Previous Page Next Page 
సుడిగుండాపురం రైల్వే హాల్ట్ పేజి 3


    ఆ యువతి ముఖంలో ఇప్పుడు చిరునవ్వు కనబడుతోంది.
    "సెంట్ పర్సెంట్ కరెక్ట్!" అంది తండ్రిని సపోర్ట్ చేస్తూ.
    జగన్నాథం ముఖం మరింత ఎర్రబడిపోయింది. కర్చీఫ్ తో ముఖానికి అర్జంటుగా పట్టిన చెమటను తుడిచేసుకున్నాడు.
    "అయామ్ సారీ సర్" అన్నాడు జగన్నాథం అని భవానీశంకర్ వైపు మండిపడుతూ చూశాడు.
    "కమాన్ ఆన్సర్ మై కొశ్చన్!" అన్నాడు కసిగా.
    "ఇన్ ఫాక్ట్! ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలంటే రెండు గంటల సమయం పడుతుంది మై డియర్ సర్! కాని మీ సౌలభ్యం కోసం కేవలం నాలుగు జెనరేషన్స్ నుంచి మాత్రమే చెపుతాను. ముందు మా తాతగారు మా అమ్మమ్మ కపిలేశ్వరపురంలో పెళ్ళి చేసుకోవటం వలన అనకాపల్లిలో మా తాతగారయిన మహేశ్వరపాత్రోగారు జన్మించారు. ఆయన ఏలూరులో శివశంకరిని వివాహమహోత్సవము ద్వారా భార్యగా చేసుకొనుట వలన..."
    జగన్నాథానికి సహనం నశించిపోయింది. "వాట్ నాన్సెన్స్ యూ ఆర్ స్పీకింగ్? నేనడిగిన ప్రశ్నేమిటి- మీ సమాధానమేమిటి?" మండిపడుతూ అన్నాడు.
    "మీరడిగిన ప్రశ్నే మీకు గుర్తులేదా? వెరీ బాడ్ సర్! వెరీ బాడ్ రిమెంబరెన్స్ పవర్! బ్రహ్మాండమైన జ్ఞాపకశక్తికి హోమియోపతిలో 'కాలిఫాస్' అనే అద్భుతమైన మందుండి. బాటిల్ రూపాయిన్నర! స్థానిక పన్నులు కూడా వుండవు, వెంటనే వాడండి! వారం రోజుల్లో మీ పేరేమిటో మీరు గుర్తుపెట్టుకోగలుగుతారు. పదిహేను రోజుల్లో మీరెవరిని ఏమేం ప్రశ్నలేశారు, ఎవరెవరు ఏమేం సమాధానాలు చెప్పారో కూడా గుర్తుకొచ్చేస్తుంది. నాలుగో వారం పూర్తయ్యేసరికి రోజూ మీ ఛాంబర్ ముందు బూజు దులిపారా లేదా అనే విషయం ఠక్కున అబ్జర్ చేసేయగలుగుతారు" ప్రవాహంలా మాట్లాడాడతను.
    మార్కండేయులు ఆనందంతో పొంగిపోయాడు. "వెరీగుడ్ ఇన్ఫర్మేషన్! మిస్టర్ జగన్నాథం ముందా హోమియోపతి మందు పేరు రాసుకోండి!"
    జగన్నాథం కోపం అణచుకుంటూ "ఎస్సార్" అని మందు పేరు రాసుకున్నాడు.
    అంతవరకూ చిరునవ్వు నవ్వుతూ ఉండిపోయిన ఆ యువతీ ఇప్పుడు అతి కష్టం మీద నవ్వాపుకుంటుంది.
    "ఆల్ రైట్! మీరడిగిన ప్రశ్న గుర్తులేదన్నారు కదూ? మీరెలా వచ్చారు? అనడిగారు. అవునా?"
    ఇప్పుడు గుర్తుకొచ్చిందా? వెరీగుడ్! యూ ఆర్ ఇంప్రూవింగ్! కీపిటప్! ఇంకో వారం రోజులు నాతో గడిపారంటే చాలు! యూ విల్ బి ఎ ఫిట్ పర్సన్! మీ ప్రశ్నకు సమాధానం చెప్పాలంటే మా ఫాదర్, మదర్ వలన నేను వచ్చాను అని చెప్పవచ్చు. కానీ అది కంప్లీట్ ఆన్సర్ అవదు. మా ఫాదర్, మదర్ ఎలా వచ్చారు అని మీరు మళ్ళీ అడగవచ్చు! మీ ముఖం చూస్తుంటే ఖచ్చితంగా అడిగే ఇంటలిజెన్స్ మీకుందని అర్థమైపోతోంది."
    ఆ యువతీ ఇక నవ్వాపుకోలేక పగలబడి నవ్వేయసాగింది.
    "యూ ఆర్ రాంగ్!" అరిచాడు జగన్నాథం దొరికిందే అవకాశం అనుకుని.
    "హి ఈజ్ రైట్!" అందా యువతి జగన్నాథం మాట పూర్తవ్వనీయకుండానే.
    "అఫ్ కోర్స్! హి ఈజ్ రైట్" అన్నాడు మార్కండేయులు ప్రేమగా కూతురి వైపు చూస్తూ.
    ""ఎస్! యూ ఆర్ రైట్" అన్నాడు జగన్నాథం చేసేది లేక.
    అతనికి నిప్పుల మీద కూర్చున్నట్లుంది "వీడెవడో ఏకు మేకయిపోయాడు. ఎలాగయినా వీడిని ఇంకొక ప్రశ్నతో డింకీ కొట్టించి బయటకు గెంటెయ్యాలి" అనుకున్నాడతను.
    "నువ్వు ఎక్కి వచ్చిన మేడ మెట్లెన్ని?" అనడిగాడు స్టయిల్ గా.
    "నాకు తెలుసు! మీ రెండో ప్రశ్న ఖచ్చితంగా ఈ స్టాండర్డ్ లో వుంటుందని! ఇది మరీ నైన్ టీన్ ఫిఫ్టీస్ లో వాడి పారేసిన సబ్ స్టాండర్డ్ స్టఫ్ మైడియర్ సర్! నైన్ టీన్ నైన్ టీ వరకూ మీరు సడన్ గా ఎదగలేరని నాకు తెలుసుగానీ కనీసం నైన్ టీన్ ఎయిటీ మోడల్ కొశ్చన్ అయినా నేర్చుకోండి సర్."
    ఆ యువతి కూడా నవ్వేయసాగింది.
    "ముందు నా ప్రశ్నకు సమాధానం చెప్పు!" కసిగా అన్నాడు జగన్నాథం.
    "వెరీ శాడ్ స్టేటాఫ్ ఎఫైర్స్ సర్! ఈ రోజుల్లో సిటీల్లో మెట్లెక్కే వాళ్ళు చాలా రేర్ గా కనబడతారు బ్రదర్! ఎక్కడ చూసినా లిఫ్ట్ ల మయం అయిపోయింది బ్రదర్! ఒకవేళ పవర్ ఫెయిలయినా జనరేటర్స్ అనేవి వుంటాయి బ్రదర్! వీటిని కనుక్కుని కూడా చాలా కాలం అయ్యింది. ఈ రెండూ ఫెయిలయితేనే మెట్లు వాడతారు మైడియర్ సర్!"
    "అంటే మీరు లిఫ్ట్ లో ఫస్ట్ ఫ్లోర్ కొచ్చానంటారు?" చాలా తెలివిగా ట్రాప్ చేయాలని నిశ్చయించుకున్నాడు జగన్నాథం.
    "ఎస్ సర్!"
    "హో!"సంతోషంగా అరిచాడు జగన్నాథం "దొరికావ్! చూశారా సర్! హి ఈజే లయర్! అబద్ధాలు చెప్పే ఈ యువకుడు మనకి అవసరం లేదు."
    "అబద్ధమా? అబద్దమేమిటి మైడియర్ జంటిల్మన్! మీ బిల్డింగ్ కి అసలు లిఫ్టే లేదా?"
    "వుంది? కాని అది ఫస్ట్ ఫ్లోర్ లో ఆగదు."
    భవానీశంకర్ బిగ్గరగా నవ్వాడు.
    "వెరీ పూర్ ఇంటలిజెన్స్ సర్! ఎన్ని మందులు వాడినా అది ఇంప్రూవ్ అవటం కష్టమని నాకిప్పుడు అర్థమయిపోయింది. సాధారణంగా ఫస్ట్ ఫ్లోర్ లో దిగాల్సిన వాళ్ళందరూ సెకండ్ ఫ్లోర్ కెళ్ళి అప్పుడు మెట్లు దిగి ఫస్ట్ ఫ్లోర్ లో కొస్తారు జెంటిల్మన్! తెలివి వున్నవారెవరయినా అదే పని చేస్తారు. నేనూ అందుకే ఆ పని చేశాను."
    "వండర్ ఫుల్!" అంటూ చప్పట్లు కొట్టిందా యువతి.
    "యూ ఆర్ సెలెక్టెడ్" అన్నాడు మార్కండేయులు.
    "హో" అన్నాడు జగన్నాథం. అని అంతలోనే సర్దుకుని "ఎస్! సెలెక్టెడ్" అన్నాడు గత్యంతరంలేక.      భవానీశంకర్ ఆనందంగా కుర్చీలో నుంచి లేచి నిలబడ్డాడు. "థాంక్యూ సర్! థాంక్యూ వెరీ మచ్" అనేసి బయటకు నడిచాడు. వెళ్ళేప్పుడు ఆ యువతి తనవంకే సినిమా హీరో వంక చూసే అభిమానిలా ఆరాధనతో చూడడం గమనించాడతను.
    ఇంటర్వ్యూ అయిపోయాక మార్కండేయులు తన కూతురు ప్రతిమతో పాటు ఆఫీస్కెళుతూంటే దారిలో అడిగింది ప్రతిమ.
    "డాడీ! ఇందాక నువ్వు సెలక్టు చేసినతను ఎలా వున్నాడు?"
    "వెరీ స్మార్ట్ బేబీ!"
    "మంచి ఇంటెలిజెంట్ కూడా కదూ?"
    "కొంచమేమిటి? బ్రహ్మాండమయిన ఇంటెలిజెంట్! మన జి.యమ్. జగన్నాథాన్నే మంచినీళ్ళు తాగించేశాడంటే హాట్సాఫ్!"


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS