Home » D Kameshwari » Jeevitham Chejaraneeyaku
"ఆంటీ! మీరు నాకు పిరికి మందు పోస్తున్నారు. మా అమ్మ మీ కంటే ముందు తరంది. అయినా ఆమె నాకిచ్చిన పాటి ధైర్యం మీరు నాకీయడం లేదు. అలాంటి భర్తతో ఇంకా కాపురం కూడానా అని నా తరపున మీరు అందరితో వాదిస్తారని ఆశించాను. మీ ఈ మాటలు నేను ఎదురు చూడనివి. మీలాంటి వ్యక్తిత్వం, ఆశయాలు, సతంత్ర భావాలు ఉన్న ఒక స్త్రీ ఇలా మాట్లాడటం నాకు ఆశ్చర్యంగా ఉంది. ఆంటీ.... నా భవిష్యత్తు ఏమయిపోతుంది? చదువుకుంటాను. ఏదన్నా ఉద్యోగం చేసుకుంటాను. నా గతం తెలిసి రెండో పెళ్ళికి అభ్యంతరంలేని వాడెవరన్నా వస్తే పెళ్ళి చేసుకుంటాను. లేదంటే హాయిగా, స్వేచ్చగా ఇష్టం వచ్చింది తింటూ, తిరుగుతూ లైఫ్ ఎంజాయ్ చేస్తాను. ఆ మొగుడు లేకపోతే నాకెవరూ లేరా! అమ్మా, నాన్న ప్రాణం ఇస్తారు. అన్నయ్య నాకోసం ఏదన్నా చేస్తాడు. ఏదో గతిలేని వాళ్ళూ చదువు సంధ్యాలేని వాళ్ళు మీరన్నట్టు భవిష్యత్తు గురించి బెంగపడాలి." విద్య జవాబు చెప్పమన్నట్లు సవాలు చేస్తూ అంది.
నిర్మల నిట్టూర్చింది.
"విద్యా..... జీవితంలో డబ్బు ముఖ్యమైనదే.... కాదనను. దీనికి మించి జీవితంలో చాలా కావాలి. మీ అమ్మగారిది కన్నకడుపు కనుక నీవు బాధపడటం సహించలేక నీవు చేసింది మంచిపని అని అనకపోయినా నీవు తమకు బరువు కాదని అనుకుంటున్నారు విద్యా.... నీకింకా పట్టుమని ఇరవై యేళ్ళు లేవు. ఇంకో ఏభై యేళ్ళ జీవితం ఉంది. అన్నాళ్ళు తల్లిదండ్రులు నీకు తోడుండరు. నీ అన్నలు వాళ్ళ సంసారాలు రాగానే నీకోసం ఏమన్నా చేస్తామన్నమాట మీద నిలవరు. విద్యా! నీకోసం మీవాళ్ళు, నీ ఇల్లు అన్నది ఉండాలి విద్యా."
"ఏమో! ఏ రెండేళ్ళో గడిచాక ఎవడన్నా నచ్చినవాడు దొరికితే మళ్ళీ పెళ్ళి చేసుకుంటాను. జీవితం అంతా ఇలాగే ఉండిపోదుగదా"! విద్య నిలేసింది.
నిర్మల అదోలా నవ్వింది.
"అలా జరిగితే మంచిదే. కాని మనిషి ఆలోచనలు తన చెప్పు చేతల్లో ఉన్నాయని గరిస్తాడు. కాని అతని చేతిలో ఏమీలేదన్నది గుర్తించడానికి ఇష్టపడడు. నీవు చెప్పినంత సుళువు కాదు. నీ ఆలోచనలు నెరవేరడం. విద్యా..... నాకు తెలిసిన నీలాంటి అమ్మాయి కథ చెప్పనా..... ఆ అమ్మాయిది నీలాంటి కేసే. భార్యాభర్తలిద్దరూ పడక విడిపోయారు. అలా విడిపోయిన భార్యాభర్తల కథలన్నీ ఇంచుమించు ఒకలాగే ఉంటాయి. కొద్ది తేడాతో. కనక వాళ్ళెందుకు విడిపోయారన్నది వదిలేసి, ఆమె భర్తనించి విడిపోయి పుట్టింటికి వచ్చాక ఒక పదేళ్ల కథ చెపుతాను..... ఆమె పేరు కూడా నిర్మల అనుకో...."
నిర్మల చెప్పడం మొదలుపెట్టింది.
నిర్మల మంచి కుటుంబంలో పుట్టింది. అందమైనది, చదువుకున్నది.
తండ్రి శివశంకరంగారు లాయరు. ముగ్గురు మగపిల్లల తరువాత పుట్టిన కూతురిని అపురూపంగా ముద్దుగా పెంచారు. ఎమ్మే కాగానే చక్కటి సంబంధం చూసి పెళ్ళి చేశారు.
పిల్లని కన్నారుగాని దాని రాతనుకనలేదు అన్నట్టు ఎంతో ఖర్చుపెట్టి చదువుకున్న మంచి ఉద్యోగంలో ఉన్న అల్లుడిని తేగలిగారు. కాని కూతురి సుఖసంతోషాలని కొనలేకపోయారు తల్లిదండ్రులు.
ముందు నుంచీ ఆ పెళ్ళి వక్రించింది. భార్యాభర్తలమధ్య వాదనలు, మాటపట్టింపులతో మొదలై పరస్పర ద్వేషాలతో చివరికి విడిపోయేవరకూ దారి తీసింది ఆ పెళ్ళి. ఆ భర్త తన కనీసపు కోరికలయినా తీర్చడానికి, వూహల స్థాయికి కూడా అందడని, అలాంటి కాపురంలో తనకి ఏ ఆనందం, సౌఖ్యం, మనశ్శాంతి ఏమీలేదని పుట్టింటివాళ్ళతో చెప్పుకుని ఏడ్చింది నిర్మల. ఆ భర్త అసలు పుట్టింటికి కూడా పంపకుండా సాధించి, ఏడ్పించి, కాల్చుకుని తినడం ఆరంభించాడు. అన్నీ వుండి కూతురు కాపురం ఎందుకిలా తయారయిందో అర్థంకాక తల్లడిల్లిపోయారు ఆ తల్లిదండ్రులు. నిర్మల ఆ కాపురం ఇంక చెయ్యనని మొరాయించింది. భర్త మరింత కసితో, ద్వేషంతో తిట్టడం, కొట్టడం, తాగి వచ్చి అసభ్యంగా ప్రవర్తిస్తూ నానా హింసపెట్టేవాడు. నిర్మల జీవచ్చవంలా తయారైంది. ఓ రోజు భర్తకు చెప్పకుండా ఇల్లు వదిలి పారిపోయి పుట్టిల్లు చేరింది.
కూతురి అవతారం చూసి, చేతిలో టిక్కెట్టన్నా లేకుండా, దమ్మిడీ లేకుండా, బికారి దానిలా తిరిగి వచ్చిన నిర్మలని చూసి వాళ్ళ గుండె లవిసిపోయాయి. శివశంకరగారు అల్లుడిని నానాతిట్లు తిట్టారు. వాణ్ణి మూడు చెరువుల నీళ్ళు తాగిస్తానని ఎగిరారు.
అల్లుడితో మాట్లాడాలని వెళ్ళిన ఆయన్ని గుమ్మంలో నిలబెట్టి నానాతిట్లు తిట్టి పంపించాడు అల్లుడు.
వియ్యంకుడికి రాస్తే 'మీ పిల్లకి ముందునించి కాపురం చేసే లక్షణాలు లేవు. భర్త అన్న గౌరవం లేకుండా కయ్యానికి కాలు దువ్వి మా వాడిని రెచ్చగొట్టేది. ఆడదానికా మాత్రం సహనం, అణుకువ లేకపోతే కాపురం ఏం చేస్తుంది? అలాంటిపిల్ల మాకు అక్కరలేదు. మీ పిల్లని మీరేం చేసుకుంటారో చేసుకోండి' అని రాసిపడేశారు ఉత్తరం.
అవమానంతో శివశంకరంగారి ముఖం ఎర్రబడింది.
"పోనీ వెధవలని, నా కూతురు నాకు బరువయి వెళ్ళానా వెధవ దగ్గరకి? పిల్లనిచ్చిన పాపానికి ఒకసారి ప్రయత్నించడం నా ధర్మం అని వెళ్ళాను. ఇంక వాళ్ళకి, మనకి ఏం సంబంధం లేదు. వాడి పేరు ఎవరూ ఎత్తడానికి వీలులేదు ఇంట్లో. నా కూతురుకి అసలు పెళ్ళే కాలేదనుకుంటాను. ఓ లక్ష రూపాయలు పోతే పోయాయి. కనీసం నా బిడ్డ నాకు దక్కింది. ఇంకా నాల్గురోజులు అక్కడ వుంటే దాని పీడకి ఉరి బిగించేవారు. లేదంటే అదే ప్రాణం విసిగి ఉరి పోసుకునేది. నీరూ..... ఈ ఆరు నెలలు నీ జీవితంలో పీడకలతల్లి. అసలు ఈ ఆరునెలలు లేవనుకుని ఆ జ్ఞాపకాలు తుడి చేసుకో అమ్మా!" అన్నారు.
ఆయన అన్నంత తేలిగ్గా తల్లి శారదాంబగారు ఈ విషయం తీసుకోలేకపోయింది. కానీ కోపంతో చిందులు తొక్కుతున్న భర్త ఏం అంటాడోనని అప్పటికి వూరుకుంది ఆవిడ.
ఏమండీ..... ఆరునెలలు కాపురం చేసిన పిల్లని ఇంటికి తెచ్చారు. ఎన్నాళ్ళు అది పుట్టింట్లో పడి ఉంటుంది. ఓ అచ్చటా ముచ్చటా లేకుండా కాపురం, పిల్లలు ఏమీ లేకుండా జీవితాంతం ఇలా మోడులా ఉంటుందా. మీదంతా ముందాలోచనలేని పనులు. అదంటే చిన్నది. లోకానుభవం లేనిది. తొందరపడింది. అన్నీ తెల్సిన మీరూ అలా తొందరపడితే ఎలా.... పెళ్ళి అనే బంధం తెంచుకుంటే పోతుందా? అంత సుళువుగా పోయేది అయితే ఇన్ని లక్షలమంది ఎన్ని బాధలు పడ్తున్నా కాపురాలు ఎందుకు చేసుకుంటున్నారు. కాస్త ఏ పెద్ద మనుషులనో తీసుకెళ్ళి అతనికి నచ్చచెప్పాలిగాని...." రాత్రి నెమ్మదిగా భర్త దగ్గర ఆ ప్రస్తావన తెచ్చింది.



