Previous Page Next Page 
నిశ్శబ్దం-నీకూ-నాకూ మధ్య పేజి 2


    చేతిలో కూలింగ్ గ్లాసు, నుదుటిమీదకు పడే జుట్టు. గళ్ళ బుష్ షర్టు.

    షార్పైనవాడు, హుషారైనవాడు.

    "సారీ.... ఇవ్వను."

    ఆరెస్బా మొహంలో నిరాశా కనబడలేదు. "అలా అంటావని తెలుసనుకో. అడిగినప్పుడెప్పుడిచ్చేవు గనుక! కానీ గురూ! నీ అంత పెద్దిల్లు-నీ అంత డీసెన్సీ నాకుంటే."

    "ఏం చేసేవాడివి".

    చంద్రం మధ్యలో కల్పించుకుంటూ, "ముందు ఈవీధిలో అమ్మాయిలూ- తరువాత ప్రక్కవీధులూ - ఆ తర్వాత ఇంకో వార్డు" చంద్రం మాట పూర్తవలేదు.

    ఆరెస్బా నవ్వి "బాగా చెప్పావు. అదే మరి లైఫంటే. బైదిబై వెళ్ళొస్తాను గురూ" అంటూ ఎంత స్పీడుగా వచ్చేడో అంత తొందరగా వెళ్ళిపోబోయి-ఏదో మాగ్నెట్ తగిలిన వాడిలా ఆగి "రెండిళ్ళవతల మేడమీద ఎవరో అమ్మాయి నిన్నే చూస్తుంది. కంగ్రాట్యులేషన్స్. బెస్ట్ ఆఫ్ లక్" అని మెట్లుదిగి వెళ్ళిపోయాడు.

    చంద్రం, మిత్ర తల తిప్పేసరికి, అప్పటివరకూ చూస్తున్న అమ్మాయి మరోవైపుకు తిరిగిపోయింది. ఇద్దరూ మొహాలు చూసుకొన్నారు.

    చాలాసేపు నిశ్శబ్దం.

    ఏడు కావస్తూంది.

    రోడ్డు అంత రష్ గా లేదు. దూరంగా ఎక్కణ్ణుంచో మెహదీహసన్ గజల్ వినిపిస్తూంది. శంభుమిత్ర పార్కువైపు చూసేడు.

    'అదే పొద'. పొద వెనుక 'అదే జంట'. దాదాపు మూడు నెలల్నుంచీ అతడు చూస్తున్నాడు. సరీగ్గా అయిదున్నరకి వాళ్ళు అక్కడ చేరుకుంటారు. ఏడు ఏడుంబావు వరకు మాట్లాడుకుంటారు. నారోకట్ పాంటు వేసుకుంటాడు అతడు. ఆ అమ్మాయి ఆఫీసు నుంచి సరాసరి ఇక్కడికే వచ్చేస్తుందనుకొంటా. ఒక పెద్ద సైజు హాండ్ బాగ్ ఆమె ప్రక్కన వుంటుంది ఎప్పుడూ.

    ఆమె చెప్తోంది. అతను వింటున్నాడు.

    అతను చెబ్తున్నాడు. ఆమె వింటోంది.

    మూడు నెలల్నుంచీ.

    రెండు గంటలపాటూ, అంటే నూట ఎనభై గంటలపాటూ వాళ్ళేం మాట్లాడుకుంటున్నారు?

    మిత్ర చూస్తూ వుండగానే ఆ జంట లేచి నిలబడ్డది. బైటకొస్తూ, ఇద్దరూ ఒకరికొకరు తెలియనట్టు విడిపోయేరు.

    అతడు కదలకుండా నిలబడ్డాడు.

    చీకట్లు ముసురుకొంటున్నాయి.

    ఆడపిల్లలు పదహారు నుంచి పద్దెనిమిది వరకూ, మొగపిల్లలు ఇరవై నుంచి ఇరవై నాలుగు వరకూ, ఒంటరితనంతో బాధ పడ్తారని ఎవరో సైకాలజిస్టు అన్నాడు. ఆ బాధేమీ లేకుండానే అతడు ఆ అవస్థని దాటేసేడు. ఒక్కడే కొడుకు అవటంవల్ల, ఆ వంటరితనం అతడికి చిన్నతనం నుంచే వచ్చింది. అయితే సితారు, పుస్తకాలూ అతడికి స్నేహితులయ్యేక ఇంక దేని అవసరం లేకపోయింది.

    కానీ ఇప్పుడు - ఇరవై నాలుగు వయసు సరిహద్దు దాటబోతున్న సమయంలో- తన ఇంటి ఎదురుగా వున్న పార్కు అతడికో చిక్కుతెచ్చిపెట్టింది. ఒక ప్రశ్న..... చాలా చిన్నది.... ఎవరికైనా చెబితే నవ్వొచ్చేది. అతడిని కలవరబెడ్తోంది.

    "నేనిచ్చిన పుస్తకం చదివేసేవా?"

