Next Page 
చీకటి తొలగిన రాత్రి పేజి 1


                                    చీకటి తొలగిన రాత్రి

                                                                 డి.కామేశ్వరి

                                                                  ఉదయం 11-20 అయింది. కలకత్తా నుంచి భువనేశ్వర్ ఎయిర్ పోర్టులోకి ఫోకర్ ఫ్రెండ్ షిప్ ప్లేను రాయంచలా నెమ్మదిగా క్రిందికి దిగివచ్చి లాండ్ అయింది. నేను, శాంతి, పిల్లలు రన్ వే దగ్గిరికి నడిచాం.

    గేంగ్ వే మీదనించే నన్ను చూసి మీనాక్షి చేయి వూపింది. పేసెంజర్లని తప్పించుకుని గబగబ ముందుకువచ్చి సంతోషంతో నాచేయి పట్టుకువూపేసింది. "బావా!.. అబ్బ ఎన్నాళ్ళయింది నిన్ను చూసి...పదకొండేళ్ళా. పన్నెండేళ్ళా? నీ పెళ్ళిలోనేగా మనం కలుసుకోడం" గబగబ నాకేం మాట్లాడడానికి సందీయకుండా తనే మాట్లాడేస్తుంది. ఈ లోపల మీనాక్షి భర్త పిల్లలు దగ్గిరకి వచ్చారు.
    "ఆ, బావా, ఇదుగో మా బుద్దావతారంగారు. సారీ రామావతారం గారు.." నాలిక కరుచుకుంటూ కొంటెగా అంది. "ఎప్పుడో పెళ్ళిలో చూసావు. మచిపోయివుంటావు. ఇదిగో యీ మంకీలిద్దరూ మా పిల్లలు..."
    రామావతారం "గ్లాడ్ టూ మీట్ యూ" అంటూ షేక్ హ్యాండిచ్చాడు..నేను శాంతిని, పిల్లల్ని పరిచయం చేశాను. అందరం లవుంజ్ వేపు నడిచాం. "బావ మీ ఉత్కళ దేశాన్ని చూడాలనే ఉత్కంఠతతో వచ్చాను చూశావా, బాబోయ్, ఎంత చక్కని తెలుగు మాట్లాడుతున్నానో.. అమెరికాలో పదేళ్ళుండివచ్చి తెలుగు మరిచిపోకపోవడమేకాక, ఇంత అనర్గళంగా మాట్లాడగలిగే నాకు ఓ "పద్మశ్రీ" అయినా ఇవ్వాలిగదా! పెద్ద ఛీఫ్ సెక్రటరీవేమో గవర్నమెంటుకి సిఫార్స్ చేసి ఓ "పద్మశ్రీ" పారేయించు బాగా!" గల గల నవ్వుతూ అంది.
    మీనాక్షి ఏం మారలేదు. రూపు మారింది కాస్త.. కానీ ఆ చిలిపితనం ఆ చలాకీతనం ఏం మారలేదు.. నాకు చాలా సంతోషం వేసింది.
    "నీవింకా అలాగే వున్నావన్నమాట. అమెరికా వెళ్ళొచ్చాక మారిపోయి వుంటావనుకున్నాను... నీ కొంటె మాటలు అలాగే వున్నాయి.." అంటూ చిన్నప్పతిలా నెత్తిన మొట్టడానికి నాచేయి లేచింది. గబుక్కున చేయి దించేశాను. అటు ప్రక్క రామావతారం. యిటు శాంతి!... "ఆగిపోయావేం బావా! మొట్టికాయవేయి!" అంటూ నవ్వింది మీనాక్షి, నవ్వేశాను నేను.
    లవుంజ్ లో కుర్చీలలో కూర్చున్నాం అందరం సామాను వచ్చేవరకు. పిల్లలు నలుగురూ అప్పుడే మాటలు కలిపేసి ఏవేవో మాట్లాడుకుంటున్నారు. పిల్లలిద్దరూ తల్లిలాగే తెల్లగా గోధుమరంగు జుత్తుతో టైట్ షార్ట్స్ తో బూట్సుతో అచ్చు దొరల పిల్లలలాగే వున్నారు. మాటల్లో కూడా యాంకీ యాస. అవునుమరి పుట్టడం పెరగడం అంతా అమెరికాలోనేగదా!
    రామావతారం ఏదో అమెరికా విశేషాలు, తిరిగివచ్చాక ఇండియాలో తన ఉద్యోగ విషయాలు మాట్లాడుతున్నాడు. మాటలు మధ్యలోనే ఎదురుగా శాంతి ప్రక్కన కూర్చున్న మీనాక్షిని నిశితంగా పరీక్షిస్తున్నాను నేను.
    మీనాక్షి చాలా ఆధునికంగా తయారయివుంది. పదేళ్ళపాటు విదేశాల్లో వుండడంచేతో. ఇదివరకటికంటే లావవడంచేతో బాగా రంగువచ్చి నున్నగా వుంది. నెత్తిన తట్టంత జుట్టుముడి లిప్ స్టిక్, పల్చటి విదేశీ షిఫాన్ చీర, స్లీవ్ లెస్ జాకట్టు _ నేనెరిగిన మీనాక్షి పెద్ద వాలుజడతో కాటుక కళ్ళతో, తలనిండా పూలతో వంటినిండా బట్టతో వుండేది. కాలం చాలా మార్పులు తెస్తుంది.. ఆఫ్ కోర్సు .. మీనాక్షేమిటి. అందరూ ఈనాడు ఇలాగే తయారవుతున్నారు. ఎక్కడో శాంతిలాంటివాళ్ళు తప్ప!
    లగేజ్ వచ్చింది.. అందరం కారులో యింటికి బయలుదేరాం. "బాగానేవుందే మీ భువనేశ్వర్ నీట్ గా రోడ్లూ అవి" అంది మీనాక్షి వెళుతూంటే. "బొత్తిగా అంత తక్కువ అంచనా కట్టకు ఎంతయినా ఒరిస్సా కేపిటల్ అన్నమాట మర్చిపోకు. మా వూళ్ళో వున్నవి రోడ్లూ బంగళాలే అంతకంటే ఇంకేం కనిపించవు" నవ్వుతూ అన్నాను.
    రాజ్ పాత్ మీదుగా ఏభైమైళ్ళు స్పీడులో నిక్షేపంగా వెళ్ళొచ్చు. పట్టపగలే రోడ్డుమీద మనుష్యులు కన్పించరు. భువనేశ్వర్ అదో అఫీషల్ కాలనీలా వుంటుంది.
    పది నిమిషాలలోనే బంగళా పోర్టికోలో కారాపాను. నౌకర్లు సామాను తీస్తూంటే ఇంట్లోకి ఆహ్వానించాను అందరిని. మీనాక్షి కారు దిగి ఇంట్లోకి రాకుండానే చుట్టూ పూలమొక్కలని చూసివచ్చింది. "ఎన్నాళ్ళయిందో పూలమొక్కలని, ఖాళీ జాగాని చూసి, అమెరికాలో వున్నన్ని రోజుల్లో రెండు గదుల కాపురం. కలకత్తా వచ్చాక ఫ్లాట్ టైపు ఇల్లు. మొక్కలంటే వావుపట్టుకుంది అంది." ఓ విరిసీ విరియని గులాబి తలలో పెట్టుకుంటూ...
    "రా, రా, లోపలి - ముందు కాఫీ అది తాగుదురుగాని, తోటకేం తరువాత రోజంతా కుర్చీవేసుకు అక్కడే కూర్చుందురుని." అన్నాను.
    ఇల్లంతా ఓ చుట్టూ తిరిగిచూసి వచ్చింది మీనాక్షి. డైనింగ్ టేబుల్ దగ్గర శాంతి కాఫీ కలుపుతుంది.. రామావతారం పైపు వెలిగించుకుంటున్నాడు. పిల్లలు అప్పుడే తోటలోకి పరిగెత్తారు.
    "ప్చ్ బావా! అన్యాయం ఎంత అన్యాయం జరిగింది?..." మీనాక్షి కూర్చుంటూ అదోలా కొంటెగా నవ్వుతూ అంది.
    నేను ఆశ్చర్యంగా చూశాను. రామావతారం శాంతి ఇద్దరు కూడా కాస్త ఆశ్చర్యంతో మొహాలు పెట్టారు. "అలా చూస్తావేమిటి. ఈ ఇల్లు ఈ తోటకంతటికి యజమానురాలవాల్సినదాన్ని వెధవది మూడు నాలుగు గదుల ప్లాటుల్లో కాపురం చెయ్యాల్సి రావటం అన్యాయం కాదంటావా?"
    నా మొహంలో రక్తం పొంగింది. శాంతి క్రింది పెదవి నొక్కిపట్టి కాఫీ కప్పుల్లో పోస్తూంది. రామావతారం పైపు కూరుతూ ఏకాగ్రతగా దానివైపు చూస్తున్నాడు.
    "బావా నీవు ఐ.ఎ.ఎస్. ఓ రెండేళ్ళ ముందయుంటే ఎంత బావుండేది.. ఈ బుద్ధావతారం బారినుంచి తప్పించుకునుండేదాన్ని.." చిలిపిగా మొగుడివైపు చూస్తూ అంది.
    "మీనాక్షీ!" గాభరాగా వారించాను. శ్రుతిమించిన రాగాన పడుతోంది మీనాక్షి వ్యవహారం. అతనేమన్నా అనుకుంటాడనికూడా లేనట్టుంది మీనాక్షికి.
    నా కలవరపాటుచూసి అతను నవ్వుతూ చేత్తో వారించాడు. "ఫర్వాలేదులెండి ఈవిడ సంగతి నాకేం క్రొత్తకాదు డోంట్ వర్రీ" అన్నాడు.
    శాంతి కప్పులందరికీ అందించింది. పిల్లల్ని పిలిచి బిస్కట్లు ఇచ్చింది. మీనాక్షి పిల్లలు అతి బుద్ధిమంతులులా వున్నారు. లేక విదేశీ మానర్సు బాగా వంటబట్టినట్టున్నాయి... "కెన్ వుయ్ హెవిట్ మమ్మీ" అంటూ తల్లినడిగి మరీ తీసుకున్నారు బిస్కట్లు...


Next Page 

  • WRITERS
    PUBLICATIONS