Home » History » Diviseema Uppena 1977
బండ్రెడ్డి పెదబస్వారావు కమ్మనమోలు గ్రామము
వయస్సు 40 సం||
అమ్మపోయింది. నాన్నపోయాడు, మేము మా స్వగ్రామమైన భావదేవరపల్లి వదిలి కమ్మనమోలు జేరుకొన్నాము. చిల్లరదుకాణం పెట్టుకొన్నాము. నాలాగే నా తమ్ముడు చిన బసవయ్య కూడా నేనున్నా ఊరే వచ్చాడు. నలుగురితో మంచిగా వుంటున్నాము. నాల్గురాళ్ళు సంపాదించుకొన్నాము. చెరొకయిల్లు కట్టుకొని అక్కడే కాపురముంటున్నాము.
ఆ రోజు శనివారం ఉదయానే తుఫాను ప్రారంభమయింది. పొద్దు యెక్కుతున్న కొలది గాలి తీవ్రమయింది. మధ్యాహ్నం పన్నెండు గంటలకే యిళ్ళన్నీ పడిపోవడం మొదలుపెట్టాయి. అక్కడున్న యిళ్ళల్లో నా యిల్లే కొంచెం గట్టిగా వున్నది. అందుకని చాలామంది మా యింట్లోకి వచ్చారు. నా తమ్ముడు కూడా తన భార్యా పిల్లలతో వచ్చాడు. షుమారు మా యింట్లో డెబ్బది మంది వరకు వున్నారు. అందరు గుమిగూడి కిక్కిరిసి, త్రొక్కిసలాడుతున్నారు.
పట్టపగలే మా యిల్లంతా చిమ్మ చీకటిగా వుంది. అప్పటికి మేమెవ్వరము భోజనము చేయలేదు. పిల్లలు పాలకు యేడుస్తున్నారు. గాలివేగం పెరిగిన కొలది యిల్లంతా వూగుతోంది అందరూ యేడ్వటం మొదలు పెట్టారు. తలుపుల్ని పలుగులేసి అదిమి పట్టుకొన్నాము ఇంటి కప్పుకొంచెంలేచిపోవటం మొదలుపెట్టింది. కిటికీల తలుపులు పోయాయి. వాటిలోన నుంచి బయటకు చూశాను. వాకిట్లోకి వాగ వచ్చింది. నా గుండెలు బ్రద్దలయ్యాయి. సముద్రపు వాగా వచ్చిందని కేక వేశాను. ఇంట్లో వాళ్ళంతా పెద్ద పెట్టున యేడ్వటం మొదలు పెట్టారు. అరప మీదకు యెక్కమని కేక వేశాను. అందరూ అరపెక్కారు. నేను కూడా అరపెక్కాను. ఆకరి మనిషి యెక్కేటప్పటికి మా యింట్లో కంఠం లోతు నీరు వచ్చింది. అరప మీద జనం తొక్కిసలాడు చున్నారు. బరువు యెక్కువై అరప విరిగి పోయింది. మేమంతా యింట్లోకి పడిపోయాము. తెప్పరించుకొని ఇల్లెక్కటం మొదలు పెట్టాము. మేమంతా యిల్లెక్కాము. నీటి వాగలు విపరీతంగా వస్తున్నవి, ఒక్కొక్కసారి తాడి యెత్తున వస్తున్నవి. మా యింటి గోడలు పడిపోయాయి. పైకప్పుకూలి పోయింది. నీళ్ళలో తేలిపోయింది. ఇల్లు సుడులు సుడులుగా తిరుగుతూ పోతోంది. ఎంతో భీతావహంగా వుంది.
మేమెవ్వరమూ బ్రతుకుతామనే ఆశలేదు. విషనాగుల పడగల్లా వాగలు బుసలు కొడుతూ, మా మీద విరుచుకు పడుతున్నాయి. కళ్ళు చూడనివ్వటం లేదు. వళ్ళంతా మంటలెత్తి పోతుంది. యెవరి వంటి మీద బట్టలు లేవు ఇంటి కప్పును కావిటించుకొని కొట్టుకుపోతున్నాము.