    "ఏదీ!" అడిగేడు మిత్ర.

    "వేలీ ఆఫ్ డాల్స్"

    లేదన్నట్టూ తలూపుతూ "సగం చదివేసరికి మనసంతా అదోలా అయిపోయింది. పూర్తి చెయ్యలేకపోయేను" అన్నాడు.

    కొంచెం సేపు మౌనం.

    శంభు అడుగుదామా వద్దా అన్నట్టూ సంశయిస్తూ- "నేనొకటి అడుగుతాను. ఏమీ అనుకోవుగా" అన్నాడు.

    "అనుకోవడానికి ఏముంది- అడుగు."

    "ఏమీ అనుకోకూడదు."

    చంద్రశేఖర్ విస్మయంతో "ఏమిటదీ?" అన్నాడు.

    తటపటాయిస్తూ "ఏమీ అనుకోకూడదు. నవ్వుకోకూడదు కూడా" అన్నాడు.

    "సస్పెన్స్ లో పెట్టక అడుగు."

    "మరి.... మరి" ఆగేడు. "అమ్మాయీ అబ్బాయీ కలుసుకున్నప్పుడల్లా ఏం మాట్లాడుకొంటారు? మొదట ఏమిటి? తరువాత్తరువాతేమిటి?"


                                                                  *    *    *


    ఈ ప్రశ్న అడుగుతున్న సమయానికి చంద్రం పిట్టగోడ దగ్గిర నిలబడి ఉన్నాడు. ఉప్పెనలా లోపల్నుంచి నవ్వు తన్నుకు రావడంతో ముందుకు వంగి గోడని పట్టుకొని నవ్వసాగేడు. ఎంత ఆపుకొందామన్నా నవ్వు ఆగకపోవటంతో, ఇక ఆ గోడకే ఆనుకొని కాళ్ళు బార్లా చాపి నవ్వసాగేడు.

    మిత్ర ఉక్రోషంతో అతణ్ణి చూడసాగేడు. అసలే ఎర్రటి కపోలాలు మరింత ఎర్రబడ్డాయి.

    మేడమీద వినిపిస్తున్న నవ్వులకి వంటవాడు పైకి వచ్చేడు. చంద్రం అతణ్ణి చూసి మరింత నవ్వుతూ- "ఏం హరిదా? నువ్వూ, నీ ప్రియురాలూ మొదటిసారి ఏం మాట్లాడుకున్నారు?" అన్నాడు. హరిదా ప్రశ్న అర్ధం కానట్లు చూసేడు.

    శంభు కల్పించుకుని, "నువ్వు లోపలికి వెళ్ళు" అని అతణ్ణి పంపించి, చంద్రం వైపు తిరిగి- "నేను ముందే చెప్పాను. నవ్వకూడదని. ఇలా అయితే అసలు అడక్కపోదునుగా" అన్నాడు ఉక్రోషంగా.

    చంద్రం మాత్రం ఆయాసం వచ్చేవరకూ నవ్వి, "జోక్ ఆఫ్ ది డే...." అన్నాడు రొప్పుతూ. "నాకు వ్రాయటం రాదు కానీ లేకపోతే దీనిమీద ఒక కథ వ్రాద్దును."

    మాట మార్చకపోతే ఇక ఎగతాళి ఆపడని, "మంచి సినిమాలేం వున్నాయి?" అని అడిగేడు.

    సినిమా అనేసరికి చంద్రం దేన్నైనా మర్చిపోతాడు.

    "వన్ ఫ్లూ ఓవర్ ది కకూస్ నెస్ట్."

    "పద పోదాం" అంటూ లేచాడు. రోడ్డు మీదంతా ఈ ప్రశ్న జ్ఞాపకం వచ్చి చంద్రం నవ్వుతూనే వున్నాడు.


                         *    *    *


    స్నేహితులిద్దరూ హాలు చేరుకునేసరికి తొమ్మిదింపావు అయింది. జనం ఆట్టే లేరు.

    శంభు టిక్కెట్లు తీసుకుంటూ వుండగా, "హాయ్ శేఖర్-" అన్న ఆడపిల్ల కంఠం వినిపించింది.

    "చచ్చాంరా బాబూ" అనుకున్నాడు శంభు వెనక్కి తిరక్కుండానే. ఈ ఊరు కాలేజీ అమ్మాయిలలో యాభై శాతం వాడికి తెలిసినవాళ్ళే.

    "హాయ్ జయా" అన్నాడు చంద్రం.

    మిత్ర టిక్కెట్లు తీసుకొని వాళ్ళదగ్గర కెళ్ళాడు.

    ఆ జయ అనబడే అమ్మాయి స్నేహితురాల్తో కలిసి సినిమాకి వచ్చింది. వీళ్ళని గూండాల బారినుంచి, పోలీసుల బారినుంచి రక్షించడానికి అన్నట్టు ఒక పదేళ్ళ కుర్రవాడు అక్కచెయ్యి పట్టుకుని నిలబడి వున్నాడు. జయ స్నేహితురాలు బెల్ బాటమ్ లో వుంది. ముందునుంచి మొగవాడిలా, వెనకనుంచి మధ్యస్థంగా వుంది.

