Next Page 
దావాగ్ని  పేజి 1


                                                దావాగ్ని

 

                                                        -మైనంపాటి భాస్కర్          

 

                             

 

    వెలుగుని వెంటబెట్టుకుని వెళ్ళిపోతున్నాడు సూర్యుడు.

 

    తెరలు తెరలుగా ఆవరించుకుంటోంది చీకటి.

 

    నిర్జనంగా ఉంది ఆ రోడ్డు. రోడ్డుకి ఓ పక్కగా నిలబడి ఉంది ఒక కారు దాని టాంకులోంచి పెట్రోలు కారిపోతోంది. ఒకచోట మడుగు కట్టి ఉంది ఆయిల్.

 

    కారుకి కొద్ది దూరంలో నిలబడి ఉన్నాడు అతను. కారిపోతున్న పెట్రోల్ ని కారిపోయినఆయిల్ ని చూసి, భుజాలు ఎగరేసి, సిగరెట్ తీసి వెలిగించాడు.

 

    అంతలో -

 

    దూరం నుంచి మరో కారు తాలూకు ఇంజను రొద వినబడింది... అతని మొహంలో రిలీఫ్ కనబడింది.

 

    కొద్ది క్షణాలలో దగ్గరయింది రెండో కారు.

 

    అది వచ్చి, ఆగిపోయి వున్న తన కారుని సమీపించబోతూ వుండగా, తన పెదిమల మధ్య ఉన్న సిగరెట్ గట్టిగా చివరిదమ్ములాగి, రోడ్డుమీదకి విసిరేశాడు అతను.

 

    తక్షణం -

 

    ఆ ధవళకాష్టం, రోడ్డుమీద వున్న ఆయిల్ ని ప్రజ్వరిల్లజేసింది. మరుక్షణంలోనే ఆ మంటలని సమీపించిన ఆ రెండో కారు దిక్కులు పిక్కటిల్లే శబ్దంతో పేలిపోయింది.

 

    వెంటనే దానికి ప్రతిధ్వనిలా మరో ప్రేలుడు:

 

    గాలిలోకి అంతెత్తున ఎగిరి, "ధన్"మన్న శబ్దంతో తన దగ్గరలో పడిన వాటిని పరికించి చూశాడు అతను.

 

    అవి రెండు రక్తపు ముద్దల్లా ఉన్నాయి. పరీక్షగా చూస్తేనేగానీ అవి రెండు మానవ హస్తాలని తెలియడం లేదు. ఆ రెండు చేతులమధ్యా కారు స్టీరింగు వుంది.

 

    అంతే:

 

    కారులో ఆ స్టీరింగు తప్ప మిగతా భాగాలేవీ మిగలలేదు.

 

    ఆ మానవ శరీరంలో ఆ రెండు చేతులు తప్ప మరే అవయవాలూ మిగలలేదు:

 

    ఆ చేతుల్లో ఒక దానికి కంకణం ఉండటం గమనించాడు అతను - ఆ మృతుడెవరో అతనికి తెలుసు... దయాదాక్షిణ్యాలు లేని నరరూపరాక్షసుడు దుర్లబ్ సింగ్: సిఖ్ఖు తీవ్రవాది:

 

    "దారి తప్పిన సోదరుడు:" అనుకున్నాడు అతను నిర్లిప్తంగా.

 

    మనుషులని చంపడం అతనికి సరదాకాదు.

 

    కానీ అతని వృత్తిలో మనుషులని చంపడం తప్పదు

 

    తప్పు కాదు కూడా:

 

    అతనేం చేసినా తన దేశం కోసమే చేస్తాడు

 

    అతనొక ఇండియన్ ఏజెంటు :

 

    పేరు రాణా:

 

    ఎక్స్ ట్రీమిస్టు కారుతోబాటు రాణా కారు కూడా పేలిపోయింది.

 

    ఇప్పుడెవరన్నా చూసినా, విపరీతమైన  వేగంతో యెదురెదురుగా వస్తున్న రెండు కార్లు ఢీకొనడం వల్ల ఆ ప్రమాదం జరిగిందనుకుంటారు గానీ, అది కావాలని చేసిన పనని ఎవరూ వూహించలేరు.

 

    కొత్త సిగరెట్టు వెలిగించి, తృప్తిగా పొగపీల్చి, మినియేచర్ వాకీ టాకీలో మాట్లాడటం మొదలెట్టాడు రాణా:

 

                                                         *    *    *    *

 

    భారత భూభాగానికి పడమటగా, దాదాపు పదిహేను వందల కిలో మీటర్ల దూరంలో, అరేబియా సముద్రంలో వుంది చిత్రద్వేప్. ఇంకా కొంచెం ముందుకుపోతే ఆఫ్రికా ఖండం తగులుతుంది.... అటు ఆఫ్రికా ఖండం, ఇటు భారత ఉపఖండం వుండటం వల్ల ఆ ద్వీపం మీద నీగ్రోల, అరబ్ ల, భారతీయుల ప్రభావం చాలా ఎక్కువగానే వుంది... ద్వీపం మొత్తం వైశాల్యం కృష్ణాజిల్లాకంటే తక్కువే ఉంటుంది. జనాభా దాదాపు అయిదు లక్షలు. అందులో మూడు లక్షలమంది. రాతియుగంలోంచి ఇంకా బయటపడని ఆటవికులు. ద్వీపంలో ముప్పాతిక భాగాన్ని ఆక్రమించుకుని ఉన్న చిక్కటి కీకారణ్యంలో ఉంటారు వాళ్ళు. ఆ ద్వీపంలో రెండే పట్టణాలు వున్నాయి. అవి హాపీటవున్, పారడైజ్ సిటీ...: చిరకాలం క్రితం బ్రిటిష్ నావికులు ఆ ద్వీపంలో మొదటిసారిగా కాలుమోపినపుడు అక్కడి ప్రకృతి సౌందర్యానికి పరవశించిపోయి ఆ పేర్లు పెట్టారు పారడైజ్ సిటీకి వాళ్ళు మొదట్లో పెట్టిన పేరు పారడైజ్ కార్నర్. కాలక్రమేణా బ్రిటిష్ వారితోబాటు, టీ, కాఫీ తోటల్లో పనిచెయ్యడానికి వలస వెళ్ళిన ఇండియన్ కూలీలు, చైనీస్ చర్మకారులూ, నేపాలీ వాచ్ మన్ లూ, అరబ్ వర్తకులూ అందరూ అక్కడే సెటిలయిపోయి, నాలుగైదు తరాలు గడిచే సరికి జనసంఖ్య పెరిగి, పారడైజ్ కార్నర్ పారడైజ్ సిటీగా మారి ఆ ద్వీపానికి కేంద్రస్థానమయింది.                             


Next Page 

  • WRITERS
    PUBLICATIONS