Home » History » Diviseema Uppena 1977
కన్నా అర్జునరావు బ్రహ్మయ్య గారి మూల
వయస్సు 26 సం||లు
మేము కాయకష్టం చేసుకొని జీవించే వాళ్ళం. కూలిచేస్తేనే మా కుటుంబాలు గడుస్తాయి. అందుకే ప్రతి సంవత్సరము కోతలకు భావదేవరపల్లి వెళ్ళుతూ వుంటాము. ఈ యేడు అట్లాగే ధారా వెంకటేశ్వరరావుగారి పొలానికి వెళ్ళాము, మేము మొత్తం ముప్పది యేడు మందిమి. శుక్రవారం నాటికి అచటికి చేరుకున్నాము. మేమంతా షావుకారుగారి చావిట్లో చేరాము మాతోపాటు తుఫాను కూడా ప్రారంభమైంది. ఆ నాటికి బత్తెం యిచ్చారు. అతికష్టం పై వంటచేసుకొన్నాము. భోజనము చేసి అక్కడే ఆ రాత్రంతా గడిపాము. తెల్లవారింది. శనివారం వచ్చింది. గాలి వేగం కూడా పెరిగింది. ఉదయం తొమ్మిది గంటలకే మేమున్న చావిడి పై కప్పు లేచిపోయింది. మేమక్కడవుంటే చచ్చిపోతామని మాకు దగ్గరలో వున్న స్కూలు షెడ్ లోకి వెళ్ళాము. అప్పటికది చాలా గట్టిగా వున్నట్టుంది. సిమెంటు చేసిన రాతిగోడలు, పైన రేకుల కప్పు చాలా గట్టిగా వున్నట్టుంది. ఫరవాలేదనుకొన్నాము. మేమంతా దానిలోనికి చేరుకున్నాము.
శనివారం ఉదయం పదిగంటలు కావచ్చింది. సిమెంటు రేకులు ఒక దాని వెంట నొకటి యెగిరిపోవటం మొదలుపెట్టినవి, గోడలు బాగా యెత్తుగా నున్నవి. అందుకని ఎంత గాలి వేసినా చలి పెద్దగా వేయటం లేదు. అంత గాలీ కూడా లెక్కచెయ్యకుండా నేనూ మరో యిద్దరు కలిసి మా షావుకారు యింటికి వెళ్ళాము. వాళ్ళెంతో బాధల్లో వున్నారు తిరిగి స్కూలులోకి వెళ్ళాము. ఇట్లా నాలుగు సార్లు తిరిగాము. నాల్గవ దఫా వెళ్ళినపుడు వాళ్ళు చాలా బాధల్లో వున్నారు. మా షావుకారు గారికి ఏడు సంవత్సరాల మగపిల్లవాడు. 12 సంవత్సరాల ఆడపిల్ల వున్నారు. ఈ పిల్లలిద్దరు మమ్ము లకు కావిటించుకొని యేడ్వటం మొదలు పెట్టారు. మాకు జాలివేసింది. వీరిని కాపాడాలనిపించింది. అప్పటికే వారి కాపురపు టిల్లు పడిపోయింది. చావిటి గదిలో వున్నారు. చావిడి కూడా బాగా దెబ్బతిన్నది. అందుకని ఆ పిల్లలను తీసుకొని స్కూలులోకి జేర్చాము.
ఆ రోజు మధ్యాహ్నం 12 గంటలగుతుంది. తుఫాను చాలా యెక్కువగా వీస్తోంది బయటకు వెళ్ళితే యెటు పోతామోననే భయముగా నున్నది. వంటిమీద బట్టలను నిలువనివ్వడం లేదు. అయినప్పటికీ మేము అయిదవ దఫా షావుకారి గారి యింటికి వెళ్ళాము. అప్పుడు షావుకారిగారి భార్యను మరదల్ని తీసుకొని వచ్చాము. చావిటి క్రింద యెడ్లు పడిపోయినవని చెప్పి యేడుస్తూ మా షావుకారు వచ్చారు. వెంటనే మేము వెళ్ళిచూశాము యెడ్లు చావిటి క్రింద పడిపోయి వున్నవి. అవి చాలా పెద్ద యెడ్లు యెంతో మోజుగా మేపుతున్నారు వాటిని చూసి మాకు జాలివేసింది. చావిటి కప్పు తొలగించి యెడ్లు తాళ్ళు కోసి బయటకు లాగాము. యెడ్లు తప్పుకొన్నవి. మేము తిరిగి స్కూలులోనికి వచ్చాము. షావుకారు కూడా మాతోనే వచ్చారు.
షుమారు సాయంత్రం 3 1/2 గంటలు కావచ్చు గాలి తూర్పునుంచి మళ్ళీ ఆగ్నేయ మూలగా వస్తోంది. వేగం చాలా యెక్కువగా వుంది. తలుపులు ఆగడం లేదు మగోళ్ళమంతా తలుపులను ముందుకు త్రోసి పట్టుకున్నాము. గాలివేగానికి గోడలు వూగుతున్నాయి. అయినా మేము వదిలిపెట్టలేదు. అట్లా షుమారు ఒక అర్ధగంట వున్నాము. ఇంతలో తలుపుల సందుగుండా నీరు రావటం మొదలుపెట్టింది. షుమారు ఒక అడుగు నీరు వచ్చింది. ఇది వాననీరనుకొన్నాము. ఇంకొంచెం సేపటికి కిటికీల సందులనుంచి నీరు వస్తోంది. అప్పటికి అది సముద్రపు వాగని మేమనుకోలేదు. ఇంతలో కొల్లూరి నాగేశ్వరరావు గోడయెక్కి యినుపత్రాసును పట్టుకొని సముద్రమువైపు చూశాడు. ఒకే కేక వేశాడు సముద్రపు వాగ వస్తుందని. అంతే మేమంతా తలుపులను వదిలిపెట్టి యెవరి ప్రాణాలను వాళ్ళు కాపాడుకోటానికి ప్రయత్నిస్తున్నాము. షావుకారు, ఆయన జీతగాడు మాత్రము తలుపులవద్దనే వున్నారు. వాళ్ళనుకూడా రమ్మని కేక వేశాము. మేము వస్తే మీరంతా చచ్చిపోతారని కేకలేశారు. అందరిని యినుప ట్రసులు పట్టుకోమని కేక లేస్తున్నారు మేమేమయినా ఫరవాలేదు, మీరు పైకి యెక్కండని అరుస్తున్నారు. అప్పటికే నీరు బొడ్డులోతున వచ్చింది కిటికీలవద్ద గోడ యెక్కటానికి జనమంతా తొక్కిసలాడుతున్నారు. నాకెక్కడాఖాళీ దొరకలేదు, ఎవరి ప్రాణాలను వారు కాపాడుకోటానికి తాపత్రయపడుతున్నారు. ఒకరి నొకరు త్రోసుకొంటున్నారు కొందరిని దిగత్రొక్కివేస్తున్నారు ఈ త్రొక్కిసలాటలో మా షావుకారిగారి భార్య చనిపోయింది అది చూచి మాలో చాలామంది యేడవటం మొదలుపెట్టారు మా షెడ్ అంతా యేడ్పులతో నిండిపోయింది.
ఆదుర్దాతో అటూయిటూ పరుగెత్తాను. అదృష్టంకొలది నాకొక బెంచి కనపడింది. దానిమీదకు యెక్కి గోడమీదకు ప్రాకాను. ఇనుప ట్రస్ ను పట్టుకొని క్రిందకుచూశాను. జనం మయాన నాభార్య కొట్టుమిట్టులాడుతోంది బిగ్గరగా పిలిచాను జనాన్ని తొలగతీసుకొని వచ్చింది. బెంచి యెక్కి చేతులందించింది. నేనూ నా స్నేహితుడు నాగేశ్వరరావు కలిసి ఆమెను పైకి లాగేసుకొన్నాము. అతికష్టంగా ట్రసులపైనే కూర్చొన్నాము.
మా ముఠామేస్త్రీ ఆరిగ గిరిరాజు, వయస్సు నలుబది సంవత్సరాలు. హరిజనుడు ఎంతో మంచివాడు. మా అందరిలోను బలవంతుడు. యుక్తిగలవాడు. అతను, అతని భార్య, మరో ముగ్గురు పిల్లలు వీళ్ళంతా ఒకేచోట నీళ్ళలో వున్నారు. పిల్లల్నిద్దరిని భుజాలపైకి యెక్కించుకొని పెద్దపిల్లను కావిటించుకొని యున్నాడు. అతని భార్యా పిల్లలు గోల జేసి యేడుస్తున్నారు మేము అతన్ని పైకి రమ్మని కేకలేశాను తాను పైకి వచ్చి తన ప్రాణాలను కాపాడుకొనుటకు అవకాశమున్నది. కాని తన పిల్లల్ని వదిలి రాలేనన్నాడు. మాకు చేతులెత్తి నమస్కరించాడు. కళ్ళనీళ్ళు పెట్టుకొని గావురుమని యేడ్చాడు. కొంచెము దూరములో తావరపు పిచ్చమ్మ అనే ఆమె వున్నది పెద్ద పెద్ద కేకలేసి యేడుస్తుంది. బయట వాగలు చాలా యెత్తుగా వస్తున్నవి. తలుపుల్ని ఆపలేక మా షావుకారు, ఆయన జీతగాడు వదిలి పెట్టారు. వెంటనే వాగ వేగంగా వచ్చి పడమటవైపు గోడకు కొట్టుకున్నది. గోడ కూలిపోయింది. అప్పటికే మేము పైన పండ్రెండు మందిమి వున్నాము మేమంతా గతుక్కు మన్నాము. వెంటనే మిగిలిన గోడలు పడిపోయినవి. మేము క్రింద పడ్డాము. కొందరు గోళ్ళ క్రింద పడ్డారు. మరికొందరు వాగలకు కొట్టుకుపోయారు. నీళ్ళు అందటము లేదు. ఈదుకొంటూ ఇనుపట్రసును పట్టుకొన్నాను. దానిమీద ప్రాకుతూ కొంతదూరం పైకి వెళ్ళాను నాలాగే కొంతమందిని ట్రసులను పట్టుకయున్నారు.
వాగలు కొద్దిపాటి తాడి యెత్తున వస్తున్నవి. వాగా వచ్చి నప్పుడల్లా మా మీదుగా పోతున్నవి. ఇంతలో నీళ్ళలో కొట్టుకుంటూ ఒక అమ్మాయి కనుపించింది. ఒక చేత్తో యినుప కడ్డీని పట్టుకొని వేళ్ళాడుతూ మరో చేత్తో ఆమెను పట్టుకొన్నాను. కాని నాకు బలం చాలలేదు. చేయి పట్టు తప్పింది ఆమె చేయి జారిపోయింది. అంతే ఆమె వాగల్లో తేలిపోయింది. యెక్కడకు పోయిందో? యేమయి పోయిందో తెలియదు ఆ కడ్డీలమీద ప్రాకుతూ కొంచము పైకి పోయాను అప్పటికి కూడా వాగలు నా మీదుగానే పోతున్నవి. భూమి నుంచి నెలకు నాలుగు గజాల ఎత్తులో వున్నాను. నాకు దగ్గరలో మరో అయిదుగురు వున్నారు. అందులో యిద్దరు క్రిందపడుతూ మరల కడ్డీలను పట్టుకొంటున్నారు. అందరమూ ప్రాణాల మీద ఆశ వదులుకున్నాము. ఆ ట్రసుల పైనే వున్నాము.
మాలో మేడికొండ భూషణం అనే అతనున్నాడు. అతను చాలా భారమైన మనిషి ట్రసులపై నిలువలేక పోతున్నాడు. నేను వదిలి వెళ్ళిపోతున్నాను. మీరుకూడా రమ్మని కేకవేశాడు. అప్పటికే నా భార్య వాగల్లో కొట్టుకపోయింది. యెక్కడికి పోయిందో తెలియదు. నేను మాత్రం ప్రాణాలపై ఆశచేత ఆ కడ్డీలను కావిటించుకొని అక్కడే వున్నాను. భూషణం తేలి వెళ్ళిపోయాడు అతని అన్న కుమారుడు ప్రసాదరావు అతనూ మా వద్దనే వున్నాడు. భూషణం వెళ్ళిపోవటం చూసి బావురుమని యేడ్చాడు. తానుకూడా నీళ్ళలో దూకపోయాడు. అతని మాటను గుర్తుపట్టి అతని భార్య యేడ్చింది. తన భార్య బ్రతికి వున్నదనే ఆశతో ప్రసాదరావు కొంత ధైర్యం తెచ్చుకొని, నేనున్నాను. భయపడకండని కేకవేశాడు. అతని భార్యకు దగ్గరలోనే భూషణం కూతురు, మరొక ఆమె వున్నారు. వీళ్ళు కేకలు వేయటం మొదలు పెట్టారు. ఇంతలో ఒక గెడ వచ్చి ఆడవాళ్ళ వద్ద ఆగింది. దాన్ని మాకు అందించారు. గెడను పోటీ పెట్టుకొని ప్రసాదరావు వున్నాడు, అతని ఆసరా చేసుకొని మేమున్నాము. కొంచెము క్రిందుగా ఆడవాళ్ళున్నారు మాకు పైగా వాగాలు పోతున్నాయి. బాగా చీకటి పడింది. ఒకరి కొకరు కనపడటం లేదు. కొండ కావురేసింది. కళ్ళెత్తి చూడనీయటం లేదు. వాగకు వాగకు మయానా మాత్రమే కొంత గాలి పీల్చుకొంటున్నాము.
