Home » Unnava Vijayalakshmi » Acharanalo Abhudayam



    'సందేహం లేదు -- అది తాము వుండే భాగమే -- కాని, ఇదేమిటి? ఇల్లు ఇలా వుందేమిటి? కొద్ది రోజులుగా అందులో మనుష్యులు వుండటం లేనట్లు వీధి గడప చీడీలు దుమ్ము కొట్టుకు పోయి వున్నాయి -- ఎన్నాళ్ళ క్రిందటో వేసిన ముగ్గు దుమ్ము పొర కప్పుకు పోయి , వాళ్ళూ వీళ్ళు  నడవటం వల్లా చెరిగిపోయి వుంది-- కళ్యాణి ఎక్కడికి వెళ్ళింది?' ఎప్పుడు వెళ్ళింది?'
    అన్నీ సందేహాలే -- అతనికి దుఃఖంతో మతి పోయినట్లయింది కొద్ది క్షణాలు ....ఆప్తులు ఎవరైనా కనిపిస్తే వాళ్ళని కౌగలించుకుని తన గాధ అంతా చెప్పి ఒక్క సారి భోరున ఏడ్చేసి హృదయ భారం తీర్చుకుందామపించింది-- కాని అదేమిటో నా అనేవాళ్ళూ ఎవ్వరూ లేని ఏకాకిగా మిగిలిపోయిన అనుభూతి లాంటిది ఉక్కిరిబిక్కిరి చేసేసింది అతన్ని.
    అలా కొద్ది క్షణాలు గడిచి పోయాయి. మనస్సుకి కమ్మిన మైకం లాంటిది వదుల్చుకుని ఒక్కసారి -- ఆలోచించటం ప్రారంభించాడు. దాదాపు నెల రోజుల క్రిందట ఈ వూళ్ళో హోటలు నుంచే తను కళ్యాణి కి వుత్తరం వ్రాశాడు.
    'కళ్యాణి మసి బొగ్గుని చూసి మాణిక్యం అని భ్రమసి నిన్ను నా జీవితం లోకి తెచ్చుకున్నాను-- కాని ఆ అర్హతని నువ్వు నిలుపుకోలేదు. అదృష్టం అందలం ఎక్కించినా బుద్ది బురదలోకి లాగుతుంది అన్నట్లుంది నీ ప్రవర్తన . సరే, ఏదయితే నేం ఇక ఇప్పుడు నిన్నూ నీ చర్యలనీ విమర్శిస్తూ కూర్చోటం నా అభిమతం కాదు-- కేవలం నా నిర్ణయాన్ని మరోసారి తెలియ జేయ్యటానికే ఈ వుత్తరం వ్రాస్తున్నాను. ఈ జీవితంలో మన ఇద్దరికీ ఎలాంటి సంబంధమూ వుండదు-- నీకు నీ అక్కయ్య, మామయ్య వాళ్ళంతా వున్నారు. వాళ్లతో నీ జీవితం సుఖంగా గడిచి పోతుంది. నేనే ఎవ్వరూ లేనివాడిగా మిగిలిపోయాను-- నిన్ను నమ్మి నా వాళ్ళందర్నీ వదులుకున్న నేను ఇవాళ మళ్లీ ఏ మొహం పెట్టుకుని వాళ్ళ దగ్గరికి వెళ్తాను? అందుకే ఎక్కడో అయిన వాళ్ళందరి కీ దూరంగా ఒక్కడినీ బ్రతక టానికి నిర్ణయించు కున్నాను-- సరే మనం విడిపోయే ముందు నీకూ పాపకి ఏదైనా ఏర్పాటు చెయ్యాల్సి న బాధ్యత నా మీద వుందని నాకు తెలుసు . ఇందులో నాలుగు వేల రూపాయలకి ద్రాప్టు పంపుతున్నాను. ప్రస్తుతం నా దగ్గర అంతకన్నా లేదు. దీనిని స్వీకరించటం లో నీకెలాంటి అభ్యంతరమూ వుండదను కుంటా...' అది దాని సారాశం -- ఆ వుత్తరం అందే వుంటుంది. అది చదువుకుని కళ్యాణి ఎంత బాధపడిందో -- ఇంక నేను తిరిగి రావటం కల్ల అని నిరాశ చేసుకుని ఎక్కడికి వెళ్ళిపోయిందో ? ఆ మాత్రం ఆలోచనైనా నాకు రాలేదు....' ఆలోచిస్తూనే మెట్ల మీదికి వెళ్లాడు-- గుమ్మం దగ్గరే ఎదురయిన మణి సంబరంగా ఇంత మొహం చేసుకుని నవ్వుతూ పల్కరించింది. 'ఎప్పుడొచ్చావు బాబాయ్' పిన్ని వూరికి వెళ్ళిందిగా -- నీకు ట్రాన్స్ ఫర్ అయిందనీ అక్కడ ఇల్లూ అదీ దొరికే దాకా తను వాళ్ళ వూళ్ళో బంధువుల ఇంట్లో వుంటా ననీ చెప్పింది...' అంటూ మధ్యలోనే ఏదో గుర్తు వచ్చినట్లు గబుక్కున లోపలికి వెళ్ళిపోయింది.
    'బంధువుల ఇంట్లోనా?' వోసారి ఆ మాటని తనలో తానె అనుకున్నాడు మురళీ విస్మయంగా.
    'అయ్యో పిచ్చి తల్లీ -- మీ పిన్నికి బందువు లేవరున్నారమ్మా? వసంత నయితే ఆదరించటానికి ఆశ్రయం ఇవ్వటానికి ఆమె తరిపు వాదించటానికి అన్నయ్య వున్నాడు. మీ పిన్నికీ ఎవరున్నారు? ఆ వున్న వాళ్ళని కూడ దూరం చేసుకునేలా చేశాను' వ్యధాపూరిత దృక్కులతో గుమ్మం వంక చూస్తూ 'అయితే మరి కళ్యాణి ఎక్కడికి వెళ్ళినట్లు ' అని తనలొ తనే ప్రశ్నించు కున్నాడు.
    ఆ ప్రశ్నకి సమాధానంగా.
    'ఈ ప్రపంచంలో మనుష్యులని అర్ధం చేసుకోలేక మోసగించ బడటమే జరిగితే ఈ గుక్కెడు ప్రాణాల్ని తీసుకుంటానే కాని మళ్లీ మీ ఆశ్రయాన్ని కోరను.' అని కళ్యాణి వోనాడు తన వాళ్ళకి చెప్పిన మాటలు, 'అడుగడుగునా , అపోహలతో అనుమానాలతో భార్యలను మానసికంగా చిత్రవధ చేసే మొగవాళ్ళు వుంటే ఇంక ఆ స్త్రీకి ఆత్మహత్య వినా గత్యంతరం ఏముంది?' వసంత గుండెలని చీల్చుకు వచ్చిన ఆక్రోశం, అతని చెవుల్లో గింగురు మన్నది-- అతను ఆ పాద మస్తకం కంపించి పోయాడు. 'భగవంతుడా ఏమిటిది, ఆ మూర్తి లాగే నేనూ కళ్ళు తెరిచేసరికి నాకూ ఏమీ మిగలకుండా పోయిందా....'నేనెంత పాపం చేశాను' అని అనుకుంటుంటే మనస్సులో ఏ మూల నుంచో మినుకు మినుకు మంటున్నట్లు వో ఆశా రేఖ తల ఎత్తింది. 'రమ సంగతి ఏమిటి? కన్న బిడ్డని దిక్కు లేనిదానిగా వదిలేసి కళ్యాణి అలాంటి అఘాయిత్యానికి తలపడుతుందా' అని తనకి తనే ధైర్యం చెప్పుకో బోయాడు-- అయితే ఆ వోదార్పు కూడా ఒక్క క్షణం కంటే ఎక్కువ సేపు నిలవలేదు-- తినటానికి తిండి లేక మలమల మాడిపోతూ ఇంక అలాంటి దుర్భర దారిద్రాన్ని భరించలేక ఇద్దరు బిడ్డలకి విషం పెట్టి తనూ ఆత్మహత్య చేసుకున్న స్త్రీ' అంటూ వోనాడు పేపరులో చదివిన వార్త గుర్తు వచ్చి ఊపిరి సలపనట్లే అయింది.

                  

                                    22
    ఇంతటి అపవాదుని నెత్తిన వేసుకుని బ్రతకలేక పోయిన కళ్యాణి కి బిడ్డ ప్రాణాలు మాత్రం ఒక లెక్కా -- అయ్యో రెండు నిండు ప్రాణాలని పొట్టన పెట్టుకున్నానే అనే దుఃఖంతో నిస్త్రాణ తో నిలబడలేక అక్కడే కూలబడ బోయిన మురళీ కి లోపలి నుంచి మణి గొంతు వినిపించింది.
    'లోపలికి రా బాబాయ్ -- మొన్న నీకో వుత్తరం వచ్చింది-- ఎక్కడ పెట్టానో గుర్తు రావటం లేదు ....వాళ్ళే లేనప్పుడు అసలు వుత్తరం ఎందుకు తీసుకున్నావ్ అంటూ అన్నయ్య ఎక్కడో పడేసినట్లున్నాడు-- ఆ -- ఇదుగో ఈ పుస్తకాల క్రింద దొరికింది.' అంటూ వుత్తరం తెచ్చి మురళీ చేతికి ఇచ్చింది. నాకు వుత్తరం ఎవరు వ్రాస్తారు అనుకుంటూనే దాన్ని అందుకుని-- ఎడ్రసు చూస్తుంటే నే అతనికి తెలిసిపోయింది అది ఎక్కడి నుంచి వచ్చిందో -- ఉలికిపడి నట్లయ్య్యాడు . ఇద్దరూ లోపలికి వెళ్ళారు-- ఆత్రంగా కవరు చింపుతూ కుర్చీలో కూర్చుంటూ 'కాసిని మంచినీళ్ళు తెచ్చి పెట్టు మణీ' అన్నాడు. మణి లోపలికి వెళ్ళిపోయింది.
    ఇన్నాళ్ళ తరువాత అమ్మ ఏం వ్రాసి వుంటుంది అనుకుంటూ ఖంగారుగా ఆదుర్దాగా కాగితాలు మడత విప్పి చదువు కోటం మొదలు పెట్టాడు.
    'చిరంజీవి మురళీ ని ఆశీర్వదించి, వ్రాయునది. నీ క్షేమం తెలిసి చాలా రోజులయింది. అవునులే నువ్వు వుత్తరాలు వ్రాసినప్పుడు మమ్మల్ని పాట్టుకుని పాకులాడినప్పుడు కసిరి కొట్టి ఇవాళ నీ క్షేమం తెలియటం లేదని బాధపడటం లో అర్ధం లేదేమో....నాకు తెలుసు-- నాన్నగారు అంత నిరభిమానంగా నిర్మొహమాటంగా వ్రాసిన వాక్యాలు చదివి రోషం తెచ్చుకుని, పోరుష పడి మనస్సు విరిచేసుకుని వుంటావు....ఆ వేడిలో ఆవేశంలో ఏదో అన్నా నిన్ను కనిపెంచిన మమకారాన్ని చంపుకోవటం మాత్రం మా వశం కావటం లేదు-- కుటుంబం పరువూ ప్రతిష్టా లెక్క చెయ్యకుండా నీ ఇష్టం వచ్చిన పెళ్లి చేసుకున్నావని మాకందరికీ కోపం వచ్చిన మాట నిజమే...కాని ఇప్పుడిపుడు ఆలోచిస్తుంటే అనిపిస్తోంది. ఇది మారుతున్న కాలం. ఈ కాలానికి ప్రతినిధులు మీరు...ఏదైనా మార్పు వచ్చిన తరువాత దానికి అందరికి ఆమోదం ఆశీర్వాదం లభిస్తుంది కాని ఈ లోపునీ అంటే పాత కొత్తల కలగలుపుతో మారుతున్న కట్టు బాట్లతో సమాజంలో మనుష్యులు అటు కొంతమంది ఇటు కొంతమంది లాగుతున్న సమయంలో ఎన్నో అసంతృప్తి కరమైన అవాంచ నీయమైన సంఘటనలు జరిగి పోతాయి. మాలాంటి పెద్దలం మీ భావాలతో ఏకీభవించటం పోవటం వల్ల కుటుంబం లో కలతలు వస్తాయి. వాటన్నింటి నీ వోర్పుతో ఎదుర్కోగలిగే శక్తి మీలాంటి వారి కుండాలి.
    నువ్వు వివేకం, విచక్షణ కలవాడివి -- ఆ అమ్మాయిలో వేలెత్తి చూపించ గలిగే లోపం ఏదైనా వుంటే నువ్వీ పెళ్లి చేసుకునే వాడివి కాదు ఆ నమ్మకం నాకుంది. మరి ఇంక అలాంటప్పుడు ఏవేవో పట్టింపులు పెట్టుకుని పంతాలకి పోవటంలో అర్ధం లేదు. ఇదివరకు మన మధ్య రేగిన కలతలని మరిచి పోదాం-- మాకు మనవరాలు పుట్టిందట కదూ-- ఆ మధ్య ఎవరో చెప్పారు-- కోడల్ని మనవరాలినీ వోసారి తీసుకురా. వస్తూ పోతూ వుంటేనే వున్న కలతలు కూడా కరిగిపోయి మమతలు గట్టి పడతాయి-- ఇక్కడంతా క్షేమం. మీరంతా క్షేమంగా వున్నారని తలుస్తాను-- మీ అందరికీ మా ఆశ్వీచనములు.....'
    ఉత్తరం చదువుతుంటే మురళీ కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. 'రెండు సంవత్సరాల తరువాత ఇవాళ అమ్మ వుత్తరం వ్రాసింది-- వాళ్ళంతా మమ్మల్ని దగ్గర జేర్చుకోటానికి ఆదరించటానికి తహతహ లాడుతున్నారు.... కానీ, కళ్యాణి ఏది?' ఎక్కడ వుంది?
    'ఆఫీసులో అర్జెంటు పని వుందని, నాన్న ఇంతకూ ముందే వెళ్ళిపోయారు. నేనూ ఇంకా అన్నం తినలేదు. నువ్వు స్నానం చెయ్యి-- మనం అంతా కలిసి తిందాం' అంటూ వచ్చింది మణి.
    'ఇప్పుడు కాదులేమ్మా-- మరోసారి వస్తాను.' అని ఆ పిల్ల చేతిలో మంచి నీళ్ళ గ్లాసు అందుకున్నాడు మురళీ.
    'ఎక్కడ్నించి బాబాట్ వుత్తరం .'
    'మా అమ్మ వ్రాసింది-- సరికాని మీ పిన్ని ఊరెళ్ళి ఎన్నాళ్ళయింది?' 'నీకు వ్రాయలేదా ? ఇరవై రోజుల పైనే అయింది. తనూ పాపా వాళ్ళ వూరి నుంచి అలా నీ దగ్గరికి వచ్చేస్తామనీ ఈలోగా ఆ వాసుదేవరావు గారు మీ సామానంతా మీ దగ్గరికి పంపిస్తార నీ చెప్పింది. అలాగే అయన వచ్చి సామానంతా తీసేసి ఇల్లు ఖాళీ చేసేశారు. అందులోకి ఇంకా ఎవరూ రాలేదు. ఖాళీగానే వుంది.....'
    మణి చెప్పుకు పోతోంది. మురళీ వినటం మానేసి ఆలోచనలో మునిగి పోయాడు. 'అవును, వాసుదేవరావు.... వాసు....ఇంతసేపూ తన పేరే గుర్తు రాలేదు. అతను వచ్చి సామాను తీసుకు వెళ్లి ఇల్లు ఖాళీ చేశాడా? అంటే కళ్యాణి అతని కేమైనా వ్రాసిందేమో . అంటే కళ్యాణి ఏమయి పోయిందో చూచాయిగా నయినా' అతనికి తెలుస్తుంది--  అవును వెంటనే వెళ్లి అతన్ని చూడాలి' అంటూ లేచి నిలబడి.

                                             




Related Novels


Acharanalo Abhudayam

Surekha Parinayam

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.