ఒక కిలోమీటరు దూరము కొట్టుకు పోయాము. చెట్లమీదుగా మా యిల్లుకొట్టుక పోతుంది. కొంత దూరం పోయేటప్పటికి, ఒక పెద్ద చెట్టు అడ్డు తగిలింది. దానిని పట్టుకొని యొక యిల్లుంది. మా తెప్ప వాటికి తగిలి ఆగింది. వాగలకు యిల్లంతా మునుగుతూ లేస్తుంది. ఒక్కొక్కసారి బొంగరంలా గిరగిరా తిరుగుతోంది, మేము యింటి మీద నిలబడలేక పోతున్నాము. అందరూ యేడుస్తున్నారు. ఎవరికి జాలి? ఎవరు మా మొరవింటారు? సముద్రునికి దండాలు పెడుతున్నారు. ఆయనకు మాత్రం మా మీద జాలా? లేదు, మా యేడ్పులు విని వికటాట్టహాసం చేస్తున్నాడు, ప్రచండ వాయువులు వీస్తున్నాయి, వాగలు మా వల్లంతా వాయ గొడుతున్నాయి. కొండంతా కావురు కమ్మింది. ప్రళయకాలమిదేన అనిపించింది.
చూస్తుండగానే మా యింటి కప్పు రెండు ముక్కలయింది. మేమున్న భాగం మాత్రం చెట్టుని అనతి పెట్టుకొని వుంది. రెండవ దాని మీద నా తమ్ముడు, మరదలు వాళ్ళ మగ పిల్లలిద్దరు వున్నారు. నా పెద్దకూతురు కూడా దానిమీదనే వుంది. మేము కొట్టుక పోతున్నామని యేడుస్తున్నారు. వాళ్ళేమయ్యారో మాకు తెలియదు, వాళ్ళంతా సముద్ర గర్భంలో కలిసి వుంటారు. వాళ్ళ నలభై మంది లోను ఒక అమ్మాయిమాత్రమే బ్రతికింది. ఆమె రెండు మైళ్ళు పోయి ఒక తాటిచెట్టు మొవ్వును పట్టుకొని బ్రతికింది. మా వాళ్ళు కొట్టుకపోవటం ఆమె కళ్ళారా చూసిందట బావ దేవరపల్లి వెళ్ళిన తరువాత మా వాళ్ళు సముద్రమువైపు వెళ్ళిపోయారట.
మేము ప్రాణాలను గుప్పెటలో పెట్టుకొని ఆ తెప్పమీదనే వున్నాము. మాలో యెవరికీ బ్రతుకుతామనే ఆశలేదు. మా తెప్పమీద ముప్పది మంది వున్నాము. దూరాన ఒక ఆవు కొట్టుకొస్తోంది. డానికి దగ్గరలోనే ఒక మనిషి కొట్టుకపోతోంది. పెద్దవాగ వచ్చింది. ఆవు మునిగిపోయింది. వాగ పోయింది. ఆవు పైకి తేలింది. ఆ మనిషి ఆ ఆవును పట్టుకొని కనిపించింది. మాకెంతో ఆశ్చర్యం వేసింది. గోమాతకు యెంత దయ అనిపించింది. అటు చూస్తుండగానే ఆవు మావద్దకు వచ్చింది. ఆ మనిషిని మా తెప్పమీదకు లాగేసుకొన్నాము. ఆమె గొరిపర్తినాంచారమ్మ నిండుచూలాలు. ఆమె వంటిమీద బట్టలు లేవు. మమ్మల్ని కావటించుకొని అక్కడే కూర్చుంది. ఆవు కొట్టుక పోయింది. మాకు దగ్గరలోనే పట్టింది, అది చచ్చిపోయింది ఆ కరుణామయికి మా మనస్సులలోనే నమస్కరించుకొన్నాము.
ప్రొద్దుగూక వచ్చింది మాకు దగ్గరలో ఒక చెట్టు కనపడుతోంది. దానిమీద మీసాల భారతి, ఆమె భర్త కూర్చుని వున్నారు. ఆమె చేతిలో మూడు మాసాల పిల్లవుంది. గాలివేగానికి చెట్టు వూగిపోతోంది. చేతిలో పిల్లజారి నీళ్ళలో పడిపోయింది. వెంటనే తన భర్త నీళ్ళలోకి దూకాడు పిల్లను పైకి అందిచ్చాడు. ఆ పిల్లను ఒక పాము చుట్టుకొని వుంది. దానిని లాగి అవతల పారేసింది. కాని ఆమె భర్త వాగుల్లో కొట్టుకపోయాడు. అతను చనిపోవడం చూసి మేమంతా బాధపడ్డాము వాళ్ళు తల్లీ పిల్లలిద్దరు బ్రతికారు.
మేమున్న తెప్పమీద ఎవరెచ్చటున్నామో తెలియదు. పంట కుప్పలు, ఇళ్ళు, పశువులు, మా ప్రక్కనుంచే కొట్టుకపోతున్నాయి. ఎక్కడనుంచో ఒక త్రాచుపాము మా తెప్పమీదకు వచ్చింది. నిజానికది క్రూరసర్పమే. కాని మాలో అది యెవ్వరిని కరవలేదు. గాలికి పడగ విప్పింది. విజ్రుంభించిన సముద్రకెరటాలను జూసి, అది కూడా జడిసిందేమో! అది మా జోలికి రాలేదు. దానిని క్రిందకు త్రోసే శాము అది నీళ్ళలో కొట్టుకపోయింది.
ఆ రాత్రి చాలా ప్రొద్దుపోయింది, గాలి పడమటగా వీస్తోంది. వాగాలు తగ్గుముఖం పట్టాయి చూస్తుండగానే నీరంతా తగ్గిపోయింది మేమంతా సొమ్మసిల్లి ఒకర్ని ఒకరు కావిటించుకొని దాని మీదనే పడిపోయాము.
నాకు స్పృహ తెలిసి చూసేసరికి తూర్పు తెల్లవారుతోంది. తుఫాను పూర్తిగా పోయింది. మాకు యెవరి వంటి మీదా బట్టలు లేవు చెట్లవెంట వెతికి అక్కడక్కడ పట్టుకొన్న గుడ్డముక్కల్ని తెచ్చి మేమంతా గోచీలు పెట్టుకున్నాము. మా వాళ్ళంతా పోయారు. నేనెందుకు బ్రతకాలి?" నేను కూడా చచ్చిపోతే బాగుండును. నా కెందుకు రాలేదు చావు? అనుకొంటూ పొదలవెంట పట్టిన శవాల్ని పరిశీలిస్తున్నాను. ఇంతలో ఒక పొదలో పిల్లయేడుపు వినిపించింది వంగి పొదలోకి చూశాను ఆ పిల్ల నా తమ్ముని కూతురు. నన్ను గుర్తుపట్టింది. పెదనాన్నా అని కేకవేసింది. నేనా పొదలోపలికి వెళ్ళలేకపోయాను. చేతులు జాపి రా అమ్మా అని కేకేశాను. ఆ బిడ్డ ముళ్ళలో ప్రాకుతూ వచ్చింది. ఎత్తుకొని హృదయానికి హత్తుకొన్నాను నా తమ్ముని కుటుంబానికి యీ బిడ్డ ఒక్కతే బ్రతికింది. ఈమె యెప్పుడిక్కడకు వచ్చిపట్టిందో ఆ పొదలో మరో నలుగురు చచ్చిపోయివున్నారు. ఆ శవాలమయానే యీ పాపవుంది. పాపను యెత్తుకొని వూళ్ళోకి వెళ్ళాను. ఊరంతా స్మశానంలాగుంది. ఎవరిల్లెక్కడో తెలియడంలేదు. ఊరంతా కొట్టుకపోయింది. మేమక్కడ వుండలేక పాపను తీసుకొని అవనిగడ్డకు వెళ్ళాము. కొన్నాళ్ళ తరువాత మాకు పునరావాస సౌకర్యాలను కల్గించారు. మేము మా గ్రామం చేరుకొన్నాము. ఇప్పుడిప్పుడే మామూలు మనుషులవలె మసలుకొంటున్నాము.
పేదబస్వారావు గారి తమ్ముడు చినబసవయ్య ఈయన కుటుంబము మొత్తము ఉప్పెనలో కొట్టుకపోయింది. ఒక ఆరు సంవత్సరాల పిల్ల మాత్రము బ్రతికింది. ఇప్పుడు టి. కొత్తపాలెంలో వుంటోంది. నేనా పిల్లను కలుసుకొన్నాను. పేరు బండ్రెడ్డి శ్రీలక్ష్మి వయస్సు ఆరు సంవత్సరాలు మాత్రమే ఆమె మహా మేధా సంపన్నురాలు. ఆ బిడ్డ తెలివితేటలకు నేనేకాదు. ఎవరైనా ఆశ్చర్యపడవలసినదే. దేవుడా బిడ్డకు ప్రసాదించిన మేధాశక్తి అలాంటిది ఆమె తన కథను యిలా చెప్పింది.
అమ్మ శనివారం చేసింది. స్వామికి దండం పెట్టుకొన్నది. నేనూ అన్నయ్యలిద్దరూ! దండం పెట్టుకున్నాము. నాన్న బయటే తిరుగుతున్నాడు. గాలిబాగా వేస్తోంది. అన్నయ్యోళ్ళు అమ్మకొంగు వదిలిపెట్టటంలేదు. అమ్మ మిరపకాయల పచ్చడి నలిపింది, అన్నం వడ్డించింది. కొబ్బరికాయకొట్టి మేమంతా భజన్లు చేస్తున్నాము. అమ్మ యెప్పుడూ యిలాగే చేస్తుంది. అసలు యిలా చేయబట్టే మేము పుట్టామంట. మా అమ్మ యెప్పుడూ చెబుతూ వుండేది. ప్రతిరోజూ భజన్లు చేస్తుండేది.
