Home » Devarakonda Balagangadhara Tilak » తిలక్ కథలు


   
    "నాకు టొమాటో వద్దు" అన్నాడు ధైర్యం చేసి.

    "మరేం కావాలి?"

    "గోంగూర పచ్చడి"

    "గోంగూర పైత్యం. మీ వొంటికసలు పడదు. డాక్టరేమన్నాడో మరిచిపోయారా? అదీగాక టొమాటోలో కాలరీలు వుంటాయి. ఏం నా బాబుకదూ?" గడ్డం పట్టుకుని గోముగా అడిగింది పద్మ.

    "నేను అన్నమే తినను, విషం మింగి చస్తాను" -అని అందామనుకున్నాడు సీతాపతి. కాని పద్మ అంతలో వెళ్ళిపోయింది. బానిస నోరు మూసేసుకోవాలి. లైఫ్ వారపత్రిక చదవాలి. టొమాటోలు తినాలి. తప్పదు రాజ శాసనం.

    నీరసంగా వెనక్కి వాలిపోయాడు సీతాపతి. తనకి వివాహం అయిన దుర్ముహూర్తాన్ని నిందించుకున్నాడు. పట్టభద్రుడై, ఆస్తిలేక ఉద్యోగంలేక నా అన్నవాళ్ళు లేక (పెంచిన మేనమామ తప్పించి) వున్న తనని చూసి వరించి, వలచి పెళ్ళి చేసుకుంది పద్మ. పాతిక ఎకరాల ఆస్థితో పెద్ద మేడతో వచ్చింది. ఇదిగాక యింకో  ముప్ఫై వేలు ఆమె పేర బ్యాంకిలో వున్నాయి. తను అనుభవించే డబ్బూతిండీ పద్మవి, ఎప్పుడేనా తనని నీచంగా, లోకువగా చూస్తుందేమో -తన నిరుద్యోగాన్ని హేళన చేస్తుందేమో! అది సాకుగా తీసుకొని దెబ్బలాడి తన అధికారాన్ని నిరూపించుకోవచ్చు ననుకున్నాడు. కాని పద్మ ఏనాడూ పల్లెత్తూ మాట అనలేదు. పైగా మీరే నా సర్వస్వం అంటుంది. ఆ యింట్లో అలా తింటూ తానుండడమే ఓ మహద్భాగ్యంగా ప్రవర్తిస్తుంది.

    "పోని పొలం వెళ్ళి మక్తాలు వసూలు చేసుకురానా" అన్నాడొకసారి . తనవల్ల ప్రయోజనం వుందని తనని తానే నమ్మించుకోవాలి.

    "మీరా!" పద్మ నవ్వింది. ఆనవ్వు అలాగ ఆడవాళ్ళే నవ్వగలరు. ఆ నవ్వులలో ఆరుగురు ఆనందవర్ధనులు ధ్వన్యాలోకాలు ప్రతిధ్వనించాయి.

    "ఏం- ఆ మాత్రం చాతకాదా నాకు?" అన్నాడు కోపంగా.

    "ఎండలోపడి పొలాలమ్మట ఏం తిరిగిరాగలరు చెప్పండి. అసలే మీరు సుకుమారులాయిరి...... పాత బకాయి లుంటాయి. పైగా రైతులు పండలేదనీ ఏదో యిబ్బంది వచ్చిందనీ , ఏవేవో చెపుతారు. నిజానిజాలు గ్రహించకలిగి ఉండాలి" అవసరమైతే  బెదిరించాలి. కొత్త రైతులకి భూములు మారుస్తామనాలి..... గోవిందయ్య అనుభవం వున్నవాడు, నమ్మకమైనవాడు..."

    పద్మ చెప్పుకుపోతూంటే సీతాపతి యింక వినలేకపోయాడు. గోవిందయ్య అంటే గుమాస్తా. నొసటిమీద నామాలూ, భుజంమీద గళ్ళ తువ్వాలూ, చంకలో గొడుగుతో ప్రత్యక్షమయ్యే నడివయస్సుదాటిన ఈ గుమాస్తా తనకన్న తెలివైనవాడా? నమ్మకమైనవాడా? తన ప్రశ్నల్నీ, బాదల్నీ మాటాడకుండా నమిలి మింగేసి ఊరుకున్నాడు సీతాపతి.

    మక్తాలు పద్మ వసూలు చేయిస్తుంది. పన్నులు ఆమె కట్టిస్తుంది. కూరలు ఆమె కొంటుంది. ఒక గుమాస్తా, ఒక పాలేరూ, ఒక వంటావిడా ఆమె సిబ్బంది జమా ఖర్చు ఆవిడ చూచుకుంటుంది. రాత్రి పడుకోబోయేముందు ఇంటితలుపులన్నీ వేసివున్నాయో లేవో ఆమె చూచుకుంటుంది. తనకి క్లబ్ లో మెంబర్ షిప్పు కి నెలనెలా రెండు రూపాయలు క్లబ్బు కుర్రాడికి ఆమె యిస్తుంది. తన క్లబ్ కివెడుతూంటే పేకాడవద్దనీ, అంతగా ఆడితే బ్రిడ్జీ లాంటి గేమ్, తక్కువ స్టేక్సుతో  వేసుకోమని ఓ పదో ఇరవయ్యో తన జేబులో పెడుతుంది. తన మందులు ఆమె కొంటుంది. తన ఆరోగ్యాన్ని ఆమె రక్షిస్తుంది. తన అవసరాన్ని ఆమె నిర్ణయిస్తుంది.

    తనకి పనిలేదు. తనకి అస్తిత్వం లేదు.

    ఒకరోజున దెబ్బలాడి తన వునికి స్థిరపరుచుకోవాలనుకున్నాడు. క్లబ్బునుండీ  ఆలస్యంగా రావాలనే వచ్చి, వక్కపొడి నముల్తూ మంచం మీద పత్రికని తిరగేస్తూ కులాసాగా రావాలనే కనపడిన భార్యని చూశాడు.

    "నేను రాకుండా అన్నం తినేసి కూర్చున్నావు. నేనంటే కొంచెమైనా విలువ  వుందా నీకు? ఈయిల్లు నీది. భమినీది.... నే నెవణ్ణి వుత్తి బానిసని..... వెధవని..... నాకొక గౌరవమూ గొప్పా యి యింట్లో ......" కోపంతో గట్టిగా అరిచాడు.

     "ఎవరు చెప్పారండీ మీకు. ఈవేళ శనివారం. నేం భోంచెయ్యమని మీకు తెలుసుగా" అంది పద్మ భర్తకేసి ఆతృతగా జాలిగా చూస్తూ.

    అతని ప్లానంతా వృధా అయిపోయింది. శనివారం మాట మరచిపోయి పూల్ అయిపోయాడు. అయినా వూరుకోలేదు సీతాపతి.

    "అలా జాలిగా మాట్లాడుతావేం? నేను అనాధ ననుకున్నావా, మతిలేనివాడిననుకున్నావా?"

    "అదికాదండి, మీరు కోపంతో కేకలు వేస్తుంటిరి. మీ డైజషన్ అసలే మంచిదికాదు. డాక్టరు చెప్పాడు జీర్ణశక్తి పాడైపోయినప్పుడల్లా కారణం లేకపోయినా ఫిట్సు లాగ యిలాగ మీరు అలసిపోతే ఎలాగ చెప్పండి పోనీ పళ్ళరసం, గ్లూకోజూ కలిపి ఇవ్వనా, సత్తువ చేస్తుంది"

    ఓడిపోయాడు సీతాపతి. ఆమెకి కోపంరాదు. మరీ రెచ్చిపోయాడు సీతాపతి టేబిల్ మీద వున్న రాధాకృష్ణ విగ్రహం పట్టుకొని నేలకేసి కొట్టాడు. రాధా, కృష్ణుడూ ముక్కలుముక్కలై వియోగం పొందారు.

    ఆమె చెదిరిపోయింది. భర్త మానసిక స్థతి ఆమెకి ఆందోళన కలిగించింది. అయినా అంతలోనే నవ్వింది.




Related Novels


తిలక్ కథలు

అమృతం కురిసిన రాత్రి

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.