Previous Page Next Page 
డెత్ సెల్ పేజి 2


    "ఎంతలో ?"
    సురేష్ తులసి వంక చూశాడు. తులసి ఓ క్షణం ఆలోచించింది.
    "వెల్........రెండు వందల్లోపల"
    "అల్ రైట్! పాతిక రూపాయలు రిజిస్ట్రేషన్ ఫీజ్ కట్టండి.
    'అంటే మీరు చుపబోయే ఇల్లు మా పేర రిజిస్ట్రేషన్ చేస్తారా?"
    "అది కాదు....." తడబడుతూ అన్నాడతను.
    తులసి పాతిక రూపాయలు యిచ్చేసింది.
    ఓ రిజిస్టర్ తీసి "తమ పేరు?" అడిగాడతను.
    "సురేష్"
    "చిరునామా?"
    "చిరునామా వుంటే ఈ పాతిక రూపాయలతో సినిమా కెళ్ళేవాళ్ళం" అతని మాటలకు తులసికి నవ్వాగలేదు.
    "ప్రస్తుతం వుండటం, ఏం చేస్తుంటారు?"
    కేరాఫ్ పుట్ పాత్! పగలయితే సరదాగా కబుర్లు చెప్పుకుంటాం.రాత్రుళ్ళయితే " అతని మాటలు వింటూనే ముసలతను ముఖానికి పట్టిన చెమట తుడుచుకున్నాడు.
    "సురేష్" అంది తులసి కోపంగా.
    "ఎన్ని గదుల ఇల్లయితే సరిపోతుంది?"
    "కనీసం పాతిక గదులుండాలి......"
    తులసి కల్పించుకుంది చప్పున.
    "ఒక గది , కిచెన్ వుంటే చాలు."
    "ఏ ఏరియాల్లో?"
    "బంజారాహిల్స్ , జూబ్లీహిల్స్, రెడ్ హిల్స్......"
    తులసి అందుకుంది మళ్ళీ.
    "ఎక్కడయినా ఫర్లేదు. మరీ ఊరి బయట కాకుండా వుంటే చాలు."
    "మీరెంతమంది మెంబర్స్?"
    "మేమిద్దరమే" మళ్ళీ జవాబిచ్చాడతను.
    "భార్యా భర్తలా?"
    "కాదు గానీ వాళ్ళిద్దరి మధ్యా వుండాల్సినవన్నీ వున్నాయ్......."
    తులసి అతని భుజం మీద లాగి కొట్టింది.
    "ఇంకా పెళ్ళి కాలేదు" అంది సిగ్గుపదతూ.
    "మరి ఒకే ఇంట్లో ఎలా వుంటారు?"
    "ఒకే బెడ్ మీద" అన్నాడతను.
    తులసి అతి కష్టం మీద నవ్వాపుకుని అతని వైపు కోపంగా చూసింది.
    "సురేష్"
    "ఓ.కె, ఓ.కె !" అన్నాడతను.
    "సరే! ఓ పని చేయండి. ఆ ఇంటావిడ అడిగితే పెళ్ళి కాలేదని చెప్పకండి." అన్నాడతను. "అలా చెప్తే మీకెవరూ ఇల్లివ్వరూ."
    "పెళ్ళి అంటే అంత యిష్టమా ఆవిడకు?"
    అతని మాటలు ముసలాయన వినిపించుకోలేదు.
    "మీకో ఇంటి అడ్రస్ యిస్తాను. వెళ్ళి ఓనర్ గంగాభవానీని కాల్సుకుని నేను పంపించానని చెప్పండి."
    "గంగా తేరీ పానీ మైలీ........."
    "ఆ ఇల్లు మీకు నచ్చినట్లయితే ఓ నెల అద్దె ఫీజుగా యివ్వాలి."
    "మీకేందుకివ్వాలి?" అడిగాడు సురేష్.
    "అది మా ఏజన్సీ రూల్"
    అనేసి ఓ కాగితం మీద ఇంటి ఓనర్ కి ఉత్తరం రాయసాగాడు.
    "ఈ లెటర్ తెచ్చినవారు నాకు గత అయిదు సంవత్సరాలుగా బాగా తెలుసు. ఎంతో మర్యాద గల కుటుంబంకి చెందినవారు. చాలా మంచితనం, నీతి , నిజాయితీ, ధర్మం, జాలి మొదలైన గుణాలు కలవారు. కనుక వీరికి........."
    'ఇంకోటి కూడా రాయండి" అన్నాడు సురేష్.
    "ఏమిటది?"
    "ఇద్దరూ ఇంట్లో ఎక్కువసేపు వళ్ళు దాచుకోకుండా కష్టపడతారని" తులసికి ఎంత ప్రయత్నించినా నవ్వాగలేదు. ముసలాయన చిరాగ్గా చుశాడతని వైపు.
    ఉత్తరం మడచి కవర్లో పెట్టి పైన అడ్రస్ రాసి సురేష్ కిచ్చాడు.
    "ఏ సంగతి మళ్ళీ రేపు చెప్పాలి."
    "ఓ.కె!"
    ఇద్దరూ బయటికొచ్చారు.
    "నువ్వెళ్ళి ఈ ఇల్లు మాట్లాడిరా. నేను మా ఫ్రెండ్ విజయతో వెళ్ళి వాళ్ళింటి దగ్గర ఓ ఇల్లు ఖాళీగా ఉందిట, చూచి వస్తాను."
    "విజయంటే ఆ 28-22- 24 అమ్మాయా?"
    తులసి కోపంగా వెళ్ళిపోబోయింది.
    "ఓ.కే........ఓ.కె." మళ్ళీ నిన్నెప్పుడు కలుసుకోవాలి?"
    "రేపు సాయంత్రం- అయిదున్నరకు అదే చౌరస్తాలో వెయిట్ చెయ్."
    "ఇవాళ రాత్రికోసారి అలా యూనివర్శిటి లాండ్ స్కేప్ గార్డెన్ కెళ్దామా?"
    "నేన్రాను - మొన్నరాత్రి వాళ్ళెవరో మనల్ని అలా చూచినందుకె నేను తలెత్తుకోలేకుండా వున్నాను."
    "అందుకే అసలు తలెత్తకూడదని చెప్పాను ముందే."
    "హలో" అందో గొంతు ముద్దగా.
    ఇద్దరూ ఆ గొంతు వైపు చూశారు.
    "హలో హలో హలో సురేష్........లాంగ్ లాంగ్ టైమ్ లాంగ్ లాంగ్ టైమ్ , అన్నాడతను ఆనందంగా.
    సురేష్ ఆప్యాయంగా అతని చేయి పట్టుకున్నాడు.
    "ఓరి డార్క్ డెవిల్! నువ్వా?"
    "అవును! సేమ్ ఓల్ డార్క్ డెవిల్! లాంగ్ లాంగ్ టైమ్ ..........లాంగ్ లాంగ్ టైమ్" తూలుతూ అన్నాడు డార్క్ డెవిల్.


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS