Next Page 
ఒక కోయిల గుండె చప్పుడు  పేజి 1

                          ఒక కోయిల గుండె చప్పుడు
            
                                       బ్లీడింగ్ హార్ట్

                                                                                        అత్తలూరి విజయలక్ష్మీ 

    కిటికీ కున్న అద్దాల్లోంచి బైట కురుస్తున్న వర్షాన్ని తదేకంగా చూస్తూ నిల్చుంది హరిత.
    ఆమె మొహంలో ఆందోళన, అసహనం... ఓ విధమైన భయం, ఇలాంటి అనేక భావాలతో నుదుటి మీద ,ముక్కు మీద కొద్దిగా చెమట పట్టి వుంది.
    ఆమెకి చేరువలో ...మంచానికి వెనుక వైపున సర్ది వుంచిన సూట్ కేస్, అత్తగారు ఆవిడ గదిలో  గాడ నిద్రలో ఉంది.
    పనివాళ్ళంతా లోపల గదుల్లో సుఖంగా, వెచ్చగా పడుకున్నారు.
    ఇల్లంతా ...కాదు... కాదు మొత్తం భవంతి నిశ్శబ్దంగా వుంది.సరిగ్గా బయల్దేరే ముందు మొదలైంది పాడు వాన.
    ఇప్పుడిప్పుడే తగ్గేలా లేదు..
    అప్సరసల మేలిముసుగు చివర వ్రేళ్ళాడే జలతారు తీగల్లా వర్షపు ధారలు.
    వారి ముక్కున మెరుస్తున్న వజ్రపు కాంతిలా మెరుపులు, ఎక్కడో పిడుగు పడిన శబ్దం.
    హరిత ఉలిక్కిపడింది.
    వర్షం అంటే చిన్నప్పటి నుంచి విపరీతమైన భయం.
    ఇల్లంతా కురుస్తోంటే అక్కడక్కడ ప్లాస్టిక్ బకెట్లు, చిన్న చిన్న బేసిన్ లుపెట్టి అందరూ ఓ మూల ఒదిగి పడుకునే వాళ్ళు.
    అమ్మ గుండెల్లోకి ఒదిగి .... గువ్వ పిట్టలా ముడుచుకుని పడుకునేది తను. హరిత నిట్టూర్చింది . ఏం చేస్తోందో అమ్మ!
    "నువ్వన్నా సుఖపడవే.... నిన్ను వెతుక్కుంటూ వచ్చిన అదృష్టాన్ని కాలదన్నకు . డబ్బు లేకపోతె బ్రతుకంత దుర్భరంగా వుంటుందో నీకు వేరే చెప్పక్కర్లేదు కదా!
    చిన్నప్పట్నించీ ఈ ఇంట్లో దరిద్రమే చూశావు. ఇహనైనా సుఖపడు. కొంచెం వయసేక్కువే గానీకుర్రాడు బంగారం లా వున్నాడు. మంచం లో వున్న ఆ తల్లి తప్ప ఎవరూ లేరట. ఆవిడ మాత్రం ఎంతకాలం బ్రతుకుతుంది. నా మాట విని ఈ సంబంధం ఒప్పుకో, ప్రేమలు- విరహాలు అన్నం పెట్టవు . ఆ సతీష్ నిన్నేం సుఖ పెడతాడు? వాడికే ఠికానా లేదు. నా మాట విని ఈ సంబంధం ఒప్పుకో...."
    పక్కింట్లో వున్న నిరుద్యోగి సతీష్ ని ప్రేమించాను. అతన్నే చేసుకుంటానని తను అన్నప్పుడు తల్లి మాటలు గుర్తొచ్చాయి.
    నిజమే! సతీష్ కి అప్పట్లో ఉద్యోగం లేదు. ట్యూషన్లు చెప్తూ, తన భోజనానికి అవసరాలకి, సరిపడా సంపాదించుకుంటూ ఉండేవాడు.
    చాలామంది ఇరుగు పొరుగు యువతీ యువకుల్లాగే తామిద్దరూ ప్రేమించుకున్నారు. కారణం! ఒకరి రూపం ఒకరికి నచ్చో లేక అభిరుచులు ఏకమయ్యో మరేదో కాదు కేవలం దరిద్రం.... ఒకేదారిలో నడిచే బాతసరుల్లాగా....
    అర్ధాకలి కడుపు.... అటుకులు వేసిన బట్టలు.. నిరాశ నిండిన కళ్ళు , తండ్రి ప్రెస్ నుంచి తీసుకోచ్చినవేస్ట్ పేపర్ల ని పుస్తకాలుగా కుట్టుకుని వాడుకునేవాళ్ళు తనూ, అన్నయ్యలు, చెల్లాయి. చిన్నయ్య అస్తమానం నాన్న మీద అరుస్తుండేవాడు. పోషించడం చేతకాని వాళ్ళు ఎందుకు కనాలి? అంటూ నాన్న ఫ్రూఫ్ రీడర్ గా పనిచేసిన చిన్న చితకా పేపర్ల న్నీ ఏడాది, రెండేళ్ళు కుంటి నడక నడిచి మూతపడ్డాయి. అందరి చదువులు మధ్యలోనే ఆగిపోయాయి. చిన్నన్నయ్య ఇంట్లోంచి పారిపోయాడు.
    హరిత ఒళ్ళు ఒక్కసారి జలదరించింది.
    చిన్నన్నయ్య దరిద్రం భరించలేక పారిపోయాడు. కానీ...తను....?
    హరిత కళ్ళముందు ట్యూబ్ లైట్ కాంతి పది వింత సోయగాలినుతోన్న లాన్ కనిపించింది. పొడుగాటి అశోకచేట్ల మీంచి మృదువుగా ధ్వనిస్తూ పచ్చి గడ్డి మీద రాలుతున్నవర్శపు చుక్కలు. మధ్యలో ఎరుపు రంగులో సన్నని గీతలు వున్న ఆకుపచ్చని హృదయాకరపు మొక్కలు.... బ్లీడింగ్ హార్ట్.
    "ఇది నేనెంతో కష్టపడి తయారుచేసుకున్న గార్డెన్. నేను అందమైన వాటినే ఎక్కువగా కోరుకుంటాను. ఎంత కష్టమైన వాటిని పొందడానికే కృషి చేస్తాను. అందుకే  బీదదాని నైనా నీ అందం... కేవలం నీ అందం చూసి నిన్ను చేసుకున్నాను.ఈ అందమైన భవంతి.... ఇంత అందమైన గార్డెన్.... ఈ ఇంట్లో వున్న ఖరీదైన ...అందమైన ఫర్నిచర్... ముఖ్యంగా అలా చూడు ఆ క్రోటన్ నేనెంతో కష్టపడి బాగా ఖర్చు పెట్టి తెప్పించాను. ఆ క్రోటన్ ని బ్లీడింగ్ హార్ట్ అంటారు. ఈ భవంతి లోని ఏ గదిలోంచి చూసినా నా కంటికది కనిపిస్తూ వుండాలి. అచ్చం గాయపడిన హృదయం లా వుంది. మధ్యలో ఆ యెర్రని గీతలు.. రక్తపు చారల్లా వున్నాయి కదా!' మొదటి రాత్రి ....ఇదే బెడ్ రూమ్ లో ఇదే కిటికీ దగ్గర నిలుచుని కిటికీ లోంచి కనిపిస్తున్న మొక్కను చూస్తూ కృష్ణ చైతన్య అన్న మాటలు..
    బ్లీడింగ్ హార్ట్.
    ఎంత అందమైన సృష్టి !
    ఎవరు పెట్టారో ఈ పేరు .దీని ఆకుల్ని స్త్రీ హృదయానికి దర్పణంగా సృష్టించిన సృష్టి కర్త ఎంత తెలివైనవాడు!
    బ్లీడింగ్ హార్ట్...గాయపడిన హృదయం... అవును తనలాంటి ఆడదాని హృదయం...
    కేవలం ...దరిద్రమే ఓ అడ్డు గోడగా మారి, తన ప్రేమను చిన్నాభిన్నం చేస్తే... ప్రేమించిన వాడికి దూరమైన ఆడదాని హృదయం.
    ప్రేమ... అనురాగం.. లాలన.... ఈ పదాలకి నిర్వచనం తెలీని ఓ స్వార్ధపరుడికి.... భోగలాలసుడికి అయిష్టంతో భార్య అయి ఖరీదైన ఈ భవంతి లో ఓ ఖరీదైన బొమ్మగా మారిన ఈ ఆడదాని హృదయం.
    హరిత పెదాలు సన్నగా కంపించాయి. నో ఈ భవంతి లో ...ఈ నిశ్శబ్దం లో ...ఈ బంగారు పంజరం లో ఒక్క క్షణం కూడా వుండకూడదు. పారిపోవాలి ...ఎలా ?....
    వర్షం తగ్గేలా లేదు .. కుండపోతగా కురుస్తూనే ఉంది.
    బైట వర్షం శబ్దం.... మధ్య ఉరుములు తప్ప అంతటా నిశ్శబ్దం..
    ఈ భవంతిలో ఎప్పుడూ నిశ్శబ్దమే.... రాత్రీ పగలు నిశ్శబ్దమే...
    తనకీ, భర్తకీ... తనకీ అత్తగారికీ మధ్య.... అత్తగారికీ తన భర్తకీమధ్య.... పని వాళ్ళకీ యజమానురాలికీ మధ్య నిశ్శబ్దం.... అంతటా నిశ్శబ్దం . అంతులేని తన గుండె చప్పుళ్ళ అంతులేని శబ్దం తప్ప అంతా నిశ్శబ్దమే..
    రెండేసి రోజులకోసారి మొహం చూపించి వెళ్ళే భర్త.... కనుసంజ్ఞాలతో అడుగులకు మడుగులోత్తే నౌకర్లు.... చిన్న చిన్న పలకరింపులు తప్ప.... మనసు విప్పి ,మాట్లాడని అత్తగారు....
    అప్పుడప్పుడు ...అచ్చు తెలుగు సినిమాల్లో అణకువ కలిగిన కోడల్లా తను అత్తగారికి చదివి వినినిపించే రామయణం  లోని , భారత, భాగవతం లోని పద్యాలు.... లలితా సహస్ర నామాలు.... విన్న గోడలు.... వాటినే ప్రతిధ్వనిస్తుంటే ...ఆ నిశ్శబ్దం లో తన చెవుల్లో శబ్ద తరంగాలను ప్రసరిస్తుంటాయి.నిశ్శబ్దం భరించలేక తను గుర్తు చేసుకునే శబ్దాలవి ఉదయం పూట ఒక గంట రెండు గంటలు.... అత్తగారి సేవలు తప్ప మిగతా సమయం అంతా తనో మనిషిననే తనకు గుర్తుండదు.
    రూఫ్ కి వ్రేళ్ళాడే షాండియర్ లా ...ఇంటి ముందు పెంచుకున్న అందమైన గార్డెన్ లా ఇంట్లో వున్న ఖరీదైన సోఫా సెట్ లా  ... విదేశాల నుంచి తెప్పించిన అందమైన ప్లవర్ వాజ్ లా ...రంగురంగుల చేప పిల్లలతో తళుకులీనే ఎక్వేరియం లా ...ఈ అందమైన అధునాతన మైన పెద్ద భవంతిలో తనో షో పీస్.
