Home » Devarakonda Balagangadhara Tilak » తిలక్ కథలు


   
    ఒక్కొక్క నిముషమే బలవంతంగా గడుస్తోంది. ఎవరో పిస్తోలుని గుండెకి సూటిగా పెట్టి ట్రిగ్గర్ మీద వేలు నొక్కుతూన్నట్టుంది. సిద్దయ్య మెల్లగా లేచాడు. దీపం వెలుగులో అతని కల్ళు నిశ్చయంతో వెలిగాయి. "వట్టి మంత్రమైనా ఈలోగా వేస్తాను బాబూ" అన్నాడు. రామచంద్రాన్ని పరీక్షించాడు. చిటికెలు వేస్తూ, పెదవులు కదుపుతూ మంచంచుట్టూ తిరుగుతున్నాడు. మంత్రావేశంతో సిద్దయ్య చూపుకి శూలంవంటి నైశిత్యం కలిగినట్టనిపించింది. ఆ సమయంలో అతను ముదుసలివాడులాలేడు. శక్తవంతమైన ఒక విద్యుత్తలంలా వున్నాడు. భూషణం ఏదో అనబోయి మానివేశాడు. సిద్దయ్య తదేకమైన తత్పరతతో గదిలోని నిశ్శబ్దం కూడా గంభీరమైన ఉద్రేకంలో ఉంది. భౌతికమైన ప్రపంచాన్నే శాసించే మనస్సుయొక్క శక్తిని నాకు చూస్తోన్నట్టు అనిపించింది.

    సూరీడు తలుపు తోసుకుని లోపలకు వచ్చింది. మొహంమీద చేతులమీద గీరుకుపోయిన యెరుపు చారలు - ఆయాసపడుతూ వుంది  "బాబూ తెచ్చాను" అంది. ఆమె చేతిలో అయిదారు మొక్కలున్నాయి. సిద్దయ్య అదే చలించని చూపుతో సంజ్ఞ చేశాడు. సూరీడు గబగబా వేరు అరగదీసి రామచంద్రం కంట్లోనూ నోట్లోనూ పెట్టింది. అతని అరిపాదాల్ని ఒళ్ళో పెట్టుకొని చేతుల్తో రాస్తూంది.

    అరగంట గడిచింది. సిద్దయ్య వేసిన మంత్రమే వేస్తూ మంచం చుట్టూ తిరుగుతున్నాడు. భూషణం తలపైకి రెండు చేతులూ యెత్తి పట్టుకుని మౌనంగా దేవుళ్ళని ప్రార్ధిస్తున్నాడు. నేను రామచంద్రంకేసి ఆదుర్దాగా చూస్తున్నాను. క్రమంగా అతని మొహంలోని చావు నీడలు తప్పుకున్నాయి. జీవకళ కొంచెంగా తిరిగి వస్తోంది. శ్వాస తేలికగా యథాస్థితికి వస్తోంది. చూస్తున్నాను. క్రమంగా అతని మొహంలోని చావు నీడలు తప్పుకున్నాయి. జీవకళ కొంచెంగా తిరిగి వస్తోంది. శ్వాస తేలికగా యథాస్థితికి వస్తోంది. సూరీడు నొసటని చిరు చెమట కమ్మింది. పరిశ్రమ వలన రామచంద్రం మొహం తేటపడింది. సూరీడు ఆనందంతో "బాబూ బతికాడు ఈ అయ్య" అని కేక వేసింది. భూషణం "ఆ!" అంటూ లేచి రామచంద్రాన్ని చూసి వెర్రిగా అరిచి నవ్వాడు "ఇదంతా నీ చలవ సూరీడూ" అంటూ ఆమె కాళ్ళమీద పడ్డాడు. సూరీడు సిగ్గుపడుతూ,  "అదేమిటి, తప్పండి బాబూ" అంటూ లేచి దూరంగా వెళ్ళింది. సిద్దయ్య మంత్రోచ్చారణ ఆపి ఒకసారి రామచంద్రాన్ని చూసి నిట్టూర్చి వెదురుగోడనానుకు నించున్నాడు. అతను చాలా అలసిపోయినట్టున్నాడు. సూరీడు దగ్గరగా వెళ్ళి తండ్రిని కౌగిలించుకుని  "నామీద కోపం వచ్చిందా బాబూ" అంది. సిద్దయ్య ప్రేమగా జాలిగా కూతురు తల నిమిరాడు.  "వెర్రిపిల్లా!" అన్నాడు ఆప్యాయంగా గాద్గదికంగా.

