Previous Page Next Page 
బంధితుడు పేజి 3


    పద్మ చెయ్యి చాచలేదు.
    "అక్కర్లేదు. నువ్వే పెట్టుకో" విసురుగా అన్నది. పద్మ.
    సరోజ ముఖం చిన్నబుచ్చుకొని అన్నకేసి చూసింది
    "అన్నీ నువ్వే పెట్టుకో! నీకుమల్లెపూలంటే ఇష్టంగా.  నీకోసమే తెచ్చాను" అన్నాడు సత్యనారాయణ భార్య ప్రవర్తనకు వళ్ళు మండి.
    పద్మ కోపం తారాస్థాయిని అందుకొంది.
    విసవిసా లోపలకు వెళ్ళిపోయింది! పాము పుట్టలోకి పోతున్నట్టు.
    సత్యనారాయణ "అమ్మా! అమ్మా!" అని  పిలుస్తూ వంటింట్లోకి వెళ్ళాడు తల్లి దగ్గిరకు.
    "ఏం బాబూ!" అన్నది తాలింపు వేస్తూ కాంతమ్మ వెనక్కు తిరిగి చూడకుండానే.
    "ఏమిటమ్మా! ఎప్పుడు చూసినా వంటింట్లోనే వుంటావ్? అన్ని పనులు నువ్వే చెయ్యాలా ఏం? అన్నాడు బిగ్గరగా భార్య వినాలనే ఉద్దేశ్యంతో సత్యనారాయణ.
    "హూ! అన్ని పనులు ఆమే చేస్తూందా?
    తనేం చేయ్యడంలేదూ?
    తను పొద్దస్తమానం చేతులు ముందు పెట్టుకొని కూర్చుంటుందనేనా అతని అభిప్రాయం?
    పద్మ రోషంతో నిలువెల్లా దహించుకు పోయింది.
    "నేను వంటేగదరా చేస్తూంది? ఓపిక వున్నంతవరకు నా బిడ్డలకు నా చేతులుమీదుగా వండిపెట్టుకుంటేనే నాకు సంతృప్తి" నీళ్ళలోనుంచి వంకాయలు ముక్కలుతీసి పోవులో వేస్తూ అన్నది కాంతమ్మ.
    తన బిడ్డలకు  వండిపెట్టుకుంటే ఆమెకు సంతృప్తి. కాని తన బిడ్డ కాదుగా? ఆ ఇంట్లో పరాయి బిడ్డ తనేగా?
    వాళ్ళ ముగురూ ఒకటే!
    పద్మ మనసులో దుఃఖం  రోషం ఒకదాన్ని ఒకటి ఒరుచు కున్నాయ్.
    "రేపటి నుంచి వంట కూడా నేనే చేస్తాను. మీరు కూర్చోండి" అన్నది పద్మ కోపంగా.
    "అదేమిటమ్మా! నువ్వు మాత్రం చెయ్యడం లేదూ! చిన్న పనీ  పెద్ద పనీ! నాకు ఓపిక వుందిగా ఇంకా? ఆ తర్వాత ఎటూ ఈ ఇంటి చాకిరీ నీకు తప్పదు" అన్నది కాంతమ్మ శాంతంగా.
    "నేను ఈ ఇంటికి వచ్చింది చాకిరీ చెయ్యడానికేగా! రేపట్నుంచి మీరు వంటింట్లోకి రాకండి. పాపం మీ అబ్బాయి చూడ లేకుండా వున్నారు మీరు కష్టపడటం?" వ్యంగ్యంగా అన్నది పద్మ.
    "అదేమితమ్మా అట్లా అంటావ్? నువ్వు ఇంటి కోడలివి, మహాలక్ష్మివి?"
    "హూ! మహాలక్ష్మి?" గొణుక్కుంటూ గదిలోకి వెళ్ళిపోయింది పద్మ.
    సత్యనారాయణ పద్మ వెనకే గదిలోనికి వచ్చాడు. భార్యప్రవర్తన అతనికి బొత్తిగా నచ్చలేదు.
    "నువ్వు పువ్వులెందుకు తీసుకోలేదూ!" కొంచెం తీవ్రంగానే అడిగాడు సత్యనారాయణ.
    ఓ క్షణం భర్త ముఖంలోకి నిరసనగా చూసింది పద్మ. ఆ తర్వాత కసిగా అన్నది.
    "నేను ముష్టి పూలకు మొహం వాచిలేను. కావాలంటే నేను కొనుక్కోగలను. నీకోసం మీరేమీ కొనక్కర్లేదు?"
    "అవును? మీ పుట్టింటివాళ్ళు శ్రీమంతులుగా? పదిమైళ్ళుకూడా లేదు మీ ఊరు. మీనాన్నకు రోజూ పూలు పంపంచమని రాయి! మనిషిచేత"
    "రాస్తే అలాగే పంపిస్తారు! నా మొగుడికి పూలుకొనే శక్తిలేదు నాన్నా? నాకు పూలు పంపిస్తాడు మా నాన్న" గర్వంగా అన్నది పద్మ. మెడ పైకి ఎత్తి.
    "పద్మా!?" గట్టిగాఅరిచాడు సత్యనారాయణ.
    "ఏం ?ఎందుకు అంతగా అరుస్తారు? మీరన్న మాటేగా? ఇంకెప్పుడూ నా పుట్టింటి ఊసు ఎత్తకండి!" అంతకంటే కోపంగా అన్నది పద్మ.
