Home » kommanapalli ganapathi rao » అసావేరి
చాలా సేపటిదాకా సమీపంలో నిలబడ్డ రాజేందర్ ని గమనించనే లేదు.
కేవలం నా మూలంగా రవికిలాంటి అనర్ధం జరిగిందన్న కోపంతో బావ ముభావంగా వున్నాడని భావించిన రాజేందర్ యిక నిభాయించుకో లేకపోయాడు. "అవును....అలా ఏసిడ్ పోయించింది నేనే....కాని అలా చేసింది శంకూ కళ్ళు పోవాలని. నాకు చెందాల్సిన సావేరి మరొకరి సొత్తు కాకూడదూ అని....."
వీర్రాజులో చలనంలేదు. అసలప్పుడు ఏమిటి ఆలోచిస్తున్నదీ రాజేందర్ కి అర్ధంకావడంలేదు.
"సావేరి నా భార్య అవుతుందన్న నమ్మకం సన్నగిల్లిపోతుంటే ఇలా తొందరపడ్డాను. బావా....సావేరి లేకుండా నేను బ్రతకలేను."
"... .... ...."
"నేను...." ఇందాకటి రవి మాటలు గుర్తుకొచ్చి చాలా బాధని నటిస్తూ అన్నాడు "చిన్నతనంనుంచీ సావేరికి కాబోయే భర్తగా ఎన్ని కలలు కన్నానని....ఏమిటి నా అనర్హత...నిన్న శంకూని నిరసించిన రవి ఇప్పుడు నన్ను కాదని శంకూని సమర్ధిస్తున్నాడూ అంటే....."
"రాజూ..." అర్దోక్తిగా వాక్యాన్ని త్రుంచేశాడు వీర్రాజు. తల తిప్పిన వీర్రాజు కళ్ళల్లోకి సూటిగా చూడలేనట్లు తలవంచుకున్నాడు రాజేందర్ ఇప్పుడెలాంటి ఉపద్రవం ఎదుర్కోవాలో అర్ధం కానట్టు.
"సావేరిని తండ్రిగా నేను ఎంత ప్రేమిస్తానో తెలుసు నీకు."
రాజేందర్ లో సన్నగా వణుకు మొదలైంది.
"కాబట్టే దానిమాట కాదనలేక అది గడపదాటి బయటికెళ్ళడం యిష్టంలేకపోయినా కాలేజీలో చేర్పించాను!"
"అది నాకూ తెలుసు...."
"కానీ నీకు తెలీనిది మరోటుంది" ఈసారి వీర్రాజు కంఠం మరింత కఠినంగా మారింది. "సావేరిని ఎంత ప్రేమిస్తానూ అంటే జ్ఞానం తెలీని సావేరి బ్రతికినంతకాలం తండ్రిగా దాని సుఖసంతోషాలకి నేనే బాధ్యున్ని కావలన్నది నా తిరుగులేని సంకల్పం..
"కానీ నేను" రాజేందర్ తత్తరపడిపోతున్నాడు.
"అనర్హుడిగా నిరూపించుకున్నావు."
"బావా....!"
"అవును రాజూ! సావేరి నడవడికి సంబంధించిన అతి ముఖ్యమైన వాస్తవాల్ని దాచి నిజంగా నువ్వు అనర్హుడివైపోయావు. అందుకే నిన్ను తొలిసారి అసహ్యించుకుంటున్నాను. ఇకముందు సావేరి తన బ్రతుక్కి సంబంధించిన నిర్ణయాలలో నేనే స్వయంగా జోక్యం చేసుకోవాలనుకుంటున్నాను."
"అంటే?" రాజేందర్ ఒంటిలోని రక్తప్రసరణ స్తంభించింది క్షణకాలం.
"డానికి వెంటనే పెళ్ళి చేయబోతున్నాను. ముందుగా కాలేజీ మాన్పించి దాని సుఖంకోరే తండ్రిగా నీ చేత తాళికట్టించబోతున్నాను."
"బా... వా...."
రాజేందర్ మనసు ఎంత తేలికపడింది వీర్రాజు సైతం వూహించి వుండడు.
"రాజూ... నా సావేరి బ్రతకాల్సింది మహల్లో, గుడిసెల్లో కాదు...." అభిజాత్యం ప్రదర్శిస్తూ కారులో కూర్చున్నాడు వీర్రాజు.
సావేరి కథను మరో మలుపుతిప్పే సంకల్పంతో అప్పటికే నిర్ణయించుకున్న వీర్రాజు కారు నడుపుతుంటే రాజేందర్ బుద్దిమంతుడైన బాలుడిలా అతని పక్కన కూర్చున్నాడు నిశ్శబ్దంగా.
వీర్రాజు నిర్ణయాలు ఎంత అనూహ్యంగా ఉంటాయో తెలిసిన రాజేందర్ తన జీవిత రధసారధ్యాన్ని బావే నిర్వహిస్తుంటే ఉత్సుకతగా చూస్తూనే ఆలోచిస్తున్నాడు.
అది.....
సాక్ష్యాధారాలలో ఏసిడ్ పోసింది తనే అని నిరూపిస్తానన్నారు రవి. ఎలా తెలిసిందతడికి?
తను ఆ విషయం చెప్పింది ఒకే ఒక వ్యక్తికి.
ఆ వ్యక్తి రజని.
* * * *
గతం పొరలో దాచుకున్న స్మ్రుతులెలా వెలుగు చీకటి కడుపునా సమాధి అయ్యింది.
ఆవిరిగా మారిన రక్తాశ్రువుల్లా గాలి నిశీధిలో నిశ్శబ్దంగా పయనిస్తూంది.
పల్లె సద్దుమణిగినా చాలామంది కంటికి కునుకు రానట్టు ఉదయం చూసిన సంఘటన గురించే విడ్డూరంగా ఆలోచిస్తున్నారు.
వీర్రాజు ఒక నియంతని తెలుసు.
అడ్డువచ్చిన వాళ్ళను అంతంచేసి అది హత్యకాదు, ఆత్మహత్య అని నిరూపించగల సత్తా ఉన్నవాడనీ గతంలో చాలా సంఘటనలు రుజువు చేశాయి.
కానీ శంకూ విషయమే అన్నిటికన్నా వారినంతగా కదిలించింది.
విరిసిన పువ్వుని చూస్తూ వింతగా రెప్పలార్చి చూసే వెర్రి బాగులవాడే....
సన్నని పిల్లకాలువలో సుడుల్ని సంబరంగా చూస్తూ సంతోషపడే వింత మనస్తత్వంగల అమాయకుడే....
తెలియకుండా సైతం చీమకైనా హానిచేయని చిన్నపిల్లడే ఇంతటి శిక్షకు ఎలా గురయ్యాడు?
"బా....మా..." బామ ఒడిలో తలపెట్టుకుని పడుకున్న శంకూ నీరసంగా పిలిచాడు. కనురెప్పలు భారంగా వాలిపోతున్న బామ్మ కళ్ళ నుంచి సుడులు తిరుగుతున్న నీళ్ళు స్పష్టంగానే కనిపిస్తున్నాయి. "నేను అస్సలు... అలాంటి పనిచేయలేదే. నేను నిన్నసాయంకాలం....ఏటి గట్టున కూర్చున్నప్పుడు....." తన్హ నిర్దోషిత్వాన్ని నిస్సహాయమ్గా నిరూపించుకునే ప్రయత్నం చేస్తుంటే వారించింది లక్ష్మమ్మ కళ్ళు ఒత్తుకుంటూ.
"పిచ్చి తండ్రీ! ఎవరనగలరయ్యా నువ్వు తప్పు చేయగలవని! పువ్వురెమ్మరాలితే పాపం కదా బామ్మా అని వాపోయె వెర్రినాన్నవ్! ఇసుకలో పిచ్చిక గూడుకట్టి అది కూలిపోయిందని కంటతడిపెట్టుకునే కుర్రవెధవ్! నిన్ను ఎవరనుమానించగలర్రా నా వరాలకొండా!"
"గట్టిగా కొట్టాడు బామ్మా!" పచ్చిపుండుగా మారిన శరీరాన్ని తలచుకుంటూ కుమిలిపోతుంటే అంతదాకా నిగ్రహించుకున్న ఆ వృద్దురాలి మనసు చివికిపోయింది మరోసారి.
లేనివాడివిరా నువ్వు....ముసలి బామ్మ తప్ప అమ్మయినా లేని అర్చకుడివి. నేనున్నా ఏం చేయగలనని....కాటికి కాళ్ళు చాచుకున్నదాన్ని కంటతడి పెట్టుకోగలను తప్ప కడుపులో దాచుకోగలనా.... నా మనవడు నేరం చేయడూ, చేయలేడూ అంటూ కనిపించని దేవుడికి చెప్పుకోగలను తప్ప దుర్మార్గాన్ని ఆపగలనా...అయినా.... ఏదో గుర్తుకొచ్చినట్టు ఉక్రోషంగా చూసింది "నీ బుద్దిలా వక్రించిపోయింది. నీ వయసెంతని..... నీ తాహతేమిటని.... నిప్పుని ముట్టుకుంటే కాలుతుందని తెలీని వెధవ్వి! కార్చిచ్చుతో కాలక్షేపం చేయాలని ఎందుకు వుబలాటపడుతున్నావు. ఎవరికి పుట్టానో తెలీని చిరునామాలేని చీకిరిపొదనని తిట్టుకునేవాడివి. కోట బురుజులమీద కూర్చోవాలని కలలెందుకు కంటున్నావు. ఒరేయ్.... రొప్పుతూంది ఉద్విగ్నంగా...సిగ్గున్న వాడివయితే ఇప్పటికయినా బుద్దితెచ్చుకో.....అందని ద్రాక్ష కోసం ఆరాటం మాని నీ బ్రతుకేదో నువ్వు బ్రతుకు.....అవకాశం దొరికిందని ఆవేశపడకురా త్రాష్టుడా!"
"బా....మ్మా" అదేమిటో తెలీదు కానీ అర్ధమయ్యేట్టు చెప్పాలనుకున్నాను కానీ ఎప్పుడూ లేనిది బామ్మ చాలా ఆవేశపడుతుంది.
"వద్దురా...ఆకాశాన్ని చూసి ఆనందపడు తప్ప అందుకోవాలని చేతులు చాచకు. ఈ రోజు ఉట్టిగా ఉరిమింది రేపు పిడుగయి వర్షిస్తుంది. అప్పుడు నువ్వేమన్నా కానీ, ముందు నా గుండె పగిలిపోతుంది ఈ బామ్మ కూడా నీకు దక్కకుండా చేజారిపోతుంది. ఆ....అంతే!"
సమీపంలో అంతసేపూ నిలబడ్డ మంగ ఇప్పటికి జోక్యం చేసుకుంది వారింపులా. "బామ్మా....అవన్నీ మాట్లాడటానికి ఇది సమయం కాదు."
"చెప్పు మంగా....వాడు మిగాలాలీ అంటే వాడి మార్గం మళ్ళించు కోవాలని వాడికి నచ్చచెప్పు.... ఆ పిల్లని మరిచిపొమ్మని ఒకవేళ మళ్ళీ కలిస్తే ముందు నేను నుయ్యో గొయ్యో చూసుకుని చస్తానని వాడికి వివరంగా చెప్పు"



