ్. అమ్మాయి చదువుకొని ప్రయోజకురాలు కావడం నీకు ఇష్టం లేదా?" భార్య కళ్ళలోకి గుచ్చిచూస్తూ అడిగాడు ధర్మయ్య.

 

    సరస్వతమ్మ కొంచెం కంగారుపడింది.

 

    "అమ్మాయి చదువుకోవడం నాకు ఇష్టంలేదా? మీ ఇష్టానికి ఎన్నడయినా ఎదురుచెప్పానా?" అన్నది సరస్వతమ్మ.

 

    "ఆకలేస్తుంది. అన్నం పెట్టమ్మా!" అంటూ సునంద వరండాలోకి రావడంతో వారి సంభాషణ అంతటితో ఆగిపోయింది.

    
                                             3


    "అమ్మాయ్! ఆలస్యం ఎందుకమ్మా? త్వరగా తెమిలిరా! బండికి టైం అవుతోంది" ఒకచేత్తో తాటాకు బుట్టా, రెండోచేత్తో ఉగ్గం కట్టిన నేతి తెపాళా పట్టుకొని వసారాలో నిల్చున్న ధర్మయ్య కూతుర్ని హెచ్చరించాడు.

 

    "వచ్చేస్తున్నా నాన్నా!" అంటూ చిన్న ట్రంకుపెట్టె చేత్తో పట్టుకుని వసారాలోకి వచ్చింది సునంద.

 

    సరస్వతమ్మ కూతిరి వెనకే వచ్చింది. ఆమెకు దిగులుగా వుంది.

 

    "అమ్మా! వస్తాను!" అన్నది సునంద.

 

    "వెళ్ళొస్తా నను తల్లీ!" అన్నది తల్లి.

 

    "అలాగేనమ్మా! వెళ్ళొస్తాను" అన్నది సునంద నవ్వుతూ.

 

    "ఆరోగ్యం జాగ్రత్త. వేళకు భోజనం చెయ్యి. డబ్బుకు ఇబ్బంది పడకు."

 

    "అలాగే అమ్మా!"

 

    "పచ్చళ్ళు పెట్టాను. నెయ్యి కూడా వుంది. హాస్టల్లో కూరలు బాగా లేవని అన్నం తినకుండా వుండేవు!"

 

    "చూడమ్మా కాలేజీ పిల్లల గురించి రకరకాల కథలు వింటూంటాం. జాగ్రత్త!"

 

    "చాల్లే! అమ్మాయికి నీతులు బోధిస్తున్నావా? సునంద నా కూతురే! నా బిడ్డ పొరపాటునకూడా తప్పటడుగు వెయ్యదు. తెలిసిందా?" అన్నాడు ధర్మయ్య కూతురివంక గర్వంగా చూసుకుంటూ.

 

    "అమ్మను చెప్పనియ్ నాన్నా! అమ్మా! నువ్వు భయపడకు! నేను జాగ్రత్తగా వుంటాను" అన్నది సునంద.


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS