Home » Unnava Vijayalakshmi » Acharanalo Abhudayam
'మీ పిన్ని వ్రాసిన వుత్తరం నాకు అందలేదమ్మా-- సరే నేను వెళ్తున్నాను' అన్నాడు.
'పిన్ని దగ్గరకేనా?'
'అవును' ఆ పిన్ని ఏ లోకంలో వున్నా వెతికి పట్టుకుంటాను. అన్నంత దృడంగా చెప్పాడు సమాధానం.
వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్న అతను ఒక్క క్షణం ఆగాడు...' నన్ను గురించి మీ కేవరికీ ఏమీ తెలియదమ్మా -- మీరంతా అమాయకులు ...నువ్వు ఇంతసేపూ నా పట్ల చూపించిన అభిమానానికి నేను అర్హుడిని కాను...' అంటూ ఒక్కసారి ఆ పిల్లని దగ్గరకు తీసుకుని ప్రేమగా తల నిమురుతూ అంతా చెప్పాయాలని పించింది -- కాని చెప్పలేక పోయాడు- ఆ భావాల నన్నింటిని కళ్ళల్లోనే నిమ్పుకుని వాత్సల్య పూరితంగా ఒకసారి ఆ పిల్ల కేసి చూశాడు.
వచ్చిన వాడివి అన్నం అయినా తినకుండా వెళ్ళిపోతున్నావు -- ఈసారెప్పుడైనా తప్పకుండా రావాలి. పిన్నినీ పాపనీ కూడా తీసుకురా.' పై మెట్టు మీద నిలబడిన మణి నిర్మలంగా, అమాయికంగా , నవ్వుతూ చెప్తోంది.
'తప్పకుండా వస్తాం.' అని గబగబా మెట్లు దిగి క్రిందికి వచ్చేశాడు.
* * * *
అన్నయ్య ,
ఈ వుత్తరం మీకు ఎలాంటి ఆశ్చర్యాన్ని కలిగిస్తుందో నేను వూహించు కోగలను....మీ మిత్రుడు మురళీని గురించి చెప్తే మీకు నమ్మశక్యం కాదేమో....అయినా యదార్ధం ఒకరికయినా తెలియ జేయాలని నా మనస్సుని కాస్తయినా తేలిక పరుచు కోవాలని ఈ వుత్తరం వ్రాస్తున్నాను-- మీరు కాకపొతే నాకు ఇంకెవరున్నారు.
వారు, విశాల హృదయంతోనే అభ్యుదయ భావాలతోనే నన్ను వివాహం చేసుకున్నారు....కాని చాలామందిలో లాగానే, పరిస్థితులన్నీ అనుకూలంగా ఉన్నంత కాలం మనిషిని అంటి పెట్టుకుని వున్న సంస్కారం, ఆ పరిస్థితులు కాస్త ఇటూ అటూ ఆయె సరికి ఆ సంస్కారపు ముసుగు తొలగిపోయి ఆ మనిషి యదార్ధ స్వరూపం బయట పడినట్లు వీరి విషయం లో కూడా జరిగింది....అంతేకాదు , వారీ అంతర్యపు అట్ట అడుగు పొరలలో ఎక్కడో ఒక చిన్న భావన, అంటే నేను ఏదైనా తప్పు చేస్తానేమో, నాలో ఏవైనా తక్కువ బుద్దులు వుంటాయేమో అన్న స్పృహ సజీవంగానే వుండి పోయింది. దానిని పూర్తిగా నిర్మూలించటం వారికి సాధ్యం కాలేదు....అందుకే అడుగడుగునా అనేకమైన సంఘటనలు....అవి అతి సామాన్యమైనవే అయినా వారికి ఏవేవో అర్ధాలు గోచరించి ఏవేవో జ్ఞాపకాలను త్రవ్వి పోసి ఎన్నో అనుమానాలు తల ఎత్తేలా చేసేవి. అలా రెండు సంవత్సరాల కాలం మానసికంగా వారు వో విధమైన నరకం అనుభవించి నాకు మరో విధమైన నరకం రుచి చూపించారు. చివరికి 'ఇంక నీకూ నాకూ ఎలాంటి సంబంధమూ లేదు' అని చెప్పేసి ఇల్లు విడిచి వెళ్ళిపోయారు.
ఏదో ఆవేశంలో, ఒళ్ళు తెలియని కోపంలో అన్న మాటలు కావు అవి-- వాటిని వారు అక్షరాల ఆచరణ లో పెట్టటానికే నిశ్చయించు కున్నారు. నాలుగు వేల రూపాయిలు పంపిస్తూ ఇంక నాతొ తెగతెంపులు చేసుకున్నట్లే అని తెలియజేస్తూ ఆ మర్నాడే వుత్తరం కూడ వ్రాశారు. అది నేను అందుకుని నాలుగు రోజులయింది.
ఈ నాలుగు రోజులూ నేను అహోరాత్రాలు ఆలోచించాను. ఇప్పుడు నేనేం చెయ్యాలి, నా కర్తవ్యం ఏమిటి అని అవిరామంగా యోచన చేశాను.
ఇలాంటి బ్రతుకు బ్రతికే కంటే చచ్చి పోతేనో అనిపించింది మొదట-- కాని పాప, దానిని ఎవరు పెంచుతారు. దాని బాధ్యత ఎవరికి అప్పగించి వెళ్తాను. ఏ అనాధ శరణాలయం లోనో దానిని వదిలిపెట్టి నా దారి నేను చూసుకుందామా అనిపించింది -- కాని తల్లితండ్రుల మధ్య రేగిన కలతల కి తను శిక్ష అనుభవిస్తున్నట్లు ఒక అనాధగా అనామకురాలి గా జీవితం అంతా గడప మనటం, అవమానాల పాలు పడమనటం నాకు ధర్మంగా అనిపించలేదు-- లక్షణంగా పెళ్లి పేరంటం జరిపించాలను కున్న ఆడపిల్ల -- నేను బ్రతికి వుండి, పాపని నా దగ్గర పెంచినా డానికి సంఘంలో పెద్ద స్థానం దొరుకుతుందని నేననుకోటం లేదు.. నా నుదుట ఇన్ని కష్టాలని వ్రాసిన భగవంతుడు దానిని మొగపిల్ల వాడుగా అయినా చేశాడు కాదేం.' అని నేను విలపించిన క్షణాలు ఎన్నో' వున్నాయి-- అది సరే లెండి.
అయినా నేను వోటమిని అంగీకరించదలచు కోలేదు. ఇంతవరకూ వచ్చాక భయపడి వెనక్కి పారిపోదలుచు కోలేదు--
కాని ఈ యింట్లో ఈ వూళ్ళో వుండాలని నాకు లేదు. నాకు మరీ అవసరం అనిపించిన కొద్ది సామాను తీసుకుని నేను వెళ్ళిపోతున్నాను....వారు పంపించిన డబ్బు నేను ఖర్చు చేయదలుచు కోలేదు. అది పాప పేరునే బ్యాంకి లో వేస్తున్నాను. నా దగ్గర కొద్దిగా డబ్బు నగలూ వున్నాయి. అవి ఖర్చయి పోయే లోపునే ఏదో వో ఉపాధి దౌరుకుతుందనే నమ్మకం నాకు వుంది. మీరు సాధ్యమైనంత త్వరలో వచ్చి ఈ ఇల్లు ఖాళీ చేసి ఇంటి వారికి అప్పగించే యండి. సామానంతా మీ దగ్గర వుంచి ఎప్పుడైనా మీ స్నేహితుడు కనిపిస్తే వారి కిచ్చి వేయండి --
వారికి ట్రాన్స్ ఫర్ అయిందనీ, ఈ లోగా నేను మా వాళ్ళింటికి వెళ్తున్నా ననీ, మీరు వచ్చి ఇంటి విషయం చూస్తారని, ఇక్కడ వీళ్ళకి చెప్పాను. ఇంటి తాళం కూడ మణి వాళ్ళ దగ్గరే ఇచ్చి వెళ్తున్నాను.
మీకు వదిన గారికి నమస్కారాలు. పిల్లలకి ముద్దులు.
కళ్యాణి.
ఉత్తరం చదువుతున్నంత సేపూ బొటబొటా కారిపోతున్న కన్నీళ్ళని అద్దుకుంటూ నే వున్నాడు మురళీ. చదవటం ముగించి తల ఎత్తి చూస్తూ 'ఇందులో తను ఎక్కడ వుండేదీ, ఎడ్రసూ అదీ ఏమీ లేదు. తరువాతెమైనా మళ్లీ వ్రాసిండా '' అన్నాడు.
'వ్రాసింది ఇదుగో' అంటూ మరో కార్డు ఇచ్చాడు వాసు.
'నువ్వెప్పుడయినా వెళ్లి చూశావా?' -- అతనేమైనా అనుకుంటాడెమో నని సిగ్గు పడుతున్నట్లు సందేహిస్తున్నట్లు అయినా అడగకుండా వుండటానికి మనస్సు వుండబట్టనట్లు మెల్లిగా అడిగాడు.
'ఒకసారి వెళ్లాను. జరిగిందంతా తన ముఖత మళ్లీ ఒకసారి విన్నాను....నేను నీ వివాహానికి ముందే నిన్ను హెచ్చరించాను గుర్తుందా? ఫరవాలేదు. ఎలాంటి పరిస్తితులైనా ఎదుర్కో గలను అనే ధైర్యం నాకు వుంది అని సమాధానం చెప్పావు -- ఏ పని అయినా మనం వూహించుకున్న దానికి అది తీరా అనుభవం లోకి వచ్చేసరికి మాలని చుట్టూ ముట్టే అనుభూతులకి చాలా వ్యత్యాసం వుండటమే కాదు, మరో చిత్రం కూడ నేను కనిపెట్టాను -- ఎలాంటి క్లిష్ట పరిస్థితులు గాని సమస్యలు గాని మరొకరికి ఎడురయినపుడు ప్రేక్షకులుగా , శ్రోతలుగా నిలబడి పోయిన మనం ఎంతో నేర్పుగా వాటికి పరిష్కారం చెప్పగలుగుతాం . న్యాయనిర్ణయం చేయగలుగుతాం. తీరా ఆ పరిస్థితులే మనకి ఎదురయితే మాత్రం సుడి గుండం లో చిక్కుకున్న నావలా అయి పోతుంది మన మనస్సు-- సరే ఇంత జరిగినా ఒకనాటికయినా నువ్వు సత్యాన్ని గ్రహించ గలవనే నమ్మకం మాత్రం నేను విడిచి పెట్టలేదు....ఈలోగా నీ జాడ కనుక్కోటం నాకు కష్టమే అయినా, ఎలాంటి పరిస్థితుల్లో నయినా ఏదో ఒకనాడు నువ్వు నా దగ్గరికి రాకుండా వుండవు అనే నమ్మకం కూడ నాకు వుంది-- అందుకే, ఎంత అలష్యమైనా సరే, ఎన్ని రోజులయినా సరే ఈ వుత్తరం దాచి వుంచాలను కున్నాను...'
'నిజమే వాసూ..... ' అని కాస్సేపు ఏదో ఆలోచిస్తూ వుండిపోయిన మురళీ మళ్లీ....మెల్లిగా మొదలు పెట్టాడు.
'ఎలాంటి పరిస్థితుల నయినా ఎదుర్కోగలను అని ఆనాడు నీకు అంత నమ్మకంగా చెప్పిన నేను అతి స్వల్ప విషయాలకే బెదిరిపోయి, వాటి పరిణామాలని అతి భయంకరంగా వూహించుకుని చివరికి మా జీవితాలనే పణంగా పెట్టాను-- దీనికి కారణం ఏమిటీ, నేనేనేందుకు అలా ప్రవర్తించాను అని ఆలోచిస్తుంటే ఇప్పుడు నాకు ఒక్కటే సమాధానం దొరుకుతోంది ....మన మనస్సు అతి చిత్రమైనది --
ఒక వ్యక్తీ పట్ల గాని, సంఘటన పట్ల గాని మనకి సానుభూతి సద్భావం వున్నప్పుడు మన మనస్సులో మృదువైన భావాలు మొలకెత్తు తాయి. ప్రతిదీ కంటికి మంచిగా, ఆహ్లాదకరంగా కనిపిస్తుంది-- కాని వాళ్ళ పట్ల వున్న సద్భావం ఏమాత్రం సదలిపోయినా సరే మన మనస్సు దారుణంగా మారిపోయి అతి సామాన్యమైన సంఘటనలే ఎంతో వికృతంగా కనిపిస్తాయి....మనస్సు చిత్రమైనది అని ఎందుకు చెప్పానంటే అది మనం ఏమరు పాటుగా వున్న సమయం చూసి మనల్ని లోబరుచు కోవాలని నోరు తెరుచుకుని ఉన్నట్లే వుంటుంది....అందుకే మనకి నిగ్రహం -- అవసరం-- మనస్సు చెడు వేపుకు మొగ్గు చూపిస్తున్నా డానికి కళ్ళెం వేసి ఆపి విచక్షగా, వివేకంతో ప్రవర్తించాలి. అదీ చేతకాక మనస్సు ఆడించి నట్ల ల్లా ఆడటం మొదలు పెట్టామంటే అది మన కళ్ళకి రంగు రంగుల అద్దాలు తొడిగి మన చుట్టూ ప్రపంచాన్ని చేతనయి నంత వికృతంగా భయంకరంగా చూపించి చివరికి మనని పశువులుగా రాక్షసులు గా మార్చేస్తుంది.'
'సరిగ్గా చెప్పావు మురళీ' అన్నాడు వాసు ఆప్యాయంగా అతని భుజం నిమురుతూ.
'నేను వెళ్తున్నాను వాసు.' అంటూ లేచాడు మురళీ.
'భోజనం చేసి వెళ్ళు.' అంది శారద.
'ఒద్దక్కయ్యా -- టాక్సీ వాకిట్లో నే వుంది. ఇప్పుడు బయలుదేరితే రెండు గంటల్లో కళ్యాణి దగ్గరికి వెళ్లి పోతాను ...అంతదాకా నాకు దేని మీదా దృష్టి పోదు ....నిన్నరాత్రి బెజవాడ లో రైలు ఎక్కిన దగ్గర నుంచీ నిమిషాలు లెక్క పెట్టుకుంటున్నా ననుకో-- ఏ స్టేషనులో అయినా కాసేపు ఎక్కువగా రైలు ఆగితే ఆ అలశ్యాన్ని భరించలేక అది కదిలే లోపునే నేను రైలు దిగి కాస్త దూరం నడిస్తే దాంతో దూరం తరిగి పోతుందనీ, కళ్యాణి దగ్గరికి మరి కాస్త త్వరగా జేరగలననీ అనిపించే నా వెర్రి వూహలకి నాకే నవ్వు వచ్చేదనుకో.....నేను అంత ఆదుర్దా పడుతుంటే నా సహనాన్ని పరీక్షించటానికా అన్నట్లు రైలు రెండు గంటలు లేటు.
'సరే ఇంటికి వెళ్ళటం -- కీడుని శంకిస్తూ మనస్సు భయంతో బిగుసుకు పోవటం, మణిని కలుసుకోటం అంతా చెప్పాను కదూ, వెంటనే బస్సు స్టాండు కి వచ్చెను. అప్పుడే వో బస్సు వెళ్లి పోయిందనీ చెప్పారు. అంతసేపు ఆగటానికి మనస్సు వుండ బట్టక టాక్సీ యెక్కి వచ్చేశాను. మరి వెళ్తాను. నాలుగు రోజులు పోయాక ఇద్దరం కలిసి వచ్చి మీ ఇంట్లో భోజనం చేస్తాము.' తెచ్చి పెట్టుకున్న చిరునవ్వు కూడ వాడి వడిలి పోయి గ్లాని తో నల్లబడి పోయిన అతని మొహం మీద మెరవ లేకపోయింది.
'వస్తా వాసూ -- నీలాంటి స్నేహితుడిని పొందగలగటం నిజంగా మా అదృష్టం నువ్వే లేకపోతె కళ్యాణి చనువుగా ధైర్యంగా వుత్తరం వ్రాయగలిగే మనిషే వుండేవాడు కాదు....అప్పుడు నేను ఆమె జాడ తెలియక ఈ ప్రపంచంలో ఆమె కోసం అన్వేషిస్తూ ఆశా నిరాశల మధ్య వూగిసలాడి పోతూ ఎంతకాలం....' గొంతు కేదో అడ్డుపదినట్లు మాటలు మాని ఆదరంగా వాసు చెయ్యి అందుకున్నాడు.
'అంతా మరిచిపో-- సంతోషంగా రండి మీరంతా మా యింటికి త్వరలోనే ' అంటూ మురళీ చేతిని ఒకసారి తన రెండు చేతులలోకి తీసుకుని వదిలేశాడు వాసు-- 'కాస్త కాఫీ అయినా త్రాగు' అంటూ శారద గ్లాసు అందిస్తుంటే వద్దనలేక పోయాడు మురళీ.
* * * *
తెరిచి వుంచిన తలుపుల లాంఛి ముందు గది , గదిలో చిందర వందరగా పడి వున్న అట బొమ్మలు కనిపిస్తున్నాయి-- ఆ బొమ్మల తాలూకు యజమానురాలు మాత్రం అక్కడ లేదు. మురళీ ఆ గది ముందు క్షణం లో సగం సేపు నిలబడి ఆ తరువాత మెల్లిగా గడప దాటి ఆ గదిని దాటి దానిని అనుకుని వున్న మరో గదిలో అడుగు పెట్టాడు-- అంతే అక్కడ అతని పాదాలతో పాటు చూపులు కూడా ఆగిపోయాయి-- అది వంట గది-- ఆ గదిలో వో ప్రక్కగా వున్న చిరు చాప మీద కళ్యాణి కూర్చుని పరధ్యానంగా ఎటో చూస్తోంది.
తలకి స్నానం చేసిన పొడి జుట్టు వదులుగా జడ అల్లుకుంది-- పచ్చటి నుదుట ఎర్రటి కుంకుమ ఉదయిస్తున్న సూర్యుడిలా వెలిగి పోతోంది. అలా వో ప్రక్క నుంచి ఆమెని చూస్తుంటే ఆ మూర్తి పట్ల అవ్యక్తమైన గౌరవం అభిమానం అపుకొలెని దుఃఖం ఇంకా ఇంకా ఎన్నో మరెన్నో భావాలు మురళీ లో పరవళ్ళు తొక్కటం ప్రారంభించి అతను చలన రహితంగా నిలబడిపోయేటట్లు చేశాయి.
గుమ్మంలోకి ఎవరో వచ్చిన అలికిడి అయి కళ్యాణి తల తిప్పి చూసింది -- కంటికి మురళీ కనిపించినా జన్మలో ఏనాడూ అతన్ని చూసిన గుర్తు కూడా లేని కొత్తదనంతో, అంతరంగం లో ఎలాంటి అనుభూతి అనేది మిగలకుండా పోయి ఏ భావాన్ని వ్యక్తం చేయలేని పొడి కళ్ళతో కొద్ది క్షణాలు అలా నిశ్చలంగా చూసింది.
క్రమంగా ఆ చూపులలోని భావ శూన్యత విడిపోయి అవి జీవాన్ని నింపుకోటం ప్రారంభించాయి. కళ్ళల్లో నీళ్ళు తిరగాబోతుంటే చటుక్కున చూపులు విడదీసుకుని వెనకగా వున్న కిటికీ వేపుకి మెల్లిగా అడుగులు వేస్తుంటే మురళీ అప్పుడే చలనం వచ్చిన వాడిలా చటుక్కున నాలుగడుగులు ముందుకు వేసి కళ్యాణి ని తన చేతులలో ఇముడ్చు కున్నాడు. ఆప్యాయంగా పలకరించబోయిన , ఏదో చెప్పబోయిన అతని గొంతు మూగాబోవటం తో ఆమె తలని గుండెలకి అనించు కున్నాడు తపనగా --
అతని పెదవులు ఆమె శిరస్సుని చుంబించాయి.
అతని అశ్రువులు ఆమె తలని తడిపేస్తున్నాయి.
ఆమె కన్నీటితో అతని గుండెలు జివ్వుమంటూ న్నాయి.
ఒకరి కన్నీటిలో పశ్చాత్తాప ము....ఎదుటి మనిషి విలువని తెలుసుకోలేక జీవితంలో దేనికోసమో వెతుక్కుంటూ ఎంతో దూరం పరుగులు పెట్టి అలసి పోయాక చివరికి తన కంటి పొరలు విదిపోయు, తనకి కావలసినది ఎక్కడ వుందో తెలుసుకున్నప్పటి తృప్తి, పారవశ్యము.
మరి ఒకరి కన్నీటి లో జీవితం అంతా కాచి వడబోసిన అనుభవం, హృదయం కరిగి కన్నీటి రూపంలో ప్రవహిస్తోందే మో అన్న ఆర్తి-- చివరికి ఆ జీవితాన్ని దక్కించు కోగలిగాననే సంతోషం సంతృప్తి.
'నన్ను క్షమించమని అడిగే అర్హత కూడా నాకు లేదు. కళ్యాణి...కాని...కాని ....నా కోరిక ఒక్కటే ....జరిగిదంతా మరిచి పోయి నీ హృదయంలో నాకు ఎప్పటిలా స్థానం ఇవ్వగలిగితే ...' ఎప్పటికో గొంతు పెగల్చుకుని అన్నాడు మురళీ రుద్ద కంఠం తో.
'అలా అనకండి...మీరు నా హృదయంలో ఎప్పుడ స్థిరంగానే వున్నారు. తలఎత్తి అనునయంగా చూస్తూ, అతని రేగిపోయి చిందర వందరగా వున్న జుత్తునీ, వాడిపోయిన మొహాన్ని వోచేత్తో మృదువుగా ఆప్యాయంగా నిమురుతూ అంది కళ్యాణి.
'ఇది నా అదృష్టం కళ్యాణి....నేను ఎన్ని అవకతవకలు చేసినా ఎంత అవివేకంగా, మూర్ఖంగా ప్రవర్తించినా -- నువ్వు దేవతలా నన్ను దగ్గరికి తీసుకున్తున్నావు....'
'అంతమాట అనకండి-- మనం అతి సామాన్యమైన మనుష్యులం -- చిరుగాలికి సహితం చలించిపోయే గడ్డి పోచలాంటి వాళ్ళం-- జీవితంలో ప్రతి చిన్న విషయానికీ కంపించిపోతూ జీవితాన్నుంచే పారిపోవాలనుకునే పిరికి వాళ్ళం ....ఇంక నుంచైనా కాస్త ధైర్యం పుంజుకుని జీవితాన్ని అర్ధం చేసుకోటానికి ప్రయత్నిద్దాం.'
'నువ్వు చెప్పిన బలహీనతలన్నీ నాలోనే వున్నాయి.....నువ్వు వాటికి అతీతురాలివే.' అన్నాడు మురళీ అనురాగంతో అమె నుదురు ముద్దు పెట్టుకుంటూ.
'బలహీనతలకి పూర్టిగా అతీతులైన మనుష్యులేవ్వరూ వుండరేమో....ఇప్పటికి అయిన అనుభవంతో నయినా మనం ఒక పాఠం నేర్చుకో గలిగితే.......'
'ఇంక నుంచి నా వల్ల ఎలాంటి పొరపాట్లు జరగవు. మన జీవితాలనే నందన వనంలో ఎలాంటి కలుపు మొక్క పెరగకుండా నేను ముందుగానే జాగ్రత్త పడతాను....నా మాటలు వింటూ నవ్వుకోకేం?' అని మురళీ అంటుంటే కళ్యాణి మందలింపు గా-- ఆర్ద్రంగా చూసింది.
'అదంతా పోనీలే ....నీకో చిత్రమైన సంగతి చెప్తాను....అమ్మ వాళ్ళు మనమీద కోపం అవీ అన్నీ మరిచి పోయారు. మనల్నందర్నీ రమ్మని అమ్మ వుత్తరం వ్రాసింది....'
'నిజమ!.....' కళ్యాణి కళ్ళల్లో కి అదొక లాంటి కాంతి వచ్చింది.
'నీతో చాలా సంగతులు చెప్పాలి..... ఆ అన్నట్లు నీ వుద్యోగం....'
అదోలా నవ్వింది కళ్యాణి. ఈ రోజుల్లో ఉద్యోగాలు దొరకటం అంటే అంత సులభమా?'
'ఇంక అదంతా మరిచిపో....మనం వెంటనే అమ్మా వాళ్ళ దగ్గరికి వెళ్దాం -- అక్కడ కొన్నాళ్ళు న్నాక వాసూ వాళ్ళ దగ్గరికి వద్దాం ....నేను శలవ ఇంకో నెలకి పొడిగిస్తూ ట్రాన్స్ ఫర్ కోసం అడిగాను....మనం ఈ ప్రయాణాలన్నీ ముగించుకునే సరికి ఆ సంగతీ తెలుస్తుంది....వాసు వాళ్ళ దగ్గర వున్న మన సామాను తీసుకుని ఆ క్రొత్త వూరికి వెళ్ళిపోదాం....'
అతను చెప్తున్నదంతా ఏదో కొత్తగా మురళీ మాటలని జీవితంలో మొదటి సారిగా వింటున్నంత శ్రద్దగా వింటోంది కళ్యాణి.
అప్పటి దాకా పెరటి చీడీల మీద కూర్చుని ఏదో ఆటలాడిన పాప తప్పటడుగులు వేసుకుంటూ లోపలికి వచ్చి తల్లితండ్రులని అలా దగ్గరగా చూసి ఏమనిపించిందో సంబరంగా అమాయకంగా చప్పట్లు కొడుతుంటే ఇద్దరూ ప్రక్కకి తిరిగి చూసి నవ్వుకున్నారు-- గబుక్కున పాపని ఎత్తుకుని ప్రేమగా దాని రెండు బుగ్గల మీద ముద్దు పెట్టుకున్నాడు మురళీ .
(అయిపొయింది)


_large.png)