    "మీట్ మై ఫ్రెండ్ శంభుమిత్ర" అంటూ పరిచయాలయ్యేయి.

    మంచి సినిమా కాబట్టి జనం ఆట్టేలేరు. ఎక్కడైనా ఇద్దరమ్మాయిల్లో ఒకమ్మాయికి స్నేహితుడు కనబడితే, రెండో అమ్మాయి అకస్మాత్తుగా మితభాషిణి అయిపోతుంది. ఎక్కడలేని రిజర్వ్ డ్ నెస్సూ తెచ్చిపెట్టుకొంటుంది.

    అలాగే తెచ్చుకుంది జయ తాలూకు స్నేహితురాలు. చాలా గంభీరంగా చుట్టూ వున్న మనుషుల్నీ, వాళ్ళ స్వభావాల్నీ పరిశీలించసాగింది.

    చంద్రం అతిధిమర్యాదల హడావుడిలో వుండి కూల్ డ్రింక్స్ అవీ ఇప్పిస్తున్నాడు.

    ఏం చెయ్యటానికి తోచనది ఒక శంభూకే.

    అతణ్ణి రక్షించటానికా అన్నట్టు బెల్ మ్రోగింది. అందరూ లోపలికి వెళ్ళారు.

    చంద్రం, శంభు, జయ, మధ్యస్థం అమ్మాయి, ఆమె తమ్ముడూ కూర్చున్నారు.

    సినిమా మొదలైంది.

    అయిదు నిమిషాల్లోనే అది మామూలు సినిమా కాదని శంభు గ్రహించాడు. సింబాలిక్ గా చూపిస్తున్న దర్శకుడి మేధస్సు అంచనా వేస్తూ అందులో లీనమై పోయాడు.

    గొప్ప విప్లవానికి నిదర్శనంగా వాటర్ టాంక్ ని కదల్చటానికి జాక్ నికల్సన్ ప్రయత్నం చేస్తున్నాడు. ప్రేక్షకులు ఊపిరి బిగపట్టి చూస్తున్నారు. హాలులో సూదిపడితే వినపడేటంత నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దంలో నుంచి ప్రక్కసీట్లోనుంచి జయా, చంద్రం.

    ".... తేనీ.... సెకం నిమాలకో....దుకుం....ది?

    "బాగా....లిగా.....ది కదూం....దుకని....రదాని.... కిద్దాను.....చి"

    "....నీ ....ఐయామ్- ట్?"

    ".....రి....నువ్వు....క చెయ్యి.... రగా....బ్బా"

    "నీ....లా.... దాన్నే....ద్దు"

    "చె....తి....జు"

    "ఆ....గో....ళ్ళీ"

    "ఇది....లా....అయి.... నే....వే....తానం...."

    "నువ్వె.... తే....నే....తోవ....చ్చే తే"

    మిత్ర ముళ్ళమీద కూర్చున్నట్లు ఇబ్బందిగా కదిలాడు. సినిమా మీద ఏకాగ్రత కుదర్లేదు. ఇద్దరి నాయికలూ కత్తిరిచ్చేస్తే బావుణ్ణు.

    ఇంటర్వెల్ అయింది.

    మళ్ళీ పాప్ కారిన్ లు.

    మధ్యస్థం అమ్మాయికూడా నిశ్శబ్దాన్ని ఛేదించింది. చంద్రం సవ్యసాచిలా జోకుల బాణాల్ని వదులుతున్నాడు. ముగ్గురూ నవ్వుతూ మాట్లాడుకుంటున్నారు.

    తనలో ఏదో కృంగిపోతున్న భావన.

    మళ్ళీ సినిమా మొదలైంది.

    సైడ్ హీరో నత్తివాడు. జారిపోయిన పాంటు, ఏదో చెప్పాలన్న తపన. ఏం చెప్పించాలో మాటల రచయితకీ, దర్శకుడికీ తోచలేదులా వుంది. నటుడు నటనతో, నత్తి నత్తి మాటలతో- మాటలో ఇమడలేని భావాన్ని- బైటకు రాలేని భావాన్ని- లోపలే కొట్టుకొని - మెడ తెగ్గోసుకుంటే.

    రక్తం.

    పిక్చర్ పూర్తయ్యేసరికి మనసంతా వికలమయింది.

    "ఇంటివరకూ వచ్చి దిగబెట్టనా" చంద్రం అడుగుతున్నాడు.

    "ఊహూ. అక్కర్లేదు, వెళ్ళిపోతాం".

    "గుడ్ నైట్-"

    "గుడ్ నైట్. మీ స్నేహితుడు ఏమిటి చాలా సీరియస్ టైప్ లా వుందే. గుడ్ నైట్ మునివర్యా" అంది జయ.


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS