Home » D Kameshwari » Jeevitham Chejaraneeyaku

    "నువ్వు నోరు మూయి ముందు. నచ్చ చెప్పాలట..... ఎవడికి..... నా మొహాన తలుపేసిన ఆ వెధవతో ఇంకా కాళ్ళ బేరానికి దిగమంటావా? ఆనాడు కాళ్ళు కడిగానని ఇప్పుడు వాడి కాళ్ళు పట్టుకోమంటావా! వాడికి పెళ్ళాం అక్కరలేకపోతే నా కూతురికి మొగుడు అక్కరలేదు. దానికి మళ్ళీ పెళ్ళి చేసి వాడికి బుద్ధి చెపుతాను చూస్తూండు." తీవ్రంగా అన్నాడు.
    "ఆ..... చూద్దురుగాని! పెళ్ళయి ఆరు నెలలు కాపురం చేసిన పిల్లకి మళ్ళి పెళ్ళి మీరన్నంత సుళువుగాదు." శారదాంబ కఠువుగా అంది.    
    "శుభం పలకరా అంటే నీలాంటి వాడే ఏదో అన్నాడట. పోనీ పెళ్ళి కాకపోతే హాయిగా ఉద్యోగం చేసుకుని దర్జాగా దాని బతుకు అది బతుకుతుంది. నీవనవసరంగా గోల చెయ్యకు." భార్య మీద ఎగిరారు శివశంకరంగారు.
    నిస్సహాయంగా నిట్టూర్చింది ఆవిడ.
    "ఏమిటమ్మా, ఇంకా ఆ డర్టీ రోగ్ తో మాటలేమిటి మనకు. వాడుత్తరోగ్ అని నాకు ముందురోజే అనుమానం వచ్చింది. అసలు అన్ని సంగతులూ తెల్సుకోకుండా పెళ్ళిచెయ్యడం మన తప్పు. ఇప్పుడు మనం బతిమిలాడితే ఇంకా నెత్తినెక్కి దాన్ని అణగదొక్కుతాడు. అలాంటి వాడితో కాపురం ఎలా చేస్తుంది నీరు? పోనీ అమ్మా.... హాయిగా ఏదో ఉద్యోగం చేసుకుంటుంది"..... పెద్దకొడుకు దగ్గర ఆవిడ ఆవేదన వెళ్ళబోసుకుంటే రఘూ ఆమెని సమర్ధించలేదు. ఈనాడు చెల్లెలిమీద ఒలకపోసే ప్రేమలు, సానుభూతులు రేపు పెళ్ళాలు వస్తే ఉండవన్న ఆవిడ ఇంగితజ్ఞానాన్ని ఎవరూ హర్షించలేదు ఆ ఇంట్లో. "అమ్మా..... నేనుండటం ఇష్టం లేకపోతే ఏదో ఉద్యోగం చూసుకుని ఇంట్లోంచి పోతానుగాని, అక్కడికి మాత్రం వెళ్లను." నిర్మల తల్లి అనునయంగా చెప్పిన మాట వినకుండానే ఎగిరిపడింది. ఆ తల్లి నిస్సహాయంగా వూరుకుంది.
    "నీరూ తల్లీ..... మీ అమ్మకి చాదస్తం. ఆవిడన్న మాటలు పట్టించుకొని బాధపడకు. నీకేం కావాలన్నానన్నడుగు. నేనుండగా నీకేం లోటు జరగదు తల్లీ! నేను లేకపోయినా నీకే లోటు లేకుండా చేసిపోతాను తల్లీ! నీవలా దిగులుగా మాత్రం కూర్చోకు. వీళ్ళ మాటలు వాళ్ళ మాటలు విని మనసుపాడు చేసుకోకుండా హాయిగా తిను. పుస్తకాలు చదువుకో. సినిమాలకి వెళ్ళు. ఫ్రెండ్స్ ఇళ్ళకి వెళ్ళు. నీకు కారు కావలసివచ్చినప్పుడు అడుగు. ముందసలు నెలరోజులు శుభ్రంగా తిను. నీ ఆరోగ్యం చక్కదిద్దుకో. నా తల్లి మొహంలో కళేపోయింది. పాలు అవి తాగు తల్లి రోజూ...."  ప్రేమగా అన్నారు శివశంకరంగారు.   
    తండ్రి ప్రేమ, వాత్సల్యం వుండగా తనకేం కొదవ అనుకుంది నిర్మల. ఇంట్లో ఎవరూ నిర్మల గతం గురించి మాట్లాడకూడదని కట్టడిచేశారాయన. కొడుకులకి నిర్మలని సినిమాలకి తీసుకెళ్ళాలని, లైబ్రరీ పుస్తకాలు తెచ్చి ఇవ్వాలని ఆయన ఆజ్ఞలు జారీ చేశారు. అవి ఆజ్ఞలు, అనుకోకుండా చెల్లెలని సంతోష పెట్టడానికి నిజంగానే పాటు పడ్డారు. ముగ్గురు అన్నదమ్ములూ సెలవులు వస్తే సినిమా కెళ్ళేవారు. ఏ మంచి పుస్తకం చూసినా కొని తెచ్చేశారు. తల్లి పాలన, తండ్రి ఆలనా, అన్నల ఆదరణలో నెలరోజులలోనే పోయిన ఆరోగ్యం చక్కబడింది.     
    మొహంలో పూరపు కళాకాంతులు తిరిగి వచ్చాయి. అందరూ కాస్త జరిగింది మరిచి రొటీన్ లో పడే వేళకి అనుకోని అఘాంతంలా..... నిర్మల నెల తప్పింది. అన్న నిజం అందరినీ దిగ్భ్రాంతిలో పడేసింది. నిర్మల ఆ రోజు ఏం తిన్నా వాంతులు చేసుకుంది. శివశంకరంగారు గంభీరంగా 'ఏమిటమ్మా.... ఏం తిన్నావు. బయటెక్కడన్నా ఏదన్నా తిన్నావా' అన్నారు ఆదుర్దాగా.    
    శారదాంబకి చటుక్కున ఏదో అనుమానం వచ్చింది. కూతుర్ని పక్కకి పిలిచి 'ఈ నెల బయటున్నావా' అంది. నిర్మల గతుక్కుమంది. ఈ గొడవల్లో, ఈ హడావిడిలోపడి తన పీరియడ్ తేదీ దాటి  ఇరవై రోజులయిపోయిందన్న సంగతే గుర్తురాలేదు ఆమెకి. కూతురి పాలిపోయిన మొహం చూసి ఇద్దరికీ జరిగింది అర్థం అయింది. శివశంకరంగారి మొహం కళ తప్పింది. శారదాంబ కలవరపడింది. అన్నలు నిశ్శబ్దంగా అక్కడి నించి వెళ్ళిపోయారు.    
    "ఇప్పుడెలాగండీ? చూశారా, తొందరపడవద్దండీ అంటే విన్నారా! ఇప్పుడేం చేస్తారు?"
    "నీవు కాస్త నోరు మూసుకుంటావా?" అన్నారు శివశంకరంగారు చిరాగ్గా. ఇది ఆయన ఎదురు చూడని సమస్య..... అనుకోని సంఘటన! ఒక్కక్షణం ఆయన మెదడు మొద్దుబారింది.   
    నిర్మల తలదించుకుంది. ఆమె గుండెలు దడదడలాడాయి భయంతో. ఈ కారణంగా తాను అక్కడికి వెళ్ళాలా.... లేదు లేదు.... తను చచ్చినా అక్కడికి వెళ్ళదు..... డాడీ.... డాడీ.... నన్నక్కడికి మాత్రం వెళ్ళమనద్దు. తనెంత మూర్ఖురాలు - ఏ మాత్రలో వేసుకోకుండా అంత నిర్లక్ష్యంగా ఎలా వూరుకుంది! అసలు కాపురంలో తనకి మతి వుండి ఏడిస్తేగా! ఇప్పుడెలా.... ఓ గాడ్..... ఇదేమిటి  ఇలా అయింది? ఏం, కడుపుతో వుంటే అక్కడికి వెళ్ళి కాపురం చెయ్యాలని రూలు వుందా? ఏ పిల్లో పుడితే..... పుడితే ఇక్కడ పెంచుకోకూడదా.... అసలు పిల్లవద్దు తనకి. అలాంటి మొగుడికి పుట్టినపిల్ల తనకి అక్కరలేదు. అబార్షన్ చేయించుకుంటే సరి. ఒక్కక్షణంలో నిర్మలని చుట్టుముట్టిన ఆలోచనలు అవి. తండ్రితో ఏం చెప్పాలో తెలియక తటపటాయిస్తూ ఉండిపోయింది. శివశంకరంగారు అన్యమనస్కంగా లేచి గదిలోకి వెళ్ళిపోయారు.
    "హూ.... మనకంటే గొప్పవాళ్ళులేరని విర్రవీగుతే మనల్ని ఆడించే వాడొకడుపైన ఉన్నాడని మర్చిపోతే నేనున్నానని చూపిస్తాడు ఆ పైవాడు. దేనికన్నా అంత తొందర పనికిరాదు. ఇప్పుడేం చేస్తారీ తండ్రీ కూతుళ్ళు?" శారదాంబ అంది.
    "ఏం చెయ్యడానికి ఏముంది? అబార్షన్ చేయించుకుంటాను. నాకీ బిడ్డ వద్దు. ఆ మనిషి తాలూకు గుర్తులు నా దగ్గిర వుండడానికి వీలులేదు." ఖచ్చితంగా అంది నిర్మల.
    "ఏమిటీ..... అబార్షన్ చేయించుకుంటావా!" నమ్మలేనట్టంది శారదాంబ.
    "అవునమ్మా..... అంత ఆశ్చర్యపోవడానికి ఏముంది? ఆ మొగుడు, ఆ కాపురం వదులుకున్నప్పుడు ఈ బంధం ఎందుకు నాకు?"


Related Novels


Bhava Bandhalu

Neti Kaalapu Meti Kathakulu

Chikati Podduna Velugu Rekha

Agni Pariksha

More