అన్నం వండింది అమ్మ, కాని మేమెవరమూ భోజనం చేయలేదు. మా యిల్లంతా పడిపోయింది. భయమేసి మేమంతా యేడుస్తున్నాము. మేమంతా గుడికాడికి వెళ్ళాము. లోనున్న వాళ్ళు గుడి తలుపులు తీయలేదు. మేమంతా మా పెదనాన్నగారి యింటికి వెళ్ళాము. ఆ యింటినిండా జనమున్నారు. అన్నయ్యోళ్ళు ఆకలేసి యేడుస్తున్నారు. అమ్మ బ్రతిమాలుతోంది. ఇంతలోనే యింట్లోకి నీళ్ళు వచ్చాయి. అందరూ యేడ్వటం మొదలు పెట్టారు. అప్పటి కప్పుడే నీరు పెరిగి పోయింది మేమంతా అరప మీదకు యెక్కాము అరప విరిగి పడిపోయింది మేమంతా క్రింద పడిపోయాము. నన్నెవరో పట్టుకున్నారు. తిరిగి యింటి మీదకు యెక్కాము. గోడలు పడిపోయాయి. యిల్లుకొట్టుకపోతోంది. అమ్మ అన్నయ్యోళ్ళను పట్టుకొని కూర్చుంది. నన్నెవరూ పట్టుకోలా! నన్నుకూడా పట్టుకో అమ్మా అన్నాను. అన్నలను పట్టుకున్నా అమ్మా! అంది అమ్మ. మేము కొట్టుక పోతున్నాము, ఒక పెద్ద చెట్టుకు మా యిల్లు పట్టుకొన్నది. ఇల్లు రెండుముక్కలయింది. అమ్మా! నాన్న! అన్నయ్యలు కొట్టుకుపోతున్నారు మేమా చెట్టు వద్దనే వున్నాము. మా వాళ్ళు పోతుంటే నేను యేడ్చాను. అమ్మా, నాన్న నా వద్దకు రాలా! వాళ్ళు కొట్టుకపోయారు నన్ను పట్టుకొంటానికి వాళ్ళెవరూరాలా! సముద్రవేణమ్మ వాళ్ళని తీసుకుపోయింది.
నేనున్నా తెప్పమీద చాలా మందివున్నారు. ఒకళ్ళనొకళ్ళు పట్టుకొనివున్నారు. నన్నెవరూ పట్టుకోలేదు! ఒక్కదాన్నే యేడుస్తూ కూర్చున్నా! పెద్ద వాగ వచ్చింది. నేను నీళ్ళలో పడిపోయా! కొంత దూరం కొట్టుకపోయా నన్నెవరో చేతుల మీద తీసుకొనిపోయినట్లుంది. కొంత సేపటికి ఒకపొదలో పడిపోయా. తరువాత ఏమి జరిగిందో తెలియదు నేను నిదురపోయా, నిదురలో మా అమ్మ వచ్చింది. నాకు బట్టలు లేవు. చలివేసి వణికిపోతున్నా మునగడ తీసుకొని పడుకొన్నా, అమ్మ నా ప్రక్కనే కూర్చుంది. నా మీద దుప్పట్లు కప్పింది, అమ్మా అని పైకిలేచా, అమ్మలేదు తెల్లవారింది, వానా గాలిపోయింది. నా ప్రక్కనే నలుగురు పడుకొనివున్నారు, వాళ్ళని కేకేశా. వాళ్ళెవరూ లేవలేదు. వాళ్ళసలెప్పటికిలేవరు, వాళ్ళు చచ్చిపోయారు.
నేనొక పొదలో చిక్కుకుపోయాను. అక్కడే మూలుగుతూ యేడుస్తున్నాను. మా పెద్ద నాన్న అక్కడికి వచ్చారు. నేను మెల్లగా పాకుతూ మా పెదనాన్న వద్దకు వెళ్ళాను. నన్ను యెత్తుకొని యింటికి వెళ్ళారు, యిల్లంతా పోయింది అక్కడెవరూ లేరు. అవనిగడ్డ వెళ్ళాము. అక్కడ నాకు వైద్యము చేయించారు తరువాత నన్ను టి. కొత్తపాలెం మా తాతయ్యగారింటికి తీసుకొని వెళ్ళారు నేను లేకపోతే నా అమ్మమ్మ బ్రతుకదు. అందుకని నేనక్కడేవుంటున్నాను, అని చెప్పింది, ఆపాప.