    సత్యనారాయణ భార్య ముఖంలోకి చూశాడు.
    "మీకు నన్ను పోషించడం చేతకాకపోతే చెప్పేయండి రేపే వెళ్ళిపోతాను" రెట్టిస్తూ అన్నది పద్మ.
    "పద్మా! ఆపై మాటలు పెగల్లేదు సత్యనారాయణ కంఠంనుంచి. కోపంతో ఊగిపోయాడు.
    "ఏం" అన్నట్టు తలెత్తి నిటారుగా నిల్చింది పద్మ.
    "అసలు నీ యేడుపంతా ఎందుకో నాకు తెలుసు.  పూలు తెచ్చి ముందుగా సరోజకు ఇచ్చాననేగా? అది చిన్నపిల్ల! దాన్ని వదిలేసి నీకివ్వమంటావా? పెళ్ళాం వచ్చిన తెల్లవారే తల్లినీ, చేల్లెల్నీ మర్చిపోయే మగ వాణ్నికాదు నేను."
    "నేరే చెప్పాలా? చూస్తూనే వున్నాగా! అమ్మ కొంగుపట్టుకు తిరిగేనీకు పెళ్ళాంకూడా ఎందుకో?" కోపంతో పిచ్చిదానిలా అరిచింది పద్మ.
    "పద్మా!" సత్యనారాయాణ కంఠం కటువుగా ఉంది.
    చెయ్యి గాలిలోకి లేచి ఆగిపోయింది, భార్య రూపం చూసి.
    "ఏం, ఆగిపోయారేం ? కొట్టండి" బుసకొట్టింది పద్మ.
     నిటారుగా నిలబడి అభిమానంతో, కోపంతో బుసలు కొడుతున్న భార్యముందు నిలబడలేకపోయాడు సత్యనారాయణ.
    గబగబా బయటికి వెళ్ళిపోయాడు. తల్లి వెనుకనుంచి పిలుస్తున్నా వినిపించుకోలేదు.
    చల్లనిగాలి వీస్తూంది. దూరంగా రేడియోలో 'లతా మంగేష్కర్' పాట వినిపిస్తోంది. పార్కు బెంచీమీద కూర్చోనివున్న సత్యనారాయణలో ఉద్రేకం తగ్గింది.
    ఛ! ఏమిటి తను యిలా ప్రవర్తిస్తున్నాడు? ఇవ్వాళ మరీ ఉద్రేక పడ్డాడు.
    పద్మకు అభిమానం యెక్కువ. తనే అనవసరంగా రెచ్చగోడ్తున్నాడేమో? తనకు మాత్రం పద్మంటే  ప్రేమ లేదూ? పద్మకు మాత్రం తనమీద ప్రేమలేదూ? కాని యెందుకు ఇద్దరిమధ్య దూరం రోజురోజుకు పెరిగిపోతోంది? ఎక్కుడుంది లోపం?
    తన  ప్రవర్తనలోనేనా? పద్మ తననుండి ఏంకోరుతుంది? తను తన తల్లితో, చెల్లెలుతో కలిసి వుండటం పద్మకు ఇష్టంలేదా?
    పెళ్ళికాగానే భర్తమీద సర్వహక్కులూ  తమకే చెందాలని కోరుకుంటారు భార్యలు.
    చిన్నప్పటినుంచి కని పెంచిన వాళ్ళమీద అభిమానంగా వుండటాన్ని కూడా భరించలేదు.
    మళ్ళీ వాళ్ళు మాత్రం పుట్టింటిమీద ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. ఒక ఇంటి కోడలు తను మరో ఇంటికి కూతుర్ని అనే విషయాన్ని విస్మరిస్తోంది. ఇంట్లో మొగుడికి సంబందించిన వాళ్ళెవరూ వుండకూడదు. ఆ మూడుముళ్ళూ వెయ్యగానే మొగుడు తనకు  బానిస పత్రం రాసి ఇచ్చినట్టే అనుకుంటుంది పెళ్ళాం!
    తల్లిదండ్రులు బిడ్డల్ని పెంచుతూ ఎన్ని కలలు కంటారు?
    తన కొడుకు గురించి పద్మ ఎన్నెన్ని ఊహించుకోవడం లేదు? ఇప్పటినుంచే?
    వాణ్ని పెద్ద డాక్టర్ను చెయ్యాలనీ, అందమయిన కోడల్ని తెచ్చుకావాలనీ యిప్పటినించే, నిండా వాడికి పదినెలలు నిండలేదు, కలలు కంటూంది.
    ఆమధ్య వొక రచయిత్రి రాసిన నవల చదవమని  తన ప్రాణం తీసింది.
    అందులోని కథానాయిక చదువుకుంది. తన అత్తమామలు ఆమె దృష్టిలో మూర్ఖులు. మూఢ నమ్మకాలు కలవాళ్ళు. వాళ్ళనీడ తన పిల్లలమీద పడుతుందని ఆమె భయం. కాని వాళ్ళు పెంచిన తన భర్త మళ్ళీ చాలా సంస్కారం కలవాడనే ఆమె అభిప్రాయం. సంవత్సరానికి ఒకసారి తోడలుట్టినవాళ్ళు రావడంకూడా ఆమె దృష్టిలో అపరాధమే.


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS