Home » VASUNDHARA » Vasundhara Kadhalu - 2



    రాజు ఆలోచనలో పడ్డాడు.
    "నువ్వు సునీతకు దూరంగా వుండడం ఎంతైనా అవసరం!" అన్నాడు వెంకన్న హెచ్చరికాగా.
    "సునీత విషయంలో మీ హెచ్చరిక పాటించలేను వెంకన్నగారూ! నాకున్న కాస్త జీవితం-ఆమెకు దూరంగా గడపలేను...." అన్నాడు రాజు.
    వెంకన్న రాజుకు చాలా చెప్పిచూశాడు. ప్రయోజనం కనపడలేదు.

                                                        7

    "సుందర్రావుగారూ! రాజుకు ఏం జరిగినా నేను సహించను సంఘం పునాదులు కదిపేస్తాను-" అన్నాడు వెంకన్న ఆవేశంగా.
    సుందర్రావతడి వంక ఆశ్చర్యంగా చూసి-"మీ కావేశం తక్కువని విన్నాను. ఆజు మీకేమౌతాడని ఇంత ఆవేశం మీకు?" అన్నాడు.
    "అతడమాయకుడు. అతడిపై మీరు సునీత అనే అమ్మాయిని ప్రయోగించారు. ఆమెను ధన ప్రలోభానికి గురిచేశారు. రాజిప్పుడామె మత్తులో వున్నాడు. ఆమె తనను ప్రేమించిందని నమ్ముతున్నాడు. ఆమెకోసం నాబోటి శ్రేయోభిలాషుల హెచ్చరికలనుకూడా లక్ష్యపెట్టడం లేదు-....."
    "వెంకన్నగారూ-రాజు చావక తప్పదు. ఇది కరీంసాహెబ్ నిర్ణయం..."
    "ఫలితంగా కరీం సాహెబే నిర్ణయాలు తీసుకునేందుకు మిగలకుండాపోతే?" అన్నాడు వెంకన్న.
    సుందర్రావదోలా వెంకన్న వంక చూసి-"రాజుకు చావు తప్పదు. మీరు చేతులు ముడుచుకుని కూర్చోవడమూ తప్పదు-...." అన్నాడు.
    "చట్టానికి వ్యతిరేకంగా పనిచేసే ఏ శక్తినీ నేను సహించను!" అన్నాడు వెంకన్న.
    సుందర్రావు ముఖం ఎర్రబడింది-"వెంకన్నగారూ! ఏది చట్టం? అమాయకులను మాయమాటలతో బుట్టలో వేసుకుని ప్రజానాయకులై మంది బలంతో కొందరు అవినీతిపరులు, అవకాశవాదులు నిర్ణయించినదాన్ని మీరు చట్టమంటున్నారు ఆ చట్టం గొప్పదైతే కరీంసాహెబ్ చట్టమూ గొప్పదే!"
    "సామాన్యుడి దైనందిన జీవితంలో యిబ్బందులు సృష్టించే ఏ చట్టమూ గొప్పది కాలేదు" అన్నాడు వెంకన్న.
    "సామాన్యుడి దైనందిన జీబితంలో ఇబ్బందులు సృష్టించేది మీరు నమ్మే చట్టమే కానీ-మా చట్టం కాదు..." అన్నాడు సుందర్రావు.
    వెంకన్న అక్కణ్ణించి కదిలాడు. కదిలేముందు మరోసారి-"రాజు ప్రాణాలమీద కరీంసాహెబ్ భవిష్యత్తాధారపడి వున్నదని వెంకన్న హెచ్చరించినట్లు మీరతడికి తెలియచేయడం మంచిది-" అని సుందర్రావు చెప్పాడు.
    సుందర్రావు నిర్లక్ష్యంగా నవ్వాడు.
    
                                    8

    పదమూడవ తేదీ.
    మధ్యాహ్నం ఒంటిగంట......
    వెంకన్న అసహనంగా పచార్లుచేస్తున్నాడు-ఇంట్లో ఎక్కడా రాజు జాడలేదు. అతడు, సునీత ఎవరికీ చెప్పకుండా మాయమయ్యారు.
    టైము రెండయింది.
    బల్లమీద ఫోన్ మ్రోగింది.
    "హలో!" అన్నాడు వెంకన్న ఆత్రుతగా.
    "వెంకన్న గారూ! నేను రాజును మాట్లాడుతున్నాను. నేను బ్రతికేవున్నాను, నాకూ, సునీతకూ రిజిస్ట్రాఫీసులో పెళ్ళయిందీరోజునే ఎవరికీ చెప్పలేదు ఎవరినీ ఆహ్వానించలేదు. సాక్షి సంతకానికి రిజిస్ట్రార్ యేర్పాటు చేశాడు. నేను మిమ్మల్ని స్వయంగా కలుసుకుని ఫీజు ఇచ్చుకుంటాను మీవల్లనే నా ప్రాణాలు కాపాడ బడ్డాయి...."
    వెంకన్న ఇంకా యేదో అనబోయాడు. అవతల క్లిక్ మంది.
    "రాజు ఎలా రక్షించబడ్డాడు?" వెంకన్న ఆలోచిస్తున్నాడు.
    అతడింకా ఆలోచనలో వుండగానే బల్లమీద ఫోన్ మ్రోగింది. వెంకన్న రిసీవర్ తీశాడు.
    "హలో! వెంకన్నగారేనా-నేను.....సుందర్రావుని లక్ష్మి రాజుకోసం కరీంసాహెబ్ విషయంలో నోరు విప్పలేదు. ఇప్పుడు రాజు సునీతకోసం జీవించాలనుకుంటున్నాడు. అతడికి బ్రతుకుపై ఆశపుట్టింది. బ్రతుకుపై ఆశ వున్నవాడెవ్వడూ కరీంసాహెబ్ జోలికి రాడు. మీరందరూ నమ్మే చట్టాన్ని నమ్మే రాజు చచ్చిపోయి నట్లే కదా! సామాన్యుడికి కష్టం కలిగించని మా చట్టాన్ని నమ్మే నేను - రాజుపట్ల కృతజ్ఞతా భావంతో అతణ్ణి రక్షించడానికే సునీతను ప్రయోగించాను. సునీత కలిగించిన ప్రేమ, త్యాగాల భ్రమలో అతడు తన ఆశయాలను మార్చుకుని సుఖంగా జీవించగలడు. కాబట్టి మీరుకూడా కరీంసాహెబ్ గురించి మర్చిపొండి...."
    వెంకన్న ఏదో అనబోయేలోగా అవతల క్లిక్ మంది.
    వెంకన్న ఆలోచిస్తున్నాడు-రెండు చట్టాల్లో యే చట్టం రాజుకెక్కువ న్యాయం చేకూర్చిందీ అని!


                             -:అయిపోయింది:-




Related Novels


Vasundhara Kadhalu - 15

Vasundhara Kadhalu - 14

Vasundhara Kadhalu - 13

Vasundhara Kadhalu - 12

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.