Home » kommanapalli ganapathi rao » అసావేరి
మంగ గొంతు పూడుకుపోతుంది "ఊరుకో బామ్మా!"
"చూడవే పిచ్చిదానా.....పగిలిన అద్దంలాంటి వాడి ఒంటినిచూడు.....నీటి అడుగున కదిలే చేపపిల్లలాంటి వాడు ఊపిరి అంధక గాయాలతో ఒడ్డున పడ్డట్టు ఎలా విలవిల్లాడుతున్నాడో చూడు....అసలు బ్రతికి బాగుపడాలీ అంటే వీడికీ ప్రేమలూ దోమలూ ఏమిటి?" ఇలాగే ఒకనాడు సరిగ్గా ఇదేలా తన కూతుర్నీ నిలదీసిన క్షణాలే గుర్తుకొచ్చాయో లేక ఓడిన బ్రతుకుతో రాజీ పడలేక బ్రతుకుని చాలించుకున్న కూతురే జ్ఞప్తికొచ్చిందో వెక్కిపడుతూంది మంగ మాట్లాడలేదిక.
ఇలాంటి క్షణాల్ని ముందే వూహించి, బెదిరించి విఫలురాలయిన మంగ ఏమని బదులివ్వగలదని.
నెమ్మదిగా తలతిప్పి చూసింది శంకూవేపు.
నేలమీద బొంతపై పరుండి కళ్ళు తెరిచి పైకి చూస్తున్న శంకూ ప్రేమించిన అమ్మాయి నిరీక్షణలోనే రెప్పలు తెరిచి వాలిపోయిన నిస్సహాయుడిలా కనిపిస్తున్నాడు.
అది కూడా కాదు.....
తనే నేర్పిన పొడుపుకథలా అనిపిస్తున్నాడు.
"నిప్పులగుండం తొక్కాను. గుప్పెడు బూడిదనయ్యాను."
* * * * *
"సా....వే....రీ...."
ప్రపంచం సద్దు మణిగిన అపరాత్రివేళ గదిలోకి అడుగుపెట్టిన తండ్రిని చూస్తూ ముందు అవాక్కయ్యింది ఆ తర్వాత భయంతో ఫోమ్ బెడ్ పైన ఓ మూల ఒరిగిపోయింది సావేరి.
"ఇంకా నిద్రపోలేదూ" మృదువుగా అడిగాడు.....కానీ సావేరి ఆ గొంతులోని సౌమ్యతని నమ్మలేకపోతూంది. ఉదయం శంకూపై తండ్రి ప్రదర్శించిన ప్రతాపానికి ఆమె లేత మనసు ఎంత గాయపడిందీ అంటే తొలిసారి తండ్రి రాక్షసత్వాన్ని ప్రత్యక్షంగా చూడటంతో కంపించిపోతూ వుంది. "నీతో ఓ ముఖ్య విషయం మాట్లాడాలి సావేరి."
సావేరి తల వంచుకుంది.
"ఆడపిల్ల తల వంచుకోవాల్సింది రెండేసార్లు. ఒకటి తప్పు చేసినప్పుడు, రెండోది తాళి కట్టించుకునేటప్పుడు"
"నేనేం తప్పు చేయలేదు" ఉక్రోషంగా అంది.
"కాక....." వీర్రాజుగారి మొహం వివర్ణమైపోయింది. "నా ఇంట పుట్టిన ఆడపిల్లని.... ఎంత నీచానికి దిగజారిపోయావు? కోరింది కాదనని తండ్రినని కూడనిది కోరటానికి ఎలా సిద్దపడ్డావు?"
సన్నగా వణికిపోతూంది అసలు విషయం తండ్రికి బోధపడిపోయిందన్న సత్యం స్పురిస్తుంటే.
"నువ్వింకా చిన్నపిల్లవనుకున్నాను తప్ప చాలా పెద్ద నిర్ణయాలు తీసుకునేటంత ఎదిగిపోయావని వూహించలేకపోయాను. కాబట్టే కాలేజీలో చదువుకుంటానంటే అవునన్నాను."
అయితే మాత్రం తనేం తప్పు చేసిందని. "కానీ డాడీ....."
"నీకూ మనసుందంటావ్. ఆ మనసుకు ఓ అభిరుచి వుండే అవకాశముందంటావా? అసలు నీ వయసెంతే? నీకేం తెలుసని? బావ రాజేందర్ నీ మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నాడో?"
ఇక నిగ్రహించుకోలేకపోయింది "నాకిష్టం లేదు."
"నీ ఇష్టాయిష్టాలతో నాకు పనిలేదు మీ ఇద్దరి పెళ్ళి జరిగి తీరుతుంది."
ఎదిరించలేనట్టు తల వంచుకుని వుండిపోయిన సావేరి కళ్ళనుంచి నీళ్ళు రాలడం స్పష్టంగా కనిపిస్తూంది.
"ఏ పనినైనా సకాలంలో పూర్తి చేయడం, అలా గెలుపు నాదే అని నిరూపించుకోవడం నీ తండ్రికి అనాదిగా వస్తున్న ఆచారం సావేరీ.....కాబట్టే పొరపాటున కాదూ అని నువ్వు తండ్రి నెదిరించటానికి సాహసించినా బలవంతంగా నీ మెడలు వంచి రాజేందర్ తో తాళి కట్టిస్తాను....తల విరుసుగా ప్రవర్తించి తిరుగుబాటు చేశావనుకో ప్రాణాలు పోతాయ్. నీవికాదమ్మా..... నువ్వు ఇష్టపడే శంకర్ గాడిని ఉదయం చూసే వుంటావు. అది శాంపిల్ మాత్రమే....."
"ఇప్పుడు?" వెనుకగా రాధమ్మ కంఠం వినిపించింది. "ఇవన్నీ మాట్లాడి తీరాలా?"
సరిగ్గా యిక్కడే వీర్రాజులో సహనం పూర్తిగా చచ్చిపోయింది. "అప్రాచ్యపుముండా....నువ్వు కాదంటే దీనికంతటికీ కారణం బయట వ్యవహారంలో తల మునకలవుతున్న తల్లిగా నువ్వు అన్ని జాగ్రత్తలూ పాటిస్తున్నావనుకున్నాను తప్ప ఇంత నిర్లక్ష్యాన్ని ప్రదర్సిస్తానని ఊహించ లేకపోయాను."
"ఇకముందు జాగ్రత్తగా వుంటుంది" ఇప్పటికి తోచిన జవాబు చెప్పిన రాధమ్మ అదే జవాబు వీర్రాజుకి మరింత ఆగ్రహాన్ని రప్పిస్తుందని కలగనలేకపోయింది. "దాన్ని ఒంటరిగా విడిచిపెట్టండి."
"అదే....అదేనే....ఆ ఒంటరిగా విడిచి పెట్టడమే దానిని అంత దాకా తీసుకొచ్చింది. ఇహ లాభం లేదు. ఈ రోజునుంచీ అది గడప దాటి బయటికి వెళ్ళటానికి వీల్లేదు....అంటే.....కాలేజీ మానిపించేస్తున్నాను."
ఉలికిపడింది సావేరి "డాడీ!" అశ్రుశిక్త నయనాలతో చేతులు జోడించింది సావేరి.
"నేను....నేనింకా చదువుకుంటాను డాడీ....నేను కాలేజీ మానను"
"నువ్వు కాలేజీ మానేస్తున్నావు" ఓ ఆదేశంలా ఒత్తి పలికారు వీర్రాజుగారు.
"చాలా త్వరలో నీకూ, రాజేందర్ కి మేరేజ్ కాబోతూంది."
* * * * *
"నో!" రవి అసహనంగా అన్నాడు. ఆవేశాన్ని అదిమిపెట్టుకుంటూ "వీల్లేదు....అలా జరగదు .....జరగనివ్వను."
"నిజం రవీ!" సురేంద్ర అనునయంగా చెప్పాడు. "మంగచేత నాకు కబురు పెట్టించింది సావేరి అది నీకు చెప్పమనే....మేరేజీకి ముహూర్తాలు కూడా నిర్ణయించే ప్రయత్నాలు చేస్తున్నారట....అందుకని ముందు కాలేజీ మానిపించేశారట. ఈ నాలుగురోజులూ కాలేజీకి రాలేదు కూడా."
అప్పటికి అర్ధమయ్యింది రవికి.....ఈ రోజు ఉదయమే అతని కళ్ళకున్న బేండేజెస్ తీసేశారు.....అదృష్టవశాత్తూ కళ్ళకే ప్రమాదం జరక్కపోయినా మరో ఇరవై నాలుగు గంటలు అబ్జర్వేషన్ లో ఉండాలని డాక్టర్లూ చెప్పడంతో ఉదయమే చూడటానికి వచ్చిన అమ్మానాన్నలు సంతోషంగా వెళ్ళిపోయారు తప్ప జరిగిన ఏ ఒక్క విషయమూ అతడికి తెలియపరచ లేదు.
అదికాదు, ఈ నాలుగు రోజుల్లో సావేరి ఒక్కరోజైనా హాస్పిటల్ కి రాలేదు.....తండ్రి చాలా తెలివిగా సావేరి రాకుండా, వాస్తవం తెలియకుండా నిరోధించాడని బోధపడగానే పైకి లేచాడు.
సురేంద్రకి అర్ధం కాలేదు రవి చేయబోతున్నదేమిటో......
డ్యూటీ డాక్టరుని కలుసుకొని "ఐ థింక్ అయామ్ ఓ.కె! డాక్టర్ నేను వెళుతున్నాను.....బిల్లు ఇంటికి పంపండి" అంటూ హాస్పిటల్ బయటికి వచ్చాడు.
"ఏమిటి రవీ....ఏమిటలా ఆవేశపడుతున్నావు?"
"సురేంద్రా!" నిన్నగాక మొన్నటిదాకా శత్రువర్గంలోనివాడిలా అనిపించిన సురేంద్ర ఇప్పుడు రవికి చాలా ఆత్మీయుడు. "జులాయిగా బ్రతకడమే అలవాటైన నేను హఠాత్తుగా జీవితం గురించి చాలా తెలుసుకోగలిగానని అనలేనుగాని ఆ ఇంటి వారసుడిగా గట్టి నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందనిమాత్రం చెప్పగలను.....సావేరి ఎంత మొండిఘటమో డాడీకి తెలీదు సురేంద్రా! ఈ సరికే నిరాహారదీక్ష ప్రారంభించి ప్రాణాలమీదికి తెచ్చుకుంటుందేమో..... వెళ్ళాలి...."
ఇక చర్చని పొడిగించని రవి తిన్నగా యింటికి వెళ్ళాడు....అసలు రవి ఆ గదిలోకి అడుగుపెట్టడం ఎవరూ చూడలేదు సరాసరి సావేరి వుండే గదిలో అడుగుపెట్టాడు.
ముందు నమ్మలేకపోయింది సావేరి....
కల కాదది ని తెలుసుకోడానికి పట్టింది అరక్షణం మాత్రమే.