పైన కూర్చున్న వాళ్ళలో యెనిమిది మందిమి మాత్రమే మిగిలి వున్నాము. మాకు అవతలగా కొల్లూరి నాగేశ్వరరావు. అతని తమ్ముడు కూర్చొని యున్నారు. యెవరో ఒక అమ్మాయి కొట్టుకొంటూ వాళ్ళ వద్దకు వచ్చింది నాగేశ్వరరావు ఆ అమ్మాయిని పట్టుకొన్నాడు. కడ్డీలపైకి లాక్కొన్నాడు. ఆమె వంటి మీద బట్టలు లేవు. మొత్తము బట్టలన్నీ పోయినవి. చలితో వణికి పోతోంది. నాగేశ్వరరావుని తన వీపును కావిటించుకోమని బ్రతిమాలుతోంది. అతను కొంచెం అనుమానించాడు. ఆవిడ వణికిపోతూ యేడ్వడం మొదలు పెట్టింది మాలో మాకు ఆదా మగా తేడాలు లేకుండా పోయింది. అతను ఆమెను కావిటించుకొని ఆ ట్రస్సులపై అదిమి పట్టుకొన్నాడు. వాగలు వస్తూనే వున్నవి వాగా వచ్చినప్పుడల్లా కొంచెము వెచ్చగానే వున్నది. సముద్రపుటొడ్డున వచ్చే అలలలాగే వస్తున్నవి. షుమారు పదిగంటల ప్రాంతంలో ఒక మెరుపు కనిపించింది. అప్పుడే పటమటగాలి కూడా వచ్చింది. నెత్తిమీదుగా పోయే నీరు కొంచెం తగ్గినట్టయింది. మరికొంతసేపటికి నీరు మా క్రిందుగా ప్రవహిస్తోంది. కాని ప్రవాహంలో తేడా కనుపించింది. పడమటకు పోయే నీరు కొంచెం తగ్గినట్టయింది. మరికొంతసేపటికి నీరు మా క్రిందుగా ప్రవహిస్తోంది. కాని ప్రవాహంలో తేడా కనుపించింది. పడమటకు పోయే నీరు తూర్పునకు పోతోంది. ఉప్పెన తగ్గుముఖం పట్టిందనుకొన్నాము. నేను కొంచెము క్రిందకు దిగి చూశాను. ట్రసులను గట్టిగా పట్టుకొని కాలువ నీళ్ళలోకి జార విడిచాను నీరు మహా వేగంగా పోతోంది ధైర్యము చేసి క్రిందకుదిగాను. రొమ్ములలోతు వచ్చింది వడి మాత్రం నిలువ నివ్వటం లేదు. కొంచెంసేపు ఆగాను మరికొంత తగ్గింది. వాళ్ళను క్రిందకు రమ్మని పిలిచాను వాళ్ళు వచ్చారు. అక్కడేరాళ్ళలో యిరుక్కుపోయిన బెంచీలుంటే వాటి మీద మీము కూర్చున్నాము. యెక్కడ వాళ్ళం అక్కడే సొమ్మసిల్లి పడిపోయాము. మేములేచి చూసేసరికి తెల్లవారింది.
మమ్ములను వదిలి వెళ్ళిన భూషణం తిరిగి వచ్చారు, మా కెంతో ఆశ్చర్యం వేసింది. అతని వంటిమీద బట్టలు లేవు. డ్రాయరు మాత్రము వుంది మాకు కూడా డ్రాయర్లు తప్ప వేరే గుడ్డలు లేవు. ఆడ వాళ్ళ జాకెట్లు తప్ప వేరేమీ లేవు. ఒకామె అసలేమీ బట్టలు లేకుండానే వుంది. మమ్ములను చూడగానే భూషణం గావురు మని యేడ్చాడు. మేమంతా యేడ్చాము. బాగా తెరిపిచ్చింది. పొద్దుకనపడుతోంది. రాళ్ళ క్రింద శవాలు కనపడుతున్నాయి. పరిశీలించాము మా షావుకారిగారి భార్య, మరో ముగ్గురువున్నారు. వాళ్ళను బయటకు తీయటానికి వీలుకాలేదు. అక్కడక్కడా చెట్లను పట్టుకొని గుడ్డపీలికలు కనిపిస్తున్నవి. వాటిని యేరి ఆడవాళ్ళకు ఇచ్చాము. వాళ్ళు వాటిని మొలలకు చుట్టుకున్నారు. మేమంతా బెంచీలపై కూర్చున్నాము. నీవెలా బ్రతికావని భూషణాన్ని అడిగాము, అతనిలా చెప్పాడు.
నేను ట్రసులను పట్టుకొని చాలాసేపు పైనే నుంచున్నాను. నాకు క్రిందుగా యెవరో ఆడవాళ్ళు కనపడుతున్నారు. వాళ్ళు నీళ్ళలో ఉక్కిరిబిక్కిరి అగుతూ నా కాళ్ళు పట్టుకలాగుతున్నారు నేను వాళ్ళను పైకి లాగాలని ప్రయత్నించాను. కాని ప్రయోజనం లేకపోయింది. వాగవచ్చి వాళ్ళను లాక్కుపోయింది. మరల యెవరో వచ్చి నా కాళ్ళు పట్టుకున్నారు. బలంగ నన్ను క్రిందకు లాగారు. నేను నిలువలేక క్రింద పడిపోయాను. నీళ్ళు అందటము లేదు. వాగల్లో తేలిపోతున్నాను. నాకు యీత వచ్చుకనుకనే యీదుకొంటూ పోతున్నాను. వాగాలు ఒక్కొక్కసారి తలక్రిందులు చేస్తున్నవి. ఒక పెద్ద వాగ వచ్చింది అది నన్ను యెత్తి ఒక తాడి చెట్టు పైన పారేసింది. దాని మొవ్వు పట్టుకొని అక్కడే కూర్చున్నాను. గాలికి చెట్టంతా వూగిపోతుంది. కూర్చోలేక పోతున్నాను. ఏమయినా మొవ్వుని పట్టుకొని నేనా చెట్టు మీదే కూర్చొన్నాను.
చాలా ప్రొద్దుపోయింది. అంతా చీకటి, కాని యేదో కావురు కమ్మినట్లు ఒకవిధమైన వెలుతురుగా వుంది. చూస్తుండగానే వాగా తగ్గుముఖం పట్టింది. నేనున్న చెట్టును ఆనుకొని మరో గంగరావి చెట్టుంది. నేను దానిమీదకు దిగాను వాగాలు రావటం ఆగిపోయినవి నేనా కొమ్మల్ని కావిటించుకొని అక్కడే బిర్రబిగిసిపోయాను. స్ప్రుహ తప్పింది. యెంత సేపు వున్నానో తెలియదు కళ్ళు తెరచి చూసే టప్పటికి క్రింద నీరు బాగా తగ్గినట్టుంది. క్రిందకు దిగాను ఒక గెడ దొరికింది. దాన్ని పోటీవేసుకొంటూ మెల్లగా బయలుదేరాను ఆ రాత్రి వేల ఎటు పోతున్నానో తెలియదు. కొంతదూరం వెళ్ళాను. అక్కడొక చెట్టు కనిపించింది. దానిమీద యెవరో మూలుగుతున్నట్టున్నారు. ముందు భయం వేసింది. కొంచెముసేపు నిలబడి, కాస్త ధైర్యము చేసి చెట్టెక్కాను. యెవరో ఆడమనిషి ఒంటిమీద బట్టలు లేవు. చలికి వణికి పోతుంది. తనలో తానే గొణుక్కుంటుంది. తన వాళ్ళని తలచుకొని యేడుస్తుంది.
ఆమె నావంక చూచింది. తానీ చెట్టు మీద చిక్కుక పోయాననీ, తనను క్రిందకు దించమని ఆమె నన్ను కోరుకొన్నది. ఎంతో కష్టపడి ఆమెను క్రిందకు దించాను. విపరీతమైన చలి అంతకు మించి లజ్జ యివన్నీ ఆమెను మునగదీసివేస్తున్నవి. ఆమెచేయి పట్టుకొన్నాను కొద్దికొద్దిగా అడుగులు వేస్తున్నది. కొంతదూరం వెళ్ళాము. అప్పటికి తెల్లవారుఝామయింది. చుక్కలు కనిపిస్తున్నవి. మాకు యెదురుగా ఒక చెట్టు కనిపించింది. దాని మీద నలుగురు కూర్చుని వున్నారు. వారికి కూడా బట్టలు లేవు. వాళ్ళను చెట్టునుంచి క్రిందకు దించాను. అందరము కలిసి ఊళ్ళోకి వెళ్ళాలని బయలుదేరాము. కొంతసేపటికి తూర్పువైపు హరిజనవాడకు జేరాము ఆ వూరంతా కొట్టుకుపోయింది మేము ఉండటానికి ఒక యిల్లు కూడా దొరక లేదు. యెంతో కష్టపడి యిక్కడకు జేరుకున్నాను. అని చెప్పాడు భూషణం.
భూషణం మాటలు విన్న మాకు యేడుపొస్తోంది, ఆకలేసి కదుపు మండిపోతోంది చలివేసి వళ్ళంతా కొంకర్లు పోతున్నాయి. ఇంటికి వెళ్ళాలనిపించింది. మేము వెళ్ళిన ముప్పది ఏడుగురులోను, యేడుగురం మాత్రమే మిగిలాము మాకు అవతల గదిలో నూట ఏబదిమందివున్నారు. వాళ్ళలో 15 మంది బ్రతికారు. ఈ విషాదాలతో మా హృదయాలు తరుక్కుపోతున్నవి. ఆకలితో కడుపులు దహించుక పోతున్నవి.
మేమంతా బయలుదేరాము. మా వూరునకు పదిమైళ్ళు నడవాలి. ఎటు చూచినా నీళ్ళు. రోడ్లు తప్ప మిగిలినవేమి కనబడుట లేదు. ఒకర్ని ఒకరు పట్టుకొని ముందుకు నడిచి పోతున్నాము. చిక్కగా వున్న పొదల ప్రక్కనుంచి వెళ్ళుతున్నాము. అక్కడొక శవం కనిపించింది దగ్గరకు వెళ్ళి చూశాను. ఎవరో కాదు నా భార్య గుండెలు బాదుకున్నాను. ముఖాన చేతులు వేసుకొని యేడ్చాను. యేం ప్రయోజనం? నేనిప్పుడు అసహాయ స్థితిలో వున్నాను. ఇప్పుడీ శవాన్ని యేమి చేయాలి? చూచి కూడా యెలా వదిలి వెళ్ళాలి. అయోమయంలో పడ్డాను. ధైర్యం చేసి నీళ్ళలో కొంతదూరం లాగాను. మా వాళ్ళంతా కేకలు వేశారు, ఆమెను అక్కడే వదిలివేశాను.
అక్కడ నుంచి ముందుకు పోతున్నాము. వళ్ళు వణుకుతోంది. కాళ్ళు పట్టుకపోయాయి. యెక్కడ చూసినా ముళ్ళు. కాళ్ళనిండా ముళ్ళు గుచ్చుకున్నాయి. యేట్లో బాధపడి కాలువకట్ట యెక్కాము గట్టునిండా తెట్టువ పట్టివుంది. కుప్పలు, వాములు, చెల్లాచెదురై గట్టుపైన పట్టాయి. ఎటు చూసినా శవాలే వాటి మీదుగ దాటి పోతున్నాము. మధ్యాహ్నం 12 గంటలకు నాగాయలంక జేరుకొన్నాము. కొద్దిగా కొట్టులు తెరిచారు. ఏమయినా కొంటానికి మా వద్ద డబ్బులు లేవు. నాలుగు బొప్పాయి కాయలు దొరికాయి. తలా ఒక ముక్క తిని కాసిని నీరు తాగాము. కొంచెం ప్రాణం వచ్చింది. తిరిగి ప్రయాణం సాగించాము.
పొట్టకై పోయిన మా ముప్పది యేడుగురులో, మిగిలిన ఏడు గురుము కొన వూపిరితో మా స్వగ్రామమైన ఎదురుమొండి జేరుకొన్నాము.


