Home » Devarakonda Balagangadhara Tilak » తిలక్ కథలు


 

                                              సీతాపతి కథ

    సీతాపతి తాపీగా కలం తీశాడు. ఒక తెల్లకాగితం తీసుకున్నాడు. ఇటూ అటూ చూశాడు. ఎవరూ లేరు. సోఫాలో బొచ్చుకుక్క కళ్ళు మూసుకుని పడుకుని వుంది. గోడమీద గడియారమూ, గడియారం పక్కనే గాంధీగారి బొమ్మా నిర్మలంగా వున్నాయి. బల్లమీద వెండి గిన్నెలో కాఫీ చల్లారిపోతోంది. కాఫీ తాగి రాయనా, రాశాక తాగనా అన్న ఆలోచనతో ఓ నిముషం ఉండిపోయాడు.

    కనుబొమలు కుంచించి, పెదవులు బిగించి, కాఫీ తాగకుండానే కాగితంమీద యిలా రాశాడు.

    "పెళ్ళాన్ని చంపెయ్యాలి"

    అమ్మయ్య! అనుకున్నాడు. స్థిమితంగా కలం టేబిలుమీద పెట్టి వెండిగిన్నె తీసుకుని కాఫీ ఓ గుక్క తాగాడు. అతనికి వొళ్ళు తేలికపడినట్టు అనిపించింది. ఆ ఆలోచన తన మనసులో వుండి తనని బరువుగా అస్తిమితంగా చేసివేస్తోంది. ఇప్పుడా ఆలోచనని ఎత్తిపట్టుకుని నీట్ గా కాగితం మీదికి దింపేశాడు.

    ఆలోచన ఉత్తినే మనస్సులో వుంటే పాదరసంలా పరుగెడుతుంది. కంగారు పెడుతుంది. రూపమూ గుణమూ ఉండవు ఆలోచనకి. ఇప్పుడు కాగితంమీద అక్షరరూపం దాల్చేటప్పటికి ఆలోచనకి ఒక మూర్తీ ఒక ప్రాణమూ ఒక వ్యక్తిత్వమూ వచ్చినట్టు అనిపించింది.

    మళ్ళీ ఓ గుక్క తాగాడు. కాగితం మీద మళ్ళీ యిలా రాశాడు.

    "బొచ్చుకుక్కని చంపెయ్యాలి."

    కొంచెం నవ్వుకున్నాడు. తను కొంచెమే నవ్వుకున్నట్టు తెలుసుకుని తిరిగీ నవ్వుకున్నాడు. కాఫీ తాగడం పూర్తయేసరికి కాగితంమీద అతని ఆలోచనలు ఇలా వ్రాయబడి వున్నాయి.
   
    "పెళ్ళాన్ని చంపెయ్యాలి.
    బొచ్చుకుక్కని చంపెయ్యాలి
    పోస్టుమాన్ ని చంపెయ్యాలి
    డాక్టర్ని చంపెయ్యాలి
    పక్కింట్లో వాళ్ళ అబ్బాయిని చంపెయ్యాలి"

    సీతాపతి సంతృప్తిగా పడక కుర్చీలో వెన్నువాల్చాడు. ఇటువంటి ముఖ్యమైన అయిదు హత్యలను చేసే గురుతర బాధ్యత తనమీద పెట్టుకున్నాడు. సీతాపతి పనిలేనివాడనీ, చాతకానివాడనీ, ఇంకెవరూ అనుకోరు. పేపర్లో , సినిమాహాళ్ళలో, శృంగాటకాలలో తనని గురించే చెప్పుకుంటారు. "అడుగో వాడే సీతాపతి" అంటూ ఆడవాళ్లు కిటికీలలోంచి చూసి భయంగా గుసగుస లాడుతారు. మళ్ళీ నవ్వుకున్నాడు.

    మనిషి అన్నవాడికి సాహసం వుండాలి. ధైర్యం వుండాలి. కత్తిలా దూసుకుపోవాలి. గుచ్చుకుపోవాలి.

    "కాఫీ తాగారా?"- సన్నని మృదువైన కంఠస్వరం గుమ్మంలో తెరవెనుకనుండి.

    ఉలిక్కిపడ్డాడు సీతాపతి. తానింకా ప్రథమ కార్యక్రమం అయిన భార్యా హననాన్ని కొనసాగించనేలేదు. ఆమె బతికేవుంది. గుమ్మం తెరచాటునవుంది. భౌతికమైన, ఖచ్చితమైన, యథార్ధమైవుంది. తాను వూరికే ఉత్తి ఆలోచనకే తృప్తిపడి పోతున్నాడు. గర్వపడి పోతున్నాడు.

    "అయితే స్నానానికి లేవండి, వేణ్నీళ్లు తొలిపి పెట్టాను."

    "అబ్బ! బద్దకంగా వుందే " అన్నాడు విసుగ్గా. తన బతుకే ఒక విసుగు. ఒక అర్ధంలేని పిచ్చిగీత.

    తెర తొలగించుకుని "పోనీ టానిక్కు యివ్వనా, స్నానం తర్వాత చేద్దురుగాని లెండి" అందామె.

    సోఫాలో పడుకునివున్న బొచ్చుకుక్కవైపు చూశాడు - దీనంగా, తన భార్య తననీ, బొచ్చుకుక్కనీ ఒకలాగే పెంచుతోంది. తనకి యిష్టాయిష్టాలు లేవు. వ్యక్తిత్వం లేదు. తన మనస్సునీ, శరీరాన్ని ఆమె ఎప్పుడో వప్పగించేసుకుంది. తనకి విముక్తిలేదు. బొచ్చుకుక్కకి లేదు. కుక్కని చూస్తూన్న కొలదీ తనకి తనే జ్ఞాపకం వస్తాడు. అందుకే తన ఆలోచనలో రెండవ హత్యకి బొచ్చుకుక్కని లక్ష్యం చేశాడు.

     "ఇదిగో తాగండి" పద్మావతి మృదువుగా మందుగ్లాసు నోటి దగ్గర పెట్టింది. లాలనగా తియ్యగా కళ్ళలోకి చూసింది. అందులోనూ అందమైన పద్మాలలాంటి కళ్ళతో సింపుల్ గా నాజూకుగా టాయిలెట్ అయి, దుస్తులు వేసుకున్న ఆమె వొంటిమీద నుండేటి యుడికిలోన్ వాసన సుతారంగా వస్తోంది ఇక్కడే వచ్చింది గట్టి చిక్కు. తనభార్య అసహ్యంగా లావుగా వుండకూడదూ? వెకిలిదీ, వెర్రిదీ కాకూడదూ? అప్పుడు తనకి భర్తగా ఒక ప్రాముఖ్యం అయినా వుండేది. దేవుడు తన మీద కసికొలదీ ఆమెని అందంగా, పొడుగ్గా చేశాడు. తియ్యగా, హాయిగా మాట్లాడుతుంది. అందరికీ పద్మ అంటే ఇష్టం. ఎవరికిష్టం కాదు -పువ్వులతో ఉన్న పున్నాగచెట్టూ, నగషీల దంతపు గిన్నెలో వున్న అగరవత్తుల గుత్తీ, నక్షత్రాలతో మెరుస్తూన్న శరదాకాశమూ?

    మందు తాగాడు. తన జుట్టులోకి వేళ్ళు పోనిస్తూ అంది పద్మ వేణ్ణీళ్ళు కాగులోకాగుతూ వుంటాయి. పదిగంటలకి స్నానం చేస్తారా చెప్పండి? ఈలోగా లైఫ్ ఏపత్రిక ఎప్పుడు చదవాలో కూడా పద్మ చెపుతుంది. చదివిస్తుంది. ఏం తాను మాంచి డిటెక్టివ్ నవల చదవకూడదా? పద్మ లైఫ్ పత్రిక అని చేతికిచ్చింది. విసుగ్గా అందుపుచ్చుకున్నాడు.

    "టమాటో పెరుగుపచ్చడి, ములక్కాడ సాంబారూ చేయిస్తున్నాను. ఇష్టమేకదూ" అంది పద్మ.

    ఎటువంటి బానిస అయినా చరిత్రలో తిరగబడిన ఘట్టాలున్నాయి. చరిత్ర చదివాడు సీతాపతి. స్వాతంత్ర్యం కోసం ప్రాణాలిచ్చిన మహామహులున్నారు. తాను మాత్రం!




Related Novels


తిలక్ కథలు

అమృతం కురిసిన రాత్రి

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.