    అందమైన గార్డెన్ లో బ్లీడింగ్ హార్ట్ లా...అతని కంటికి అందంగా అలంకరించుకుని కనిపిస్తూ .... మాట్లాడడానికి మనుషులు లేక గొంతెప్పుడో మూగపోయింది.ఎగసిపడే భావాలకు అర్ధం తెలీక గుండె ఎప్పుడో బండబారింది. స్వేచ్చ లేని కాళ్ళు, చేతులూ, చచ్చులుపడ్డాయి. అర్ధం లేని ఆలోచనలతో మనసేప్పుడో లాలిత్యం పోగొట్టు కుంది. ఇంకేం మిగిలింది తనకి!
    భార్యంటే పదిమందికీ పరిచయం చేసుకోవడానికి, పనికొచ్చే ఓ స్టేటస్ సింబలే .
    భార్యంటే , తనే సమయంలో వచ్చినా... ఏం చేసినా , ఏం మాట్లాడినా చిరునవ్వు నవ్వుతూ ప్రేమజల్లులు కురిపించే ఓ సాధనం.
    భార్యంటే.... ఈ భవంతినీ, ఈ భవంతి లోని ఆణువణువూనూ సూపర్ వైజ్ చేస్తూ వుండాల్సిన సూపర్ వైజర్.
    హరిత గుండెల్లో చెలరేగే భావాలన్నీ చిన్న చిన్న సూదులుగా మారి గుచ్చుతున్న భావన.
    పారిపోవాలి.... ఇక్కణ్ణించి పారిపోవాలి. ఇంతకన్నా మంచి అవకాశం తనకిక రాదు. కృష్ణచైతన్య గుజరాత్ నుంచి తిరిగి వచ్చేలోగా పారిపోవాలి . ఎలా ?.... వర్షం తగ్గదా? గడియారం పన్నెండు అయిన సూచనగా గంటలు కొట్టింది.... హరిత కి తల్లి గుర్తొచ్చింది. అచ్చం గడియారం లో ముల్లులా అవిశ్రాంతంగా పనులు చేస్తుంది.జ్వరం వచ్చినా జలుబు చేసినా, అలాగే తూలుతూ, ..కూర్చుంటూ , పడుకుంటూ చేసేది.
    అలా చేయడం ఆవిడ జన్మహక్కుగా పిల్లలంతా భావించారు. ఏనాడూ, ఎవరూ ఆవిడకి సాయం చేయలేదు. తనూ చేయలేదు. చదివించలేదన్న కోపంతో.... సతీష్ ని పెళ్ళి చేసుకోనివ్వలేదన్న కోపంతో.... పేదరికం అడ్డుగా పెట్టుకుని , తన బ్రతికుని.... తన మనసునీ.... ఓ ధనికుడి కి అమ్మేస్తోందన్న కోపంతో ఆవిడ మీద సానుభూతి కూడా చూపించలేదు.
    "అమ్మా! హరిత కళ్ళ నుంచి రెండుకన్నీటి చుక్కలు "ఎంత అదృష్టవంతురాలవే హరీ! ఇంత పెద్ద ఇల్లు.... ఖరీదైన చీరలు.... పెద్ద హోదా వున్న భర్త...బంగారు పూలతో పూజ చేశావో పోయిన జన్మలో...!' తల్లి మాటలు చెవుల్లో ప్రతిధ్వనించాయి."ఎందుకమ్మా ఈ చీరలు.... నగలు.... ఎందుకివ్వన్నీ ...ప్రేమానురాగాలు...ఆప్యాయత.... అభిమానం లేని ఈ ఇల్లు ఎంత అందంగా వున్నా.... కళావిహీనమే కదమ్మా.... మనిషి మనిషికీ మధ్య సాన్నిహిత్యం .... పరస్పరావగాహన లోపించిన ఇల్లు... ఇది ఇల్లు కాదమ్మా స్మశానం.."


Next Page 

  • WRITERS
    PUBLICATIONS