    దిక్కులేకుండా అడవిలో చచ్చిపోతాననుకున్న. ఈ రాత్రి పాములవాడి గుడిసెలో అదృష్టవశాత్తు సుఖాంతం అయింది. బిగుసుకుపోయిన నరాలు ఒక్కసారిగా సళ్ళి ఒక్కసారిగా ఒళ్ళంతా తేలికై పోయినట్టనిపించింది. రామచంద్రం కళ్ళు తెరచి సన్నగా మూలిగి పక్కకి చూశాడు. భూషణం దగ్గరగావెళ్ళి వెర్రి ఆనందంతో జరిగిందంతా చెప్పేస్తున్నాడు "బతికావురా రామచంద్రం. ఇంక భయంలేదురా దేవుడు మనపాలిట వున్నాడు. తెల్లారకుండా బస్సు వస్తుంది. దానిలో వెళితే కలెక్టరుగారింట్లో పెళ్ళిముహూర్తానికి తప్పకుండా వెళ్ళొచ్చును. అసలు నువ్వు లేకపోతే అక్కడ కథ లేదు" అంటూ వాగేస్తున్నాడు. బరువుగా నీరసంగా ఉన్న రామచంద్రం కళ్ళల్లో చిరునవ్వు తాలూకు వెలుగు అలలాగా మెదిలింది. అంతలోనే భూషణం మెడకి చేతులు తగిలించి గబుక్కున ఏడ్చాడు.  "ఛఛ ఇపుడేడుస్తావేమిటి ప్రమాదం తప్పిపోయింది. పడుకోపడుకో మళ్లీ ఉదయం పెళ్ళికి రెడీగా ఉండాలి" అన్నాడు భూషమం. అతను బతకడంలోని పరమార్ధం కలెక్టరుగారింట్లో పెళ్ళికి హాజరవటం కాబోలు అని కుర్రవాణ్ణి నా మనస్సుకి అనిపించకపోలేదు. అసలు పెద్ద ఉద్యోగస్థుల ఇళ్ళల్లో జరిగే శుభకార్యాలకి ఇంతగా అవసరమైన పెద్ద మనుషులకి హఠాత్తుగా చచ్చిపోయే హక్కు 'లా' ప్రకారం ఉండి ఉండదు కూడా. సూరీడు నవ్వుతూ ఒకచేత్తో పాత్రని పట్టుకువచ్చి "తప్పుకో బాబూ, ఆయన్ని కొంచెం పడుకోనివ్వండి" అంటూ రామచంద్రం తలని వొళ్ళోకి తీసుకుని నోట్లో పాత్రలో ఉన్న పాలు పోసింది.

    "ఏమిటిది?" అన్నాడు భూషణం.

    "మిరియప్పొడీ పాలూ -ధారకంగా ఉంటది" అంది సూరీడు.

    "ఈ అడవిలో మీకు పాలు సప్లయ్ అవుతాయా ఏమిటీ?" భయంపోగానే నాగభూషణం సహజమైన వివేకాన్ని విచక్షణనీ తిరిగి పొందాడు.

    సూరీడు ఫక్కున నవ్వింది."మేకపాలు బాబూ" అంది.

    "రామ రామ. మేకపాలు తాగడమే? సరే సరే ఆపద్ధర్మం" అన్నాడు భూషణం.
   




Related Novels


తిలక్ కథలు

అమృతం కురిసిన రాత్రి

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.