Previous Page Next Page 
మండు వెన్నెల పేజి 3

ఎవరు వీళ్ళంతా? ఏం జరిగిపోయింది?
ఎందుకు ఇలా మారిపోయింది ఇల్లు? అమ్మేదీ?
ఏదీ అంతుపట్టలేదు భానురేఖకి. ఎవర్నడిగినా తనవైపు వింత జంతువును చూసినట్లు చూస్తున్నారే గానీ సరైన జవాబు చెప్పడం లేదు.
కనీసం నాన్నగారొస్తేనే గానీ సంగతులు తెలియవు తనకి!
అమ్మెక్కడికెళ్ళింది?
దిగులుగా ఉంది తనకి.
నెమ్మదిగా బెడ్ రూంలోకి వెళ్ళింది భానూ.
గదిలోకి వెళ్ళగానే, అక్కడ కనిపించింది అమ్మ. బాగా చిక్కిపోయి, ఇంకెవరో మనిషి లాగా కనబడుతోంది. కానీ అమ్మ అమ్మే! తను గుర్తుపట్టలేదా ఏమిటి.
"అమ్మా!" అంది ఆర్ద్రంగా.
"అమ్మా!" అన్నట్లు ఆమె పెదవులు కూడా కదిలాయి.
దగ్గరగా వెళ్ళింది భానురేఖ. ఆమె కూడా ముందుకు నడిచి వచ్చింది.
అమ్మ కాదు! నిలువుటద్దంలో తన ప్రతిబింబం అది!
నిరాశా, విస్మయం, రెండూ ఒక్కసారిగా కలిగాయి భానురేఖకి.
తను అచ్చం అమ్మ పోలిక అంటారు అందరూ! కానీ అమ్మ అంత పొడుగు ఎలా అయింది?
నిశ్చేష్టురాలయి చూస్తూ ఉంటే, వెనక నుంచి నిశ్శబ్దంగా ఎవరో వచ్చి దగ్గర నిలబడ్డారు.
గిరుక్కున తిరిగి చూసింది భానురేఖ.
నాన్నగారు!
నాన్నగారేనా? ఇలా మారిపోయారేమిటి?
"నాన్నా!" అంది సందేహంగా. ఆమె గొంతు దుఃఖంతో వణుకుతోంది.
ఒక్కసారిగా ఆమె చుట్టూ రెండు చేతులూ వేసి దగ్గరికి హత్తుకున్నాడు రఘురాం.
"బేబీ! మై డార్లింగ్ డార్లింగ్ బేబీ!" అన్నాడు ఆమె నుదుటిని ముద్దు పెట్టుకుంటూ. అతని గొంతు గాద్గదికంగా ఉంది.
ఆయన్ని కావలించుకుని వెక్కి వెక్కి ఏడ్చింది భానురేఖ. "నాన్నా? నాకేమయింది నాన్నా?" అంది దిగులుగా.
అతను ఆప్యాయంగా ఆమె తల నిమిరాడు.
"ఏం కాలేదు స్వీటీ! ఏం కాలేదు! యూ ఆర్ ఆల్ రైట్ నౌ!"
"నిన్నంతా హాస్పిటల్ కి రాలేదేం నాన్నా! నాకెంత దిగులేసిందో తెలుసా?"
"ఊళ్ళో లేనమ్మా! నీకు మెలకువ వచ్చిందని తెలియగానే ఢిల్లీ నుంచి ఫ్లయిట్ లో వచ్చేశాను తల్లీ!"
"అమెరికా నుంచి ఆరోజు ఫ్లయిట్ లోనే మీరు వచ్చారా నాన్నా?"
"వచ్చాను స్వీటీ?"
"అమ్మేది?"
అతను మాట్లాడకుండా తల పక్కకి తిప్పుకున్నాడు.
భానురేఖే అంది మళ్ళీ. "నాకు తెలుసు నాన్నా! అమ్మ ఎక్కడికెళ్ళిందో! అరుణ కొనుక్కున్న కేన్వాస్ బ్యాగ్ లాంటిది నాకూ కావాలని చెప్పాను. తేవడానికి వెళ్ళి వుంటుంది. అవునా! టెన్త్ న మా స్కూల్ రీ ఓపెనింగ్ నాన్నా! అప్పటికి నా జ్వరం పూర్తిగా తగ్గిపోతుందా. ఈసారి పబ్లిక్ ఎగ్జామ్! కామిక్సు చదవకు! క్లాస్ బుక్స్ చదివి బెస్టు స్టూడెంటు షీల్డు గెలుచుకో!" అని చెప్పారు నాన్నా సిస్టర్ కేథరిన్! ఈ సంవత్సరం నేను చాలా బిజీ!"
తన కళ్ళలోని నీటి పొర కూతురికి కనబడి పోతుందేమో అని భయపడ్డాడు రఘురాం.
సిస్టర్ కేథరిన్ రిటైర్ అయిపోయి నాలుగేళ్ళవుతోందని, తల్లి సుమిత్ర ఆ యాక్సిడెంటులో చనిపోయి ఎనిమిదేళ్ళవుతోందనీ, అప్పటి నుండి కోమాలో వుండిపోయిన తన భానురేఖ కోసమే తను విలాసినిని మళ్ళీ పెళ్ళి చేసుకున్నాననీ ఈ చిన్నారి తల్లికి ఎలా చెప్పడం?
హఠాత్తుగా గుర్తొచ్చినట్లు అడిగింది భానురేఖ "నాన్నా! వేరీజ్ పింకీ?"
రఘురాం మొహం వికసించింది.
"పింకీని చూశావా నువ్వు?" అన్నాడు ఆనందంగా.
"చూడదమేమిటి? పింకీ ఈజ్ మై ఫేవరెట్!"
ఉత్సాహంగా, పింకీ! పింకీ!" అని పిలిచాడు రఘురాం.
వెంటనే ఒక ఏడేళ్ళ పిల్ల గదిలోకి వచ్చి, రఘురాంని ఆనుకుని నిలబడి, భానురేఖని చిత్రంగా చూడడం మొదలెట్టింది.
ఆ అమ్మాయిని చూడగానే డిసప్పాయింట్ అయినట్లు మొహం పెట్టింది భానూ. "నాన్నా! దిసీజ్ నాట్ పింకీ!" అంది గొంతుతో.
పింకీకి కోపం వచ్చింది. "నేనే పింకీని! నువ్వు మంకీవి!" అంది బుంగమూతి పెట్టి.
సపోర్టు కోసం అన్నట్లు తండ్రివైపు తిరిగింది భానూ. "పింకీ అంటే నా బొమ్మ నాన్నా! మీరు చూడలేదా? నీలం కళ్ళూ, బంగారు రంగు జుట్టు..." అని ఆగి, ఆశ్చర్యంగా తండ్రి తలవైపు చూసింది. "నాన్నా! మీ కర్లింగ్ హెయిర్ ఏదీ? తిరుపతి వెళ్ళారా?"
బట్టతల తడుముకుని, ఇబ్బందిగా నవ్వి ఊరుకున్నాడు రఘురాం.
ఆశ్చర్యంగా చూస్తూ కాసేపు ఆగి, మళ్ళీ అంది భాను. "నా పింకీకి మొన్న పొద్దున నీళ్ళు పోసి కొత్త గౌను తొడిగి రేడియో మీద పెట్టాను నాన్నా! ఏమయింది మరి?"


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS